స్టార్‌లింక్: ఎలాన్ మస్క్ కంపెనీ రాకతో భారత్‌లో ఇంటర్నెట్ చౌకగా లభిస్తుందా?

స్టార్‌లింక్ ఇంటర్నెట్ యాక్సెస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్టార్‌లింక్ లాంచింగ్ (ఫైల్ ఫోటో)

మొబైల్, ఇంటర్నెట్ సర్వీసెస్ కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ తర్వాత ఇప్పుడు రిలయన్స్ జియో కూడా భారత్‌కు స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసులను తీసుకొచ్చేందుకు ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్ స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం చేసుకుంది.

స్టార్‌లింక్ ఒక ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సర్వీస్. ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్ దీన్ని నిర్వహిస్తోంది.

శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌తో ఆ శాటిలైట్ పరిధిలో ఎక్కడైనా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించవచ్చు.

ఎలాన్ మస్క్, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. స్పేస్‌ఎక్స్, టెస్లా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)‌ వంటి సంస్థలకు ఆయన యజమాని.

ప్రస్తుతం అమెరికా పాలనలో మస్క్ కీలక పాత్రను పోషిస్తున్నారు.

స్టార్‌లింక్ హైస్పీడ్ ఇంటర్నెట్ సర్వీసును అందిస్తుంది. సంప్రదాయక ఇంటర్నెట్ సర్వీసులు చేరడం కష్టమైన చోటుకు.. అంటే, మారుమూల ప్రాంతాల్లోకి కూడా స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు అందుతాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
స్టార్‌లింక్

ఫొటో సోర్స్, Getty Images

స్టార్‌లింక్ ప్రణాళికలు

ప్రస్తుతం 100కు పైగా దేశాల్లో స్టార్‌లింక్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. భారత్‌కు పొరుగునే ఉన్న భూటాన్‌లో కూడా స్టార్‌లింక్ సేవలు అందిస్తోంది.

అయితే, భారత్‌లో స్టార్‌లింక్‌కు ఇంకా అనుమతులు (రెగ్యులేటరీ అప్రూవల్స్) దక్కలేదు. వీటిపై భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నాయి.

కానీ, ఇప్పుడు దీనికి ఆమోదం లభిస్తే, భారత్‌లో ఇంటర్నెట్ సర్వీసుల ముఖచిత్రమే మారిపోనుంది.

పాలనా ప్రక్రియ(అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్) ద్వారా కాకుండా వేలం ద్వారా శాటిలైట్ స్పెక్ట్రమ్‌ను అందించాలని ముకేశ్ అంబానీ, భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ కోరుకుంటున్నారు.

కానీ, వేలం ప్రక్రియపై ఎలాన్ మస్క్ సుముఖంగా లేరు.

నగరంలోని ప్రజలకు ఇంటర్నెట్ సేవలను అందించాలనుకునే కంపెనీలు ఇతర కంపెనీల తరహాలోనే టెలికామ్ లైసెన్స్‌ను తీసుకోవాలని, స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయాలని సునీల్ మిట్టల్ అంటున్నారు.

సునీల్ మిట్టల్, భారత్‌కు చెందిన రెండో అతిపెద్ద వైర్‌లెస్ ఆపరేటర్. 80 శాతం టెలికామ్ మార్కెట్‌ అంబానీ, సునీల్ మిట్టల్ చేతుల్లోనే ఉంది.

స్టార్‌లింక్

ఫొటో సోర్స్, Getty Images

స్టార్‌లింక్ ఎలా పనిచేస్తుంది? ఈ సర్వీసులను ఎలా పొందాలి?

సంప్రదాయక బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు భూగర్భ ఫైబర్ కేబుల్స్‌పై, సెల్యూలార్ టవర్ల మీద ఆధారపడతాయి. స్టార్‌లింక్ మాత్రం 'లో ఎర్త్ ఆర్బిట్' ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్‌ యాక్సెస్‌ను అందిస్తుంది.

ఈ ఉపగ్రహాల నుంచి వచ్చే సిగ్నల్స్, భూమ్మీద ఉండే రిసీవర్లను చేరతాయి. తర్వాత ఇంటర్నెట్ డేటాగా మారతాయి.

