భార్యాభర్తల మధ్య గొడవల్లో కొంపముంచే 6 మాటలు ఇవే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎలైస్ హెర్నాండెజ్
- హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్
గ్యాస్‌లైటింగ్ అనేది ఓ మానిపులేషన్ టెక్నిక్.
ఇది తమను తాము ప్రశ్నించుకోవడాన్ని, లేదా వాస్తవికతను చూసే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది.
గ్యాస్‌లైటింగ్... ఈ పదాన్ని 2022కి గానూ ‘‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’’గా మెరియమ్ వెబ్‌స్టర్ డిక్షనరీ ప్రకటించింది.
గ్యాస్‌లైటింగ్ అంటే ఒక వ్యక్తిని పూర్తిగా తప్పుదోవ పట్టించడం. ఇంకా చెప్పాలంటే మన అవసరానికి తగినట్లుగా వారిని కీలుబొమ్మగా వాడుకోవడం.
ఈ పదాన్ని ‘‘సైకలాజికల్ మానిపులేషన్’’ కోణంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారని మెరియమ్ వెబ్‌స్టర్ చెబుతోంది.
ఎదుటి వారి నుంచి ఏదైనా పొందాలనే ఉద్దేశంతో కొందరు దీన్ని తరచుగా ఉపయోగిస్తుంటారు.
''అది మానవ సహజం. కొన్నిసార్లు మనల్ని మానిపులేట్ చేస్తున్నప్పటికీ అది మనకు తెలియదు'' అని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ కార్ట్‌నే ఎస్ వారెన్ బీబీసీ ముండోతో చెప్పారు.
అందులో ప్రమాదమేంటంటే, ఆ టెక్నిక్ మనపై ప్రయోగించారని గుర్తించలేకపోవడమే.
ఎవరైనా మీతో ఏదైనా చెప్పినప్పుడు మీకు అభద్రత భావం కలిగినా, లేదా అసౌకర్యంగా అనిపించినా దానిని గుర్తించడం కీలకం. ''మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నట్లుగా అనిపిస్తే'' అని వారెన్ వివరించారు.
ఎవరైనా ఏదైనా ఇబ్బందికరమైన విషయం చెప్పినప్పుడు అసౌకర్యంగా అనిపించొచ్చు. అలాగే, ఆ వ్యాఖ్యలు బాధ కలిగించేవి కూడా కావొచ్చు. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు సంయమనం పాటించాలని ఆమె సూచించారు.
అందులో, ఏవి మిమ్నల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయో గుర్తించాలి.
వాటిని అవేర్‌నెస్ (అవగాహన పెంచుకోవడం), ఎవాల్యుయేషన్ ( వాటి తీవ్రతను అర్థం చేసుకోవడం), యాక్షన్ (ఏం చేయాలి) అనే మూడు భాగాలుగా వారెన్ విభజించారు.
గ్యాస్‌లైటింగ్ పరిస్ధితి ఎదురైనప్పుడు తనను తాను తెలుసుకుని, ఆత్మగౌరవంతో స్పందించడమే లక్ష్యంగా ఉండాలని ఆమె సూచిస్తున్నారు.
''మీ దృక్పథం, మీ భావనలు, అనుభవాలు, గత చరిత్ర, నేపథ్యం ఆధారంగా మీరు దేనినైనా గౌరవంగా తీసుకోవడమే కాకుండా వాటి పరిమితులను కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది'' అని వారెన్ వివరించారు.
అయితే, అది అంత తేలికైన పనేం కాదు. వాదనలు జరిగే సమయంలో చర్చకు వచ్చే కొన్ని ప్రమాదకరమైన మాటలు (పదబంధాలు), వాటికి ఎలా స్పందించాలనే విషయంపై బీబీసీ ముండోలో సైకాలజిస్టుతో చర్చించాం.

ఫొటో సోర్స్, COURTESY
నువ్వు ఎక్కువగా స్పందిస్తున్నావు / నువ్వు చాలా సున్నితం
ఇది చాలా సాధారణం.
ఈ మాట ఎవరైనా మీకు చెప్పారంటే, మీరు వాస్తవానికి దూరంగా ఉన్నారని చెబుతున్నారని అర్థం.
ఒకవేళ మీరు చాలా సున్నిత మనస్కులు అని ఎవరైనా అంటే, కావొచ్చు. మీరు భావోద్వేగాలకు గురైనప్పుడు అలా అనిపించే అవకాశం ఉంది. అయితే, అందువల్ల ఎలాంటి ఇబ్బందీ లేదు.
ఇలాంటి మాటలు మీకు ఉపయోగపడవు. ఎందుకంటే ఆ సమయంలో మీ అవసరాలు, భావోద్వేగాలను వారు పట్టించుకోరు. మీ భావోద్వేగంలో నిజం ఉన్నప్పటికీ వాటిని కొట్టిపడేసే అవకాశం ఉంది. కొన్నిసార్లు అవి సహేతుకమైన విమర్శలు కూడా కాకపోయి ఉండొచ్చు.
మరి దీనికి జవాబు ఎలా చెప్పొచ్చు?
