కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....

శవాన్ని మోస్తున్న సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాండీ జోయ్ షాహ్
    • హోదా, బీబీసీ న్యూస్

అయిదేళ్లుగా జరుగుతున్న యుద్ధంతో కామెరూన్‌లోని బమెండా నగరం దాదాపుగా శిథిలమైంది.

అక్కడ ఇళ్లు ఖాళీ అవుతుంటే స్మశానాలు నిండిపోతున్నాయి.

ఇంగ్లిష్ మాట్లాడే గ్రూపులు, ఫ్రెంచ్ మాట్లాడే ప్రభుత్వం మధ్య సాగుతున్న పోరులో అంత్యక్రియల వ్యాపారం పెరుగుతోంది. శవపేటికల కోసం ఆర్డర్లు పెరిగిపోతున్నాయి.

బమెండాలో శవాలు ఎక్కడక పడితే అక్కడ కనిపిస్తాయి. వీధులు, కాలువలు, నదులు ఇలా అన్ని చోట్ల శవాలను విసిరేస్తారు. ఆ నగరంలో పని చేసే కార్మికులు ఆ శవాలకు ఖననం చేస్తారు.

అయితే ఒకనాటి మాదిరిగా కాస్త ఖరీదైన, విలాసవంతమైన శవపేటికలకు నేడు డిమాండ్ తగ్గిపోయింది. తక్కువ ధరలో దొరికే శవపేటికలకు గిరాకీ బాగా పెరిగింది.

ఒకప్పుడు బైబిలు, కార్లు, బీరు సీసాలు వంటి వాటి ఆకారంలో శపేటికలను చేయించుకునేవారు. కొందరు చనిపోయే ముందు శవపేటిక ఎలా ఉండాలో చెబుతారు.

ప్రజల ఆసక్తుల ఆధారంగా శవపేటికలను తయారు చేయడం, వాటి మీద రకరకాల డిజైన్లు వేయడం చేసేవారు. కానీ అదంతా గతం. నేడు 1,500 డాలర్ల కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.

ఖాళీ వీధి

ఫొటో సోర్స్, Getty Images

కామెరూన్ నార్త్-వెస్ట్, సౌత్-వెస్ట్ ప్రాంతాలలో యువకులు, పిల్లలకు తరచూ అంత్యక్రియలు చేయాల్సి వస్తోందంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

యుద్ధం తలెత్తిన అయిదేళ్లలో వేల మంది చనిపోయారు. సుమారు పది లక్షల మంది ఫ్రెంచ్ మాట్లాడే ప్రాంతాలకు పారిపోయారు. మరొక 80వేల మంది పక్కనున్న నైజీరియాలో తలదాచుకున్నారు.

ఈ అంతర్యుద్ధానికి బీజాలు బ్రిటిష్, ఫ్రెంచ్ వలసల పాలనలో పడ్డాయి. నాడు బ్రిటిష్ పాలనలోని ప్రాంతాలను, ఫ్రెంచ్ పాలనలోని ప్రాంతాలను కలిపి కామెరూన్ దేశాన్ని స్థాపించారు.

1884లో జర్మనీ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. 1916లో బ్రిటిష్, ఫ్రెంచ్ సేనలు జర్మనీ సైన్యాన్ని తరిమికొట్టాయి. మూడేళ్ల తరువాత 80శాతం భూభాగాన్ని ఫ్రాన్స్ తీసుకోగా, 20శాతం బ్రిటన్ అధీనంలోకి వెళ్లింది.

1960లో ఫ్రెంచ్ పాలనలోని కామెరూన్‌కు విముక్తి లభించింది. ఆ తరువాత రెఫరెండం పెట్టి, కామెరూన్‌లో బ్రిటన్ పాలనలోని సౌత్ కామెరూన్‌ను కలిపారు. నార్త్ కామెరూన్‌ను నైజీరియాలో విలీనం చేశారు.

ఏడుస్తున్న మహిళ
ఫొటో క్యాప్షన్, తన కుమారున్ని పోలీసులు కాల్చి చంపారని ఈ మహిళ చెబుతున్నారు.