మస్క్ కంపెనీ స్టార్‌లింక్‌కు ప్రస్తుతం ఆర్బిట్‌లో దాదాపు 7000 ఉపగ్రహాలు ఉన్నాయి. 100 దేశాల్లో 40 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

ప్రతీ అయిదేళ్లకు కొత్త టెక్నాలజీ ప్రకారం, తన నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ ఉంటానని మస్క్ చెప్పారు.

భారత్‌లో స్టార్‌లింక్ సర్వీసులను 2021లోనే తీసుకురావాలని మస్క్ ఆశించారు. కానీ, రెగ్యులేటరీ సమస్యల కారణంగా ఆలస్యమైంది.

వినియోగదారులు, స్టార్‌లింక్ సర్వీసులు పొందడానికి స్టార్‌లింక్ డిష్‌తో పాటు రౌటర్ అవసరం.

సమీపంలోని స్టార్‌లింక్ శాటిలైట్ క్లస్టర్‌కు ఈ డిష్ తనంతటతానే అనుసంధానం అవుతుంది. ఇది ఎలాంటి అవాంతరాలు లేకుండా కనెక్టివిటీని అందిస్తుంది.

స్టార్‌లింక్‌ను ఒక స్థిరమైన ప్రదేశంలో ఉంచి ఉపయోగించుకునేలా రూపొందించారు. కానీ, అదనపు హార్డ్‌వేర్ సహాయంతో కదిలే వాహనాలు, పడవలు, విమానాల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందవచ్చు.

స్టార్‌లింక్

ఫొటో సోర్స్, Getty Images

స్టార్‌లింక్ ఇంటర్నెట్ స్పీడ్ ఎంత?

ఇంటర్నెట్ ఎల్‌ఈవో శాటిలైట్లు వేగంగా (25-60 మిల్లీ సెకన్లు) స్పందిస్తాయి. సంప్రదాయక జియోస్టేషనరీ శాటిలైట్లు 600 మిల్లీ సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకుంటాయి.

ఈ స్పీడ్ కారణంగా వీడియో సమావేశాలు, ఆన్‌లైన్ గేమింగ్, హెచ్‌డీ స్ట్రీమింగ్ వంటి వాటికి స్టార్‌లింక్ సర్వీసులు మరింత ఉపయోగకరంగా పరిగణిస్తున్నారు.

అయితే, సంప్రదాయక ఫైబర్ ఆధారిత బ్రాండ్‌బ్యాండ్ సర్వీసులైన జియో ఫైబర్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ వంటివి నగర ప్రాంతాల్లో మంచి వేగంతో సర్వీసులను అందిస్తున్నాయి.

భారత్‌లో ఫైబర్ కనెక్టివిటీ లేని, లేదా సరిగ్గా పనిచేయని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో స్టార్‌లింక్‌ సర్వీసులతో ప్రయోజనం ఉండొచ్చు.

స్టార్‌లింక్ వచ్చిన తర్వాత, భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ గణనీయంగా బలపడే అవకాశం ఉంది.

అయితే, ఇప్పటికే ఉన్న సర్వీసులతో పోలిస్తే స్టార్‌లింక్ సర్వీసులు ఎంత చౌకగా అందుతాయనే అంశంపై ఇది ఆధారపడి ఉంటుంది.

మస్క్, ముకేశ్ అంబానీ

ఫొటో సోర్స్, Getty Images

స్టార్‌లింక్ ఇంటర్నెట్ ధర ఎంత?

భారత్‌లో స్టార్‌లింక్ ప్లాన్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ, భూటాన్‌లో స్టార్‌లింక్ సర్వీసుల ధరలను బట్టి భారత్‌లో వీటి ధర ఎంత ఉంటుందో అంచనా వేయవచ్చు.

భూటాన్‌లో రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ నెలకు అక్కడి కరెన్సీలో చెప్పాలంటే 3000 నోంగ్‌ట్రమ్‌గా ఉంది. భూటాన్ కరెన్సీ విలువ, భారత్ కరెన్సీ విలువ సమానం అయినందున భారత్‌లో కూడా రెసిడెన్షియల్ లైట్ ప్లాన్‌కు రూ. 3,000 ఉండొచ్చని భావిస్తున్నారు.

