మాంసం తిన్న తర్వాత 'స్టార్' పురుగు కుడితే మనిషి ప్రాణాలకే ప్రమాదమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మాక్స్ మట్జా
- హోదా, బీబీసీ న్యూస్
ఒక రకమైన పురుగు కుట్టడం వల్ల అరుదైన మీట్ అలర్జీ (మాంసం అలర్జీ)కి గురవుతున్న అమెరికన్ల సంఖ్య పెరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటివరకు దాదాపు నాలుగున్నర లక్షల మంది ఈ అలర్జీకి గురై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇటీవల ఆల్ఫా-గాల్ సిండ్రోమ్(ఏజీఎస్) కేసుల సంఖ్య భారీగా పెరిగినట్లు సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
ఈ అలర్జీ కొన్ని రకాల మాంసం తినేవారికి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.
స్టార్ గుర్తున్న ఈ కీటకం లాలాజలంలో ఆల్ఫా-గాల్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు.
వీటి వెనుక భాగంలో ఉండే తెల్లని మచ్చ ద్వారా ఈ ప్రమాదకర కీటకాలను గుర్తించవచ్చు. అమెరికాలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. అయితే, వాతావరణ మార్పుల కారణంగా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రక్తం పీల్చే ఈ కీటకాలను అంబ్లివొమా అమెరికనమ్‌గా పిలుస్తారు. కొన్ని రకాల జంతువులు, పక్షుల మాంసం తిన్న తర్వాత అవి కుడితే జబ్బులు వచ్చే అవకాశం ఉంది.
ఆల్ఫా-గాల్ సిండ్రోమ్‌కి కారణమయ్యే ప్రమాదకర ఆహార జాబితాలో పంది, ఆవు, కుందేలు, గొర్రె మాంసాలతో పాటు జిలాటిన్, పాలు, పాల పదార్థాలు ఉన్నాయి. కొన్ని ఔషధాలు కూడా ఏజీఎస్‌కి కారణమవుతాయి.
ఏజీఎస్‌కి గురైతే కడుపులో తిప్పడం, డయేరియా, దద్దుర్లు, శ్వాస తీసుకోవడం తగ్గిపోవడం వంటి లక్షణాలను ప్రాథమికంగా గుర్తించొచ్చు. అది ప్రాణాంతకమైన అనాఫిలాక్సిస్‌కి దారితీయొచ్చు. అనాఫిలాక్సిస్‌కు గురైతే శరీరం మొత్తం అలర్జీ వచ్చి, అవయవాలపై ప్రభావం పడుతుంది.
ఈ ఆల్ఫా-గాల్ సిండ్రోమ్ రియాక్షన్స్ అందరిలో ఒకేలా ఉండవు. కొద్దిపాటి నుంచి తీవ్రమైన ప్రభావం చూపించొచ్చని, కొందరిలో ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని సీడీసీ తెలిపింది.
అనాఫిలాక్సిస్ అనేది ప్రాణాలకు హానికలిగించే రియాక్షన్. అది వేర్వేరు అవయవాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అలాంటి వారికి వెంటనే వైద్యం సాయం అందించాల్సి ఉంటుంది.
అయితే, ఆల్ఫా-గాల్ సిండ్రోమ్‌కి గురైన వారందరిలో అలర్జీ లక్షణాలు కనిపించకపోవచ్చని సీడీసీ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
మాంసం నెమ్మదిగా జీర్ణం అవడం వల్ల అలర్జీ లక్షణాలు కనిపించేంత వరకూ ఏజీఎస్‌ను గుర్తించడం కష్టం.
2010 నుంచి సుమారు లక్షా పది వేలకు పైగా ఏజీఎస్ కేసులను గుర్తించినట్లు సీడీసీ తెలిపింది. 2017 నుంచి 2021 మధ్య ఈ అలర్జీ కేసుల సంఖ్య బాగా పెరిగిందని, ఏడాదికి 15 వేల కేసులు నమోదయ్యాయని చెప్పింది.
రోగ నిర్ధారణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, ఇప్పటి వరకూ సుమారు 4 లక్షల 50 వేల మంది ఈ ఆల్ఫా-గాల్ కారణంగా మీట్ అలర్జీకి గురై ఉంటారని సీడీసీ చెబుతోంది.
ఈ అలర్జీపై గతేడాది చేపట్టిన సర్వేలో 1500 మంది డాక్టర్లు, వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. వారిలో సుమారు 42 శాతం మంది ఈ సిండ్రోమ్ గురించి వినలేదని చెప్పారు.
ఈ వ్యాధిని కచ్చితంగా నిర్ధారించలేమని సర్వేలో పాల్గొన్న వారిలో మూడింట ఒకటో వంతు మంది వైద్యులు చెప్పినట్లు సీడీసీ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. కేవలం 5 శాతం మంది మాత్రమే కచ్చితంగా గుర్తించగలమని చెప్పారు.
2008లో క్యాన్సర్ చికిత్స కోసం ఔషధాలను పరీక్షించే సమయంలో అమెరికా పరిశోధకులు దీన్ని గుర్తించారు. అప్పటి వరకు ఈ సిండ్రోమ్ గురించి తెలియదు.
అలాగే, ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రాంతంలో కనిపించే ఇక్సోడెస్ హోలోసైక్లస్ - అకా కూడా ఇదే విధమైన మీట్ అలర్జీలకు కారణమవుతుంది.
ఇక్సోడెస్ హోలోసైక్లస్ - అకా పక్షవాతానికి కారణమయ్యే కీటకం. ఇది శరీరంలోకి పంపే న్యూరోటాక్సిన్లు పక్షవాతాన్ని కలుగజేస్తాయి.
ఇలాంటి పురుగులు రాకుండా తలుపులు సరిగ్గా వేసుకోవాలని, శరీరంపై పురుగు కుట్టిన గుర్తులు ఏమైనా ఉన్నాయేమో తరచూ చూసుకుంటూ ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పురుగులు కుట్టడం వల్ల లైమ్ వ్యాధికి గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. జ్వరం, తలనొప్పి, దద్దుర్లు, అలసిపోవడం ఈ వ్యాధి లక్షణాలు.
కీటకాలను నివారించేందుకు డీఈఈటీ (ఎన్ - డైతిల్ మెటా లొలామైడ్) కెమికల్ ఉత్పత్తులను వాడాలని, లేదంటే మనం వాడే దుస్తులు, ఇతరత్రా వాటిని పెర్మిత్రిన్ రసాయనంతో శుభ్రం చేయాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఎయిడ్స్: అలా చేస్తే ఈ వ్యాధి 2030లోగా అంతం అవుతుందా?
- పెళ్లయినా సెక్స్‌లో పాల్గొనడం లేదా?
- మనుషులకు దూరంగా అడవిలో బతకాలనుకున్నారు, ప్రాణాలు కోల్పోయారు.. కుళ్లిపోయిన స్థితిలో అక్కాచెల్లెళ్లు, అబ్బాయి శవాలు
- హైదరాబాద్ యువతి అమెరికాలో ఎంఎస్ చదివేందుకు వెళ్లి రోడ్డు పక్కన దీనస్థితిలో కనిపించారు... అసలేం జరిగింది?
- రేటింగ్, రివ్యూ, లైక్ ఫ్రాడ్స్: భారతీయుల నుంచి రూ.712 కోట్లు దోచుకున్న చైనా ముఠా, ఆ డబ్బు మిలిటెంట్ సంస్థ హిజ్బొల్లాకు ఎలా చేరింది?














