తెలంగాణ: గణేశ్ చందా ఇవ్వనందుకే టీచర్‌ను వివాదంలోకి లాగారా... బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

టీచర్ మల్లికార్జున్

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

తెలంగాణలో నాస్తికుడైన ఒక దళిత ఉపాధ్యాయుని చేత ‘బలవంతంగా’ హిందుత్వ సంఘాలు, బీజేపీ కార్యకర్తలు క్షమాపణలు చెప్పించడం వివాదంగా మారింది.

నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి హై స్కూలులో తెలుగు ఉపాధ్యాయునిగా మల్లమారి మల్లికార్జున్ అనే వ్యక్తి పని చేస్తున్నారు. ఆయన దళిత సముదాయానికి చెందినవారు.

స్కూల్లో హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా మల్లికార్జున్ బోధిస్తున్నాడంటూ ఈ నెల 2వ తేదీన హిందుత్వ సంఘాలకు చెందిన కొందరు వ్యక్తులు, బీజేపీ కార్యకర్తలు కోటగిరి హై స్కూలు వద్దకు నిరసనకు దిగారు. మల్లికార్జున్ క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు.

మల్లికార్జున్‌ను ‘బలవంతంగా’ తీసుకొని వెళ్లి దగ్గర్లోని హనుమాన్ ఆలయంలో పూజలు చేయించి, ఆయన చేత ‘బలవంతంగా’ క్షమాపణలు చెప్పించారు అని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి.

టీచర్ మల్లికార్జున్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, టీచర్ మల్లికార్జున్

అసలు వివాదం ఏంటి?

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో మారుమూలన ఉండే ప్రాంతం కోటగిరి. ఇది నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కోటగిరిలో జిల్లా పరిషత్ పాఠశాలకు శంకుస్థాపన చేశారు.

ఆ పాఠశాలలోనే నేడు దళితవర్గానికి చెందిన మల్లమారి మల్లికార్జున్ గత నాలుగేళ్లుగా తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.

పోయిన ఏడాది అంటే 2022 అగస్టు నెలలో కోటగిరి జిల్లా పరిషత్ హై స్కూల్‌కు వినాయక చందాల కోసం కొంత మంది యువకులు వచ్చారు. కానీ నాస్తికుడైన మల్లికార్జున్ చందా ఇచ్చేందుకు నిరాకరించారు.

‘నేను నాస్తికున్ని అని చెప్పాను. నాస్తికుడివైతే.. దేవున్ని నువ్వు నమ్మవా? దేవుడు లేనిది నీకు చదువెట్లా వచ్చింది’ అని ఆ యువకులు నాడు నన్ను ప్రశ్నించారు అని మల్లికార్జున్ తెలిపారు. వాళ్లకు సమాధానం చెప్పే క్రమంలో ‘సరస్వతిని నమ్ముకుంటేనే చదువొస్తదా? అమెరికా లాంటి దేశాల్లో సరస్వతిని నమ్మట్లేదు కదా? వాళ్లకు చదువురావట్లేదా?’ అని ఉదాహరణగా చెప్పాను అని ఆయన అన్నారు.

ఈ ఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత నాడు మల్లికార్జున్ మాట్లాడిన మాటలు ఇటీవల బయటకు వచ్చాయి. దీంతో హిందుత్వ సంఘాలకు చెందిన కొందరు ఈ నెల 2న కోటగిరి హై స్కూలుకు వెళ్లి మల్లికార్జున్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

స్కూలు హెడ్ మాస్టర్, మండల విద్యాధికారి(ఎమ్‌ఈఓ) వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ హిందుత్వ సంఘాలకు చెందిన వారు బడి ముందు కూర్చొని తెలుగు టీచర్ మల్లికార్జున్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ మతం, హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా పిల్లలకు మల్లికార్జున్ పాఠాలు చెబుతున్నారని వారు ఆరోపించారు.

