చిన్న వయసులోనే పీరియడ్స్ ఎందుకు వస్తాయి, ఇది ప్రమాదకరమా?

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, డేవిడ్ కాక్స్
    • హోదా, బీబీసీ న్యూస్

అమెరికాలో అమ్మాయిలకు పీరియడ్స్ తొందరగా వస్తున్నాయని తాజా పరిశోధనలో తేలింది. దీనికి కాలుష్యం కూడా కొంత వరకు కారణమని చెబుతున్నారు.

మునుపటి తరాలతో పోలిస్తే చాలా తక్కువ వయస్సులో పిల్లలు యుక్తవయస్సులోకి ప్రవేశిస్తున్నారని అనేక దశాబ్దాలుగా ప్రపంచంలోని పలుదేశాల శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

బాలికలకు మొదటి పీరియడ్స్ వచ్చిన తర్వాత దానిని రుతుక్రమ వయస్సు లేదా యుక్త వయస్సు అంటారు. ఇలా కౌమార దశలోకి వచ్చిన వారిలో శారీరక మార్పులు త్వరగా జరుగుతాయి.

ఒక అంచనా ప్రకారం, అమెరికాలో ఒక శతాబ్దం కిందట ఆడపిల్లల కంటే ప్రస్తుత తరం అమ్మాయిలు నాలుగు సంవత్సరాల ముందుగానే రుతుక్రమంలో ప్రవేశిస్తున్నారు.

ఈ ఏడాది మేలో విడుదలైన కొత్త డేటా ప్రకారం 1950, 1969ల మధ్య జన్మించిన బాలికలకు సగటున 12.5 సంవత్సరాల వయస్సులో పీరియడ్స్‌ మొదలయ్యాయి.

అయితే 2000ల ప్రారంభంలో జన్మించిన తరానికి ఇది 11.9 సంవత్సరాలకు పడిపోయింది.

వాట్సాప్
ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ముందుగా పీరియడ్స్ వస్తే ఏం జరుగుతుంది?

ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ధోరణి ఉందని పరిశోధకులు గమనించారు. బాలికలలో అకస్మాత్తుగా యుక్త వయస్సు సంకేతాలు ఎలా ప్రారంభమవుతున్నాయి అన్నదాని గురించి దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు వివరించారు.

2008 నుంచి 2020 మధ్య 8 సంవత్సరాల కంటే ముందు రుతుక్రమం వచ్చినవారి సంఖ్య 16 రెట్లు పెరిగిందని పరిశోధకులు చెప్పారు.

"మైనారిటీ, లోయర్ సోషల్ ఎకనామిక్ గ్రూపులకు చెందిన పిల్లలు తొందరగా యుక్త వయస్సులోకి ప్రవేశించడం చూస్తున్నాం. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది." అని అమెరికాలోని ఎమోరీ యూనివర్శిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆడ్రీ గాస్కిన్స్ చెప్పారు.

ఎర్లీ ప్యూబర్టీ( ముందస్తు యుక్తవయసు ) అనేది శరీరంలో చాలా మార్పులు తీసుకొస్తుందని గాస్కిన్స్ వంటి పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. ఇది ముందస్తు మెనోపాజ్‌కు దారితీస్తుందని, ఆయుర్దాయంపైనా, సంతానోత్పత్తి పైనా ప్రభావం పడొచ్చని డేటా సూచిస్తోంది.

అంతేకాదు ముందస్తు రుతుక్రమం అన్నది రొమ్ము, అండాశయ క్యాన్సర్, ఊబకాయం, టైప్2 మధుమేహం, ఇతర గుండె జబ్బులతో సహా అనేక వ్యాధులతో ఇది ముడిపడి ఉంటుంది.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

కారణాలేంటి?

ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు.

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్ బ్రెండా స్కెనాజీ ఒక కారణాన్ని వివరించారు. శరీరంలోని కణాలు ఈస్ట్రోజెన్ వంటి సెక్స్ హార్మోన్ల చుట్టూ ఎక్కువకాలం ఉంటే, అది కణితులు అభివృద్ధి చెందే ప్రమాదాన్ని పెంచుతుందని, ఇది క్యాన్సర్‌కు దారితీయవచ్చని తెలిపారు.

ఇది కాకుండా, శృంగార జీవితంలోకి తొందరగా ప్రవేశించే ఇలాంటి అమ్మాయిలు తొందరగానే లైంగికంగా చురుకుగా మారే అవకాశం ఉందని స్కెనాజీ చెప్పారు.

"అమెరికాలో అబార్షన్ చట్టవిరుద్ధంగా జరుగుతోంది. గర్భనిరోధకాలు అందుబాటులో లేవు, ఇది భయానక పరిస్థితి. ఇది టీనేజ్ అమ్మాయిలలో అవాంఛిత గర్భాల సంఖ్యను పెంచుతుంది." అని ఆమె అన్నారు.

యుక్తవయస్సు ప్రారంభం శరీరంలోని హైపోథాలమిక్-పిట్యూటరీ-అడ్రినల్ (HPA), హైపోథాలమిక్-పిట్యూటరీ-గోనాడల్ (HPG) యాక్సెస్ అని పిలిచే రెండు ముఖ్యమైన వ్యవస్థల నియంత్రణలో ఉంటుంది. ఇవి మెదడులోని హైపోథాలమస్ అనే భాగాన్ని కలుపుతాయి. ఈ హైపోథాలమస్ ఆకలి, బాడీ టెంపరేచర్ వంటి వాటిని నియంత్రిస్తుంది.

