పెద్దక్కగా పుట్టడం శాపమా, అది ఒక మానసిక సమస్యగా మారుతోందా?

- రచయిత, అనఘా పాఠక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆమె తన స్నేహితురాళ్ళలాగా చాలా వేగంగా సైకిల్ తొక్కాలనుకుంటుంది. వాళ్లతో చేరి అరుస్తూ పరుగెత్తాలనుకుంటుంది. కానీ ఆమె 'పెద్దది' కాబట్టి చాలా బుద్ధిగా ఉండాలి.
ఆమె వయసు ఆరేళ్లే. కానీ ప్రతి సాయంత్రం స్నేహితులతో ఆడుకోవడానికి బయటికి వచ్చినప్పుడు తానొక్కతే ఉండదు. బుజ్జిగాడైన తన తమ్ముణ్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఆమె మీద ఉంటుంది.
మా ఇంటి పరిసరాల్లో ఇలాంటి దృశ్యాన్ని చూస్తుంటాను. వాళ్లు పిల్లలే అయినా, తమకంటే చిన్నోళ్లైన తమ్ముళ్లను, చెల్లెళ్లను అక్కలు తమ వెంట తీసుకెళ్లాల్సిందే. వాళ్లు కేర్ టేకర్ పాత్రను పోషించాల్సి ఉంటుంది.
ఇటీవల సోషల్ మీడియాలో #eldestdaughtersyndrome పేరుతో ట్రెండ్ అయిన ఈ ధోరణి కేవలం నా ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితం కాదని అనిపిస్తోంది.
అధికారికంగా ఇది మానసిక సమస్యగా నిర్ధరణ కానప్పటికీ, ఎల్డెస్ట్ డాటర్ సిండ్రోమ్ పిల్లలందరిలో పెద్దదైన అక్క అనుభవాల గురించి చెబుతుంది.
కుటుంబంలో పెద్ద కూతురు కావడం వల్ల తమ జీవితాలు ఎలా తయారయ్యాయి అన్నదానిపై చాలా మంది మహిళలు తమ అనుభవాలను పంచుకున్నారు.
"ఈ భావం జీవితాంతం మీతో ఉండిపోతుంది," అన్నారు హిమాన్షీ (పేరు మార్చాము).
ఆమె ట్యూషన్ టీచర్, గృహిణి. తన పేరును వెల్లడించడానికి ఇష్టపడలేదు.
‘‘నేను పెద్దదాన్ని, నా కుటుంబం గురించి చెడుగా మాట్లాడకూడదు" అని అన్నారు.

హిమాన్షీకి తనకన్నా చిన్నవాళ్లైన ముగ్గురు తోబుట్టువులు ఉండేవారు.
"నాకు బాల్యం గుర్తులేదు. అసలు నాకు బాల్యం అన్నది ఉండేదో లేదో ఖచ్చితంగా తెలీదు. గుర్తున్నదల్లా తమ్ముళ్లు, చెల్లెల్ని చూసుకోవడం. వాళ్లను పెంచడం నా విధి అన్నట్లు అందరూ నా నుంచి దీన్ని ఆశించేవాళ్లు. తప్పుగా అర్థం చేసుకోకండి. నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. కానీ నాకు కొంచెం స్వేచ్ఛ, తక్కువ బాధ్యతలు ఉంటే బావుండేది.’’ అన్నారామె.
కుటుంబంలో పెద్దది కావడం వల్లే తన కలలను సాకారం చేసుకోలేకపోయానని ఆమె భావిస్తారు. తన చిన్న చెల్లెలికి వచ్చిన అవకాశాలను ఆమె వరకు వచ్చేసరికి నిరాకరించేవారు.
“కుటుంబంలో పెద్దదాన్ని. మొదటి కూతుర్ని. తొందరగా పెళ్లి చేసేసారు. కానీ చిన్న చెల్లెలికి మాత్రం చదువుకునే అవకాశాన్ని ఇచ్చారు. తను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మారింది. ఆ చదువుతోనే ఇప్పుడు ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. బీకాం చేసాను, నాకూ ఏదైనా ఉద్యోగం, కెరీర్ కావాలనుకున్నాను. కానీ అది జరగలేదు. ఇప్పుడు ట్యూషన్లు చెప్పుకుంటున్నాను” అని ఆమె బాధపడ్డారు.
