మీకు ఇష్టమైన పాట ఎక్కడికి వెళ్లినా వినిపిస్తున్నట్లు అనిపించిందా... ఎందుకిలా జరుగుతోంది?

ఫ్రీక్వెన్సీ ఇల్యూజన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాట వింటున్న యువతి
    • రచయిత, అల్ముడెనా డీ కాబో
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మీరు ఓ పాటను విని బాగా ఇష్టపడ్డారని అనుకుందాం. ఆ తరువాత కొన్ని రోజులు మీరు ఎక్కడికి వెళ్లినా, ఆ పాట ఎక్కడో అక్కడ మీకు వినిపిస్తున్నట్లు మీకు అనిపించిందా?

మీ బంధువులు, స్నేహితులు ఎవరైనా తాము నీలం రంగు కారును కొన్నామని చెప్పగానే, ఉన్నట్టుండి అదే రంగు కారులు మీకు రోడ్డుపై ఎక్కువగా కనిపించడం జరిగిందా? అలా జరిగే ఉంటుంది కదూ?

మీకు అలాంటి అనుభవం కలిగితే బహుశా అది మీ భ్రాంతి కావచ్చు. ఈ విషయం మీ ఫ్రెండ్స్‌కో, కుటుంబ సభ్యులకో చెబితే వారు కూడా అదే మాట అని ఉండొచ్చు. దీన్ని సైన్స్ పరిభాషలో ‘ఫ్రీక్వెన్సీ ఇల్యూజన్’ అంటారు.

ఈ ఫ్రీక్వెన్సీ ఇల్యూజన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుందట.

మీకు ముఖ్యమైనవిగా అనిపించిన వస్తువులు, విషయాలపైనే మీరు దృష్టిపెట్టినప్పుడు, అవే మీకు తరచూ కనిపించినట్లు అనిపిస్తుంది. అసలు మనలో ఇలాంటి ఆలోచనలు ఎలా కలుగుతాయో చూద్దాం....

ఫ్రిక్వెన్సీ ఇల్యూజన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, మెదడు

ఫ్రీక్వెన్సీ ఇల్యూజన్ అంటే..

ఈ ఫ్రీక్వెన్సీ ఇల్యూజన్ భావనను ‘బాడర్ మీన్హోఫ్ ఫెనామినా’ అని కూడా అంటుంటారు. ఇది జ్ఞాపకశక్తికి సంబంధించినది.

1994లో జర్మన్ ఫోరంకు చెందిన ఓ వ్యక్తి తాను 1970లకు చెందిన రెడ్ ఆర్మీ ఫాక్షన్ అనే జర్మనీ తీవ్రవాద సంస్థ గురించి చదివాడట. ఆ సంస్థకు చెందిన ఇద్దరు ముఖ్య నేతలు బాడర్, మీన్హోఫ్‌ల గురించి తెలుసుకున్న సందర్భంలో ఆ తరువాత కూడా తెలీకుండానే వారి గురించి విషయాలపై తనకి ఎక్కువ దృష్టి ఉండేదని తన అనుభవాలను పంచుకున్నాడు.

అతను తన అనుభవాన్ని పంచుకున్న నేపథ్యంలో మిగిలిన పాఠకులు తమ తమ అనుభవాలను కూడా పంచుకోవడం మొదలైంది. క్రమంగా ఈ ఫెనామినాగా అందరి దృష్టిని ఆకర్షించి అదేపేరుగా మారింది.

అయితే ఇది కొత్తగా కనుక్కున్న విషయం కాదు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిలో మన మెదడులోని ఆలోచనలు, పనితీరుపై ముడిపడి ఉంది.

“ఇప్పుడు మీకేదైనా విషయాన్ని గుర్తిస్తే, దానికి సంబంధించినదే మీరు ఎక్కువగా చూస్తున్నట్లు అనిపిస్తుంది” అని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన సైకాలజీ, బయాలజీ గ్రాడ్యుయేట్ డా.నేహా పాఠక్ అన్నారు. వెబ్ఎండీ (WebMD) అనే ప్రత్యేక వెబ్‌సైట్‌కు రాసిన వ్యాసంలో ఈ విషయం పేర్కొన్నారు.

“మొదట, మీరు ఏదో తరచుగా కనిపించడం మొదలైందని మీరు నమ్ముతారు. ఆ తర్వాత ఆ పదం, ఆ విషయం, అంశం ఇప్పుడు కనిపించినంతగా ఇంతకుముందు కనిపించలేదని అనుకుంటారు. ఇందుకు కారణం కన్ఫర్మేషన్ బయాస్ అనే మానసిక ప్రక్రియ. వాస్తవానికి అలా ఏమీ జరిగి ఉండదు. కానీ మీరు అలా అనుకునేలా మీ మెదడు మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది” అని నేహా పాఠక్ అన్నారు.

