కెమ్‌సెక్స్ అంటే ఏమిటి, బాయ్‌ఫ్రెండ్ కోసం ఆ డ్రగ్స్‌కు బానిసైన యువతి ఏం చెబుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దినుక్ హేవావితారణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
''నేను అలాంటివి వాడలేదు. కానీ, నా మాజీ బాయ్‌ఫ్రెండ్ కోసం తొలిసారి అవి తీసుకోవాల్సి వచ్చింది.'' అని 27 ఏళ్ల నయోమి బీబీసీతో చెప్పారు.
'ఐస్ డ్రగ్'గా పేరున్న నిషేధిత మాదక ద్రవ్యం (మెథాంఫెటామైన్)కు ఆమె ఎలా బానిస అయ్యారో వివరించారు.
''శృంగారంలో పాల్గొనడానికి నా బాయ్‌ఫ్రెండ్, నేనూ ఈ డ్రగ్ తీసుకునేవాళ్లం. ఒకవేళ ఈ డ్రగ్స్ తీసుకోకపోతే, మేం ఏం చేయలేం.'' అని ఆమె తన అనుభవాన్ని పంచుకున్నారు.
నయోమి నిజమైన పేరును వ్యక్తిగత గుర్తింపు గోప్యత దృష్ట్యా బీబీసీ బయటపెట్టడంలేదు. ఈ కథనంలో తమ అనుభవాలను పంచుకున్న వారి పేర్లను కూడా గోప్యంగా ఉంచుతోంది.


ఫొటో సోర్స్, Getty Images
కెమ్‌సెక్స్ అంటే ఏమిటి?
సంభోగానికి ముందు, లైంగిక ఆసక్తిని మరింత పెంచేందుకు డ్రగ్స్, రసాయన ఔషధాలను తీసుకోవడాన్ని కెమ్‌సెక్స్ అంటారని లైంగిక సంభోగం ద్వారా వ్యాపించే వ్యాధులపై పనిచేస్తున్న వైద్యనిపుణులు డాక్టర వినో ధర్మకుల సింఘే చెప్పారు.
''సెక్స్‌కు ముందు ఏదైనా డ్రగ్ లేదా రసాయన పదార్థాన్ని తీసుకోవడాన్ని మేం కెమ్‌సెక్స్ అని పిలుస్తాం. లైంగిక ఆనందాన్ని మరింత పెంచేందుకు చాలామంది వీటిని వాడుతుంటారు.'' అని వైద్యనిపుణులు తెలిపారు.
''చాలామంది వీటిని పార్టీలలో వాడతారు. అలాంటి ప్రాంతాలలో సురక్షితం కాని లైంగిక చర్యలు ఎక్కువగా జరుగుతుంటాయి. దీంతో, లైంగిక సంభోగం ద్వారా వ్యాపించే వ్యాధులు విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయి.'' అన్నారు.
దీని గురించి కొన్ని గ్రూపులు అవగాహన కల్పిస్తున్నాయని, శ్రీలంకలో దీనిపై డేటాను సేకరించే ప్రొగ్రామ్‌ను ఈ ఏడాది మొదలుపెడుతున్నారని తెలిపారు.
ఎక్కువ సమయం లైంగిక సంభోగంలో పాల్గొనేందుకు, లేదంటే ఈ ప్రక్రియ తేలిగ్గా అయిపోయేందుకు కెమ్‌సెక్స్ లేదా డ్రగ్స్‌ను యూరోపియన్ దేశాల్లోని ప్రజలు వాడుతున్నట్లు 2024 జూన్ 25న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విడుదల చేసిన డేటాలో వెల్లడైంది.
పలు కమ్యూనిటీల్లో ముఖ్యంగా హోమోసెక్సువల్ కమ్యూనిటీలో ఈ డ్రగ్స్ లేదా కెమ్‌సెక్స్‌ను ఎక్కువగా వాడుతున్నట్లు ఒక అధ్యయనం తెలిపింది.
హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై జాయింట్ యూనైటెడ్ నేషన్స్ ప్రొగ్రామ్ (యూఎన్ఎయిడ్స్) విడుదల చేసిన డేటాలో ఆసియా పసిఫిక్ దేశాల్లో కొత్తగా వచ్చిన 43 శాతం హెచ్ఐవీ ఇన్‌ఫెక్షన్లు పురుషులతో పురుషులు సెక్స్ చేయడం వల్లనే వచ్చినట్లు తెలిసింది.
అదే సమయంలో, దేశాన్ని బట్టి కెమ్‌సెక్స్ వాడకం ఈ కమ్యూనిటీలో 3 శాతం నుంచి 31 శాతం వరకు ఉంటుందని వెల్లడైంది. హోమోసెక్సువల్ కమ్యూనిటీలో కెమ్‌సెక్స్ వాడకం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇతర వ్యక్తులు కూడా వీటిని వాడుతున్నారు.
'అతన్ని రక్షిద్దామని, నేను కూడా బానిస అయ్యాను'
శ్రీలంకలో నయోమిలాగా చాలామంది యువత సెక్స్ కోసం ఐస్ డ్రగ్‌తో పాటు పలు రకాల మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారు.
తన బాయ్‌ఫ్రెండ్‌తో జరిగిన అనుభవాన్ని నయోమి బీబీసీతో పంచుకున్నారు.
''నా బాయ్‌ఫ్రెండ్ వేరే దేశంలో నివసించేటప్పుడు ఐస్ డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ఆ సమయంలో మరో అమ్మాయితో అతనికి సంబంధం ఉండేది. ఆ తర్వాత ఆయన శ్రీలంక వచ్చాడు. ఐస్‌డ్రగ్స్ ఆపేశాడు. ఆ సమయంలో మేం మంచి స్నేహితులం.ఇంతలో నా బాయ్‌ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయి మరో అబ్బాయిని పెళ్లిచేసుకుంది. ఆ బాధ నుంచి అతన్ని బయటకు తీసుకురావాలనుకున్నా. అతని కోసం నేను చేయగలిగిందంతా చేశాను. అదే సమయంలో, మేమిద్దరం ప్రేమించుకున్నాం. నేను అల్కాహాల్, సిగరెట్లు తీసుకునే దాన్ని. కానీ, ఎప్పుడూ ఐస్ డ్రగ్స్ తీసుకోలేదు. ఒకరోజు ఐస్ డ్రగ్స్ తీసుకోవాలని నా బాయ్‌ఫ్రెండ్ నాకు సూచించాడు. ఎంతో ఆత్రుతతో వాటిని తీసుకున్నా.'' అని నయోమి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'సెక్స్ సమయంలో ఊహించని అనుభూతి’
ఐస్ డ్రగ్స్ తీసుకుని సెక్స్‌లో పాల్గొన్నప్పుడు తాను ఊహించని అనుభూతిని పొందినట్లు నయోమి చెప్పారు. తనకు అసలు అలసటగా అనిపించలేదన్నారు. దీంతో ఈ డ్రగ్స్‌ను తీసుకోవడం ప్రారంభించినట్లు తెలిపారు.
''నేను, నా బాయ్‌ఫ్రెండ్ కలిసినప్పుడు, ఈ డ్రగ్స్‌ను తీసుకునేవాళ్లం. తొలుత, డ్రగ్స్‌తో అతను ఇంటికి వచ్చేవాడు. ఐస్ డ్రగ్స్ తీసుకున్న తర్వాత, మేం కలిస్తే చాలా ఆనందం కలిగేది. ఈ డ్రగ్స్ సెక్స్‌లో పాల్గొనే సామర్థ్యాన్ని పెంచుతాయి. వీటిని తీసుకున్నాక మనం మరో ప్రపంచంలోకి వెళతాం.'' అని నయోమి చెప్పారు.
''ఏడాది పాటు, ఐస్ డ్రగ్స్ తీసుకుని సెక్స్‌లో పాల్గొనే విధంగా అలవాటుపడ్డాం. చివరికి, ఈ డ్రగ్స్ మమ్మల్ని జీవన్మరణ పరిస్థితికి తీసుకొచ్చాయి.'' అని తెలిపారు.