ఈ క్రమంలో మల్లికార్జున్ స్కూల్ ఎదుట, హిందుత్వ సంఘాల వారికి క్షమాపణలు చెప్పారు. ఆ తరువాత మల్లికార్జున్‌ను ఊరేగింపుగా తీసుకెళ్లి కోటగిరి గ్రామంలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేయించడంతోపాటు ‘జై శ్రీరాం’ నినాదాలు చేయించారు. మల్లికార్జున్ నుదుటన బొట్టు పెట్టి క్షమాపణలు చెప్పించారు. అందుకు సబంధంచిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరగడం గమనార్హం.

విద్యార్థులు

‘ఊరు దాటవని బెదిరించారు’

ఈ వివాదం తలెత్తిన కోటగిరి హై స్కూల్‌కు బీబీసీ వెళ్లింది.

తన నమ్మకాలకు వ్యతిరేకంగా బలవంతంగా తనతో క్షమాపణలు చెప్పించారని తెలుగు ఉపాధ్యాయుడు మల్లికార్జున్ అంటున్నారు.

‘సారీ చెప్పకపోతే ఈ స్కూలు దాటలేవు. ఈ గేటు కూడా దాటలేవు. గ్రామ దేవత బారెడు పోశమ్మను కూడా దాటలేవని బెదిరించారు. వారు ఏ క్షణంలోనైనా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి సందర్భంలో వివాదం పెద్దది చేసుకోవడం ఇష్టం లేక బలవంతంగానే తప్పు జరిగిందని క్షమాపణ కోరాను. అక్కడి పరిస్థితుల వల్లే నేను క్షమాపణ కోరాల్సి వచ్చిందే తప్ప నేను నిజంగా తప్పు చేసినట్టు కాదు.

కానీ స్కూలు దగ్గర చెబితే సరిపోదు. నువ్వు దేవున్ని నమ్మను అన్నావు కాబట్టి, గుడిలోకి వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే అంటూ బలవంతంగా నెట్టుకుంటూ హనుమాన్ గుడికి నన్ను తీసుకెళ్లారు. అక్కడ భజన చేయించి, బొట్టు పెట్టి మరోసారి క్షమాపణ చెప్పించారు.

నేను సరస్వతిని మొక్కొద్దని గానీ, పూజ చేయొద్దని కానీ ఎక్కడా చెప్పలేదు. క్లాసులోనే కాదు క్లాసు బయట కూడా చెప్పలేదు’ అని మల్లికార్జున్ బీబీసీతో అన్నారు.

‘హిందూ వ్యతిరేక భావాలు పెంచుతున్నారు’

హిందూ దేవుళ్లకు ‘వ్యతిరేకంగా’ గతంలో వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆ వీడియోలు నేడు బయటకు వస్తున్నాయి కాబట్టి, వారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని బీజేపీ నేతలు అంటున్నారు.

‘స్కూలులో హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా టీచర్ మల్లికార్జున్ విద్యార్థులకు బోధిస్తున్నందుకే ఆందోళనకు దిగాం. ఆయనతో బలవంతంగా క్షమాపణలు చెప్పించలేదు. ఇష్టపూర్వకంగానే హనుమాన్ ఆలయానికి వచ్చారు’ అని వారు అంటున్నారు.

‘వృత్తిరీత్యా పాఠాలు చెప్పాల్సిన టీచర్, హిందూ దేవతలను ఎలా దూషిస్తారు? దేశంలో చాలా స్కూళ్లలో టీచర్లు, గ్రామస్తులు కలిసి సరస్వతి దేవి విగ్రహాలను ప్రతిష్టిస్తుంటారు. ఆయన సరస్వతి దేవిని దూషించారు. దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి.

క్రైస్తవ మిషనరీలు ఇప్పుడు స్కూళ్లలోకి ప్రవేశించాయి. ఉపాధ్యాయులు ఈ రకంగా తయారైతే ఎట్లా?

రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలన్నీ హిందు దేవతలు, అయ్యప్ప స్వామి, సరస్వతి చుట్టూ తిరుగుతున్నాయి. అక్కడ భైరి నరేష్, రాజేష్ ఇక్కడ ఈ టీచర్. అందరి వీడియోలు బయటకొస్తున్నాయి. ఇతనిది కూడా వచ్చింది. అందుకే ఇప్పుడు క్షమాపణలు అడగాలని కోరాం.