ఫ్రీక్వెన్సీ ఇల్యూజన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఒకే మోడల్ లేదా ఒకే కలర్ కార్లు తరచూ కనిపించడం కూడా ఫ్రీక్వెన్సీ ఇల్యూజన్‌లో ఒక భాగం

మెదడులో ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది?

2005లో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలోని భాషాశాస్త్ర విభాగ ఆచార్యులు ఆర్నాల్డ్ జ్వికీ తొలిసారిగా ‘ఫ్రీక్వెన్సీ ఇల్యూజన్’ అన్న పదాన్ని ఉపయోగించారు.

ఆయన ఈ పరిణామాన్ని రెండు మానసిక ప్రక్రియల ఫలితంగా పేర్కొన్నారు.

అవి..

సెలెక్టివ్ అటెన్షన్- ఈ మానసిక ప్రక్రియ మన అభ్యాసానికి చాలా కీలకం. నిర్ధిష్ట క్షణాన మనకు ఏది ముఖ్యమో దానిపైనే దృష్టి కేంద్రీకరించేలా చేసి, మిగిలిన వాటిని వదిలేస్తుంది.

నిర్థరణ పక్షపాతం (కన్ఫర్మేషన్ బయాస్)- ఇది మనం ఆ నిర్ధిష్ట క్షణాన మనం ఏం ఆలోచిస్తున్నామో, అందుకు మద్దతు ఇచ్చే అంశాల కోసం అన్వేషించేలా చేస్తుంది.

ఉదాహరణకు మనం నీలిరంగు కార్లును ఎక్కువగా చూడటం వలన, ఆ రంగు కార్లు మరిన్ని ఉన్నాయన్న మన నమ్మకాన్ని నిర్థరించుకుంటాము.

“ఈ ఫ్రీక్వెన్సీ ఇల్యూజన్ అన్నది అందరికీ జరిగి ఉండకపోవచ్చు లేదా అది అనుభవంలోకి వచ్చినట్లుగా వారు గుర్తించకపోవచ్చు. అయినప్పటికీ ఇది పరిణామాణాత్మకమైన ప్రాధాన్యత గల అంశం” అని క్లినికల్ సైకాలజిస్ట్, సోషల్ సైకాలజీలో డాక్టరేట్ పొందిన జోవన్నా రియెరా బీబీసీతో అన్నారు.

మానవుడికి అవగాహన సామర్థ్యం ఉంది. అయితే మనకు ఉన్న పరిమితుల కారణంగా మన మెదడు అన్ని ఉద్దీపన చర్యలపై దృష్టి పెట్టలేదు. అలా గనుక చేయకపోతే మనం మనచుట్టూ ఉన్న వాతావరణానికి అలవాటు పడలేం.

మన ఇంద్రియాల నుంచి కొన్ని అంశాలను గ్రహించి, వాటిని విశ్లేషించి అవి ఫలానా అని వివరణ తెలుసుకుంటాము. దీనేని అవగాహన అని అంటాం.

“ఎప్పుడైతే మనం నిర్దిష్టమైన ఉద్దీపనాలకు లోనవుతామో అంటే ఏదైనా ఆసక్తిగా అనిపించినప్పుడు, లేదా మన దృష్టిని ఏదైనా విషయం ఆకర్షించినప్పుడు, అది మనలో భావోద్వేగాలను కలిగిస్తుంది. ఆ తరువాత అలాంటివే మనకు తరచుగా కనిపించడం మొదలవుతుంది. అలాంటివే ఎక్కువ ఉన్నాయని మనం అవగాహనకు వచ్చేలా మానసిక ప్రక్రియలు జరుగుతాయి” అని ఆమె అన్నారు.

ఫ్రీక్వెన్సీ ఇల్యూజన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, మీకు ఇష్టమైన విషయం మీ మెదడులో పదే పదే తిరుగుతుంటుంది.

ఇలా ఎందుకు జరుగుతుందంటే ఆ సమయాన మనం చూసినదే ముఖ్యమైనదని మన మెదడు గ్రహిస్తుంది. అది ముఖ్యమైనది కాబట్టి, అందుకు అనుగుణంగా మానసిక ప్రక్రియలు జరిగేలా చేసి, ఆ ఫలితాలనే మనకు కనిపించేలా చేస్తుంది.

