ఆల్కలీన్ డైట్ అంటే ఏంటి?

పండ్లు, కూరగాయలు

ఫొటో సోర్స్, Getty Images

ఆల్కలీన్ డైట్.. ఆహార్యం, ఆరోగ్యం విషయంలో జరిపే చర్చలలో ఈ మధ్య తరచూ వినిపిస్తున్న మాట ఇది.

వివాదాస్పదమైన ఈ డైట్ సురక్షితమైనదేనా? శాస్త్రీయంగా ఇది శరీరానికి మంచి చేసేదేనా?

ఇలాంటి అనేక ప్రశ్నలకు ఈ కథనంలో సమాధానాలు చూద్దాం..

ఏమీటీ డైట్

ఆల్కలీన్ డైట్ అనేది శరీరం, రక్తం పీహెచ్‌ను మనం తినే ఆహారం ద్వారా మార్చుకోవచ్చనే సిద్ధాంతం ఆధారంగా రూపొందించిన ఆహార ప్రణాళిక.

ఆమ్లం, క్షార గుణాలను స్థాయిని సూచించడానికి వాడే ప్రమాణం పీహెచ్.

అయితే, ఇలా ఆహారంతో శరీరం, రక్తం పీహెచ్ స్థాయిని మార్చగలమా అనేదానికి శాస్త్రీయంగా బలమైన ఆధారాలైతే లేవు.

ఆల్కలీన్ డైట్ ప్రతిపాదిస్తున్నవారు ఏమంటున్నారంటే..

ఆల్కలీన్ డైట్ అనేది ఆరోగ్యానికి మంచిది అనే చెప్పేవారు అందుకు కారణాలు చెప్తున్నారు. ఆధునిక ఆహారం తినేవారి శరీరాల్లో ఆమ్లాలు అధికంగా పేరుకుంటున్నాయని..ఆధునిక ఆహారం ఆర్థరైటిస్, మూత్రపిండాల వ్యాధులు, కాలేయ సంబంధిత సమస్యలు, క్యాన్సర్లకు కారణమవుతోందని చెప్తున్నారు.

మాంసాహారం, గోధుమలు, ఇతర కొన్ని ఆహారధాన్యాలు, రిఫైన్డ్ సుగర్స్, పాల ఉత్పత్తులు, కెఫిన్, ఆల్కహాల్, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటివన్నీ ఆమ్లం ఉత్పత్తి చేసే ఆహారాలని చెప్తున్నారు.

ఆల్కలీన్ ఫుడ్స్‌గా పేర్కొనేవాటిలో పండ్లు, కూరగాయాలు ఉంటాయి.

ఆల్కలీన్ డైట్‌ను నిజానికి కిడ్నీలో రాళ్లు, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లను తగ్గించే లక్ష్యంగా అభివృద్ధి చేశారు. మనం తినే ఆహారాన్ని బట్టి మూత్రం పీహెచ్ మారిపోతుంది కాబట్టి మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల నివారణకు ఆల్కలీన్ డైట్ ముందుకుతెచ్చారు.

కిడ్నీ

ఫొటో సోర్స్, Getty Images

అయితే, ఆల్కలీన్ డైట్ ఏకంగా శరీరం పీహెచ్‌ను మార్చేస్తుందనడానికి ఎలాంటి ఆధారం లేదు.

శరీరంలోని రక్తం పీహెచ్ స్థాయి కిడ్నీల పనితీరుపై ఆధారపడి ఉంటుంది. రక్తం పీహెచ్ పూర్తిగా కిడ్నీల నియంత్రణలోనే ఉంటుంది. అంతేకానీ, తినే ఆహారం వల్ల రక్తం పీహెచ్ మారుతుంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

తినే ఆహారం వల్ల మానవ శరీర పీహెచ్ మారుతుంది అనడానికి సరైన ఆధారాలు లేవు అని ‘క్యాన్సర్ రీసెర్చ్ యూకే’ చెప్పింది.

ఆమ్ల ఆహారం(ఎసిడిక్ డైట్) వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది అనడానికీ ఆధారాల్లేవని చెప్పింది.

ఆల్కలీన్ డైట్ పేరుతో సమతుల ఆహారాన్ని కోల్పోవడం వల్ల నష్టాలు ఉండొచ్చని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.

అయితే, ఆల్కలీన్ డైట్‌లో భాగంగా పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవడం.. ఆహారంలో చక్కెరలు తగ్గించుకోవడం.. ఆల్కహాల్ తగ్గించుకోవడం వంటివన్నీ ఆరోగ్యకరమైన ఆహార ఆలవాట్లకు దగ్గరగా ఉన్నాయి.

బరువు చూసుకుంటున్న వ్యక్తి

ఫొటో సోర్స్, Getty Images

ఆల్కలీన్ డైట్ పనిచేస్తుందా?

మోడర్న్ డైట్‌లో సంతృప్త కొవ్వులు, చక్కెరలు, ఉప్పు ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో మెగ్నీషియం, పొటాషియం వంటి ఆల్కలైజింగ్ మినరల్స్ తక్కువగా ఉంటాయి.

అయినప్పటికీ, ఆల్కలీన్ డైట్‌తో రక్తం పీహెచ్ బ్యాలన్స్ చేస్తూ బరువు మెంటైన్ చేయడం సాధ్యమవుతుందన్న వాదన వివాదాస్పదమవుతోంది.

