అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లే వ్యోమగాములకు ఎలాంటి శిక్షణ ఇస్తారు, క్వారంటైన్‌లో ఎందుకు ఉంచుతారు?

ఫొటో సోర్స్, Nasa.gov
- రచయిత, శ్రీకాంత్ బక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలిసారి ఒక భారతీయ వ్యోమగామి వెళుతున్నారు. ఆక్సిమ్ 4 మిషన్‌లో భాగంగా వెళ్లనున్న నలుగురు వ్యోమగాముల్లో ఇస్రోకు చెందిన శుభాన్షు శుక్లా కూడా ఉన్నారు.
ఈ మిషన్‌కు కమాండర్‌గా పెగ్గీ విట్సన్, పైలట్‌గా ఇస్రోకి చెందిన శుభాన్షు శుక్లా, మిషన్ స్పెషలిస్ట్‌లుగా పోలండ్‌కి చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కి విస్నివ్స్కీ, హంగరీ నుంచి టిబోర్ కాప్ ఉన్నారు.
అయితే, ఈ ప్రోగ్రామ్ కోసం ఈ నలుగురితో పాటు మరో ముగ్గురికి కూడా శిక్షణ ఇచ్చారు.


ఫొటో సోర్స్, Axiom Space
'వెళ్లేది నలుగురైతే శిక్షణ ఏడుగురికి ఎందుకు?'
అంతరిక్ష ప్రయాణాలు చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఒక్కసారి ప్రయోగం, ప్రయాణ తేదీ నిర్ణయించిన తర్వాత అన్నీ పకడ్బందీగా జరగాలి. వాతావరణం సరిగ్గా లేకపోతే ఒకటి రెండు రోజులు వాయిదా వేస్తారు. తాజా ఆక్సిమ్ 4 మిషన్ కూడా వాతావరణ పరిస్థితుల వల్ల రెండుసార్లు వాయిదా పడింది.
వాతావరణం బాగోలేకపోతే వాయిదా వేస్తారు. కానీ, వెళ్లాల్సిన వ్యోమగాముల్లో ఎవరికైనా ఇబ్బంది ఎదురైతే అప్పుడేం చేస్తారు. అందుకే ప్రతి అంతరిక్ష ప్రయాణానికి వెళ్లాల్సిన వారితో పాటుగా బ్యాకప్ టీమ్‌ను కూడా సిద్ధం చేస్తారు.
ఆక్సిమ్ 4 ప్రయాణంలో నలుగురు వ్యోమగాములతో పాటు మరో ముగ్గురు బ్యాకప్ టీమ్ కూడా సిద్ధంగా ఉన్నారు. వారిలో ఇస్రోకు చెందిన వ్యోమగామి ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఒకరు. ఆయన పైలట్ శుభాన్షు శుక్లాకు బ్యాకప్‌గా ఉన్నారు.

ఫొటో సోర్స్, axiomspace.com
వారితో పాటు కమాండర్ పెగ్గీ విట్సన్‌కి బ్యాకప్‌గా మైఖెల్ లోపెజ్ అనే అమెరికన్, స్పానిష్ ఆస్ట్రోనాట్ సిద్ధంగా ఉన్నారు.ఇక మిషన్ స్పెషలిస్ట్‌కి బ్యాకప్‌గా గుల్యా సెరెనీ ఉన్నారు. వీరు కూడా ఆక్సిమ్ 4 సభ్యులతో పాటుగా పూర్తి స్థాయిలో సమాన శిక్షణ తీసుకుంటారు.
ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ముందుగా నిర్ధరించిన వారిలో ఎవరైనా అంతరిక్ష ప్రయాణం చేయలేకపోతే, వారి స్థానంలో బ్యాకప్ సభ్యులను ఉపయోగించుకుంటారు. 1984లో రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లేటప్పుడు కూడా... ఆయనకు బ్యాకప్ టీంలో రవీష్ మల్హోత్రా అనే మరో భారతీయ వ్యోమగామికి శిక్షణ ఇచ్చారు.
ఇస్రో గగనయాన్ ప్రాజెక్ట్‌కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో శుభాన్షు శుక్లా, బాలకృష్ణన్ నాయర్ కూడా ఉన్నారు. వీరితో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు గగన్‌యాన్ కోసం సిద్ధమవుతున్నారు.
శుక్లా చేయబోయే 14 రోజుల అంతరిక్ష ప్రయాణం... ఇస్రో భవిష్యత్ ప్రయోగాలకు, భారత అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి చాలా ఉపయోగపడుతుందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ తెలిపారు.

