గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటి? నీటి నుంచి ఎలా ఉత్పత్తి చేస్తారు?
దాదాపు 50 లక్షల ఏళ్ల కింద మానవజాతి రెండు కాళ్లపైన నడవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కొన్ని లక్షల సంవత్సరాల పాటు మనిషి కాలినడక మీదనే ఆధారపడ్డాడు.
ఆ తర్వాత జంతువులను మచ్చిక చేసుకున్నాడు. పడవలు తయారు చేశాడు. గుర్రాలు, పడవలు ప్రపంచ గమనాన్నే కొత్తగా మార్చేశాయి.
గుర్రాలు రాజ్యాల సరిహద్దుల్ని చెరిపేస్తే, నౌకలతో కొత్త రాజ్యాలు కనుక్కున్నాడు.
ఇక మానవ ఆవిష్కరణల్లో అత్యుత్తమమైనదిగా చెప్పుకునే పెట్రోల్.. ప్రపంచ గతిరీతుల్ని అనూహ్యంగా మార్చేసింది.
కానీ పెట్రోల్ కనుక్కున్న వందల ఏళ్ల తర్వాత కూడా దాని ప్రత్యామ్నాయం గురించి పెద్దగా ఆలోచనలు చెయ్యలేదు.
అయితే ఇప్పుడు కాలుష్యం, ఇంధన ధరలు, ఇతర అంశాలు.. మనల్ని ప్రత్యామ్నాయాల వైపు పరుగులు పెట్టిస్తున్నాయి.
శిలాజ ఇంధనాలకు బదులుగా ఏం వాడొచ్చనే ప్రశ్నకు సమాధానంగా కనిపిస్తోంది క్లీన్ హైడ్రోజన్.

ఫొటో సోర్స్, Getty Images
గ్రీన్ హైడ్రోజన్ మిషన్
భారత్‌ను గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మార్చేందుకు 22వేల కోట్ల రూపాయలతో చేపట్టనున్న నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
2030 నాటికి కనీసం ఐదు మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది పది మిలియన్ టన్నులకు చేరుకుంటే ఎగుమతులు కూడా చేయవచ్చు.
2030 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు, స్వచ్ఛమైన ఇంధనాన్ని అందించడం ఈ మిషన్ లక్ష్యం.
గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటి?
గ్రీన్ హైడ్రోజన్ స్వచ్ఛమైన శక్తి. సోలార్ పవర్ వంటి పునరుత్పాదక శక్తిని ఉపయోగించి నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విభజించడం ద్వారా దీనిని ఉత్పత్తి చెయ్యవచ్చు. నీటి ద్వారా విద్యుత్‌ను పంపినప్పుడు హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది.
ఈ హైడ్రోజన్ అనేక సందర్భాలలో శక్తిగా పని చేస్తుంది. హైడ్రోజన్‌ను తయారు చేయడానికి ఉపయోగించే విద్యుత్తు పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే వస్తుంది. కాబట్టి ఇది పూర్తిగా కాలుష్య రహితం. అందుకే దీనిని గ్రీన్ హైడ్రోజన్ అంటున్నారు.
చమురు శుద్ధి, ఎరువులు, ఉక్కు, సిమెంట్ వంటి కార్బన్ రహిత భారీ పరిశ్రమలకు ఇది సహాయపడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
ఈ మిషన్ ద్వారా ఉత్పత్తి చేసే కర్బన రహిత హైడ్రోజన్‌ను వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు.
2030 నాటికి 125 గిగా వాట్స్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలన్నది ఈ మిషన్ లక్ష్యం.
రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షల ఉద్యోగాలు
ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం కేటాయించిన 22వేల కోట్ల రూపాయల్లో ఎక్కువ భాగం అంటే. 17,490 కోట్ల రూపాయలు స్ట్రాటజిక్ ఇన్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్- సైట్ కోసమే ఖర్చు చేయనున్నారు.
పైలట్ ప్రాజెక్టుల కోసం 1446 కోట్లు, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు 400 కోట్లు, ఇతర విభాగాల కోసం 388 కోట్లరూపాయలు కేటాయించారు.
ప్రాజెక్టు అమలుకు సంబంధించి మార్గదర్శకాలను కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ జారీ చేస్తుందన్నారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్.
ఈ ప్రాజెక్టు ద్వారా 2030 నాటికి 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, వీటి ద్వారా 6 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అంచనా.
దీనివల్ల లక్ష కోట్ల రూపాయల విలువైన చమురు దిగుమతులను తగ్గించుకోవచ్చని, 50 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను అదుపు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ‘‘తప్పుడు కేసులో జైలుకు పంపి సెక్స్‌కు దూరం చేశారు.. రూ. 10 వేల కోట్లు పరిహారం ఇవ్వాలి’’ - ప్రభుత్వంపై కేసు
- తెలంగాణ: గణేశ్ చందా ఇవ్వనందుకే టీచర్‌ను వివాదంలోకి లాగారా... బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- చెంఘిజ్ ఖాన్ ఓ బండి నిండా పురుగులను వెంటబెట్టుకుని ఎందుకు తిరిగేవాడు?
- జోషిమఠ్: ఈ హిమాలయ నగరం ఎందుకు కుంగిపోతోంది? జనం ఎందుకు ఇళ్లు వదిలి పోతున్నారు?
- మైనర్ హిందూ బాలిక ‘కిడ్నాప్, మతమార్పిడి, వివాహం’.. పాకిస్తాన్లో ఆందోళనలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



