‘మేం భారతీయుల్లా ఎలా కనిపిస్తాం?’ ఈశాన్య రాష్ట్ర విద్యార్థి ‘హత్య’తో భారత్‌లో జాతి వివక్షపై మరోసారి చర్చ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అభిషేక్ డే
- హోదా, గువాహటి
చల్లని హిమాలయాల్లో ఉండే ఉత్తరాఖండ్ రాజధాని దెహ్రాదూన్ నగరంలో కొన్ని వారాల కిందట జరిగిన ఓ హింసాత్మక ఘటన అక్కడ 'వేడి'ని రాజేసింది.
ఏంజల్, మైఖేల్ చక్మా లు ఈశాన్య రాష్ట్రం త్రిపురకు చెందిన సోదరులు.
తమ ప్రాంతం నుంచి సుమారు 2400 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంటూ చదువుకుంటున్నారు.
డిసెంబర్ 9న ఆ సోదరులు ఓ మార్కెట్‌కు వెళ్లినప్పుడు కొంతమంది పురుషుల గుంపు వాళ్లతో గొడవపడిందని, జాతి పేరుతో దూషించిందని వారి తండ్రి తరుణ్ చక్మా బీబీసీకి తెలిపారు. అప్పుడు ఆ సోదరులు ఎదురుతిరగ్గా, వారిపై ఆ గుంపు దాడి చేసిందని ఆయన ఆరోపించారు.
ఓ మెటల్ బ్రాస్‌లెట్‌తో వాళ్లు మైఖేల్ చక్మాపై దాడి చేశారని, ఏంజల్ చక్మాను కత్తితో పొడిచి గాయపరిచారని చెప్పారు.

ఈ ఘటన తర్వాత మైఖేల్ కోలుకున్నారు. కానీ, ఏంజల్ చక్మా 17 రోజుల తర్వాత ఆస్పత్రిలో మరణించారని తరుణ్ చక్మా చెప్పారు.
ఈ ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, చక్మా కుటుంబ సభ్యులు ఇది జాతి వివక్ష దాడి అని చెబుతుండగా.. నిందితులు దాన్ని ఖండించారు.
ఈ ఘటన అనేక నగరాల్లో నిరసనలకు కారణమైంది. అలాగే, ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారు పని లేదా చదువు కోసం పెద్ద నగరాలకు వెళ్లినప్పుడు తాము జాతి వివక్షను ఎదుర్కొంటున్నామన్న ఆరోపణలు మరోసారి చర్చకు దారి తీశాయి.
'మా రూపం చూసి ఇల్లు అద్దెకివ్వటం లేదు'
రూపం కారణంగా తరుచూ తాము జాతీయత గురించి ప్రశ్నలను ఎదుర్కొంటున్నామని, అలాగే బహిరంగ ప్రదేశాల్లో, పని ప్రదేశాల్లో వేధింపులకు గురువుతున్నామని ఈశాన్య రాష్ట్రాలవారు అంటున్నారు.
వారిలో చాలామంది, ఈ వివక్ష కేవలం దూషణలకే పరిమితంకాకుండా తమ రోజువారీ జీవనానికి ఆటంకం కల్పిస్తోందని అంటున్నారు.
ఈశాన్య భారతవాసుల్లో చాలామంది తమకు అద్దెకు ఇల్లు దొరకడం కష్టంగా ఉంటోందని, తమ రూపం, ఆహారపు అలవాట్లు లేదా కొన్ని స్టీరియోటైప్ అభిప్రాయాల కారణంగా చాలామంది అద్దెకు ఇల్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని చెబుతున్నారు.
ఈశాన్య రాష్ట్రాల నుంచి పెద్ద పెద్ద నగరాలకు వచ్చినవారు ఇలాంటి పరిస్థితుల కారణంగా ఒకే ప్రాంతంలో కమ్యూనిటీగా ఏర్పడి జీవించాల్సి వస్తోంది. అప్పుడే తాము భద్రంగా ఉంటామని, పరస్పర మద్దతు, సాంస్కృతిక అనుబంధం ఉంటుందని వారు భావిస్తున్నారు.
మరికొంతమంది మాత్రం, దేశంలో చాలా ప్రాంతాలలో తమకు ఎదురవుతున్న వివక్ష, విద్వేషంలాంటి సమస్యలకు అలవాటుపడి జీవించడం నేర్చుకున్నామని చెబుతున్నారు.
అయితే.. ఏంజల్ చక్మా ‘హత్య’లాంటి హింసాత్మక ఘటనలు తమను తీవ్ర అభద్రతకు గురిచేస్తున్నాయని అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'వెలుగులోకి రాని ఘటనలెన్నో..'
