గుంటూరులో ‘చంద్రన్న కానుకల’ పంపిణీ వెనుక లక్ష్యం ఏమిటి? తొక్కిసలాటకు బాధ్యులెవరు?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంద్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభలో వారం రోజుల వ్యవధిలో జరిగిన రెండు ఘటనల్లో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు.
గుంటూరులో జనవరి 1న చంద్రన్న కానుక పేరుతో ఎన్టీఆర్ జనతా వస్త్రాలంటూ చేపట్టిన పంపిణీలో జరిగిన తొక్కిసలాట ముగ్గురి ప్రాణాలు తీసింది.
డిసెంబర్ 28న నెల్లూరు జిల్లాలోని కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది చనిపోయారు.
ఈ వరుస ఘటనలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
కందుకూరులో 8 మంది మృతికి కారకులంటూ విమర్శలు తప్ప అరెస్టుల వరకూ వెళ్లలేదు. కానీ గుంటూరు ఘటనలో నిందితుడిగా ఉయ్యూరు ఫౌండేషన్ అధినేత ఉయ్యూరు శ్రీనివాస్ మీద కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 304 కింద ఆయన్ని గుంటూరు నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, UGC
అసలేం జరిగింది?
గుంటూరులోని వికాస్ నగర్‌లో ఉన్న సుమారు 8 ఎకరాల ప్రాంగణంలో చంద్రన్న కానుకల పంపిణీ చేపట్టారు. జనవరి 1న సాయంత్రం తొలుత సభ నిర్వహించారు.
ప్రాంగణమంతా పసుపు జెండాలతో నింపారు. ‘మీరే కావాలి’ అంటూ చంద్రబాబుకి స్వాగతతోరణాలు ఏర్పాటు చేశారు. రాజకీయ విమర్శలతో కూడిన బ్యానర్లు ఏర్పాటు చేశారు. వేదిక కూడా పసుపు మయం చేశారు.
సభలో పాల్గొన్న చంద్రబాబు కూడా ప్రభుత్వంపై విమర్శలు, తమ పాలనలో సాధించిన ఘనతలు అంటూ రాజకీయ ప్రసంగం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తామన్నది తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీని ఆదరించాలని పిలుపునిచ్చారు.
దాదాపుగా రాజకీయ సభను తలపించేలా జరిగిన ఈ కార్యక్రమం ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది.
ఆమెరికాలో ఉంటున్న ఎన్‌ఆర్‌ఐ ఉయ్యూరు శ్రీనివాస్ కొంతకాలంగా ఏపీలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అన్న క్యాంటీన్ల పేరుతో టీడీపీ శ్రేణులు నిర్వహిస్తున్న ఆహార పంపిణీ కేంద్రాలకు ఆయన సహాయం అందించారు.
దానికి కొనసాగింపుగా ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ పేరుతో ఒక చీర, పప్పులు , ఆయిల్ ప్యాకెట్, బెల్లం, ఉల్లిపాయలు వంటి సరుకులతో కూడిన ఓ సంచిని పంపిణీ చేసేందుకు భారీ కార్యక్రమం చేపట్టారు.
పోలీసుల అనుమతి తీసుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో విపక్ష నేత పాల్గొనడంతో కొందరు పోలీస్ సిబ్బందిని కూడా భద్రత కోసం నియమించారు.
కానీ ఆ కార్యక్రమానికి వచ్చిన సామాన్య ప్రజానీకానికి అవసరమైన ఏర్పాట్లు నిర్వాహకులు చేసినట్టు కనిపించలేదు. నియంత్రణకు అవసరమైన సిబ్బంది కూడా ఆ ప్రాంగణంలో లేరు.

ఫొటో సోర్స్, UGC
‘‘రమ్మని పిలిచి, ప్రాణం తీశారు’’
ఈ ప్రాంగణంలో సభికుల కోసం సుమారుగా 4,000 కుర్చీలు వేశారు. బయట కూడా దాదాపు అంతే స్థలం ఖాళీగా ఉంది. అక్కడ కూడా టెంట్లు, ఇతర ఏర్పాట్లు చేశారు. మొత్తం ఆ ప్రదేశమంతా సుమారు 20 వేల మంది మీద నిలుచోవడానికి అవకాశం ఉంది.
కానీ ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్నారనే ప్రచారం, నాలుగైదురోజులుగా టోకెన్ల పంపిణీ జరగటంతో ఊహించిన దానికి మించి అక్కడికి జనం చేరుకున్నారు. అందులో అత్యధికంగా 80 శాతం మహిళలున్నారు.
"మా ప్రాంతంలో లక్ష్మి అని టీడీపీ కార్యకర్త ఇంటింటికీ వచ్చి స్లిప్పులు ఇచ్చారు. పట్టుకుని రమ్మన్నారు. అవి తెస్తే చంద్రన్న కానుక ఇస్తారని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి వెళ్లాం’’ అని గుంటూరు నగరంలోని ఏటీ అగ్రహారం ప్రాంతానికి చెందిన గోపిదేశి వరలక్ష్మి చెప్పారు.