''కొంతకాలం తర్వాత, నా బాయ్‌ఫ్రెండ్‌కు ఈ డ్రగ్స్ దొరకలేదు. వాటి కోసం నన్ను ఆశ్రయించేవాడు. వాటి నుంచి ఆయన్ను బయటకు తీసుకొచ్చే క్రమంలో, నేనే వాటికి బానిసయ్యాను'' అని నయోమి బాధపడ్డారు.
చివరికి కేవలం ఈ డ్రగ్స్ కోసమే అతను నా దగ్గరకు వచ్చేవాడని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఆ తర్వాతే సీరియస్‌నెస్ అర్థమైంది'
తన బాయ్‌ఫ్రెండ్ ప్రవర్తన పూర్తిగా మారిపోయినట్లు నయోమి చెప్పారు. అతను మానసికంగా, శారీరకంగా బలహీనంగా మారినట్లు తెలిపారు.
''డ్రగ్స్ తీసుకున్న తర్వాత, కొంత సమయం పాటు నేను, నా బాయ్‌ఫ్రెండ్ చాలా బలహీనంగా మారేవాళ్లం. వీటిని తీసుకుంటే, రోజంతా ఏదీ తినాలపించదు. వీటి మత్తు చాలాసేపు ఉంటుంది. మేమిద్దరం అనారోగ్యం పాలయ్యేవాళ్లం. బరువు తగ్గిపోయాం. మీకేమైనా అయిందా అని స్నేహితులు అడిగేవాళ్లు'' అని నయోమి చెప్పారు.
''ఈ డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించి ఏడాదైన తర్వాత, సెక్స్‌లో పాల్గొనడం చాలా కష్టమైంది. అఫ్రొడిసియాక్స్ తీసుకున్నప్పటికీ, నా బాయ్‌ఫ్రెండ్ సెక్స్‌లో పాల్గొనలేక పోయేవాడు.'' అని తెలిపారు.
''ఇంటికి వెళ్లిన తర్వాత వారాల తరబడి గది నుంచి బయటకు రాలేకపోయాడని నా బాయ్‌ఫ్రెండ్ స్నేహితులు చెప్పారు. అప్పుడు నాకు దాని తీవ్రత అర్థమవ్వడం ప్రారంభమైంది. నేను కూడా ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఎక్కడో రేడియో శబ్దాలు వినిపిస్తున్నట్లు అనిపించేది.'' అని చెప్పారు.
''ఆ తర్వాత నా బాయ్‌ఫ్రెండ్ ముక్కు నుంచి తరచూ రక్తం కారేది. డాక్టర్ దగ్గరకు వెళ్లమని ఎన్నోసార్లు అతనికి చెప్పాను. కానీ ఆ సలహా అతనికి నచ్చలేదు. రాయిలాగా మారిపోయాడు. పదేపదే నాతో గొడవపడేవాడు. నాపై అనుమానం పెంచుకున్నాడు'' అని వివరించారు.
''చివరికి, నాతో చెప్పకుండానే దేశం విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. కౌన్సెలింగ్ కోసం నేను సైకియాట్రిస్ట్ వద్దకు వెళ్లాను. ప్రస్తుతం మెల్లమెల్లగా సాధారణ స్థితికి వస్తు న్నాను.'' అని నయోమి తాను పడ్డ బాధను వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
'లైంగికంగా సంక్రమించే వ్యాధుల అవకాశం ఎక్కువ’
''అసురక్షిత సెక్స్‌లో డ్రగ్స్ వాడుతున్నారు. దీనివల్ల, హెచ్ఐవీ, హెపటైటిస్ బీ వంటి లైంగిక సంక్రమణ వ్యాధులు బారిన పడే ప్రమాదం పెరుగుతుంది.'' అని డాక్టర్ నిమాలి జయసూరియా బీబీసీతో చెప్పారు.
హెరాయిన్‌కు బానిస అయ్యేవారిలా కాకుండా 20 నుంచి 40 ఏళ్ల మధ్య విద్యావంతులైన యువత ఎక్కువగా ఐస్ డ్రగ్స్ వాడుతూ తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని అన్నారు.
