Ukraine, Russia War: యుక్రెయిన్‌కు ఆయుధాలు ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తున్నాయి? ఆయుధాల కోసం ఫ్రాన్స్‌పై ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు

ఫొటో సోర్స్, ARIS MESSINIS
- రచయిత, హూగ్ షెఫీల్డ్
- హోదా, బీబీసీ న్యూస్ పారిస్
యుక్రెయిన్‌కు ఆయుధ సరఫరాను పెంచేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తక్షణ నిర్ణయం తీసుకోవాలని అక్కడి రక్షణ వ్యూహాల నిపుణులు ఒత్తిడి చేస్తున్నారు.
యూరప్‌ను సైనిక స్వయంప్రతిపత్తి వైపు నడిపించాలని భావిస్తున్న ఫ్రాన్స్.. యుక్రెయిన్‌కు చేస్తున్న యుద్ధ సహాయం ఎందుకంత తక్కువగా ఉందని వారు ప్రశ్నిస్తున్నారు.
ఫ్రాన్స్ విదేశాలకు సరఫరా చేసే ఆయుధాల వాటా 2 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు ఇటీవల యుక్రెయిన్, పోలండ్‌లలో క్షేత్రస్థాయిలో చేపట్టిన పరిశీలనలో తేలింది. కీయేవ్ కు జరుగుతున్న ఆయుధ సరఫరాలో అమెరికా వాటా 49 శాతం కాగా, పోలండ్‌కు 22%, జర్మనీకి 9% వాటా ఉంది.
"యుక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేస్తున్న దేశాల్లో ఫ్రాన్స్ పాత్ర చాలా తక్కువని ఈ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఈ గణాంకాల కచ్చితత్వం గురించి నాకు ఆందోళన ఉంది" అని ఫ్రాన్స్‌లో రక్షణ రంగ విశ్లేషకుడు ఫ్రాంకోయిస్ హీస్‌బర్గ్ అన్నారు.
"పోలండ్‌లో ప్రముఖ ఆయుధ సరఫరా కేంద్రాన్ని సందర్శించి, సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన ఆయుధాల జాబితాతో నిజానికి సరఫరా అవుతున్న ఆయుధాల మొత్తాన్ని పరిశీలించాను. దురదృష్టవశాత్తు ఈ గణాంకాలు నా భయాలను నిజం చేశాయి. యుక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేస్తున్న దేశాల జాబితాలో ఫ్రాన్స్ 9వ స్థానంలో ఉంది" అని చెప్పారు.
ఈ విషయాన్ని ఫ్రాన్స్ అధికారులు అంగీకరించారు.
ఆయుధ సహాయానికి సంబంధించిన గణాంకాలు నిరుత్సాహపరిచేవిగా ఉన్నాయని ఫ్రాన్స్ అంగీకరించింది.
చేసే సహాయాన్ని దాని నాణ్యతను బట్టి పరిగణించాలి గాని పరిమాణాన్ని బట్టి కాదని ఆ దేశ రక్షణ శాఖ అధికారులు అంటున్నారు.
కొన్ని దేశాలు కాలం చెల్లిన పరికరాలను భారీగా సరఫరా చేస్తున్నాయి. ఫ్రాన్స్ 18 సీజర్ సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆయుధ యూనిట్‌లను సరఫరా చేసిందని వారు చెబుతున్నారు.
ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక జరిగిన ఒప్పందం తర్వాత ఇతర పశ్చిమ దేశాల మాదిరిగానే ఫ్రాన్స్ కూడా తన ఆయుధ నిల్వలను తగ్గించుకుంటోంది.
యుక్రెయిన్‌కు సరఫరా చేసిన ఆయుధాలు ఫ్రాన్స్‌లో ఉన్న మొత్తం మొబైల్ ఆయుధాల్లో పావు వంతు ఉంటాయి.
ముప్పు పొంచి ఉన్న సాహిల్, ఇండో-పసిఫిక్ ప్రాంతాలకు చేయాల్సిన ఆయుధ సరఫరాను విస్మరించి యుక్రెయిన్‌కు మరిన్ని ఎక్కువ ఆయుధాలు సరఫరా చేయడం కుదరదని ఫ్రాన్స్ చెప్పింది.
"ఆయుధ సరఫరాలో ఫ్రాన్స్ మిగిలిన దేశాల కంటే వెనుకబడి ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ, ఫ్రాన్స్ కూడా యుక్రెయిన్ యుద్ధంలో తన పాత్రను పోషించాలని అనుకుంటోంది" అని నేషనల్ డిఫెన్స్ రివ్యూ ఎడిటర్ జెరోమ్ పెల్లిస్‌ట్రాండి చెప్పారు.
"ఈ వాదనలు అర్థరహితంగా చేస్తున్నవి కావు" అని హీస్‌బర్గ్ అన్నారు.
"యుద్ధరంగంలో తన పాత్రను పోషించకుండా, ఈ మొత్తం వ్యవహారం నుంచి తుడిచిపెట్టుకుపోయే పాత్రను ఫ్రాన్స్ స్వయంగా రచించుకుంటోంది" అని ఆయన అన్నారు.