‘‘మొదట అంతా బాగానే ఉంది. లైన్లో కూడా ముందు నుంచున్నాం కాబట్టి మాకు అందుతాయని అనుకున్నాం. కానీ ఆరు గంటల వరకూ వేచి చూస్తే తీరా సభ అయిపోయే సమయానికి తొక్కిసలాట మొదలయ్యింది. మమ్మల్ని కింద పడేశారు. నేను ఏదోలా బయటపడ్డాను. కానీ మా తోటికోడలు ప్రాణం కోల్పోయింది" అని ఆమె వివరించారు.
ఆమె తోటి కోడలు గోపిదేశి రమాదేవి (50) ఆదివారం నాటి ఘటనలో అక్కడిక్కడే ప్రాణం విడిచారు. ఆమె మీద వంద మంది పడి తొక్కేశారని వరలక్ష్మి అన్నారు.
‘‘మమ్మల్ని రమ్మని పిలిచి, మీటింగ్ పెట్టి, ప్రాణం తీసినట్టయ్యింది’’ అని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

ఫొటో సోర్స్, UGC
‘‘నన్ను కాపాడి నా బిడ్డ చనిపోయింది’’
ఇక్కడ జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు చనిపోయారు. ఆస్పత్రికి చేర్చేలోగా వారి ప్రాణాలు పోయాయి. మరో 34 మందిని ఆస్పత్రిలో చేర్చారు. సోమవారం సాయంత్రానికి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో 8 మంది చికిత్స పొందుతున్నారు.
ఈ ప్రమాదంలో చనిపోయిన సయ్యద్ ఆసీఫా(37) నగరంపాలెంలో ఘోరీల దొడ్డి ప్రాంతానికి చెందిన ఒంటరి మహిళ. కుట్టుపని చేసుకుంటూ ఇద్దరు బిడ్డలను పోషించుకుంటోంది. చీరల పంపిణీ టోకన్ పట్టుకుని వెళ్లిన తర్వాత తొక్కిసలాటలో చిక్కుకుని చనిపోయిందని ఆమె తల్లి రహామున్నీసా అన్నారు.
‘‘మా అమ్మని కాపాడండి’’ అంటూ కేకలు వేసి తను ప్రాణం విడిచిందని తెలిపారు.
"అందరికీ చీరలు ఇస్తారని అనుకున్నాం. వేదిక వెనుక వైపు లైన్లు పెట్టారు. లైన్లో ముందు వరుసలో ఉన్నాం. అప్పటికే చాలాసేపటి నుంచి నిలబడి ఓపిక పోయింది. ఈలోగా తొక్కిసలాట జరగడంతో కిందపడి విలవిల్లాడాల్సి వచ్చింది’’ అని రహామున్నీసా వివరించారు.
‘‘నా కూతురితో పాటుగా నేను కూడా పడిపోయాను. ఆమె కేకలకు నన్ను కొందరు బయటకు లాగారు. కానీ నా కూతురిని కాపాడుకోలేకపోయాము. ఆస్పత్రికి తీసుకొచ్చేలాగా చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. సొంత ఇల్లు లేదు. భర్త లేడు. పిల్లలిద్దరూ అనాధలయ్యారు’’ అంటూ ఆమె బీబీసీకి చెప్పి రోదించారు.
‘‘నష్టపరిహారం కింద కొంత మొత్తం ఇచ్చినా కూడా ఆ తండ్రి లేని బిడ్డలకు తల్లిని తెచ్చి ఇవ్వలేరు కదా’’ అని ఆమె ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, UGC
ఈ కార్యక్రమం లక్ష్యం ఏమిటి?
ఉయ్యూరు ఫౌండేషన్ శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన కార్యక్రమం అంతా రాజకీయంగా సాగింది. అధికార పక్షాన్ని విమర్శించడం, టీడీపీ ప్రచారం చేయడమే ప్రధానంగా కనిపించింది.
ఉయ్యూరు శ్రీనివాస్ కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా మారే లక్ష్యానికి అనుగుణంగా దీనిని చేపట్టారనే విమర్శలున్నాయి. సభ కవరేజ్‌కి వెళ్లిన జర్నలిస్టులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
"గుంటూరు జిల్లాకే చెందిన శ్రీనివాస్ అమెరికాలోని వర్జీనీయాలో స్థిరపడ్డారు. ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాత సొంత ప్రాంతంలో రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్టు ఆయన కార్యక్రమాలు, మాటలు చాటుతున్నాయి’’ అని గుంటూరుకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు.
‘‘మాజీ మంత్రి ఆలపాటి రాజాకి ఆయన సమీప బంధువు. కాబట్టి రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు కూడా భావిస్తున్నారు. ఆయన మాత్రం ఏడాదిగా కేవలం సేవా కార్యక్రమాలతోనే సాగుతున్నారు’’ అని చెప్పారు.
