మగవాళ్లకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండరా? మహిళల నుంచి పురుషులు నేర్చుకోవాల్సిందేంటి?

అబ్బాయిలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రోనాల్డ్ అవిలా-క్లౌడియో
    • హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్

వయసు పెరుగుతున్నకొద్దీ కొందరు మగవాళ్లు ఇతర పురుషులతో స్నేహం కొనసాగించడానికి ఎందుకు ఇబ్బంది పడతారు? వారి మహిళా భాగస్వాముల నుంచి వారికెలాంటి ఒత్తిడి ఉంటుంది?

2019లో చేపట్టిన యూగవ్ సర్వే(YouGov survey)లో ప్రతి ఐదుగురిలో ఒకరికి అసలెలాంటి క్లోజ్ ఫ్రెండ్స్ లేరని తెలిసింది. మహిళలతో పోలిస్తే ఈ సంఖ్య పురుషుల్లో రెండింతలు ఎక్కువగా ఉంది.

మూవెంబర్ ఫౌండేషన్ నిర్వహించిన ఇదే రకమైన పోల్‌లో కూడా ప్రతి ముగ్గురిలో ఒకరికి అసలు అబ్బాయిలు ప్రాణ స్నేహితులుగా లేరని తెలిసింది.

అయితే, ఇక్కడ క్లోజ్ అనే దాన్ని ఎలా నిర్వచిస్తున్నారంటే.. ఆరోగ్యం నుంచి ఆర్థిక ఆందోళనల వరకు ప్రతి విషయాన్ని అబ్బాయిలు తమకెలాంటి ఇబ్బంది లేకుండా, స్వేచ్ఛగా పంచుకునే వ్యక్తును క్లోజ్ ఫ్రెండ్స్‌గా నిర్వచించారు.

అయితే, తమ స్నేహాన్ని కాపాడుకోవడానికి మహిళల నుంచి పురుషులు ఏం నేర్చుకోవచ్చు.

బ్రిటీష్ కమెడియన్, ‘బిల్లీ నో-మేట్స్: హౌ ఐ రియలైజ్డ్ మెన్ హావ్ ఏ ఫ్రెండ్‌షిప్ ప్రాబ్లమ్’ రచయిత మ్యాక్స్ డికిన్స్ ఈ విషయాలను గురించి చర్చించారు.

అబ్బాయిలెవరూ తనకు స్నేహితులుగా లేరని తనెప్పుడు గుర్తించారు, ఆ తర్వాత ఆయన ఏం చేశారు అన్న విషయాలను బీబీసీ రేడియో 4 వుమన్స్ అవర్‌లో పంచుకున్నారు.

మగవారు తమ జెండర్ వ్యక్తుల్నే స్నేహితులుగా ఎలా మలుచుకోవాలి? వారినెలా తమ స్నేహితులుగా దీర్ఘకాలం ఉంచుకోవాలో కొన్ని సూచనలు చేశారు.

అబ్బాయిలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

‘నా బుర్ర పనిచేయలేదు’

తన భాగస్వామికి ప్రపోజ్ చేసిన రోజునే మ్యాక్స్ డికిన్స్‌కు ఈ విషయం తెలిసింది. తన జీవితంలో మగవారు ఎవరూ స్నేహితులుగా లేరని ఆయన గుర్తించారు.

‘‘నా స్నేహితురాలితో కలిసి హాట్టన్ గార్డెన్‌లో నగల దుకాణానికి వెళ్లాను. ఆ తర్వాత వైన్ తాగాం. నీ జీవితంలో ఎవరూ బెస్ట్ మ్యాన్‌? అని ఆమె నన్ను ప్రశ్నించింది. ఆ సమయంలో నా బుర్రంతా మసకబారినట్లు అయింది’’ అని మ్యాక్స్ డికిన్స్ తెలిపారు.

‘‘ఆ రాత్రే నేను ఇంటికి వెళ్లి, పేపర్, పెన్ తీసుకుని, నేను స్నేహితులుగా భావించే కొందరి పేర్లను రాసుకున్నాను. వీరిలో చాలామందితో నేను రోజూ కలిసి పనిచేస్తాను. కొందరితో అయితే ఏడాది నుంచి మూడేళ్ల వరకు మాట్లాడి కూడా ఉండకపోవచ్చు. నా స్నేహితులందరూ ఎక్కడికి వెళ్లిపోయారు? ఓ మై గాడ్ అని ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాను’’ అని మ్యాక్స్ డికిన్స్ తెలిపారు.