ఫ్రెంచ్ మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఇంగ్లిష్ మాట్లాడే వారు మైనారిటీలు అయ్యారు. ఫ్రెంచ్ మెజారిటీ ప్రభుత్వాలు తమ ఉనికి మీద దెబ్బకొడుతున్నాయని ఇంగ్లిష్ మైనారిటీలు భావిస్తున్నారు.

తమ సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, భాష, చరిత్ర వంటి వాటిని మార్చేలా ఫ్రెంచ్ మెజారిటీ ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను వారు వ్యతిరేకిస్తున్నారు.

ఇలా రెండు వర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి.

కానీ 2016లో ఇంగ్లిష్ మాట్లాడే వారి ప్రాంతాల్లోని పాఠశాలలు, కోర్టుల్లో ఫ్రెంచ్ భాషను వాడాలని ప్రభుత్వం చెప్పడంతో నిరసనలు పెరిగాయి.

బమెండాలో వేల మంది వీధుల్లోకి వచ్చారు. అక్కడ ఇంగ్లిష్ అధికారిక భాష అయినప్పటికీ ప్రభుత్వ సమాచారాన్ని ఆ భాషలో ప్రచురించకపోవడం కూడా ఘర్షణకు కారణమైంది.

బమెండాలో నిరసనలను అణచివేసేందుకు ప్రభుత్వం భద్రతా దళాలను రంగంలోకి దింపింది. నిరసనకారులతో చర్చలు మాత్రం జరపలేదు.

భద్రతా దళాల రాకతో బమెండాలోని ఇంగ్లిష్ యువకులు ఆయుధాలు పట్టారు. ఇంగ్లిష్ మాట్లాడే ప్రాంతాలను కలిపి స్వతంత్ర దేశంగా గుర్తించాలంటూ వారు డిమాండ్ చేయడం ప్రారంభించారు. అలా అంతర్యుద్ధం మొదలైంది.

సైనిక వాహనాలు, బూట్ల కవాతులు ఈ ప్రాంతంలో నిత్యకృత్యం అయ్యాయి.

‘సైనికులు ఇళ్లలోకి చొరబడతారు. అరెస్టులు చేస్తారు. మార్కెట్లను తగులబెడతారు. వేర్పాటు వాదులతో చేతులు కలిపితే మీకూ ఇలాంటి దుస్థితే వస్తుందని హెచ్చరించేందుకు, తిరుగుబాటుదారుల శవాలను బహిరంగంగా ఊరేగిస్తారు’ అని స్థానికులు చెబుతున్నారు.

ఈ ఘర్షణలో ప్రభుత్వ బలగాలు కూడా చాలా నష్టపోయాయి.

యుద్ధంలో చనిపోయిన సైనికుల శవాలను ప్రతి గురువారం, శుక్రవారం మార్చూరీల నుంచి బయటకు తీస్తారు. కామెరూన్ దేశ జాతీయ జెండాను చుట్టిన ఆ శవపేటికల ముందు నిలబడి, చనిపోయిన సైనికుల భార్యలు ఏడుస్తారు. ఆ తరువాత శవపేటికలను భూమిలో పూడ్చుతారు.

వేర్పాటువాదులు కూడా ప్రజలను హింసిస్తున్నారనే పేరు వచ్చింది. సైనికులకు సహకరించినందుకు ఆడవారిని హింసించడం, వారి తలలు తీసేయడం వంటివి చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు తీసి బయటకు విడుదల చేస్తున్నారు. సైనికులకు సాయం చేసే వారి పరిస్థితి ఇలా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

వరుసలో నిలబడి ఉన్న మహిళలు

వేర్పాటువాదులకు బాగా పట్టున్న ఈ ప్రాంతాల్లో సైనికులు ఆచితూచీ అడుగులు వేస్తారు. ప్రధాన వీధుల గుండా వారు ప్రయాణించరు. సైన్యం ఆదేశాల మేరకు రాత్రి పూట రెస్టారెంట్లు, బార్లు, క్లబ్బులు వంటివి మూసేస్తారు.

స్కూళ్లను మూసేయాల్సిందిగా నాలుగేళ్ల కిందట వేర్పాటు వాదులు ఆదేశించారు. కానీ కొన్ని స్కూళ్లు నేటికీ నడుస్తున్నాయి. పిల్లలు మాత్రం యూనిఫాం వేసుకుని రావడానికి భయపడుతున్నారు.

