Crimean Bridge: క్రైమియా బ్రిడ్జిని ఎవరు, ఎలా పేల్చారు?

- రచయిత, పాల్ ఆడమ్స్
- హోదా, బీబీసీ న్యూస్ కీయెవ్, యుక్రెయిన్
క్రైమియాను రష్యాతో అనుసంధానించే కీలక వంతెనపై శనివారం పేలుడు జరిగింది. వంతెన కొద్దిగా ధ్వంసమైంది. ఆ వంతెన పై దాడి చేసింది యుక్రెయిన్ ప్రత్యేక దళాలేనని రష్యా ఆరోపించింది.
ఈ వంతెనపై పేలుడు ఏర్పడిన విధానం గురించి చాలా వాదాలు ప్రచారంలోకి వచ్చాయి.
ట్రక్ బాంబు ద్వారా ఈ వంతెనను పేల్చేశారని ప్రకటించడంలో రష్యా ఏ మాత్రం సమయం తీసుకోలేదు. అయితే, దీనిని ఎవరు పేల్చారనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేదు.
"యుక్రెయిన్ ఈ పేలుడు పట్ల స్పందించిన తీరు తీవ్రవాద స్వభావాన్ని ప్రదర్శిస్తోంది" అని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా అన్నారు.
సోషల్ మీడియాలో విడుదలయిన సెక్యూరిటీ కెమెరాల ఫుటేజీలో ఒక ట్రక్ కనిపిస్తోంది. ఈ ట్రక్ రష్యన్ నగరం క్రాస్నోదర్‌కు చెందిందని ఆరోపిస్తున్నారు. పేలుడు జరిగిన సమయంలో ట్రక్ వంతెన పై పశ్చిమం వైపుకు వెళుతోందని చెబుతున్నారు.
క్రస్‌నోదర్‌కు చెందిన 25 ఏళ్ల సమీర్ యూసోబోవ్ ఈ ట్రక్ యజమాని అని రష్యా అధికారులు చెబుతున్నారు. ఆయన బంధువు మఖీర్ యూసోబోవ్ ట్రక్ డ్రైవ్ చేస్తున్నారు.
అయితే, ఈ ఫుటేజీని జాగ్రత్తగా గమనిస్తే ట్రక్‌కు పేలుడుకు సంబంధం లేదని అర్ధమవుతుంది.

ట్రక్ వంతెన పైకి వస్తూ ఉండగా, వెనుక వైపున భారీ అగ్ని గోళం మండుతున్నట్లుగా ఫుటేజీలో కనిపిస్తోంది.
ఈ ట్రక్ ద్వారా బాంబు పేలుడు జరిగినట్లు రష్యన్ వర్గాల్లో వేగంగా వ్యాపించిన పుకార్లు అనుమానాస్పదంగా ఉన్నాయి. యుక్రెయిన్ ఈ వంతెనను ఉద్దేశ్యపూర్వకంగానే పేల్చేసిందని రష్యా ఆరోపించింది.
"నేను వాహనాల ద్వారా భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించేందుకు వినియోగించే పరికరాలను చూశాను" అని బ్రిటిష్ సైన్యంలో పని చేసిన మాజీ పేలుడు పదార్ధాల నిపుణులు చెప్పారు.
అయితే, ఈ వంతెన పై జరిగిన పేలుడు వాహనాన్ని ఉపయోగించి పేల్చినట్లుగా అనిపించటం లేదని అన్నారు.
రహస్యంగా అమర్చిన నావికాదళ డ్రోన్ ద్వారా వంతెన కింద ఈ పేల్చి ఉండవచ్చని ఆయన వివరించారు.
"సాధారణంగా వంతెనలు వాటిపై ప్రయాణించే బరువును తట్టుకునే విధంగా నిర్మిస్తారు. వంతెన కింది నుంచి వచ్చే ఒత్తిడి తట్టుకునే విధంగా వీటి నిర్మాణ శైలి ఉండదు. ఇదే విషయాన్ని యుక్రెయిన్ దాడిలో దుర్వినియోగం చేసి ఉంటారు" అని అభిప్రాయపడ్డారు.
పేలుడు జరగడానికి ఒక క్షణం ముందు బాణం ఆకారంలో ఉన్న నౌక కనిపించిందని సెక్యూరిటీ కెమెరా వీడియోలో కనిపించిందని మరి కొంత మంది చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఇదెలాంటి నౌక అయి ఉంటుంది?
ఒక మానవ రహిత రహస్య నౌక క్రైమియా నగరంలోని సెవాస్ట పోల్ లోని రష్యా నేవల్ బేస్ తీరం వైపుకు కొట్టుకుని వచ్చినట్లుగా కనిపిస్తున్న ఫోటోలు సెప్టెంబరు 21న రష్యా సోషల్ మీడియాలో కనిపించాయి.
ఈ నౌక నల్లని కవర్ కప్పినట్లుగా ఉంది. నౌక పైన బాణాల మాదిరిగా ఉన్న సెన్సార్లు, పెరిస్కోప్ మాదిరి పరికరం కనిపించింది.
ఈ నౌకను సముద్రంలోకి పంపించి పేల్చేశారని కొన్ని స్థానిక కథనాలు చెబుతున్నాయి.
"మానవ రహిత వాహన భాగాన్ని కనుగొన్నాం" అని రష్యా అధీనంలో ఉన్న సెవాస్టపోల్ గవర్నర్ చెప్పారు.
"సర్వే పూర్తయిన తర్వాత ఈ వాహనాన్ని సముద్రంలో ఉండగానే పేల్చేశారు. ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదు" అని చెప్పారు.
యుక్రెయిన్ దగ్గర ఇటువంటి రహస్య పరికరాలున్నాయని నివేదికలు రావడం ఇది మొదటిసారి కాదు.
"యుక్రెయిన్ దగ్గర రిమోట్ కంట్రోల్ ద్వారా నావికా దళ వాహనాలను పర్యవేక్షణ, దాడి చేసే పరికరాలు ఉన్నాయనే స్పష్టమైన నివేదికలు ఉన్నాయి" అని పేలుడు పదార్ధాల నిపుణులు చెప్పారు.
"ఈ విధమైన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు కొన్నేళ్లు పట్టి ఉండవచ్చు" అని చెప్పారు.
కొన్ని వందల మైళ్ళ దూరంలో యుక్రెయిన్ అధీనంలో ఉన్న భూభాగం నుంచే ఈ దాడిని నిర్వహించి ఉంటే, ఇది ఇప్పటి వరకు కీయెవ్ చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్కమైన దాడి అని చెప్పవచ్చు .
కానీ, ఈ వాదనను ఎవరూ ధ్రువీకరించడం లేదు.