ఈశాన్య ప్రాంతాల ప్రజలపై కొన్నేళ్లుగా జాతి హింస తాలూకు ఘటనలకు సంబంధించి అనేక హైప్రొఫైల్ కేసులు నమోదయ్యాయి.
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల నిడో టానియా 2014లో హత్యకు గురి కావడంతో జాతి వివక్షపై అనేక నిరనసల వ్యక్తమయ్యాయి. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
ఆయన రూపం గురించి అవహేళన చేసి, కొంతమంది ఆయనపై దాడి చేసి చంపారనే ఆరోపణలు వచ్చాయి. దేశ రాజధాని దిల్లీలో జరిగిన ఈ హింసాత్మక ఘటన, అంతటితో ముగిసిపోలేదని సామాజిక కార్యకర్తలు అంటున్నారు.
ఈశాన్య ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల విద్యార్థి ఒకరు పుణెలో దాడికి గురయ్యారు. ఆ మరుసటి ఏడాది మరో విద్యార్థి బెంగళూరులో తన ఇంటి యజమాని నుంచి జాతి వివక్ష దూషణలు, దాడిని ఎదుర్కొన్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది.
ఇలాంటివి ఎన్నో ఘటనలు జరిగినా, చాలావరకు మరుగునపడిపోయాయని, పెద్దగా వెలుగులోకి రాలేదని హక్కుల కార్యకర్తలు అంటున్నారు.
"దురదృష్టవశాత్తు, ఏదైనా తీవ్రమైన హింసాత్మక ఘటన జరిగినప్పుడు మాత్రమే ఈశాన్య ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న జాతి వివక్ష ఘటనల గురించి చర్చ నడుస్తోంది" అని దిల్లీలోని రైట్స్ అండ్ రిస్క్స్ అనాలసిస్ గ్రూప్ డైరెక్టర్ సుహాస్ చక్మా అన్నారు.
'ఆ వేదనను మోయక తప్పదు'
జాతి వివక్ష హింసకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన వార్షిక నేర నివేదికల్లో ఎలాంటి ప్రత్యేక సమాచారాన్ని పొందుపరచడం లేదు.
ఏంజల్ చక్మా ‘హత్య’ తనను తీవ్రంగా బాధించిందని రాజధాని(దిల్లీ)లో నివసించే అస్సామీ అంబికా ఫోంగ్లో అన్నారు.
"చిన్న కళ్లు, వెడల్పాటి ముక్కుతో ఉండే మా ముఖం తీరుతెన్నుల వల్ల మేం జాతి వివక్ష చూపేవారికి టార్గెట్‌గా మారుతున్నాం" అని ఆమె అన్నారు.
పని ప్రదేశంలో జరిగిన చర్చలో కొన్నేళ్ల కిందట తన సహోద్యోగులు తనను జాతి పేరుతో పిలవడాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.
"ఇలాంటివి ఎదుర్కోక తప్పదు. వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం నేర్చుకోవాలి. అయితే, తీవ్రమైన వేదనను మోయక తప్పదు’’ అని ఆమె చెప్పారు.
మేఘాలయకు చెందిన మేరీ వహ్లాంగ్, తాను కర్ణాటకలో చదువు పూర్తికాగానే ఇంటికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తన సహ విద్యార్థులు అనేకసార్లు జాతి పేరుతో పిలవడంతో ఆమె పెద్ద నగరాల్లో ఉద్యోగాన్ని వెతుక్కోవాలనే తన ఆలోచనలను మానుకున్నట్లు చెప్పారు.
"తాము జాతి వివక్షను ప్రదర్శిస్తున్నామని, లేదా అది ఇతరులను బాధిస్తుందని అర్థం చేసుకోకుండానే చాలామంది ఇలాంటి దూషణలకు పాల్పడుతుంటారని కొద్దిరోజులకు నేను అర్థం చేసుకున్నా. దీని వల్ల జరిగే పరిణామాలు తెలిసి కూడా మరికొంతమంది ఇలా చేస్తుంటారు" అని ఆమె అన్నారు.
'ఇది సమాధానం లేని ప్రశ్న'
ఇలాంటి ఘటనలు ఎప్పుడో ఒకసారి జరుగుతున్నవి కాదనీ, ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన చాలామందికి జాతి వివక్ష అవహేళనలు ఎదుర్కోవడం వారి జీవితంలో ఓ భాగంగా మారిపోయినట్లుగా సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు.
కొన్నేళ్లుగా ఈశాన్య ప్రాంతం గురించి, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న జాతి వివక్ష గురించి అవగాహన పెరుగుతున్నప్పటికీ, ఆ వివక్ష ఇంకా కొనసాగుతోందని వారు అంటున్నారు.