ఈ ప్లాన్‌లో స్టార్‌లింక్ స్పీడ్ 23 ఎంబీపీఎస్ నుంచి 100 ఎంబీపీఎస్ మధ్య ఉంటుంది. బ్రౌజింగ్, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్‌కు ఈ స్పీడ్ సరిపోతుంది.

అదేవిధంగా 25 ఎంబీపీఎస్ నుంచి 110 ఎంబీపీఎస్ వరకు ఉండే రెసిడెన్షియల్ ప్లాన్ ధర రూ. 4,200 ఉంటుంది.

భారత్‌లో స్టార్‌లింక్ సర్వీసుల ధర రూ.3,500 నుంచి రూ.4,500 మధ్య ఉండొచ్చని టెలికాం మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ ఒప్పందంతో ఇవి మరింత చౌకగా మారొచ్చు.

 స్టార్‌లింక్ శాటిలైట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికాలోని న్యూ మెక్సికోలో ఓ ఇంటి కప్పు మీద ఏర్పాటు చేసిన స్టార్‌లింక్ శాటిలైట్

నిపుణులు ఏమంటున్నారు?

భారత్‌లోని 140 కోట్ల జనాభాలో 40 శాతం మందికి ఇప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం లేదని కన్సల్టింగ్ కంపెనీ ఈవై పార్థినాన్ వెల్లడించింది. ఇందులో గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే ఎక్కువని పేర్కొంది.

చైనా గురించి చెప్పాలంటే, చైనాలో 109 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారని, భారత్‌లో 75 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారని ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ ట్రెండ్స్‌ను పర్యవేక్షించే ఒక డేటా రిపోర్ట్ పేర్కొంది.

ఇంటర్నెట్‌ వినియోగం(అడాప్షన్)లో ప్రపంచ సగటు 66.2తో పోలిస్తే భారత సగటు వెనుకబడి ఉంది. అయితే, ఈ అంతరం తగ్గుతున్నట్లు ఇటీవలి అధ్యయనాలు చూపిస్తున్నాయి.

సరైన ధరల్ని నిర్ధారిస్తే, శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ఈ అంతరాన్ని పూడ్చటంలో సహాయపడగలదు.

భారత ఆపరేటర్లతో ఈ ధరల యుద్ధాన్ని ఎవరూ ఆపలేరని టెక్నాలజీ అనలిస్ట్ ప్రశాంతో కె రాయ్ బీబీసీ ప్రతినిధి సౌతిక్ బిశ్వాస్‌తో అన్నారు.

మస్క్ వద్ద చాలా డబ్బు ఉంది. భారత దేశీ మార్కెట్‌లో పట్టు సాధించడం కోసం ఆయన కొన్ని ఏరియాల్లో ఉచిత సర్వీసులను కూడా అందించవచ్చు.

స్టార్‌లింక్ ఇప్పటికే కెన్యా, దక్షిణాఫ్రికాల్లో ధరలు తగ్గించింది.

అయితే, ఇది అంత సులభం కాకపోవచ్చు.

అధిక ధరల కారణంగా ప్రభుత్వ సబ్సిడీలు లేకుండా పోటీపడటం స్టార్‌లింక్‌కు కష్టంగా మారొచ్చని 2023 నాటి ఒక నివేదికలో ఈవై పార్థినాన్ పేర్కొంది.

భారత్‌లోని ప్రధాన బ్రాడ్‌బ్యాండ్ కంపెనీల కంటే స్టార్‌లింక్‌కు అయ్యే ఖర్చు 10 రెట్లు ఎక్కువ ఉంటుందని ఆ నివేదిక తెలిపింది.

ప్రపంచవ్యాప్త కవరేజీని అందించడానికి ఎంఈవో శాటిలైట్ల కంటే ఈఎల్‌ఈవోఎస్ శాటిలైట్లు చాలా ఎక్కువ అవసరం అవుతాయి. దీని వల్ల ప్రయోగ, నిర్వహణ ఖర్చులు పెరుగుతాయని ఆ రిపోర్ట్ పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)