సోషల్ మీడియాలో మహిళలు, పెద్ద కూతురు కావడం తమను కుటుంబానికి విధేయులుగా , ఆత్మవిశ్వాసం లేని వాళ్లుగా మార్చిందని, త ఆనందాన్ని పణంగా పెట్టి ఇతరులకు మొదటి స్థానం ఇచ్చే వాళ్లమని చెబుతున్నారు.
ఇలాంటి అనుభవాలు తనకు చాలా ఉన్నాయని హిమాన్షీ తెలిపారు.
“నాకు ఏం కావాలో అడగలేను. ఎప్పుడూ ఇతరులు నా గురించి ఏమనుకుంటారో లేదా నా కుటుంబాన్ని నిరాశపరుస్తానేమో అనే ఒత్తిడిలో ఉంటాను. నాకు ఇప్పుడు దాదాపు నలభై ఏళ్లు. కానీ నాకు పెద్ద ప్రాధాన్యత లేదు అనే భావన ఇంకా నన్ను వదలలేదు” అని ఆమె నిట్టూర్చారు.
అక్కలే ప్రాథమిక సంరక్షకులు
శ్రుతకీర్తి ఫడ్నవిస్ పుణెలో కౌన్సెలర్, బిహేవియరల్ థెరపిస్ట్‌గా పని చేస్తున్నారు. ఆమె ఈ విషయాన్ని ఇలా వివరించారు.
“కుటుంబంలోని పెద్ద పిల్లల్లో కనిపించే ఒక లక్షణం - ఇతరులను సంతోషపెట్టాలన్న నైజం. అదే కాకుండా ఆదర్శప్రాయంగా ఉండడం. వాళ్లు తాము అన్ని సందర్భాలలో సరిగ్గా ఉండాలని తమపై తాము ఒత్తిడి పెంచుకుంటారు. తప్పులు చేయడానికి ఇష్టపడరు. తరచుగా స్వీయ విమర్శ చేసుకుంటూ ఉంటారు’’ అని తెలిపారు.
కుటుంబంలోని పెద్ద పిల్లలలో ఉండే ఈ లక్షణాన్ని శ్రుతకీర్తి ‘న్యూరోటిసిజం’ అంటారని తెలిపారు.
"న్యూరోటిసిజం అనేది విశ్రాంతి తీసుకోలేకపోవడం అనే లక్షణం" అని చెప్పారు. "వీళ్లు తమ భావోద్వేగాల నిర్వహణ కంటే వాటిని అణిచివేసేందుకు మొగ్గు చూపుతారు."
"ఇంకా ఇతర విపరీత లక్షణాలు కూడా ఉన్నాయి – వీళ్లు తిరుగుబాటు చేయాలనుకుంటారు లేదా అన్నీ వదిలేయాలనుకుంటారు. ఇది వీళ్లపై ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం వల్ల వచ్చే నిరుత్సాహం నుంచి వస్తుంది. అలా పెరిగిన పిల్లలు సామాజికంగా అందరికీ దూరంగా ఉంటారు. వారి భావోద్వేగ మేధస్సు తగ్గుతుంది’’ అని చెప్పారు.
కుటుంబంలో అందరికన్నా పెద్దపిల్లలు కావడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని భావిస్తారు.
భారతదేశంలాంటి సమాజాలలో, తల్లిదండ్రులు తమ మొదటి బిడ్డపై చాలా ఒత్తిడి పెడతారు. "తల్లిదండ్రులకూ మొదటి బిడ్డ ఒక ప్రయోగంలాంటిదే," అని శ్రుతకీర్తి నవ్వారు.