దైవానికి సంబంధించిన అంశంలో వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి, దైవసన్నిధిలో క్షమాపణ చెప్పాలని అడిగాం. దానికి అతను అంగీకరించాడు. మేం బలవంతం చేయలేదు’ అని కోటగిరి మండలం బీజేపి నాయకుడు కాపుగాండ్ల శ్రీనివాస్ బీబీసీతో అన్నారు.

కోటగిరి స్కూలు హెడ్ మాస్టర్

పాఠశాల హెడ్ మాస్టర్ ఏమంటున్నారు?

కోటగిరి హై స్కూలులో 600 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. సుమారు 30 మంది టీచర్లు పని చేస్తున్నారు.

‘దేవతలను కించపరుస్తూ మా స్కూలులో ఎక్కడా బోధన జరగడం లేదు. మల్లికార్జున్ టీచర్ కూడా అలాంటి విషయాలేవీ విద్యార్థులకు చెప్పలేదు. నేను క్లాసుల్లో విద్యార్థులను ఎంక్వైరీ కూడా చేశాను. అలాంటిదేమీ జరగలేదు.

తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఇక్కడ పాఠాలు చెబుతారు. వివిధ వర్గాలకు చెందిన పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. ఎక్కడా కూడా మతానికి సంబంధించిన విషయం ఎప్పుడూ చర్చకు రాలేదు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. అట్లా జరగకూడదు, కానీ జరిగింది’ అని కోటగిరి పాఠశాల హెడ్ మాస్టర్ శివలింగ్ గాలప్ప బీబీసీతో అన్నారు.

మండల విద్యాధికారి(ఎమ్‌ఈఓ) సమక్షంలోనే బలవంతంగా ఉపాధ్యాయున్ని గుడికి తీసుకెళ్లారని కొంతమంది ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు.

‘ఆ రోజు ప్రధానోపాధ్యాయులు, ఎమ్ఈఓ గారు అక్కడే ఉన్నారు. వారికి ఫిర్యాదు ఇచ్చి చర్యలకు డిమాండ్ చేస్తే బాగుండేది. ఆ రకంగా ప్రయత్నం చేయకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక ఉపాధ్యాయునితో ఆ విధంగా ప్రవర్తించడం హేయమైన చర్య’ అని కోటగిరి హైస్కూల్‌లో పనిచేస్తున్న గోపాల్ కాలే అన్నారు.

‘అలా ఉపాధ్యాయున్ని గుడికి తీసుకెళ్లడాన్ని మేమైతే సమర్థించలేదు. కానీ వారు ఆవేశంగా ఉన్నారు. పోలీసులు పహారాలో తీసుకెళ్లారు. మేము కూడా వెనుక వెళ్లాం. మాకైతే అది నచ్చలేదు. ఘటన మీద డీఈఓతో పాటూ నాకూ ఓ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా హెడ్ మాస్టర్‌ను కోరాం’ అని కోటగిరి మండల విద్యాధికారి నాగనాథ్ బీబీసీతో అన్నారు.

కోటగిరి పాఠశాల

విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం ఎలా పెరుగుతుంది?

భారత రాజ్యాంగం చెబుతున్నట్టుగా ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించే చర్యలు విద్యార్థి దశ నుంచే మొదలవ్వాలని సామాజిక సంఘాలు అంటున్నాయి. ‘దేశ భవిష్యత్తు క్లాస్ రూమ్‌లోనే నిర్మాణం అవుతుందని కోఠారీ కమిషన్ చెప్పింది. నేటీ బాలలే రేపటి పౌరులు కనుక శాస్త్రీయ దృక్పథం కలిగిన విద్యార్థులే గొప్పగా ఎదిగే అవకాశం ఉంటుంది.

దళిత వర్గాలు చదువుకుని ఎదిగి, సామాజిక గౌరవం కోసం ఎన్నో బాధలు పడతారు. అలాంటి వర్గం నుంచి వచ్చిన ఉపాధ్యాయుడు ఎక్కడైతే గౌరవం పోగొట్టుకున్నాడో అక్కడే అతనికి అది దక్కేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ఆ రోజు ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులు, విద్యాశాఖ అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.