‘‘దీని గురించి నేను కాస్త గూగుల్ చేసినప్పుడు, ఇలాంటి సమస్యతో చాలా మంది పురుషులు బాధపడుతున్నట్లు తెలిసింది. చెప్పాలంటే, 1970 ప్రారంభంలోనే సామాజిక శాస్త్రవేత్తలు క్రాస్ జెండర్ స్నేహం గురించి పరిశోధనలు ప్రారంభించారు. మహిళలతో పోలిస్తే పురుషులకు తక్కువ మంది స్నేహితులుగా ఉంటారు. ముఖ్యంగా ప్రాణ స్నేహితులు మరీ తక్కువ.

పురుషుల వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతుంది. ఒకవేళ విడాకులు లేదా పదవీ విరమణను తీసుకుంటే, మహిళల కంటే పురుషులే ఎక్కువగా మానసికంగా, శారీరకంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇది కాలం గడుస్తున్నా కొద్ది మరింత పెరుగుతుంది’’ అని చెప్పారు మ్యాక్స్ డికిన్స్.

మ్యాక్స్ డికిన్స్

ఫొటో సోర్స్, BBC RADIO 4

ఫొటో క్యాప్షన్, మ్యాక్స్ డికిన్స్

సర్వేల్లో ఏం తేలింది?

సర్వే సెంటర్ ఫర్ అమెరికన్ లైఫ్ నిర్వహించిన 2019 నాటి అధ్యయనంలో పాల్గొన్న 15 శాతం అమెరికన్ పురుషులు తమకు అసలు ప్రాణ స్నేహితులు లేరని తెలిపారు. 1990 నాటి సర్వే లెక్కలతో పోలిస్తే ఇది ఐదింతలు ఎక్కువ.

ఇదే విషయం పలు ఇతర సర్వేల్లో కూడా వెల్లడైంది. వివిధ దేశాలకు చెందిన పురుషులందరిలోనూ ఇలా జరుగుతుందని డెవలప్‌మెంటల్ సైకాలజీలో నిపుణులు అయిన నియోబె వే చెప్పారు.

న్యూయార్క్ యూనివర్సిటీలో సీనియర్ లెక్చరర్ అయిన నియోబె వే తన వృత్తి జీవితంలో వందల మంది టీనేజర్లను ఇంటర్వ్యూ చేశారు. వయసు పెరిగే కొద్ది వారెలా ప్రాణ స్నేహితులను కోల్పోతున్నారో తెలుసుకున్నారు.

గూగుల్‌లో డికిన్స్ కనుగొన్న పరిణామాలు సైన్స్ రుజువు చేసిన దాని కంటే ఎక్కువగా ఉన్నాయని ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీలోని ఆంథ్రోపాలజీ, ఎవాల్యూషనరీ సైకాలజీ ప్రొఫెసర్ రాబిన్ డంబార్, నియోబె వే అన్నారు.

ఫ్యామిలీ, భాగస్వామి కాకుండా బయట పెద్దగా అర్థవంతమైన సంబంధాలు ఉండకపోవడంతో, ప్రజలు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటున్నారు.

దీనికి పరిష్కారంగా డికిన్స్ ఆ తర్వాత, ‘బిల్లీ నో-మేట్స్: హౌ ఐ రియలైజ్డ్ మెన్ హావ్ ఏ ఫ్రెండ్‌షిప్ ప్రాబ్లమ్’ అనే పుస్తకాన్ని రచించారు.

ఎందుకిలా జరుగుతుందో అర్థం చేసుకునేందుకు ప్రాథమికంగా ఇది చాలా అవసరమన్నారు.

దీనికి గల కారణాలు చాలా సంక్లిష్టమైనవి. ఈ కారణాలను నిపుణులు అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే, ప్రజలు తమ సామాజిక ప్రపంచాన్ని చాలా ఉన్నతంగా, ఊహించని విధంగా మలుచుకుంటూ ఉంటారు.

పురుషులు

ఫొటో సోర్స్, Getty Images

స్నేహం చేయాలనే కోరిక అవసరం

మహిళలతోనే కాదు పురుషులతో స్నేహానికికీ మగవారు చాలా ఇబ్బందులు పడుతున్నారని ప్రొఫెసర్ డంబార్ అన్నారు.

న్యూయార్క్‌లో ఆదాయం తక్కువ ఉన్న పిల్లలు చదువుకునే పాఠశాలల్లో నియోబె వే ఎన్నో ఏళ్ల పాటు అధ్యయనాలు చేశారు.

ఈ అధ్యయనాల్లో పురుషుల మధ్య స్నేహ సంబంధాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు.