ఒకప్పుడు ఇతర దేశాల్లో ఉండే బమెండాకు చెందిన ప్రజలు తరచూ ఇక్కడకు వస్తూ ఉండేవారు. ఇక్కడ ఆర్థికవ్యవస్థకు వారు విదేశాల నుంచి పంపే డబ్బు కూడా ముఖ్యమే. కానీ నేడు అంతర్యుద్ధం వల్ల వాళ్లు రావడం దాదాపుగా మానేశారు.

వేర్పాటు వాదులకు విదేశాల నుంచి డబ్బులు అందుతున్నట్లు ప్రభుత్వ అధికారులు ఆరోపిస్తున్నారు.

బమెండాను సందర్శించే ప్రవాసీలను అరెస్టు చేస్తున్నారు. కొందరు కనిపించకుండా పోతున్నారు. దాంతో విదేశాల్లో ఉండే బమెండా ప్రజలు రావడం మానేశారు. వాళ్లు రాకపోవడం, డబ్బులు పంపడం తగ్గిపోవడంతో ఇక్కడ ఆర్థికవ్యవస్థ మరింత పతనమైంది.

‘ప్రస్తుతం కడుపు నిండటమే కష్టమవుతోంది. ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియదు. ఈరోజు మీతో మాట్లాడిన వ్యక్తి రేపు చనిపోవచ్చు’ అని స్థానికుడు పీటర్ షాంగ్ అన్నారు.

సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

ఇంతటి కష్టంలోనూ చిన్నచిన్న సంతోషాలు కూడా ఉన్నాయి.

యుద్ధం తెచ్చిన కర్ఫ్యూ వల్ల నేడు మేరీ క్లెయిర్ భర్త సమయానికి ఇంటికి వస్తున్నాడు.

‘ఇంతకు ముందు ఆయన రోజూ తాగి, అర్ధరాత్రి వచ్చి పడుకునే వాడు. పిల్లలను అసలు పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడు సమయానికి ఇంటికి వస్తున్నాడు. పిల్లలతో ఆడుకుంటున్నాడు. వారికి చదువు చెబుతున్నాడు. ఈ యుద్ధం మమ్మల్ని దగ్గర చేసింది’ అని మేరీ అంటున్నారు.

బమెండాలో తుపాకీ మోతల మధ్యే జీవితం నడుస్తూ ఉంటుంది.

‘తుపాకుల శబ్దాలకు భయపడి పరిగెడితే, మాకు తిండి ఎలా దొరుకుతుంది? పిల్లలకు ఏం పెట్టాలి? కాల్పులు జరిగేటప్పుడు దాక్కుంటాం. ఆగిపోగానే తిరగి పనిలోకి పోతాం’ అని ఒక కూరగాయల వ్యాపారి అన్నారు.

‘నా కూతురికి ఏడేళ్లు. తనకి తుపాకీ కాల్పులు చాలా సాధారణమై పోయాయి. కాల్పులు జరిగేటప్పుడు ఎవరు కాలుస్తున్నారో తను చెప్పగలదు. కాల్చేది సైనికుల మెషిన్‌ గన్లా లేక వేర్పాటువాదుల ఏకే-47 తుపాకులా? అనేది కూడా నా బిడ్డ చెబుతుంది’ అని ఒక మహిళ చెప్పారు.

యుద్ధం వల్ల టీనేజీ యువతుల్లో అవాంఛిత గర్భాలు పెరిగిపోతున్నాయి. ఇంటి నుంచి పారిపోయి నిరాశ్రయులైన అమ్మాయిలను అటు సైనికులు, ఇటు వేర్పాటువాదులు లైంగికంగా హింసిస్తున్నారు.

‘ఇక్కడ రేప్ అనేది యుద్ధంలో వాడే ఒక ఆయుధం’ అని ఒక నన్ ఆగ్రహంతో అన్నారు. దగ్గర్లోని అనాథాశ్రమానికి వెళ్లేందుకు ఆమె ట్యాక్సీ కోసం ఎదురు చూస్తున్నారు.

పట్టణంలోని ప్రతి మలుపులోనూ యుద్ధం తాలుకూ విధ్వంసం కనిపిస్తూ ఉంటుంది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)