10 నుంచి 20 సంవత్సరాల కిందటి వరకు శాస్త్రవేత్తలు చిన్నవయసులో ఊబకాయం సమస్య మాత్రమే యుక్త వయస్సుకు కారణమని భావించారని గాస్కిన్స్ అంటున్నారు. అయితే ఇదొక్కటే కారణం కాదని, దీని వెనుక అనేక ఇతర అంశాలు ఉన్నాయని ఇటీవలే తేలిందని ఆమె తెలిపారు.

కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

వాయు కాలుష్యం

గత మూడు సంవత్సరాలలో నిర్వహించిన అనేక ఇతర అధ్యయనాలు ఆశ్చర్యం కలిగించే ఒక కారణాన్ని సూచిస్తున్నాయి. అదే వాయు కాలుష్యం.

ఈ పరిశోధనలో ఎక్కువ భాగం దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు చేశారు. IQAir ఇండెక్స్ ప్రకారం సోల్, బుసాన్, ఇంచియాన్ నగరాలు ప్రపంచంలోని 100 అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఉన్నాయి.

కాలుష్య కారకాలకు, యుక్తవయస్సుకు మధ్య ఉన్న సంబంధంపై సోల్‌లోని ఇవా ఉమెన్స్ యూనివర్శిటీ ఇటీవల ఒక రివ్యూను ప్రచురించింది.

కొన్ని ప్రధాన కారణాలు: సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్ వంటి విషవాయువులు. ఈ వాయువులు వాహనాల నుంచి పొగ, మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ల నుంచి వెలువడే వ్యర్థాల ద్వారా వాతావరణంలోకి ప్రవేశిస్తాయి.

పోలాండ్‌లో బొగ్గుతో పని చేసే ఫ్యాక్టరీల కారణంగా గాలి నాణ్యత తక్కువగా ఉంటుంది. 2022లో అక్కడి శాస్త్రవేత్తలు 1,257 మంది మహిళల నుంచి సేకరించిన డేటాను అధ్యయనం చేశారు. నైట్రోజన్ (నత్రజని) వాయువులు ఎక్కువగా ఉండటానికి బాలికలకు 11 ఏళ్లలోపు పీరియడ్స్ రావడానికి సంబంధం ఉందని వారు గుర్తించారు.

బహుశా అంతకన్నా మరో పెద్ద సమస్య పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం పార్టికల్స్). ఇవి కంటికి కనిపించనంత చిన్నవి. ఈ పీఎం కణాలు కన్‌స్ట్రక్షన్ సైట్స్, ఫారెస్ట్ ఫైర్స్ (కార్చిచ్చులు) పవర్ జనరేషన్ ప్లాంట్స్, వెహికల్ ఇంజిన్స్ నుంచి గుంతల రోడ్ల వరకు వివిధ మూలాల నుంచి గాలిలోకి విడుదలవుతాయి.

గర్భంలో ఉన్నప్పుడు లేదా బాల్యంలో పీఎం 2.5, పీఎం10 కణాల ప్రభావానికి గురయ్యే అమెరికన్ బాలికలకు చిన్నవయస్సులోనే రుతుతుస్రావం మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉందని గాస్కిన్స్, ఆమె సహచరులు 2023 అక్టోబర్‌లో కనుగొన్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

రక్తంలోకి పీఎం 2.5 కణాలు

"పీఎం2.5 కణాలు సులభంగా రక్తంలోకి ప్రవేశిస్తాయి. ముందు ఊపిరితిత్తులలోకి చేరతాయి. అవి ఫిల్టర్ కావు. తర్వాత మిగిలిన అవయవాలకు చేరుకుంటాయి. కొన్ని పీఎం2.5 కణాలు అండాశయాలు, ప్లాసెంటా, పిండ కణజాలంలాంటి అనేక ప్రాంతాలకు చేరతాయి." అని గాస్కిన్స్ చెప్పారు.

"పీఎం2.5కి ఎక్కువ ప్రభావితం అయిన అమ్మాయిలు కూడా ఈస్ట్రోజెన్ మాదిరి పని చేసే ఇతర రసాయనాల ప్రభావానికి లోనవుతారు. దీని కారణంగా శరీరం ముందుగానే యుక్త వయస్సులోకి ప్రవేశించవచ్చు." అని గాస్కిన్స్ అభిప్రాయపడ్డారు.

ఇంత చిన్న వయసులోనే ఆడపిల్లల శరీరంలో వచ్చే మార్పుల వెనుక అనేక అంశాలు ఉంటాయని గాస్కిన్స్ చెబుతున్నారు. PM-2.5, ఇతర కాలుష్య కారకాల పాత్ర కేవలం ఒక ఉదాహరణ మాత్రమేనని ఆమె అన్నారు.

మారుతున్న ప్రపంచం, పిల్లల అభివృద్ధిపై దాని ప్రభావం గురించి మనకు ఇంకా పెద్దగా తెలియదని ప్రొఫెసర్ బ్రెండా స్కెనాజీ చెప్పారు. మైక్రో-ప్లాస్టిక్స్, వాతావరణ మార్పుల వంటి కారకాల పాత్ర గురించి మనకు ఎక్కువ తెలియదని కూడా స్కెనాజీ అభిప్రాయపడ్డారు.

“మనకు దీని గురించి చాలా తక్కువ అవగాహన ఉందని అనుకుంటున్నా. పర్యావరణంలోని రసాయనాలు, ఊబకాయం, మానసిక సమస్యల్లాంటి పలు కారణాల మిశ్రమం వల్ల కూడా చిన్నవయసులోనే రుతుక్రమం మొదలు కావచ్చు.’’ అని స్కెనాజీ తెలిపారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)