డికిన్స్‌తో పాటు ఇతర చాలామంది వ్యక్తులు ఎదుర్కొనే సమస్య పరిష్కారానికి సొంత థియరీని నియోబె వే రూపొందించారు.

స్నేహితులు కావాలనే కోరిక పిల్లలకు సహజంగా ఉండాలని టీచర్లు చెప్పారు.

ప్యూర్టో రికాన్స్, డొమినకన్లు, నల్లజాతీయులు, ఆసియన్లతో చేసిన ఇంటర్వ్యూలలో.. ‘‘మగ స్నేహితుల గురించి చిన్నవయసులో వారేం చెప్పారో విన్నాం. అతను లేకుండా నేను ఉండలేను. అతనికి నా రహస్యాలన్ని చెబుతాను’’ అని అంటుంటారు.

కానీ, వారు ఒక వయసుకు వచ్చాక, 15 ఏళ్లు, ఆపైబడిన తర్వాత పిల్లలు తమ స్నేహితులను కోల్పోతున్నారు. ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఐసోలేట్ అవుతున్నారు.

డీప్ సీక్రెట్స్: బాయ్స్ ఫ్రెండ్‌షిప్ అండ్ ది క్రైసిస్ ఆఫ్ కనెక్షన్(2011) అనే పుస్తకాన్ని రచించిన నియోబె వే ఈ మార్పుకు గల కారణాలను వివరించారు.

తాము మగ వారమనే అహంభావం అబ్బాయిలు పెరుగుతున్న సమయంలో మెల్లమెల్లగా వారిలో చొచ్చుకుపోతుంది. చాలా వరకు ఇది అమెరికా సంస్కృతి నుంచే వస్తుంది. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాల గురించి వివరించారు.

తెల్లజాతీయులు అయినా, ధనవంతులైన, హెటెరోనార్మేటివ్ అయినా పురుషులమనే అహంభావం ప్రపంచంలోని మగ స్నేహితుల మధ్యలోకి కూడా చేరి, వారిని స్నేహాలను దెబ్బతీస్తుందన్నారు.

పురుషులు

ఫొటో సోర్స్, Getty Images

డంబార్ దీనికి మరో రకమైన అభిప్రాయాన్ని తెలియజేశారు. తమ పూర్వీకుల నుంచి మానసిక వారసత్వంగా మనుషుల్లో ఈ లక్షణం పెంపొందుతుందని ఎవాల్యుషనరీ సైంటిస్ట్‌గా తన అభిప్రాయాన్ని తెలిపారు.

మహిళలలా కాకుండా, మగవారు తమ స్నేహాలను చాలా తేలికగా, పనికి సంబంధించి, ఇతరాత్ర కార్యకలాపాల కోసంగానే భావిస్తారు. అంటే అందరూ కూర్చుని బీర్ తాగేందుకు, గేమ్ చూసేందుకు లేదా పర్వతాలను ఎక్కేందుకు ఇలా వారి స్నేహితులను ఎంచుకుంటూ ఉంటారని ఆక్స్‌ఫర్డ్ రీసెర్చర్ తెలిపారు.

కానీ, మహిళలు ఒకరికొకరు మాట్లాడుకుంటూ, స్నేహపూర్వకమైన సంబంధాలను నిర్వహించుకుంటూ ఉంటారు. వారి భావనలను పంచుకుంటుంటారు.

పురుషుల సంబంధాలు ఎక్కువగా శారీరకంగా ఉంటాయి. అదే సమయంలో మరింత సాధారణంగా కూడా అనిపిస్తాయని వివరించారు.

సమాజాన్ని రక్షించేందుకు అప్పటి కాలంలో పురుషులు కలిసి పనిచేసేవారని అన్నారు.

‘‘సమాజాలను రక్షించే వారుగా, వారియర్స్‌గా పురుషులను చూసేవారు. దీన్ని విజయవంతంగా చేపట్టేందుకు, ఒకరికొకరు సంబంధాలను కలిగి ఉండేవారు’’ అని తెలిపారు.

కానీ, మరోవైపు తమ పార్టనర్లలో ఎవరైనా గాయపడ్డా లేదా చనిపోయినా దాన్ని సీరియస్‌గా తీసుకునే వారు కాదు. ఎందుకంటే, ఒకవేళ పట్టించుకుంటే, ప్రతి ఒక్కటీ దెబ్బతింటుందని భావించేవారు.

మహిళలు ఇతర ఉద్యోగాల్లో పాలుపంచుకోవడం నుంచి వారి జీవితంలో ఎక్కువ భాగం సంతానోత్పత్తి చుట్టూనే తిరుగుతూ ఉంటుందని డంబార్ చెప్పారు.