"పిల్లలను ఎలా పెంచాలో వాళ్లకూ తెలియదు. తెలిసీ తెలియకుండానే వాళ్లు తాము ముందుగా ఊహించుకున్న లక్షణాలన్నీ మొదటి బిడ్డకు ఆపాదిస్తారు. తల్లిదండ్రులకు రెండవ లేదా మూడవ సంతానం పుట్టేసరికి, వాళ్లు ఆలోచనలు, వాళ్ల పెంపకమూ మెరుగవుతుంది. కానీ మొదటి బిడ్డపై దీని ప్రభావం చాలా ఉంటుంది. అబ్బాయిలలోనూ ఇదే పరిస్థితి’’ అని ఆమె చెప్పారు.
ఏది ఏమైనా, భారతదేశం వంటి పితృస్వామ్య సమాజంలో, యువతులు తరచుగా తమ తమ్ముళ్ల ప్రాథమిక సంరక్షురాలి పాత్రను పోషించాలి.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5) ప్రకారం బాలికలు బడి మానేయడానికి రెండు ప్రధాన కారణాలు - బాల్య వివాహాలు, ఇంటి పని. ప్రభుత్వ గణాంకాల ప్రకారం (2021-22) సెకండరీ స్థాయిలో బాలికల స్కూల్ డ్రాప్ అవుట్ రేటు 12.3 శాతం.
ఈ స్థాయిలో అబ్బాయిల డ్రాప్ అవుట్ రేటు కూడా అమ్మాయిల మాదిరిగానే ఉంటుంది. కానీ డ్రాప్ అవుట్‌కు కారణం మాత్రం భిన్నమైనది.
రంజనా గవాండే ఒక సామాజిక కార్యకర్త, న్యాయవాది. ఆమె మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతంలో మహిళల హక్కుల కోసం పని చేస్తున్నారు.
“గ్రామీణ భారతదేశంలో ఆడపిల్లలు ఇంటి పని చేయడానికి, తమ తమ్ముళ్లు, చెల్లెళ్లను చూసుకోవడానికి పాఠశాల నుంచి డ్రాప్ అవుట్ కావడం సర్వసాధారణం. మనం సమాజంలోని పేద వర్గాలలో, తల్లిదండ్రులు ఇద్దరూ పనిచేస్తుంటారు, చిన్న పిల్లలను చూసుకోవడానికి ఎవరూ ఉండరు. కాబట్టి 6 సంవత్సరాల వయస్సు ఉన్న అమ్మాయిలు తమ చెల్లెళ్లు, తమ్ముళ్లను చూసుకోవడం ప్రారంభిస్తారు’’ అని వివరించారు.
భారతీయ తల్లిదండ్రులు ఆడపిల్లలు మంచి భార్య, మంచి తల్లి కావడానికి దీనిని ఒక శిక్షణగా భావిస్తారని ఆమె చెప్పారు.
"దురదృష్టవశాత్తూ, ఈ అమ్మాయిలు బాల్యంలోని ఆనందాన్ని కోల్పోతారు. తమ ఆనందాన్ని తోబుట్టువుల కోసం త్యాగం చేస్తారు" అని తెలిపారు.

మగపిల్లలూ బాధ్యత తీసుకోవాలి
అమీర్ సుల్తానా చండీగఢ్ పంజాబ్ యూనివర్శిటీలో జెండర్ స్టడీస్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
భారతీయ మధ్యతరగతి కుటుంబాలలో పెద్ద కుమార్తెపై చాలా బాధ్యతలు ఉంటాయని ఆమె అంగీకరించారు.
“అమ్మాయి బడి మానేయకపోవచ్చు. కానీ ఆమె పాఠశాల వదిలాక తన తోబుట్టువులను జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్లకు తిండి తినిపించాలి. తల్లి తర్వాత తల్లిగా మారాలి. పిల్లలందరిలోకి పెద్దవాడు అబ్బాయి అయితే, కుమార్తె ఇల్లు శుభ్రం చేస్తుంది. వంట చేస్తుంది. తన అన్నయ్యకూ ఆమెనే ఆహారం తినిపిస్తుంది” అని వివరించారు.
