రోమియో జూలియట్:‘‘బలవంతంగా మాతో నగ్నంగా నటింపజేశారు’’- 70 ఏళ్ల వయసులో కేసు వేసిన హీరో హీరోయిన్లు

రోమియో అండ్ జూలియట్ సినిమా సీన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, స్టీవ్ మైకింటోస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘రోమియో అండ్ జూలియట్’... 1968లో వచ్చిన హాలీవుడ్ సినిమా.

లియోనార్డ్ వైటనింగ్, ఒలివియా హసీ ఆ సినిమాలో జంటగా నటించారు. నాడు లియోనార్డ్ వయసు 16ఏళ్లు కాగా ఒలివియా వయసు 15ఏళ్లు.

‘రోమియో అండ్ జూలియట్’ సినిమా షూటింగ్ సందర్భంగా ‘నగ్న’ దృశ్యాల్లో నటించేలా తమను బలవంతంగా ఒప్పించారంటూ నేడు ఆ నటులు ఆరోపిస్తున్నారు. తాము లైంగిక వేధింపులకు కూడా గురైనట్లు నిర్మాణ సంస్థ ‘పారామౌంట్ పిక్చర్స్’ మీద వారు దావా వేశారు.

ఇప్పుడు లియోనార్డ్, ఒలివియా ఇద్దరూ 70వ పడిలో ఉన్నారు.

రోమియో అండ్ జూలియట్ సినిమా సీన్

ఫొటో సోర్స్, Getty Images

వివాదం ఏంటి?

‘రోమియో అండ్ జూలియట్ సినిమా షూటింగ్ సందర్భంగా నగ్నంగా ఉండే ఒక బెడ్ రూం సీన్ తీయాలని ఆ సినిమా డైరెక్టర్ ఫ్రాంకో జెఫ్ఫిరెల్లీ భావించారు.

అయితే ఆ న్యూడ్ సీన్ తీసేందుకు లియోనార్డ్, ఒలివియా నగ్నంగా కనిపించాల్సిన అవసరం లేదని ముందు ఫ్రాంకో వారికి హామీ ఇచ్చారు.

స్కిన్ కలర్ అంటే చర్మం రంగులో ఉండే దుస్తులతో ఆ నగ్న దృశ్యాలను రికార్డు చేస్తామని చెప్పారు.

కానీ ఆ మరుసటి రోజు ఫ్రాంకో మాట మార్చారు. లియోనార్డ్, ఒలివియా నగ్నంగా నటించాల్సిందేనని...లేదంటే సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పారు. సినిమా ఫెయిల్ అయితే కోట్ల రూపాయలు వృథా అవుతాయని అన్నారు.

బెడ్ రూమ్ సీనులో కెమెరాలు ఎక్కడ పెడతారో లియోనార్డ్, ఒలివియాకు ఫ్రాంకో చూపించారు. నగ్న దృశ్యాలు సినిమాలో కనపడకుండా చూస్తామని డైరెక్టర్ తెలిపారు.

కానీ చివరి క్షణంలో అలా డిమాండ్ చేయడంతో లియోనార్డ్, ఒలివియాలకు నగ్నంగా నటించడం తప్ప మరొక మార్గం లేకుండా పోయింది.

కానీ రహస్య కెమెరాలతో లియోనార్డ్, ఒలివియాలను నగ్నంగా చిత్రీకరించారు. వారికి అనుమతి లేకుండా మైనర్లను అలా చిత్రీకరించడం అనేది చట్ట విరుద్ధం. ఈ విషయం నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్‌కు కూడా తెలుసు.

అలా బలవంతంగా నగ్న దృశ్యాల్లో నటించేలా ఒప్పించడం, వేధింపులకు గురి చేయడం వల్ల లియోనార్డ్, ఒలివియా మానసికంగా కుంగి పోయారు. ఎమోషనల్ గాను బాగా డిస్టర్బ్ అయ్యారు. అది శారీరక ఆరోగ్యం మీదా ప్రభావం చూపింది.