''మీరు నా గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నారు. కానీ, ఇప్పటికి ఇదే వాస్తవం. నేను అలాగే ఫీల్ అవుతున్నా. నేను చూసిందీ అదే. నేను నమ్ముతోంది కూడా అదే''
''నా ఫీలింగ్స్ గురించి చర్చించేందుకు నేను సిద్ధంగా లేను. మీరు చెప్పేది వింటాను. కానీ, అది మీరు గౌరవిస్తారని అనుకుంటున్నా'' అని చెప్పొచ్చు.
మిమ్మల్ని ఏదైనా బలంగా ఇబ్బంది పెడితే కొద్దిసేపు ఆ వాదన ఆపేయడం మంచిది.
''ఒక నిమిషం ఆగి, ఊపిరి తీసుకుని, మిమ్నల్ని అంతగా బాధించిన విషయమేంటో చెప్పేయండి'' అని నిపుణులు సూచిస్తున్నారు.
నేనేదో సరదాకు అన్నాను
ఏదైనా బాగా ఇబ్బందికరమైన, మనసును బాధపెట్టే ఒక మాట అనేసిన తర్వాత ఈ పద బంధాన్ని ఎక్కువగా వాడతారు.
కొన్నిసార్లు మీరు అలా ఉంటారు, ఇలా ఉంటారంటూ జడ్జ్ చేసేలా మాట్లాడుతుంటారు.
అలాగే, నీచమైన, ఇబ్బందికరమైన జోకులు వేస్తుంటారు. వాళ్లు సీరియస్‌గానే ఆ వ్యాఖ్యలు చేసి, ఆ తర్వాత దానిని జోక్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తుంటారు. వాటి మూలం నీచంగానే ఉంటుందని వారెన్ చెప్పారు.
అలాంటప్పుడు ఏం చెప్పాలి?
మొదట ఆ వ్యాఖ్యలు సరదాగా చేసినవి కాదని గుర్తించాలి.
''నువ్వు ఇది జోక్ అనుకుంటున్నావేమో. కానీ అది జోక్ కాదు. నాకు చాలా బాధ కలిగించింది'' అని నిర్మొహమాటంగా చెప్పాలని సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నేను అలా చేసేలా నువ్వే చేశావ్ / నీ వల్లే ఇలా జరిగింది
కొందరు తమ అవసరాల కోసం, ఇతరులను నిందించేందుకు ఇలాంటి మాటలు ఉపయోగిస్తుంటారు.
''నువ్వు గొడవపడ్డావు కాబట్టి నేను నీ మీద అరిచాను'', ''నువ్వు ఆలస్యంగా వచ్చావు కాబట్టి నీ మీద అరిచాను'' వంటి పదాలు వాడుతుంటారు.
అయితే, ''ఇతరుల ప్రవర్తనకు మీరెప్పుడూ, ఎప్పుడూ కారణం కాదని గుర్తుంచుకోవాలి'' అని వారెన్ వివరించారు.
అలాంటి మాటలు చాలా తీవ్రంగా ఉంటాయి. అందులో ఎవరో ఒకరిని, ఏదో విధంగా నిందించే అవకాశం ఉంటుంది.
రిలేషన్‌షిప్‌లో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కానీ, రిలేషన్‌షిప్‌లో అన్ని సమస్యలకూ కారణం ఒక్కరే అని నిందించకూడదు.
సమాధానం ఇలా
ఎవరైనా కావాలని మిమ్మల్ని నిందించేందుకు ప్రయత్నిస్తే కచ్చితంగా చెప్పేయండి.
''అవన్నీ నువ్వు అనుకుంటున్నవే కానీ, నేను అనుకోవడం లేదు''
''నేను చేసిన పనులు మీకు మంచిగా అనిపించకపోవచ్చు. కానీ, వాటిపై మీ రియాక్షన్‌కి మాత్రం మీదే బాధ్యత. నాది కాదు. నువ్వేం చేస్తున్నావో నీ ఇష్టం, నాకు సంబంధం లేదు.''
సమస్య అంతా నీవల్లే అని ఎవరైనా నిందిస్తుంటే మధ్యలో కల్పించుకుని ఇలా చెప్పొచ్చు.
''నా వల్ల అది మనకు ఇబ్బందికరంగా మారి ఉండొచ్చు. అందులో నాకూ బాధ్యత ఉంది. కానీ మొత్తం సమస్యకు నాది మాత్రమే బాధ్యత కాదు. ఎందుకంటే దానికి నువ్వు కూడా కారణమే''
నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే ఇలా చేస్తావా? / నన్ను ఇలా చేయనివ్వవా?
అన్ని బిల్స్ మీతో కట్టించేందుకు, కొందరితో మాట్లాడకుండా నియంత్రించేందుకు, ఓపెన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఈ మాటలు ఎక్కువగా వినిపిస్తాయి.
''తమ భాగస్వామి ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకోకుండా ఉండడానికి ఇలాంటి మాటలు వాడతారు. అది ఒక గ్యాస్‌లైటింగ్ పరిస్థితి. మీ పరిమితులను మీకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది'' అని వారెన్ చెప్పారు.