ఇలాంటి సామాజిక ప్రవర్తన వల్ల కుమార్తెలకు, ముఖ్యంగా వాళ్లు కుటుంబంలో పెద్ద కూతురు అయితే, కనీస హక్కులు కూడా దక్కడం లేదని అమీర్ సుల్తానా ఆవేదన వ్యక్తం చేసారు.
“వాళ్లు శారీరక శ్రమ ఒత్తిడిని భరించాలి. కుటుంబం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే, చాలాసార్లు పెద్ద కుమార్తెకు త్వరగా వివాహం చేసేస్తారు. ఇది ఆమెకు అవకాశాలను అందకుండా చేయడం, ఆమె ఎప్పుడూ సమానత్వాన్ని ఆస్వాదించలేదు. ఆమె చదువుకోలేదు. మెరుగైన నైపుణ్యాలు సంపాదించలేదు. సరిగ్గా తిండి తినే అవకాశమూ ఉండదు. ఎందుకంటే తన తోబుట్టువులకు తినిపించడమే ఆమె పని. ఆమె మానసిక ఆరోగ్యమే కాదు, శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ముఖ్యంగా, జీవితాంతం ఆమెను ఎవరూ పట్టించుకోరు. చిన్నప్పటి నుండి అవసరమైన సంరక్షణ లభించదు”
కుటుంబంలోని పిల్లలందరి బాగోగులు చూడడం, పిల్లలందరినీ సమానంగా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత అని సుల్తానా అన్నారు.
“ఒకసారి మన కుటుంబాలు, సమాజాలలో ఆడపిల్లల పట్ల గౌరవాన్ని పెంపొందించిస్తే, తదుపరి దశలు సులభతరం అవుతాయి. తల్లిదండ్రులు ఇద్దరూ పని చేయాల్సిన పరిస్థితులు ఉండే, పిల్లల సంరక్షణ చూసుకోలేని పేద కుటుంబాలను నేను అర్థం చేసుకోగలను. ఇలాంటి సందర్భాలలో పెద్ద కుమార్తె బాధ్యతలు తీసుకోవచ్చు. కానీ ప్రభుత్వం వీళ్లకు సహాయం చేసే వ్యవస్థను నిర్మించవచ్చు. బాలికలు పాఠశాలల్లో ఉండేలా చూస్తూ, అలాంటి వాళ్లను ఉన్నత విద్యలో ప్రోత్సహించవచ్చు” అంటారు ఆమె.
శ్రమ విభజన సంస్కృతి, మగపిల్లలూ బాధ్యతలను పంచుకునేలా చేయడం న్యాయబద్ధమైన, మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో సహాయపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
దీనికంతా చాలా కాలం పట్టవచ్చు. కానీ ఏవైనా కొన్ని చర్యల ద్వారా మనం ఈ సమానత్వాన్ని సాధించగలిగితే, మా ఇంటి దగ్గర్లోని 6 ఏళ్ల అమ్మాయి పూర్తి వేగంతో తన సైకిల్‌ను తొక్కగలుగుతుంది. ఆమె కూడా గాలి గుసగుసలను వినగలుగుతుంది. అందరిలాగే తానూ బాల్యాన్ని అనుభవించగలుగుతుంది.
ఇవి కూడా చదవండి:
- వేరే అభ్యర్థికి ఓటేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఏం జరిగిందంటే...
- ‘మా నాన్న సీఎం’
- ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌లకు చేరాక ఏం జరుగుతుంది, భద్రత ఎలా ఉంటుంది? లోపలికి ఎవరెవరు వెళ్లొచ్చు?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: కొట్లాటలు, గాలిలోకి కాల్పులు, పెట్రోలు బాంబులు, ఈవీఎం ధ్వంసాలు, కిడ్నాపులు, సస్పెన్షన్లు.. పోలింగ్ రోజు ఏం జరిగిందంటే..
- ‘నాకు పెళ్లి కావడం లేదు, సెక్స్ వర్కర్ల దగ్గరకు వెళుతుంటాను. ఇలా ఎన్నాళ్లంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














