స్పేస్ మిషన్ పూర్తి కాకుండానే నలుగురు వ్యోమగాములను వెనక్కి తీసుకువస్తున్న నాసా.. అసలేమైంది?

నాసా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అస్ట్రోనాట్స్

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, కింద వైపు ఎడమ నుంచి పైలట్ మైక్ ఫిన్కే, కమాండర్ జెనా కార్డ్‌మాన్, వెనుక నిల్చున్నవారు ఎడమ నుంచి మిషన్ స్పెషలిస్ట్ ఒలెగ్ ప్లటొనోవ్, జపనీస్ అస్ట్రోనాట్ కిిమియా యూయి
    • రచయిత, మాక్స్ మట్జా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి నలుగురు వ్యోమగాములను భూమి మీదకు తీసుకు వస్తున్నట్లు నాసా తెలిపింది. ఈ నలుగురిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారి మిషన్ పూర్తి కావడానికి నెల రోజుల ముందే ఆ నలుగురు ఆస్ట్రోనాట్లను నాసా కిందకు తీసుకువస్తోంది.

ఆ నలుగురిలో అనారోగ్యం బారిన పడిన వ్యక్తి ఎవరు, ఎలాంటి అనారోగ్య సమస్య ఎదుర్కొంటున్నారు? ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందనే విషయం నాసా వెల్లడించలేదు. అయితే ఆ వ్యోమగామి పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పింది.

"ఇదేమీ అత్యవసర తరలింపు కాదు. ఆ వ్యోమగామి ఆరోగ్యం గురించి నిరంతం అప్రమత్తంగా ఉన్నాం" అని నాసా అధికారి ఒకరు చెప్పారు.

స్పేస్‌వాక్ కోసం ఇద్దరు వ్యోమగాములు గురువారం ఐసిస్ నుంచి బయటకు రావడానికి సిద్ధం కావాల్సి ఉండగా 'వైద్యపరమైన కారణాల దృష్ట్యా' అంటూ బుధవారం నాసా ఈ కార్యక్రమాన్ని అర్థాంతరంగా రద్దు చేసింది.

నలుగురు వ్యోమగాములను వెనక్కి తీసుకువస్తున్నట్లు నాసా అడ్మినిస్ట్రేటర్ జరేడ్ ఇసాక్‌మ్యాన్ గురువారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు.

వ్యోమగామి అనారోగ్యానికి అంతరిక్ష పరిశోధనలు లేదా గాయం కారణం కాదని ఆయన వివరించారు.

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వ్యోమగాముల రాకపై 48 గంటల్లో మరి కొంత సమాచారం, స్పష్టత వస్తుందన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నాసా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అస్ట్రోనాట్స్

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్,

65 ఏళ్లలో చరిత్రలో తొలిసారి

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ నుంచి వ్యోమగాములను ఆపరేషన్ పూర్తి కావడానికి ముందే తీసుకురావడం ఇదే తొలిసారి.2000 సంవత్సరం నుంచి ఐఎస్ఎస్‌కు ఆస్ట్రోనాట్లు వెళ్లి వస్తున్నారు.

ఈ నలుగురు సభ్యుల బృందాన్ని క్రూ-11 పేరుతో పిలుస్తున్నారు. వీరిలో నాసా వ్యోమగాములు జెనా కార్డ్‌మాన్, మైక్ ఫిన్కే, జపాన్ అంతరిక్ష సంస్థ జక్సాకు చెందిన కిమియా యూయి, రష్యన్ కాస్మోనాట్ ఒలెగ్ ప్లటొనోవ్ ఉన్నారు.

అమెరికన్ అస్ట్రోనాట్ ఒకరు, ఇద్దరు రష్యన్ కాస్మోనాట్లు కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉంటారని నాసా అధికారి తెలిపారు.

ఆస్ట్రోనాట్ అనారోగ్య కారణంగా మిషన్‌ పూర్తి కాకుండానే ఆపేయడం నాసా 65ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి అని నాసా చీఫ్ హెల్త్ అండ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జేమ్స్ పోల్క్ చెప్పారు.

క్రూ -11 సిబ్బందిని 2025 ఆగస్టులో స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు పంపించారు. క్రూ -11 ఆరు నెలల పాటు అంతరిక్షంలో గడిపి మరో నలుగురు ఆస్ట్రోనాట్లు అక్కడకు చేరుకున్న తర్వాత ఫిబ్రవరిలో తిరిగి రావాల్సి ఉంది.

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఉన్న వ్యోమగాముల కోసం ప్రాథమిక చికిత్సకు అవసరమైన వైద్య సామగ్రి, భూమి మీద ఉన్న డాక్టర్లతో మాట్లాడేందుకు సమాచార వ్యవస్థ అందుబాటులో ఉన్నాయి. దీని సాయంతో వారు డాక్టర్లతో మాట్లాడి చికిత్సకు సంబంధించిన సలహాలు తీసుకోవచ్చు.

క్రూ -11 కిందకు రావడం వల్ల, కొత్త వాళ్లు అక్కడకు వెళ్లే వరకు అంతరిక్షంలో తాము చేపట్టిన ప్రయోగాలు, నిర్వహణా కార్యక్రమాలు వాయిదా పడతాయని ఓపెన్ యూనివర్సిటీలో స్పేస్ సైంటిస్ట్ డాక్టర్ సిమియోన్ బార్బర్ చెప్పారు.

"స్పేస్ స్టేషన్ చాలా పెద్దది. అక్కడ చాలా పెద్ద ఇంజనీరింగ్ వర్క్ జరుగుతుంది. దీని కోసం కనీస స్థాయిలో కొంతమంది సిబ్బంది కావాలి" అని ఆయన అన్నారు.

కొత్తవాళ్లు వచ్చే వరకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోని మిగిలిన సిబ్బంది "మరికొన్ని ప్రయోగాత్మక పనులు చేయాల్సి రావచ్చు. అలాగే స్టేషన్‌ను పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది" అని ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)