ఫొటో సోర్స్, Nasa.gov
వ్యోమగాములకు ఎలాంటి శిక్షణ ఇస్తారు?
అంతరిక్షంలోకి వెళ్లే ముందు వ్యోమగాములకు విభిన్న అంశాలపై లోతైన, సమగ్ర శిక్షణ అందిస్తారు. ఇందుకోసం చాలా ఖర్చవుతుంది. భారత్ తన వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు చాలా పెద్ద ఎత్తున నిధులు చెల్లించాల్సి ఉంటుంది.
వ్యోమగాములకు శారీరక, మానసిక అంశాలతో పాటు, సాంకేతిక అంశాలు, భాషా పరమైన శిక్షణ, సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాలు ఇలా చాలా రకాల శిక్షణలు అందిస్తారు.

ఫొటో సోర్స్, Nasa.gov
'టెక్నికల్, ఆపరేషనల్ ట్రైనింగ్'
నాసా అందించిన వివరాల ప్రకారం వ్యోమగాములకు టెక్నికల్, ఆపరేషనల్ ట్రైనింగ్ ఇస్తారు. ఇందుకోసం స్పేస్ స్టేషన్ నమూనాను ఇక్కడే తయారు చేసి, అందులో వారికి పూర్తి స్థాయిలో అన్ని రకాల శిక్షణలు ఇస్తారు.
అంటే అక్కడ ఏయే పరికరాలను ఎలా ఉపయోగించాలో భూమ్మీదే సిమ్యులేటర్‌లో లాంచింగ్, డాకింగ్, ల్యాండింగ్, ఎమర్జెన్సీ అంశాలపై శిక్షణనిస్తారు.
వీటితో పాటు స్పేస్ వాక్ వంటి అంశాలను వర్చువల్ రియాల్టీ వంటి విధానాల్లో, అతిపెద్ద స్విమ్మింగ్ పూల్ ల్యాబ్‌లలో శిక్షణ ఇస్తారు.
వీటితో పాటు రోబోటిక్ సిస్టమ్‌లు ఎలా ఆపరేట్ చేయాలనే దానిపై కూడా శిక్షణ ఇస్తారు.

ఫొటో సోర్స్, Nasa.gov
మైక్రో గ్రావిటీ శిక్షణ
అంతరిక్షంలోకి తొలిసారి వెళ్లబోయే వ్యోమగాములు అక్కడ భార రహిత స్థితికి పూర్తి స్థాయిలో అలవాటు పడేలా భూమ్మీదే శిక్షణ ఇస్తారు.
ఇందుకోసం స్విమ్మింగ్‌పూల్‌లో అతిపెద్ద ల్యాబ్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లాంటి నమూనాను ఏర్పాటుచేసి అక్కడ శిక్షణ ఇస్తారు. దీని వల్ల వ్యోమగాములకు భార రహిత స్థితి అలవాటు అవుతుంది. దీంతో పాటు మైక్రో గ్రావిటీని అలవాటు చేసేలా పారాబోలిక్ ఫ్లైట్ టెస్ట్‌లు కూడా నిర్వహిస్తారు.
నాసా వెల్లడించిన వివరాల ప్రకారం.. వ్యోమగాములు అత్యంత చురుగ్గా, వేగంగా స్పందించేందుకు T-38 జెట్ ట్రైనింగ్ అని ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు. ఇందులో వారు అత్యధిక గురుత్వాకర్షణ శక్తి (జీ ఫోర్స్) దగ్గర కూడా పనిచేసేలా, ప్రతిచర్యలు చేయగలిగేలా శిక్షణ ఇస్తారు.
ఇది వారు ఐఎస్ఎస్ నుంచి తిరిగి భూమ్మీదకు వచ్చేటప్పుడు ఎదుర్కొనే పరిస్థితి. ఇది చాలా క్లిష్టమైన సమయం. అందుకే వ్యోమగాములు ఈ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Nasa.gov
ఫిజికల్ అండ్ సర్వైవల్ ట్రైనింగ్
ఇక వ్యోమగాముల శారీరక ధడత్వం చాలా కీలకమైన అంశం. అయితే, అంతరిక్షంలో మైక్రో గ్రావిటీలో పనిచేయడం, భూమ్మీదకు తిరిగి వచ్చేటప్పుడు అత్యధిక జీ ఫోర్స్‌లో పనిచేయడం వంటి అంశాలపై ప్రత్యేకమైన ఎక్సర్‌సైజులు చేయిస్తారు.
వీటితో పాటు అత్యవసర సందర్భాల్లో ఎలా స్పందించాలో నేర్పేందుకు ఎడారులు, అడవులు, సముద్రాలు వంటి భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం, అక్కడి నుంచి బయటపడటం వంటివాటిపై శిక్షణ ఇస్తారు.
వాతావరణ పీడనం తక్కువగా ఉన్న పరిస్థితులు, ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు ఎలా స్పందించాలి? అంతరిక్ష ప్రయాణాల్లో స్పేస్ క్యాబిన్ ప్రెజర్ తగ్గినప్పుడు ఏం చేయాలి? వంటి శిక్షణలు కూడా ఇస్తారు.