'అలా డ్రగ్స్‌కు బానిసయ్యాను'
26 ఏళ్ల యోమల్ బీబీసీతో మాట్లాడారు. తాను ఒక మ్యూజిక్ ప్రొగ్రామ్‌కు వెళ్లానని, అక్కడ డ్రగ్స్ తీసుకునేలా ప్రలోభానికి గురైనట్లు చెప్పారు. ''తరచూ పలు మ్యూజిక్ కన్సర్ట్‌లకు హాజరయ్యే ఫీల్డ్‌లో నేను పనిచేస్తున్నా. కన్సర్ట్ తర్వాత జరిగే పార్టీలలో ఇక్కడ చాలా డ్రగ్స్ వాడతారు. అలాంటి ఒక పార్టీల్లోనే నేను డ్రగ్స్ తీసుకున్నాను.'' అని తెలిపారు.
ఈ డ్రగ్స్ తీసుకున్న అరగంట తర్వాత తన శరీరం ప్రభావిత మవ్వడాన్ని గమనించినట్లు చెప్పారు.
'' ఆ సమయంలో నాన్ స్టాప్‌గా 7 నుంచి 8 గంటలు డ్యాన్స్ చేసేవాడిని. ఆ తర్వాత, నా గర్ల్‌ఫ్రెండ్‌తో సెక్స్‌లో పాల్గొనేవాడిని. ఆ సమయంలో నాకసలు అలసట అనిపించేది కాదు. కానీ, ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. ఈ డ్రగ్స్ వల్ల, నా చేతులు, కాళ్లు, శరీరమంతా వణుకు వచ్చేది. ఒకటి లేదా రెండు రోజుల పాటు ఏదీ కూడా తినాలనిపించేది కాదు.'' అని యోమల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఈ డ్రగ్స్‌తో ఎక్కువ సేపు సెక్స్ చేయవచ్చా’?
ఎక్కువ సేపు లైంగిక సంభోగంలో పాల్గొనేందుకు ఈ డ్రగ్స్ ఉపయోగపడతాయనే నమ్మకంతో ప్రజలు వీటిని తీసుకుంటారని శ్రీలంకలోని రాజరత యూనివర్సిటీకి చెందిన సీనియర్ లెక్చరర్ డాక్టర్ మనోజ్ ఫెర్నాండో చెప్పారు.
''నమ్మకాలు, అపోహలు ఇలాంటి డ్రగ్స్ తీసుకునేలా ప్రలోభపెడతాయి. అయితే, లైంగిక ఆనందాన్ని, సామర్థ్యాన్ని పెంచుతాయనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ, ప్రతి డ్రగ్‌ను దీనికి ముడిపెడతారు.'' అని చెప్పారు.
హెరాయిన్, ఐస్ వంటి చాలా డ్రగ్స్ విషయంలో ఇలాంటి సాధారణ అపోహలు, నమ్మకాలు ఉన్నాయన్నారు. లైంగిక సామర్థ్యాన్ని పెంచి, ఆనందాన్ని ఇస్తాయని భావిస్తారని చెప్పారు.
''మానసిక ఒత్తిడితో చాలా మంది ఈ డ్రగ్స్‌ను తీసుకుంటూ ఉంటారు.'' అని అన్నారు.
సినిమాల్లో చూపించినట్లుగా వీటిని తీసుకునేందుకు వివిధ రకాల ట్రిక్స్‌ను వాడుతుంటారు. వాటిని పొందేందుకు ఎంత దూరమైనా వెళతారు. స్నేహితుల ఒత్తిడితో చాలామంది ఈ డ్రగ్స్ తీసుకుంటారు.
''లైంగిక సంభోగంలో ఎక్కువ సేపు పాల్గొనేలా చేసే సామర్థ్యం డ్రగ్స్‌లో లేదు. ఇలాంటి డ్రగ్స్ తీసుకునే వ్యక్తి ఎక్కువ సేపు సెక్స్‌లో పాల్గొంటున్నట్లు అనిపిస్తుంది. అదంతా ఒక మానసిక భ్రాంతే'' అని డాక్టర్ మనోజ్ చెప్పారు.
ఐస్ డ్రగ్స్ లేదా హెరాయిన్ లేదా ఇతర డ్రగ్స్ ఏవీ కూడా లైంగిక ప్రక్రియను పెంచవని డాక్టర్ మనోజ్ స్పష్టం చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