ఫొటో సోర్స్, Satellite image ©2022 Maxar Technologies.
యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్స్కీ కార్యాలయ అధిపతిగా ఉన్న మిఖాయిల్ పొడిల్యాక్ విడుదల చేసిన ప్రకటన మాస్కో చేస్తున్న బాంబు సిద్ధాంతాన్ని కొంత వరకు బలపరుస్తోంది.
"దీనికి సమాధానాలు రష్యాలోనే వెతకాలి" అని అన్నారు.
రష్యా భద్రతా సంస్థలో వివిధ విభాగాల మధ్య చోటు చేసుకుంటున్న అంతర్గత కలహాల వల్ల ఈ పేలుడు సంభవించిందని అన్నారు.
"ఒక వైపు రష్యా అంతర్గత వ్యవహారాల విభాగం, ప్రైవేటు మిలిటరీ కాంట్రాక్టర్లు, మరో వైపు రక్షణ మంత్రిత్వ శాఖ, రష్యా ఫెడరేషన్ సిబ్బంది మధ్య జరుగుతున్న పోరాటం ఈ రూపంలో రూపాంతరం చెందిందని ప్రకటనలో పేర్కొన్నారు.
ఇతరులెవరికీ తెలియని విషయాలు పొడిల్యాక్‌కు మాత్రమే ఏమైనా తెలుసా? లేదా ఆయన మాస్కోను ట్రోల్ చేస్తున్నారా?
వాస్తవం ఎవరికీ తెలియదు.
గతంలో రష్యా బ్లాక్ సీ ఫ్లీట్ మోస్క్వా మునిగిపోయిన తీరు, ఆగస్టులో క్రైమియాలో రష్యా వైమానిక కేంద్రాన్ని రహస్యంగా పేల్చేసిన దాడి చోటు చేసుకున్న విధానాన్ని కూడా కీయెవ్ ఊహకే వదిలేసింది.
రష్యా ఈ ఏడాది ఫిబ్రవరిలో యుక్రెయిన్ పై దాడి మొదలుపెట్టిన తర్వాత యుక్రెయిన్ చేపట్టిన సైనిక ప్రయత్నాలతో పాటు సమాచార ప్రచారంలో భాగం. ప్రస్తుతానికి ఈ ప్రచారం యుక్రెయిన్ కు ఫలితాలనిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- మొబైల్ ఫోన్లు చోరీ అయితే పోలీసులు ఎలా వెతికి పట్టుకుంటారో తెలుసా?
- కొల్లాపూర్ మహాలక్ష్మి - అంబాబాయి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
- రాజరాజ చోళుడు హిందువు కాదా, అసలు హిందూ అనే మతమే లేదా, చరిత్ర ఏం చెబుతోంది?
- బల్లి పడితే ఆహారం విషపూరితం అవుతుందా, ఇంట్లో బల్లులు లేకపోతే మనుషులకు ఏం జరుగుతుంది?
- మీరు డార్క్ చాక్లెట్ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