"మేం పూర్తిగా భారతీయుల్లా ఎలా కనిపిస్తాం? బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు" అని ఓ మానిటరింగ్ కమిటీలోె సభ్యురాలైన అలనా గోల్మెయి అన్నారు. భారతీయ నగరాల్లో జాతి వివక్ష హింసకు సంబంధించిన ఫిర్యాదులు పెరిగిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం 2018లో ఈ మానిటరింగ్ సంస్థను ఏర్పాటు చేసింది.
ఇలాంటి వాటిని జాతి వివక్షతో సంబంధంలేనివని, ఎక్కడో మారుమూలన జరిగిన చిన్న ఘటనలనీ వదిలిస్తే సమస్య తీవ్రమవుతుందని ఆమె అన్నారు.
"సమస్యను మొదట ఒప్పుకుని, గుర్తించినప్పుడే దాన్ని పరిష్కరించడం మొదలవుతుంది" అని బీబీసీతో అన్నారు గోల్మేయి.
ఏంజల్ చక్మా ‘హత్య’ జాతి వివక్ష వ్యతిరేక చట్టాన్ని తీసుకురావాలనే డిమాండ్లను మళ్లీ ముందుకు తెచ్చింది. చట్టపరమైన సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ అనేకమంది విద్యార్థులు, పౌర సంఘాలు.. ప్రభుత్వానికి బహిరంగ లేఖలు రాశాయి.
2014లో నిడో టానియా మృతి తర్వాత, ఈశాన్య ప్రాంతవాసులు ఇతర ప్రాంతాల్లో నివసించే క్రమంలో ఎదురయ్యే వివక్షను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ ప్యానెల్ అదే ఏడాది హోంశాఖకు తన నివేదికను సమర్పించింది. విస్తృత స్థాయిలో జాతి వివక్ష ఎదురవుతోందని ధ్రువీకరిస్తూ, దాన్ని అరికట్టడానికి జాతి వివక్ష వ్యతిరేక చట్టం, ఫాస్ట్-ట్రాక్ దర్యాప్తు, సంస్థాగత రక్షణల వంటి చర్యలను సైతం అందులో సూచించింది.
అయితే, అప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. ఎలాంటి నిర్దిష్ట జాతి వివక్ష వ్యతిరేక చట్టం అమల్లోకి రాలేదని, అలాగే కమిటీ చేసిన సూచనల్లో చాలామేరకు పాక్షికంగానే అమలయ్యాయని చెబుతున్నారు.
దీనిపై స్పష్టత కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బీబీసీ సంప్రదించింది. అయితే వారు ఇంకా స్పందించాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
అడ్డుకోవడం సాధ్యమేనా?
అయితే ఈ జాతి వివక్ష వ్యతిరేక చట్టం తీసుకురావాలని మళ్లీ కొత్తగా వినిపిస్తున్న ఈ డిమాండ్లు.. ఈ విద్వేషాలను అడ్డుకోగలవా అనే చర్చ కూడా ఉంది.
అయితే, చక్మా, గోల్మేయి వంటి నిపుణులు, కార్యకర్తలు ఇది సాధ్యమేనని అంటున్నారు.
వరకట్న నిషేధ చట్టాలు, కుల ఆధారిత దాడి నిషేధ చట్టాలను వారు ప్రస్తావిస్తున్నారు.
"జాతి వివక్ష వ్యతిరేక చట్టం బాధితులకు సాధికారత కల్పించగలదు. ఫిర్యాదు చేసేలా ప్రోత్సహించగలదు" అని గోల్మేయి అన్నారు.
అటు, త్రిపురలో ఉన్న తరుణ్ చక్మా తన పెద్ద కొడుకు గురించి బాధపడుతూనే, తన చిన్న కొడుకు మైఖేల్ విషయంలో ఆందోళనగా ఉన్నారు.
సోషియాలజీలో చివరి సంవత్సరం చదువుతున్న మైఖేల్, చదువు పూర్తి చేసేందుకు తిరిగి డెహ్రాదూన్ వెళ్లాలని భావిస్తున్నారు.
ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వారి కుటుంబ సభ్యులు భావిస్తుండగా.. తరుణ్ చక్మా మాత్రం తన కొడుకు భద్రత గురించి, అలాగే చదువును మధ్యలో ఆపేస్తే ఎదురయ్యే నష్టం గురించి ఆలోచిస్తూ సతమతమవుతున్నారు.
‘‘ఏం జరిగినా, మంచి భవిష్యత్తు కోసం ఉన్నత విద్య అవసరం. మేం మా కొడుకులను ఇంటి నుంచి దూరంగా పంపడానికి కారణం కూడా అదే" అని ఆయన అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














