సునీతా విలియమ్స్‌లా వ్యోమగామి కావడం ఎలా, ఏం చదవాలి, ఎలాంటి శిక్షణ ఉంటుంది?

సునీతా విలియమ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అంతర్జాతీయ అంతరిక్షంలో గడపడానికి తగిన శిక్షణ, అనుభవం అవసరం.

సునీతా విలియమ్స్, బుచ్‌విల్‌మోర్ అంతరిక్షంలో చిక్కుకుపోవడం, 9నెలల అనంతరం వారు సురక్షితంగా భూమిపైకి చేరుకోవడం ప్రపంచం మొత్తం ఉత్కంఠగా చూసింది.

సునీత,విల్‌మోర్ సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఎలా ఉండగలిగారు.

ఇందుకోసం వారు ఎలాంటి శిక్షణ తీసుకున్నారు.

అంతరిక్షంలో ఎలా ఉండాలో వ్యోమగాములకు శిక్షణ ఇస్తారు.

ఇంతకీ నాసాలో వ్యోమగామి కావడం ఎలా? ఏం చదవాలి? అవకాశం ఎలా దక్కుతుంది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వ్యోమగామి కావడానికి అర్హతలేంటి?

మానవ సహిత అంతరిక్ష యాత్రల కోసం నాసా వ్యోమగాములను ఎంపిక చేస్తుంటుంది. సైనిక సిబ్బంది, అధికారులు మాత్రమే కాక, నాసా వ్యోమగాములుగా మారేందుకు సామాన్య ప్రజలు కూడా దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు.

దరఖాస్తుదారులు (అతడు/ఆమె) అమెరికా పౌరులై ఉండాలి.

గుర్తింపు పొందిన కాలేజీ నుంచి స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్)లో మాస్టర్స్ డిగ్రీ కావాలి. బయోలాజికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీలను కూడా నాసా అంగీకరిస్తుంది. మెడిసిన్ డిగ్రీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వ్యోమగామి అయ్యేందుకు నాసాకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అవసరమైన అనుభవం ఉండాలి. మాస్టర్స్ డిగ్రీ తర్వాత కనీసం రెండేళ్లు లేదా జెట్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు పైలట్-ఇన్-కమాండ్‌గా 1000 గంటలు పని చేసిన అనుభవం అవసరం.

అలాగే సుదీర్ఘ అంతరిక్ష యానానికి అభ్యర్థులకు తగిన శారీరక సామర్థ్యం ఉందా లేదా అని పరిశీలిస్తారు. ఈ పరీక్షలలో కంటిచూపును, రక్త పోటును పరీక్షిస్తారు. అభ్యర్థి ఎత్తు 62 నుంచి 75 అంగుళాల మధ్య ఉండాలి.

సునీతా విలియమ్స్ యూఎస్ నేవల్ అకాడమీ నుంచి ఫిజికల్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఆ తర్వాత ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేశారు.

1998లో నాసాకు ఎంపికైనప్పుడు, యూఎస్ నేవీలో పనిచేస్తున్నారు.

నేవల్ ఏవియేషన్ వింగ్‌తో పాటు పలు పదవుల్లో ఆమె యూఎస్ నేవీలో పదకొండు ఏళ్లు పనిచేశారు. ఇప్పటి వరకు 30 రకాల ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఆమె నడిపారు.

సునీతా విలియమ్స్

ఫొటో సోర్స్, X/NASA

రెండు దశలలో ఇంటర్వ్యూలు

మానవ సహిత అంతరిక్ష యాత్రల కోసం నాసా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దీనికి సైన్యంలో పనిచేసే మూడు బ్రాంచుల వారు, అమెరికా పౌరులు దరఖాస్తు చేసుకోవచ్చు.

నాసాలో వ్యోమగాములను ఎంపిక చేసే బాధ్యత ఆస్ట్రోనాట్ సెలక్షన్ బోర్డు చూసుకుంటుంది. ప్రతి దరఖాస్తును ఈ బోర్డే పరిశీలిస్తుంది. ఈ రివ్యూ ప్రక్రియలోనే, దరఖాస్తుల విద్యార్హతలు, ఇతర సమాచారాన్నిపరిశీలిస్తుంది.

దరఖాస్తుల పరిశీలన తర్వాత, తొలి రౌండ్ ఇంటర్వ్యూ కోసం కొందరిని ఎంపిక చేస్తుంది. ఈ ఇంటర్వ్యూ సాధారణంగా వారం రోజులపాటు అమెరికాలోని హ్యూస్టన్‌లో నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌లో జరుగుతుంది. తొలి రౌండ్‌లో ఎంపికైన వారికి మరోసారి ఇంటర్వ్యూ ఉంటుంది.

