‘తూటా మనవైపు వస్తే అది పిల్లలకు తగలకూడదు, మనకే తగలాలని నా భార్యకు చెప్పాను’ - హైజాక్ అయిన రైలు ప్రయాణికుల అనుభవాలు

ఫొటో సోర్స్, EPA
- రచయిత, కెల్లీ ఎన్‌జీ
- హోదా, బీబీసీ ఉర్దూ
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో సాయుధ మిలిటెంట్లు హైజాక్ చేసిన జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి విడుదలైన ప్రయాణికులు తమకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు.
‘కాల్పులు జరుగుతున్నంత సేపు మేం ఊపిరి బిగపట్టుకుని ఉన్నాం, తరువాత ఏం జరగబోతోందో తెలియక చాలా భయపడ్డాం" అని ప్రయాణికుల్లో ఒకరైన ఇషాక్ నూర్ బీబీసీతో చెప్పారు.
మంగళవారం క్వెట్టా నుంచి పెషావర్‌కు 400మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న రైలుపై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) దాడి చేసి కొంతమందిని బంధించింది.
రైలుపై దాడి సమయంలో కొందరు ప్రయాణికులు గాయపడ్డారు. రైలు డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి.
బుధవారం రాత్రి నాటికి 300 మంది ప్రయాణికులను విడిపించడంతో పాటు 33 మంది మిలిటెంట్లను హతమార్చినట్లు సైనిక వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ గణాంకాలను బీబీసీ స్వయంగా ధ్రువీకరించుకోలేదు.

మిగిలిన ప్రయాణికులను రక్షించడానికి వందలాది మంది సైనికులను మోహరించినట్లు భద్రతా దళాలు చెబుతున్నాయి. హెలికాప్టర్లు, ప్రత్యేక దళాల సిబ్బందినీ మోహరించారు.
మరోవైపు రైలులోని మిగతా వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదంటూ బీఎల్ఏ హెచ్చరించింది.
విడిపించిన ప్రయాణికులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
కొంతమంది ఉగ్రవాదులు ప్రయాణికులను చుట్టుపక్కల ఉన్న పర్వత ప్రాంతానికి తీసుకెళ్లి ఉండవచ్చు అని భద్రతాధికారులు చెబుతున్నారు.
రైలులో ఉన్న వారిలో సుమారు 100 మంది భద్రతా దళాలకు చెందినవారని అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
తన కుటుంబాన్ని కలవడానికి క్వెట్టా నుంచి లాహోర్‌కు ప్రయాణిస్తున్న ముహమ్మద్ అష్రఫ్ ఈ రైలులో చిక్కుకున్నారు.
అయితే, మరికొందరు ప్రయాణికులతో కలిసి ఆయన ఎలాగోలా మిలిటెంట్ల చెరలోని రైలు నుంచి మంగళవారం తప్పించుకున్నారు.
"అందరూ చాలా భయపడ్డారు. అదొక భయానక పరిస్థితి" అని ఆయన చెప్పారు.
రైలు దిగిన తరువాత తామంతా నాలుగు గంటలు నడిచి తర్వాతి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నట్లు ఆయన చెప్పారు.
తమలో నడవలేని వారిని మిగతావారు భుజాలపై మోసుకొచ్చినట్లు చెప్పారు.
" చాలా అలసిపోయాం, మాతో పాటు మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు" అని ఆయన చెప్పారు.
భార్య, ఇద్దరు పిల్లలతో ప్రయాణిస్తున్న నూర్ మాట్లాడుతూ.. ''మొదటి పేలుడు చాలా తీవ్రంగా ఉంది. నా పిల్లల్లో ఒకరు కిందపడిపోయారు'' అని చెప్పారు.
తాను, తన భార్య చెరొక బిడ్డని కాపాడటానికి ప్రయత్నించామని చెప్పారు.
"ఒకవేళ బుల్లెట్ మన వైపు వస్తే అది పిల్లలకి తగలకూడదు, మనకే తగలాలి అని నా భార్యతో అన్నాను" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రైలు మూడో బోగీలో ఉన్న ముష్తాక్ ముహమ్మద్ ప్రయణికులందరూ భయంతో వణికిపోయిన ఆ క్షణాలను గుర్తుచేసుకున్నారు.
"దాడి చేసిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. వారి నాయకుడు భద్రతా సిబ్బందిపై నిఘా ఉంచాలని.. ప్రయాణికులు తప్పించుకోకుండా చూడాలని పదేపదే చెప్పాడు" అని ఆయన అన్నారు.
మిలిటెంట్లు ప్రయాణికులలో బలూచిస్తాన్ వారిని.. మహిళలు, పిల్లలు, వృద్ధులను మంగళవారం సాయంత్రం నుంచి విడుదల చేయడం ప్రారంభించారని.. తాను బలూచిస్తాన్‌లోని టర్బాట్ నగర నివాసినని చెప్పినప్పుడు తనను వదిలిపెట్టారని, తనతోపాటు పిల్లలు, మహిళలు ఉండడం వారు చూశారని ఇషాక్ అన్నారు.
అయితే, ఇంకా ఎంత మంది ప్రయాణికులు బందీలుగా ఉన్నారనేది స్పష్టంగా తెలియలేదు.
మిగిలిన ప్రయాణికులను రక్షించడానికి భద్రతా దళాలు పెద్ద ఎత్తున ఆపరేషన్ ప్రారంభించాయని, వందలాది మంది సైనికులను, హెలికాప్టర్లు, ప్రత్యేక దళాల సిబ్బందిని కూడా మోహరించారని అధికారులు తెలిపారు.
బుధవారం క్వెట్టా రైల్వే స్టేషన్‌లో డజన్ల కొద్దీ చెక్క శవపేటికలను రైలులోకి ఎక్కించడాన్ని బీబీసీ చూసింది. ఒక రైల్వే అధికారి మాట్లాడుతూ, అవి ఖాళీగా ఉన్నాయని, ప్రాణనష్టం జరిగితే మృతదేహాలు ఉంచడానికి వాటిని తీసుకెళుతున్నారని చెప్పారు.

ఫొటో సోర్స్, BBC Urdu
బీఎల్ఏ చాలా ఏళ్లుగా పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోరుతూ పోరాటం చేస్తోంది. అనేక దాడులు చేసింది. తరచుగా పోలీస్ స్టేషన్లు, రైల్వే లైన్లు, రహదారులను లక్ష్యంగా చేసుకుంది.
2000ల ప్రారంభం నుంచి పాకిస్తాన్ సైన్యం, భద్రతా దళాలు బలూచిస్తాన్‌లో చేపట్టిన తిరుగుబాటు నిరోధక చర్యల వల్ల వేలాది మంది అదృశ్యమయ్యారన్న ఆరోపణలున్నాయి. హింస, చట్టవిరుద్ధ హత్యలు వంటి నేరాలకు పాల్పడినట్లు భద్రతా దళాలపై ఆరోపణలు ఉన్నాయి, అయితే ఆ ఆరోపణలను వారు తిరస్కరిస్తున్నారు.
పాకిస్తాన్ అధికారులు - అలాగే బ్రిటన్, అమెరికా సహా అనేక పాశ్చాత్య దేశాలు... బీఎల్ఏని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి.
రైలు హైజాక్ కావడంపై పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆందోళన చెందుతున్నట్టుగా పేర్కొంది.
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ రైలు ముట్టడిని తీవ్రంగా ఖండించారు. మిగిలిన ప్రయాణికులందరినీ వెంటనే విడుదల చేయాలని కోరారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