కొన్నిసార్లు మీరు తప్పు చేస్తున్నారనే భావన కూడా అందులో ఉంటుంది. కొన్నిసార్లు మీరు చాలా దారుణంగా ప్రవర్తిస్తుంటారనే భావన కూడా కలిగించొచ్చు.
''రిలేషన్‌షిప్‌లో ఏదైనా ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలి. మనందరి అవసరాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. అలా ఉంటేనే అది ఆరోగ్యకరంగా ఉంటుంది. కానీ మీరు చేయకూడని పనిని చేయమని చెప్పాలని అనుకున్నప్పుడు, నా మీద నీకు ప్రేమ లేదు, నువ్వు నాకు కరెక్ట్ కాదు అంటూ పక్కకు నెట్టేస్తుంటారు'' అని ఆమె వివరించారు.
అలాంటి సమయంలో ఇలా చెప్పొచ్చు
''నేను ఇది చేయకపోవడానికి, మీపై ప్రేమకు సంబంధం లేదు. అది నాకు ఇష్టం లేదు. నేను నాలాగా జీవించాలనుకుంటున్నాను''
''అలా చేయడం నాకు ఇబ్బందిగా ఉంది. నేను మిమ్నల్ని ప్రేమిస్తున్నాను. మీరు నాకు ఏదైనా చెప్పొచ్చు. కానీ మీరు చెబుతున్న దానిని నేను నియంత్రించలేను. అది నాకు సరైనది కాదనిపిస్తోంది కాబట్టి నేను చేయను'' అని చెప్పొచ్చని వారెన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నువ్వు తప్ప అందరూ ఒప్పుకుంటారు
తమ దృక్పథాన్ని సమర్థించుకోవడానికి కొందరు మీరు చాలా ఇబ్బందికరమైన, లేదా వివాదాస్పద వ్యక్తి అని నిర్ణయించేలా అలాంటి మాటలు వాడుతుంటారు.
అందరినీ కలిపి మాట్లాడడం ద్వారా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తారు. గ్యాస్‌లైటర్‌గా భావిస్తుంటారు.
అది అందరి నుంచి మిమ్నల్ని ఒంటరిని చేసే ప్రయత్నం. మీకు ఇతరుల సాయం తప్పనిసరి అనే భావన కల్పించేందుకు అలా చేస్తారు. అది నిజం కాదు.
ఎలా తిప్పికొట్టొచ్చు?
''ఇతరుల గురించి కాకుండా మీ గురించి మీరు మాట్లాడితే సంతోషిస్తాను''
ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ గురించి మీరు మాట్లాడుతున్నట్టే, మిమ్మల్ని గ్యాస్‌లైట్ చేస్తున్న వ్యక్తి కూడా అనుకోవాలి. ఒకవేళ వారి జీవితంలో మీ వల్ల ఇబ్బంది ఉన్నట్టయితే దాని గురించి మాట్లాడొచ్చు.
ఇక్కడ అసలు సమస్య ఏంటంటే...
ఇది అసలు సమస్యను పక్కదారి పట్టించే విషయం. మీరు ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నారో దాని నుంచి తప్పుదోవ పట్టించడం.
ఇదో మ్యాజిక్ ట్రిక్. ''నువ్వు దీని గురించి మాట్లాడతావని నాకు తెలుసు. కానీ, అసలు విషయం అది కాదు. దానికి కారణం వేరే ఉందిలే'' అంటూ ఉంటారు.
సమాధానం ఇలా
ఇక్కడ అసలు సమస్యపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంతేకానీ మరో విషయంలోకి వెళ్లొద్దు. పరధ్యానంలో పడకుండా దాని గురించి మాత్రమే మాట్లాడండి.
''నేను దేని గురించైనా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాను. కానీ, ప్రస్తుతం ఉన్న సమస్య ఇదే.''
లేదంటే,
''అది వేరే విషయం. కావాలంటే దాని గురించి మరోసారి మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు సమస్య మాత్రం ఇదే'' అని స్పష్టంగా చెప్పొచ్చు.
ఇవి కూడా చదవండి:
- Live-in relationship: సహజీవనంలో ఉన్నవారికి జన్మించిన పిల్లలకూ పూర్వీకుల ఆస్తిపై హక్కు-సుప్రీం కోర్టు తీర్పుపై ఎవరేమన్నారు
- దూరంగా ఉంటే ప్రేమ పెరుగుతుందా? భార్యాభర్తల బంధం బలపడాలంటే కొంతకాలం ఒకరికొకరు దూరంగా ఉండాలా?
- మనిషి ఒంటి మీద కంటికి కనిపించని గీతలు ఉంటాయని తెలుసా... ఆ రేఖల రహస్యమేంటి?
- మద్యం - గంజాయి: అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే వ్యసనాలకు ఎక్కువగా బానిసలవుతారా?
- ‘నా భర్త మరో మహిళతో నగ్నంగా ఉన్నట్లు ఎడిట్ చేసిన ఫోటోలను తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేశారు’ -లోన్ యాప్ బాధితురాలు