చికిత్స కోసం లియోనార్డ్, ఒలివియాలు ఎంతో డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. వారు ఎన్నో సినిమా అవకాశాలు కోల్పోయారు. కాబట్టి వారికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు 500 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించేలా ఆదేశించాలి’ అని పిటిషన్ పేర్కొంది.

రోమియో అండ్ జూలియట్ సినిమా సీన్

ఫొటో సోర్స్, Getty Images

‘ఫ్రాంకో మోసం చేశాడు’

సినిమాలో లియోనార్డ్ వీపు భాగం, ఒలివియా రొమ్ములు కనిపించాయి. డైరెక్టర్ ఫ్రాంకో తమను మోసం చేశాడని వారు ఆరోపిస్తున్నారు.

నాడు నటులు మైనర్లు కాబట్టి నగ్నంగా చిత్రీకరించడం కాలిఫోర్నియా చట్టాలకు విరుద్ధమని లియోనార్డ్, ఒలివియా తరపున న్యాయవాది వాదించారు.

తమ కెరియర్ ప్రమాదంలో పడుతుందనే భయంతో నాడు కేసు వేయలేదని లియోనార్డ్, ఒలివియాల మేనేజర్ టోనీ మరినోజీ తెలిపారు.

‘నాడు చెప్పినా నమ్మేవారు లేరు. నేడు అన్యాయం మీద గొంతు ఎత్తడానికి మీటూ వంటి ఉద్యమ వేదికలు ఉన్నాయి. కానీ నాడు అలాంటివి లేవు. అందువల్ల వారు ఇంత కాలం మౌనంగా ఉన్నారు’ అని టోనీ అన్నారు.

‘మైనర్లను నగ్నంగా చిత్రీకరించడం కానీ ఆ దృశ్యాలను బహిరంగంగా చూపించడం కానీ నేరం. 1960లలో ఇద్దరూ చిన్న వయసులో ఉన్నారు. ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు. (నగ్న దృశ్యాల వల్ల) ఒక్కసారిగా వారు ఫేమ్ అయ్యారు. తమకు అలా జరుగుతుందని పిల్లలుగా వారు ఊహించుకోలేదు. వారికి ఏం చేయాలో తెలియలేదు’ అని వారి లాయర్ సాలమన్ గ్రేయసన్ తెలిపారు.

‘రోమియో అండ్ జూలియట్’ సినిమా దర్శకుడు ఫ్రాంకో కొన్నేళ్ల కిందట మరణించారు.

రోమియో అండ్ జూలియట్ సినిమా సీన్

ఫొటో సోర్స్, Getty Images

గతంలో సమర్థించిన ఒలివియా

నేటు పిటిషన్ వేసిన ఒలివియా గతంలో ఆ నగ్న దృశ్యాలను సమర్థిస్తూ మాట్లాడారు.

2018లో హాలీవుడ్ ఫిలిం మ్యాగజైన్ వెరైటీతో మాట్లాడుతూ... ‘నా కంటే ముందు ఎవరూ ఆ వయసులో అలాంటి సీన్‌లో నటించలేదు. ఫ్రాంకో ఆ సీన్‌ను చాలా బాగా తీశారు. అది సినిమాకు ఎంతో అవసరం’ అని ఒలివియా అన్నారు.

‘అలాంటి (న్యూడ్) సీన్లను అమెరికాలో తప్పుగా చూస్తారు. కానీ యురోపియన్ సినిమాల్లో నగ్నత్వం అనేది చాలా సహజమైన అంశం. అలా (న్యూడ్) నటించడం పెద్ద కష్టమేమి అనిపించలేదు. నగ్నంగా నటించేటప్పుడు లియోనార్డ్‌ కూడా ఇబ్బంది పడలేదు. కాసేపటి తరువాత మేం దుస్తులు వేసుకోలేదనే విషయమే మేం మరచి పోయాం’ అని ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ గతంలో ఆమె చెప్పారు.

నాడు ఆ సినిమా చాలా పెద్ద హిట్. నాలుగు విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్ అయింది. బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ కాస్టూమ్ డిజైన్ విభాగాల్లో రెండు ఆస్కార్లు గెలుచుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)