ఫొటో సోర్స్, Axiom Space
భాషా సంస్కృతులపై శిక్షణ
ఆక్సిమ్ 4 మిషన్‌లో నాలుగు దేశాలకు చెందిన వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్నారు.
ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కూడా వివిధ దేశాలకు చెందిన ఏడుగురు వ్యోమగాములున్నారు.
వారితో సంభాషనలు జరిపేటప్పుడు, వారితె 14 రోజుల పాటు కలసి పరిశోధనలు చేసేటప్పుడు మరింత సాఫీగా వారితో మెలిగేందుకు వీలుగా వారికి వివిధ భాషలు, వివిధ సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులకు చెందిన అంశాలపై కూడా శిక్షణ ఇస్తారు.

ఫొటో సోర్స్, Nasa.gov
వైద్యం, ఆరోగ్యం
నాసా వెల్లడించిన వివరాల ప్రకారం వ్యోమగాములకు పూర్తి స్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. శిక్షణా సమయంలో వారి ఆహారం, వ్యాయామం అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి.
వారి శారీరక ధృడత్వం, చురుకుదనం, మానసికంగా వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలు అన్నింటినీ నిపుణులు పర్యవేక్షిస్తారు. అంతరిక్ష ప్రయాణానికి ముందు వారు కచ్చితంగా సుమారు వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతారు.
వీటితో పాటు వ్యోమగాములు స్ప్రేస్ క్రాఫ్ట్ సిస్టమ్స్‌ని, రోబోటిక్స్‌ని ఎలా ఉపయోగించాలో పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తారు.
ఇక అంతరిక్షంలోకి వెళ్లి వాళ్లు నిర్వహించాల్సిన అన్ని ప్రయోగాలపైనా శిక్షణ ఇస్తారు.
అక్కడ డేటా సేకరణ, డేటా మేనేజ్‌మెంట్, విపత్కర పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలి? టెక్నికల్ సమస్యలు వస్తే ఎలా పరిష్కరించాలో అన్నీ ముందే శిక్షణ ఇస్తారు.
ఇక స్పేస్ వాక్, ఇతర క్రిటికల్ ఆపరేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తారు.
భూమ్మీద ఎవరికైనా అనారోగ్యం తలెత్తితే ఆస్పత్రికి తీసుకెళ్తాం. అదే అంతరిక్షంలో అనారోగ్యం తలెత్తితే... డాక్టర్‌ని పంపించడం కష్టం కాబట్టి... వ్యోమగాములకు వైద్య చికిత్సలో కూడా కొంత శిక్షణ ఇస్తారు.
అంతరిక్షంలో స్వీయ ఆరోగ్యంతో పాటు, సహచరులు అనారోగ్యం పాలైతే అక్కడ వైద్య పరికరాలు ఎలా ఉపయోగించాలి, ప్రాథమికంగా ఎలాంటి చికిత్స అందించాలి వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు.

ఫొటో సోర్స్, Axiom Space
లాంచ్‌కు ముందు శిక్షణ
ఈ శిక్షణా కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక అన్ని పరీక్షలూ పాసైన వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపేందుకు ఎంపిక చేస్తారు. క్వారంటైన్, వైద్య పరీక్షలు, ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తయ్యాక... లాంచింగ్ రోజు ఆస్ట్రోనాట్లను తమ స్పేస్ సూట్లు వేసుకుని సిద్ధం చేస్తారు.
ఈ స్పేస్ సూట్లను ఎక్స్‌స్ట్రా వెహికిలర్ మొబిలిటీ యూనిట్స్ అంటారు. ఆ తర్వాత అన్ని సిస్టమ్స్ సమగ్రంగా చెక్ చేస్తారు. లాంచ్‌కు ముందు వ్యోమగాములు తమ కుటుంబ సభ్యులతో పరిమితంగా, నియంత్రిత పరిస్థితుల్లో మాట్లాడేందుకు అవకాశమిస్తారు.
ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వారిని నేరుగా మాట్లాడనివ్వరు. వ్యోమగాములు మానసికంగా మరింత దృఢంగా ఉండేందుకు అవసరమైన సైకలాజికల్ సపోర్ట్ అందిస్తారు.
ఇలా అన్ని దశల్లో, అన్ని విధాలుగా సర్వం సిద్ధంగా ఉన్నారని నిర్ధరించిన తర్వాతే వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపిస్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