‘‘వారి భర్త ఎక్కడ పనిచేస్తే అక్కడికి వారు వెళ్తుంటారు. ఇతర ప్రదేశాలకు తరలివెళ్లినప్పుడు వారు ఒంటరిగా భావిస్తుంటారు. దాన్ని అధిగమించేందుకు శారీరకంగా కాకుండా మానసికంగా సపోర్టును వారు కోరుకుంటారు. ప్రపంచంలో చాలా సమాజాల్లో ఇది జరుగుతూ ఉంటుంది’’ అని రాబిన్ డంబార్ వివరించారు.

అబ్బాయిలు

ఫొటో సోర్స్, Getty Images

ఒంటరితనంతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు

సామాజిక ఒంటరితనం సాధారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటుందని సర్జన్ జనరల్‌కు చెందిన అమెరికా కార్యాలయం వివరణాత్మక నివేదికను విడుదల చేసింది. దేశంలో ఇది వ్యాధులను అంచనా వేస్తుంటుంది.

2023లో ప్రచురించిన డాక్యుమెంట్‌లో, ‘‘సంబంధాలు తక్కువగా ఉండటం కార్డియోవస్క్యులర్ వ్యాధులను, డెమెన్షియా, గుండెపోటు, డిప్రెషన్, ముందస్తు మరణాలకు సూచికగా ఉంటున్నట్లు’’ ఈ సంస్థ వివరించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గత సంవత్సరం ఈ సమస్యను ఎత్తి చూపింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురు పెద్దవారిలో ఒకరు సామాజిక ఒంటరితనాన్ని, 5 శాతం నుంచి 15 శాతం మధ్య కౌమర దశలో ఉన్నవారు ఒంటరితనంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

‘‘సంబంధాలలో నెలకొన్న ఇబ్బందులు డిప్రెషన్‌‌కు, ఒత్తిడికి, హింసకు దారితీస్తాయి. హింస గురించి తీసుకుంటే, కాల్పులు, లైంగిక హింస వంటివి కూడా ఉంటున్నాయి. ఒంటరితనంతో హింసలు నెలకొంటాయని ఈ పరిశోధన చెబుతుంది’’ అని ప్రొఫెసర్ నియోబె వే అన్నారు.

నియోబె వే తన సిద్ధాంతంలో చెప్పిన పురుషులు, వారు అణచివేతకు గురైన సమాజంలో నివసిస్తున్నారు.

తమలోని భావాలను బయటికి చెప్పేందుకు అవకాశం ఉండదు. ఇవి కూడా ఒంటరితనానికి, ఆ తర్వాత హింసకు కారణమవుతున్నాయి.

అమ్మాయితో మాట్లాడుతున్న అబ్బాయి

ఫొటో సోర్స్, Getty Images

మహిళల నుంచి ఏం నేర్చుకోవాలి?

మహిళలు తమ స్నేహాలను బలపరుచుకునే, వృద్ధి చేసుకునే విధానాలను అర్థం చేసుకోవాలని మ్యాక్స్ డికిన్స్ అన్నారు.

‘‘వారి మధ్యలో బలమైన భావోద్వేగాల సంభాషణలు ఉంటాయి. వారు మానసిక సంఘర్షణలను ప్రాణ స్నేహితులతో పంచుకుంటూ ఉంటారు. రొమాంటిక్ పార్టనర్‌తో కంటే ఎక్కువ క్లోజ్‌గా ఉండే ప్రాణ స్నేహితురాలు తమకు ఉందని వారు తరచూ చెబుతుంటారు’’ అని బ్రిటీష్ కమెడియన్ చెప్పారు.

అందుకోసం, ఆయన తొలుత ప్రాణ స్నేహితుల కోసం చూశారు. కేవలం కొన్ని పనులు మాత్రమే వారితో కలిసి పనిచేసేలా కాకుండా.. మరింత స్నేహపూర్వకమైన సంబంధాలను కలుపుకునేలా ప్రయత్నించారు.

‘‘అంతకుముందు నాకు చాలా వరకు స్నేహాలు జోకులు, నవ్వుల ద్వారానే ఉండేవి. పెద్దగా వారిపై ఎలాంటి ప్రేమ ఉండేది కాదు. కానీ, నా స్నేహితులతో ప్రేమగా మాట్లాడేందుకు నేను ప్రయత్నించాను. వారితో నా సంబంధాలను మరింత దృఢంగా మార్చుకోవాలని అనుకున్నాను. దీని కోసం నేను చాలా ప్రయత్నాలు చేశాను’’ అని చెప్పారు.