రక్తం పీహెచ్ స్థాయి 7.35 నుంచి 7.45 మధ్య ఉంటుంది. మానవ శరీర నిర్మాణం, వ్యవస్థే రక్తం పీహెచ్‌ను మెంటైన్ చేస్తుంటుంది.

అయితే, ఆల్కలీన్ డైట్ అంటూ సూచిస్తున్న ఆహారాలు వాస్తవంగా కూడా ఆరోగ్యకరంగా బరువు మెంటైన్ చేయడానికి ఉపయోగపడేవే.

మాంసాహారం తగ్గించడం, ప్రాసెస్డ్ ఫుడ్, రిఫైన్డ్ సుగర్స్, కెఫెని, ఆల్కహాల్ తగ్గించడం.. మొక్కల ఆధారిత ఆహారమైన పండ్లు, కూరగాయలు, గింజలు, నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు మెంటైన్ చేయడంతో పాటు ఆరోగ్యానికి మంచిది.

ఆల్కలీన్ డైట్‌తో ఆరోగ్య ప్రయోజనాలున్నాయా?

ఇలాంటి ఆహారంతో కొన్ని ప్రయోజనాలు ఉండొచ్చు. ప్లాంట్ బేస్డ్ ఫుడ్ సమృద్ధిగా తీసుకోవడం వల్ల పొటాషియం, సోడియం వంటివి శరీరానికి తగినంత అందుతాయి.

దానివల్ల రక్తపోటు అదుపులో ఉండడమే కాకుండా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

ఇక ఆల్కలీన్ డైట్‌తో ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఆస్టియోపోరోసిస్ నుంచి రక్షణ ఉంటుందని ఈ డైట్‌ను సపోర్ట్ చేస్తున్నవారు చెప్తున్నారు.

దీనికి తగినంత ఆధారాలు లేనప్పటికీ ఈ ఆహారంతో శరీరానికి పొటాషియం అధికంగా అందడంతో పాటు ఎసిడిక్ డైటరీ ప్రోటీన్ తక్కువ చేరుతుంది కాబట్టి ఎముకలకు మంచిదే.

ఆల్కలీన్ డైట్ వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేకపోగా ఈ డైట్ కారణంగా శరీరానికి ప్రోటీన్ తగినంత అందక వయోధికులలో ఎముకలు బలహీనమయ్యే ప్రమాదం ఉంది.

ప్రోటీన్ ఫుడ్

ఫొటో సోర్స్, Getty Images

దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం ఉంటుంది?

ఆల్కలీన్ డైట్ ఎక్కువ కాలం తినడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఆ డైట్ ఏ స్థాయిలో తీసుకుంటున్నారు అనేదానిపై ఆధారపడుతుంది.

పూర్తిగా ఆల్కలీన్ డైటే తీసుకుంటుంటే అందులో ఆహార ధాన్యాలు, పాల ఉత్పత్తులు, జంతు సంబంధిత ఆహారం ఉండదు కాబట్టి శరీరానికి కొన్ని రకాల విటమిన్లు, ప్రోటీన్ తగినంత అందకుండాపోతుంది.

ముఖ్యంగా విటమిన్ డి, విటమిన్ బీ12, కాల్షియం, ఐరన్ అందదు.

ఆల్కలీన్ డైట్‌లో ఏమేం లోపిస్తున్నాయో చూసుకుని వాటిని అదనంగా తింటే శరీరానికి సమతులాహారం అందించినట్లవుతుంది.

మందులు, సిరంజ్

ఫొటో సోర్స్, Getty Images

ఆల్కలీన్ డైట్ ఎవరైనా తీసుకోవచ్చా?

సాధారణ ఆహారం కాకుండా నియంత్రిత ఆహార ప్రణాళికలు పాటించాలనుకుంటే గర్భిణులు, పాలిచ్చే మహిళలు, మధుమేహ వ్యాధిగ్రస్థులు, ఇతర కొన్ని వ్యాధులతో బాధపడేవారు వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవాలి.

ఇలాంటి నియంత్రిత ఆహారం యువత, పిల్లలకు మంచిది కాదు. కొన్ని రకాల ఆహార సమూహాలను తొలగిస్తే పెరుగుదలకు అవసరమైన కీలక పోషకాలు శరీరానికి అందకుండాపోతాయి.

పాల ఉత్పత్తులు వంటివి పూర్తిగా మానేస్తే కాల్షియం సహా మరికొన్ని పోషకాలు అందవు.

కాబట్టి ఆల్కలీన్ డైట్ తీసుకునేవారు అందులో ఏమేం పోషకాలు అందడం లేదో వాటిని భర్తీ చేసుకునేందుకు తగిన ఆహారం తినాలి.

దీర్ఘకాలిక వ్యాధులు, క్రిటికల్ ఇల్‌నెస్‌తో ఇబ్బందిపడేవారు అందుకు తగిన ఆహారం తీసుకోవాలి. ఆల్కలీన్ డైట్ అందుకు సరిపోతుందో లేదో తెలుసుకుని ముందుకుసాగాలి.

( గమనిక: ఆల్కలీన్ డైట్‌కు సంబంధించిన ఈ కథనం స్థూల అవగాహనకు మాత్రమే. డైటీషన్ కానీ వైద్యుడి సలహా కానీ తీసుకుని నిర్ణయం తీసుకోవాలి )

వీడియో క్యాప్షన్, పేలుడు ధాటికి రెండు ముక్కలైన రోడ్డు, పేలుడుకు కారణమేంటో తెలియదు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)