గ్రామీణ ప్రాంతాల స్కూళ్లలో పేదవర్గాలకు చెందిన పిల్లలే ఎక్కువగా చదువుతారు. వారిలో ప్రశ్నించే తత్వం పెరిగితేనే జ్ఞానం పరిణితి చెందుతుంది.

నాస్తికత్వం దేవున్ని నమ్మకపోవచ్చు కానీ అది ప్రజల సంక్షేమాన్ని కోరుతుంది’ అని భారత నాస్తిక సమాజం జాతీయ అధ్యక్షుడు, జీడి సారయ్య అన్నారు.

వీడియో క్యాప్షన్, కోటగిరి: గణేశ్ చందా ఇవ్వనందుకే టీచర్‌ను వివాదంలోకి లాగారా... బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

దళితుడు కాబట్టే ఉపాధ్యాయ సంఘాలు మౌనంగా ఉన్నాయా?

కోటగిరి హై స్కూల్ కేంద్రంగా జరిగిన వివాదంలో ఉపాధ్యాయ సంఘాల మీద విమర్శలు వస్తున్నాయి.

మల్లికార్జున్ దళితుడు కావడం వల్లే పెద్ద ఉపాధ్యాయ సంఘాలైన పీఆర్టీయూ లాంటివి మద్దతుగా నిలువలేదని తెలంగాణ ఎస్సీ-ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకట్ ఆరోపించారు. 50కి పైగా ఉపాధ్యాయ సంఘాలు ఉన్నా వారి నుంచి ఎందుకు సరైన స్పందన రాలేదని ప్రశ్నించారు.

‘ఈ ఘటనలో పూర్వాపరాలు ఆలస్యంగా తెలిశాయి. మొదట్లో టీచర్ మల్లికార్జునే ఇష్టపూర్వకంగా క్షమాపణలు చెప్పాడని తెలిసింది. ఆ తర్వాత స్వయంగా మల్లికార్జున్ వాస్తవాలు బయటపెట్టాక మా సంఘం తరపున పత్రికా ప్రకటన రూపంలో జరిగిన ఘటనను ఖండించాం. అది అన్ని దినపత్రికల్లో వార్తగా వచ్చింది. టీచర్‌ను టీచర్ గానే చూస్తాం తప్ప ఉపాధ్యాయ సంఘాల్లో కులం అనేది లేదు. చట్ట ప్రకారం చర్యలు ఉండాల్సిందే’ అని ఆరోపణలపై పీఆర్టీయూ(టీఎస్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి అన్నారు.

‘ఉపాధ్యాయ సంఘాల్లో కులం లాంటిది ఉండదు. సంఘంలో అన్ని కులాలకు సంబంధించిన టీచర్లు ఉంటారు. వివక్ష లాంటిది ఉండదు. కోటగిరి హైస్కూల్ ఘటనపై తొందరగా చొరవ తీసుకుని ఉండకపోవచ్చు. సరైన స్పందన లేకపోవచ్చు అంతే. టీచర్ పై దాడిని ఎవరైనా ఖండించాల్సిందే’ అని మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి బీబీసీతో అన్నారు.

అయితే, ఆయా ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి లాంటి కీలక పదవుల ఎంపికలో వివక్ష ఉందని, కులం ప్రాధాన్యత వహిస్తుందని తన వివరాలు వెల్లడించడానికి ఇష్టపడని ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ఒక సీనియర్ ఉపాధ్యాయ సంఘ నాయకుడు బీబీసీతో చెప్పారు.

రెండు వర్గాల మీద కేసులు

ఈ వివాదంలో రెండు వర్గాల మీద కోటగిరి పోలీసులు కేసులు నమోదు చేశారు.

‘తనపై దౌర్జన్యం చేసి, తన మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించారని మల్లికార్జున్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపిసీ సెక్షన్-353, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. హిందూ దేవతలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశాడని కాంపొండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లికార్జున్ మీద కూడా కేసు పెట్టాం’ అని కోటగిరి ఎస్సై మచ్ఛేందర్ రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)