"నేను కీయెవ్‌లో ఉన్నప్పుడు అందరూ మర్యాదగా ప్రవర్తించారు. యుక్రెయిన్ ప్రజలు మమ్మల్ని ఆమోదించడం లేదని అనిపించలేదు. ఇది ఒక విధమైన దారుణం. ఈ యుద్ధంలో ఫ్రాన్స్ పోషించే పాత్రకు ప్రాధాన్యత తగ్గుతున్నట్లు అనిపిస్తోంది" అని అన్నారు.
ఈ సమీకరణ అర్ధం చేసుకోవడం చాలా సులభం. యుక్రెయిన్ తనకు అవసరమైన ఆయుధ సహాయాన్ని చేసే దేశాలతోనే చర్చలు జరుపుతుంది. ప్రస్తుతానికి ఫ్రాన్స్ ఆ దేశాల జాబితాలో లేదు.

ఫొటో సోర్స్, Reuters
ఫ్రాన్స్‌కు మరొక ప్రమాదం కూడా ఉంది.
యుక్రెయిన్‌లో తన ఉనికి లేకపోవడం వల్ల యూరప్ రక్షణ బాధ్యతలు చేపట్టేందుకు నాయకత్వం వహించేందుకు పోటీలో నిలిచే అవకాశాన్ని కోల్పోతుంది.
ఇప్పటికే తూర్పు యూరప్‌లో చాలా దేశాలు మాక్రాన్ పట్ల సందేహంతో ఉన్నారు. యుద్ధం మొదలైన మొదటి నెలల్లో ఆయన రష్యా అధ్యక్షుని తరుపు వహిస్తున్నట్లుగా ఉన్న వైఖరిని ప్రదర్శించారని చాలా మంది భావించారు. యుక్రెయిన్ విజయం పట్ల ఫ్రాన్స్ సందిగ్ధంలో ఉందనే వాదన నాటుకుంది.
అయితే, ఈ వాదన అన్యాయంగా ఉందని లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీలో అంతర్జాతీయ భద్రత అధ్యాపకుడు పియరీ హారోచ్ అన్నారు. యుక్రెయిన్‌కు తక్కువ మొత్తంలో ఆయుధాల సరఫరా చేయడానికి యుక్రెయిన్ విజయాన్ని ఆకాంక్షించకపోవడం కారణం కాదని అన్నారు.
యూరోపియన్ దేశాలన్నీ ఒకే తాటి పై నడుస్తున్నాయని తూర్పు యూరప్ దేశాలైన పోలాండ్ లాంటి దేశాలకు భరోసా కల్పించేందుకు ఫ్రాన్స్ తన ఆయుధ సరఫరాను వీలైనంత త్వరగా పెంచాలని అన్నారు.
"యూరప్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి సాధించేందుకు ఫ్రాన్స్ ఆయుధాల సంయుక్త సేకరణ ద్వారా రక్షణ పరిశ్రమను మరింత పటిష్టం చేసుకునే లక్ష్యం పై దృష్టి పెట్టింది. కానీ, సంయుక్త సేకరణ కావాలనుకుంటే యూరోపియన్ దేశాల భద్రత పట్ల ఒకే విధమైన దృక్కోణం ఉన్నట్లు ఇతర దేశాలకు ప్రదర్శించగలగాలి" అని అన్నారు.
"వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని సాధించడం కోసం ఫ్రాన్స్‌కు సహకరించడం వ్యూహాత్మక ముప్పు కాదని తూర్పు యూరప్ దేశాలకు నమ్మకం కలిగించగలగాలి" అని అన్నారు.
ఫ్రాన్స్ యుక్రెయిన్‌కు 50 లెక్‌లెర్క్ ప్రధాన యుద్ధ ట్యాంకులను పంపాలని హరోచ్ పిలుపునిచ్చారు. యుక్రెయిన్‌కు గగన తల రక్షణ విధానాల అవసరం ఎక్కువగా ఉంది. వీటిని పంపిస్తే బాగుంటుందని హీస్ బర్గ్ అంటున్నారు.
"ఇది ప్రస్తుతానికి మంటలను చల్లార్చే సాధనం లాంటిది" అని డాక్టర్ హరోచ్ అన్నారు.
"పొరుగువారింట్లో మంటలు రగులుతుంటే, ఆ మంటలు మీ ఇంటికి చేరే వరకు చూస్తూ కూర్చోవడం కంటే ఆ సాధనాన్ని వారికివ్వడమే ఉత్తమం" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నేటి యువత మద్యం తాగడం తగ్గించేస్తున్నారా? కారణాలేంటి?
- సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుతో అబార్షన్లు, మారిటల్ రేప్‌కు సంబంధించి మహిళల హక్కుల్లో వచ్చిన మార్పులు ఏంటి?
- మాగ్నస్ కార్ల్సన్-హాన్స్ నీమాన్: 19 ఏళ్ల కుర్రాడిపై చెస్ ప్రపంచ చాంపియన్ ఆరోపణలు ఎందుకు?
- ‘పస్తులైనా ఉందాం ఆ పనికి మాత్రం వెళ్లొద్దని కాళ్ల మీద పడ్డాం.. ఇప్పుడు మాకెవరు దిక్కు’
- ఆంధ్రప్రదేశ్‌లో 'పేదలందరికీ ఇళ్లు' నిర్మాణం ఎందుకు ఆలస్యం అవుతోంది? ఈ ఆలస్యానికి బాధ్యులు ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