సంవత్సరాలు అయినా తన స్నేహం దెబ్బతినకుండా ఉండేందుకు, స్నేహితులతో బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు మ్యాక్స్ డికిన్స్.

‘‘ఒకసారి చాలా సాధారణమైన పనినే నేను చేశాను. ఐదుగురు వ్యక్తులతో కలిసి ఫుట్‌బాల్ లీగ్‌ ఆడాను. ఫుట్‌బాల్ ఆడుకున్న తర్వాత, పబ్‌కు వెళ్లాం. మేం చేసింది చిన్న పనే, కానీ దాని వల్ల ఎంత తేడా కనిపించిందో’’ అని వివరించారు బ్రిటీష్ కమెడియన్.

‘‘అంతకుముందు అందరితో కలిసి ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఓనర్‌షిప్ అంతా తానే తీసుకునే వాడిని, కానీ, ప్రస్తుతం ఇతరులతో కలిసి ఏదైనా యాక్టివిటీలు చేద్దామనుకున్నప్పుడు పార్టనర్‌పై ఆధారపడటం వల్ల సంబంధాలు మరింత పెరిగాయి’’ అని ఆయన గుర్తించారు.

‘‘మన జీవితాల్లో మహిళలను హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ లాగా భావిస్తాం. వారు స్నేహాలను ఏర్పాటు చేసుకుంటే, మనం వారి సోషల్ గ్రూప్‌లపై ఆధారపడతాం’’ అని అన్నారు.

‘‘ఎందుకంటే, మనం సామాజిక పనులు చేయమని భావిస్తాం. ఇతరులతో మాట్లాడటం, మీటింగ్‌లను నిర్వహించడం, పోస్ట్‌ కార్డులు పంపడం అవన్నీ మహిళలవే అనుకుంటాం. కానీ, సంబంధాలను ఏర్పాటు చేసుకునేందుకు, వాటిని చక్కగా నిర్వహించుకునేందుకు ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు అవసరమే’’ అని వివరించారు.

‘‘చివరిగా, మీరెంత మీ జీవితంలో బిజీగా ఉన్నప్పటికీ, ఇతరుల కోసం కాస్త సమయాన్ని కేటాయించాలి’’ అని బ్రిటీష్ కమెడియన్ మ్యాక్స్ డికిన్స్ సూచించారు.

తన పెళ్లి వేడుకలో బెస్ట్ ఫ్రెండ్ అంటూ తనకెవరూ లేరని గుర్తించిన డికిన్స్ తన పుస్తకం రాసేందుకు తోడ్పడింది. కానీ, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్‌ను చేసుకోవాలని ఆయన భావించారు. దాని కోసం ప్రయత్నించి, విజయం సాధించారు.

ప్రొఫెసర్లు వే, డంబార్ సూచనలు

  • స్నేహాలు పొందాలనే కోరిక మనుషుల్లో అంతర్లీనంగా ఉందనే విషయాన్ని గుర్తించండి. ఇది సెక్స్ లేదా జెండర్‌కు సంబంధించినది కాదు. మీలాగా ఇతర పురుషులు కూడా అబ్బాయిలను స్నేహితులుగా చేసుకోవాలని ఆసక్తితో ఉంటారు.
  • ప్రశ్నలతో తలమునకలయ్యే వారు, ఇతరులు కూడా తమల్ని ప్రశ్నలు వేయాలని కోరుకుంటూ ఉంటారు. కానీ, వ్యక్తిగతంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాటిపై ఫోకస్ చేయొద్దు. ఉదాహరణకు జిమ్‌లో లేదా పక్కింటివారిని మీరు చిన్నతనంలో వారికిష్టమైన మెమరీ ఏంటి? ఏ ఫుడ్‌ను మీరు ఎక్కువగా ఇష్టపడతారు? అని అడగవచ్చు. ఎవర్ని మీరు నమ్ముతారు? ఎందుకు? ఇలాంటి ప్రశ్నలు వేయొచ్చు.
  • మీ స్నేహితులతో కామన్‌గా ఉండే యాక్టివిటీల గురించి, ఇష్టపడే ప్రదేశాల గురించి తెలుసుకోండి. దీని వల్ల మీ విషయాలను వారితో పంచుకోగలుగుతారు.
  • ఇవన్నీ కూడా రెండు వైపులా ఉండాలి. అంటే ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు, మీరు కేవలం సమాధానం చెప్పడమే కాకుండా, వారిని కూడా ఏదో ఒకటి అడిగి, సంబంధాలను పెంచుకోవాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)