చివరి ఇంటర్వ్యూలో, నాసాకు కొత్త వ్యోమగాములు ఎంపికవుతారు. ఎంపికైన వారిని శిక్షణ కోసం పంపుతారు. ఈ శిక్షణ రెండేళ్ల పాటు జాన్సన్ స్పేస్ సెంటర్‌లో కొనసాగుతుంది.

వ్యోమగాములు

ఫొటో సోర్స్, Getty Images

ఎలాంటి శిక్షణ ఇస్తారంటే..

జాన్సన్ సెంటర్‌లో బేసిక్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఇస్తారు. దానిలో స్పేస్‌వాక్ ఎలా చేయాలి? స్పేస్ స్టేషన్ ఎలా ఆపరేట్ చేయాలి? టీ-38 జెట్ ప్లేన్‌ను ఎలా నడపాలి, రోబోటిక్ ఆర్మ్‌ను ఎలా వాడాలి? వంటివన్ని ఉంటాయి. అదనంగాఅండర్‌వాటర్ సర్వైవల్, స్కూబా డైవింగ్ వంటి నైపుణ్యాలను నేర్పిస్తారు.

వీటితోపాటు తప్పనిసరిగా డైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్టులో మూడు రౌండ్లు 25 మీటర్ల పొడవైన స్విమ్మింగ్ పూల్‌లో ఆపకుండా ఈత కొట్టాలి. ఆ తర్వాత, మరో స్విమ్మింగ్ టెస్టు ఉంటుంది. స్పేస్ షూట్, టెన్నిస్ షూ వేసుకుని ఆగకుండా 25 మీటర్ల పొడవైన స్విమ్మింగ్ పూల్‌లో మరో మూడుసార్లు ఈత కొట్టాలి. ఈ మూడు రౌండ్లను ఆపకుండా పూర్తి చేయాలి.

వ్యోమగాములకు వాతావరణ పీడనాన్ని తట్టుకునేలా శిక్షణ ఇస్తారు. మోడిఫైడ్ జెట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో మైక్రోగ్రావిటీ కోసం కూడా శిక్షణ ఇస్తారు. అంతరిక్షంలో ఎలాంటి గురుత్వాకర్షణ ఉండదు కనుక, ఈ శిక్షణ చాలా అవసరం.

రెండో దశలో కంప్యూటర్ ఆధారిత శిక్షణ ఉంటుంది. నాసా స్పేస్ షటిల్‌ను ఎలా ఆపరేట్ చేయాలి? వెహికిల్, స్పేస్‌క్రాఫ్ట్ లాంచ్ ఎలా? వంటివి నేర్పిస్తారు.. స్పేస్‌క్రాఫ్ట్‌ల సిస్టమ్స్‌లో లోపాలను ఎలా గుర్తించాలి? వాటికి మరమ్మతులు ఎలా చేయాలి? వంటి విషయాలపై కూడా శిక్షణ ఇస్తారు.

జాన్సన్ సెంటర్‌లో శిక్షణ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నమూనాను కూడా సిద్ధం చేశారు. ట్రైనీలకు వంట, పరికరాల వాడకం, వాటి నిర్వహణ, కెమెరాల వాడకం, పలు ఆపరేషన్స్ గురించి ముఖ్యమైన సమాచారం ఇస్తారు.

శిక్షణ అంతా పూర్తయిన తర్వాత, ట్రైనీలను పరిశీలిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత, నాసా వ్యోమగామిగా నియమిస్తారు. ఈ శిక్షణ పూర్తి చేసుకోలేని వారిని నాసాలోని ఇతర విభాగాల్లో పనిచేసేందుకు పంపుతారు.

ఇస్రో

ఫొటో సోర్స్, ISRO

భారత్‌లో..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగన్‌యాన్ మిషన్ కోసం పనిచేస్తోంది. ఈ మిషన్‌లో ముగ్గురు వ్యోమగాములు మూడు రోజుల పాటు అంతరిక్షంలో ఉంటారు. ఆ తర్వాత భూమికి తిరిగి వస్తారు. ఇది భారత్‌కు చెందిన తొలి మానవ సహిత అంతరిక్ష మిషన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన నలుగురు పైలట్లను ఈ మిషన్‌ కోసం ఇస్రో ఎంపిక చేసింది.

భారత వైమానిక దళం నుంచి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లాను గగన్‌యాన్ మిషన్‌కు ఎంపిక చేసినట్టు ప్రకటించారు.

రష్యాలో 13 నెలల శిక్షణ తర్వాత, ఈ నలుగురు వ్యోమగాములకు ప్రస్తుతం ఇస్రో వ్యోమగాముల శిక్షణా కేంద్రంలో ట్రైనింగ్ ఇస్తున్నారు.

2035 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఇది ఇండియన్ స్పేస్ స్టేషన్‌గా ఉంటుందని పేర్కొంది.

2040 నాటికి చంద్రునిపైకి వ్యోమగాములను పంపాలని నాసా ప్రయత్నిస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)