“ఫ్రీక్వెన్సీ ఇల్యూజన్‌తో మెదడులోని పలు భాగాలకు సంబంధం ఉంటుంది. భావోద్వేగాలకు కారణమయ్యే మెదడులోని ప్యారిటల్ భాగం, జ్ఞాపకశక్తికి సంబంధించిన హిప్పోకాంపల్, అమిగ్దాలా భాగాల నుంచి ఫ్రీక్వెన్సీ ఇల్యూజన్ కలగడానికి అవసరమయ్యే సమాచారం చేరుతుంది” అని రియేరా అన్నారు.

“ఉదాహరణకు నేనొక గర్భిణిని చూశానని అనుకుందాం. ఆ తరువాతి నుంచి నేను గర్భిణులనే ఎక్కువ చూస్తుంటాను. దీనికి కారణమేంటంటే నేను ఆ నిర్ధిష్టమైన క్షణాన అదే ముఖ్యమని అనుకున్నాను. అందువల్ల నాకు అప్పటి నుంచి గర్భిణులే ఎక్కువగా కనిపించడం మొదలవుతుంది” అని ఆమె వివరించారు.

“ఇది భావోద్వేగ అంశాలతో మాత్రమే కాకుండా మెదడులో నిక్షిప్తమైన జ్ఞాపకశక్తితో కూడా ముడిపడి ఉంటుంది. నేను గర్భిణిపై దృష్టి చూపడానికి కారణం, బహుశా నేను గతంలో బిడ్డను కోల్పోయి ఉండొచ్చు, లేదా గర్భవతిని కాావాలని ఆశ పడుతుండొచ్చు. లేదా నేను కూడా గర్భవతిని అయ్యుండొచ్చు. ఆ క్షణం నాకు ముఖ్యమైనదని అనిపించింది కాబట్టి, నా మెదడు అందుకు అనుగుణంగా పనిచేసింది” అని రియెరా అన్నారు.

ఇలా మనకు ఎదురయ్యే పరస్థితులు, అనుభవాలను బట్టి మన మెదడులో ఫ్రీక్వెన్సీ ఇల్యూజన్‌ కలగడానికి అందుకే ఇది అందరిలోనూ ఒకేలా ఉండదు.

ఫ్రీక్వెన్సీ ఇల్యూజన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుందా?

రియెరా దీని గురించి మరింత వివరించారు.

“ఉదాహరణకు నేను నీలం రంగు కార్లనే ఎక్కువగా చూస్తున్నాను అనుకుందాం. నా మెదడు నేను చూస్తున్న కార్లలో వేరే రంగు కార్లు ఉన్నా సరే, నేను ఇచ్చిన ప్రాధాన్యతను అధారంగా చేసుకుని నీలం రంగు ఉన్న కార్లపైనే నా దృష్టిని కేంద్రీకృతం అయ్యేలా చేస్తుంది”

“ మరో ఉదాహరణ...నేను ఈ మధ్యనే ఒక పండును తిన్నాను. అది బాలేదు. ఆ కారణంగా నేను అనారోగ్యానికి గురయ్యానని అనుకుందాం. ఆ తరువాత కొన్ని రోజుల పాటు నా మెదడు నాలాగే ఇంకెవరికైనా జరిగిందా?, ఆ పండు తింటే అలా తరచుగా జరుగుతుందా? అన్న విషయాలనే ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అంటే నా మెదడు ఈ విషయం ముఖ్యమైనదిగా భావించి, ప్రమాదకరమైన పరిస్థితులకు అనుగుణంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది” అని ఫ్రీక్వెన్సీ ఇల్యూజన్ గురించి వివరించారు రియేరా.

ఫ్రీక్వెన్సీ ఇల్యూజన్ జనరల్ ప్రతికూల ప్రభావాన్ని చూపదు. కానీ మన జ్ఞాపకాలు కొన్ని రోడ్డు ప్రమాదాల వంటి సంఘటనలతో ముడిపడితే గనుక ఆ ప్రభావంలో మార్పు రావొచ్చు.

ఇలాంటి సందర్భాలలో ‘పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్’ వంటి సమస్యకు దారి తీయొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటివి తప్ప ఈ ఫ్రీక్వెన్సీ ఇల్యూజన్ వలన మరేవిధమైన ఆరోగ్య సమస్యలు తలెత్తవు.

వీడియో క్యాప్షన్, గుజరాత్ లో ఒక తల్లిపడుతున్న కష్టాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)