‘‘రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో చాలామంది ఎన్ఆర్ఐలు తొలుత ఇలాంటి ప్రయత్నం చేయడం గతంలో కూడా చూశాము. అమెరికన్ సిటిజన్‌గా ఉన్న శ్రీనివాస్ అది వదులుకుని వస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా కనిపించింది’’ అని వ్యాఖ్యానించారు.
ఉయ్యూరు శ్రీనివాస్ నేరుగా రాజకీయ ఆరంగేట్రం చేస్తారా లేదా అనేది పక్కన పెడితే రాజకీయ ప్రసంగాలతో చేసిన సేవా కార్యక్రమంలో ఇంతటి విషాదం బాధాకరమంటూ అభిప్రాయపడ్డారు.
ఏ లక్ష్యంతో రాజకీయ ప్రకటనలతో కూడిన సేవా కార్యక్రమాలకు పూనుకున్నారనే అంశంపై శ్రీనివాస్ అభిప్రాయం కోరగా ఆయన స్పందించేందుకు నిరాకరించారు.

ఫొటో సోర్స్, UGC
కేసు నమోదు, అరెస్ట్
ఉయ్యూరు శ్రీనివాస్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. తొక్కిసలాట ఘటన తర్వాత ఐపీసీ 174 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత దానికి ఐపీసీ 304 కూడా జత చేశారు.
నేరపూరితంగా మనుషులు చనిపోయేందుకు కారకుడయ్యారనే అభియోగంపై గుంటూరు నల్లపాడు పోలీసులు ఉయ్యూరు శ్రీనివాస్‌ని అరెస్ట్ చేశారు.
కేసు దర్యాప్తులో సభా ప్రాంగణం ఏర్పాట్లలో నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించినట్టు గుంటూరు ఎస్‌పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. విజయవాడలో నిందితుడిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు.
"సేవ పేరుతో వేల మందిని సమీకరించినప్పటికీ, అందుకు తగ్గట్టుగా భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్ల ప్రమాదం జరిగింది. పోలీసు యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుంది. అనేక మందిని రక్షించగలిగాము. ముగ్గురి ప్రాణాలు పోవడం, మిగిలిన వారికి గాయాలు పాలుకావడానికి కారకుడు శ్రీనివాస్. అందుకే అరెస్ట్ చేశాం" అని ఆయన బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
రాజకీయ దుమారం...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గతంలో కూడా చాలా సందర్భాల్లో చీరల పంపిణీ తొక్కిసలాటకు దారితీసింది. కొన్నేళ్ల క్రితం వరంగల్‌లో రూపాయికే చీర అంటూ చేసిన ప్రచారం కారణంగా తొక్కిసిలాట, లాఠీఛార్జ్ జరిగింది.
1994 ఎన్నికలకు ముందు హిమాయత్ నగర్ టీడీపీ ఆఫీసులో కూడా ఇలాంటి ఘటన జరిగింది. ఆ తర్వాత కూడా కొన్ని ఘటనలు నమోదయ్యాయి.
తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోవడానికి టీడీపీ నేతలే కారణమని, చంద్రబాబు ప్రచార యావతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది.
ప్రభుత్వ తీరు కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది. దాంతో వరుస ఘటనల చుట్టూ ఇప్పుడు రాజకీయ రచ్చ సాగుతోంది.
కందుకూరులో రోడ్డు మీద ప్రమాదం జరగ్గా, తాజాగా ఓ గ్రౌండ్‌లో ప్రమాదం మూలంగా సామాన్యులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
అయితే తొక్కిసలాటకి నిర్వాహకులు ప్రధమ ముద్దాయిలుగా భావించి కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరుకు చెందిన సామాజికవేత్త యర్రా రామనాయుడు అన్నారు.
"ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడి వచ్చిన వారిని సాయంత్రం వరకూ కూర్చోబెట్టారు. టీడీపీకి విస్తృత యంత్రాంగం ఉన్నప్పుడు ఇంటింటికీ పంపిణీ చేసి ఉంటే సమస్య ఉండేది కాదు. పోనీ వచ్చిన వారికి వచ్చినట్టు ఇచ్చేసినా ఇబ్బంది రాకపోయేది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘అలా కాకుండా కేవలం సభలో తమ ప్రసంగాలన్నీ పూర్తయ్యే వరకూ వారిని కూర్చోబెట్టి, చివరిలో హడావిడి చేయడం ఇంతటి నష్టానికి కారణమయ్యింది. సేవా కార్యక్రమాల పేరుతో సాగుతున్న వ్యవహారాలకు కూడా పరిధి ఉండాలి’’ అని పేర్కొన్నారు.
పోలీసులు అనుమతులు ఇచ్చేసి చేతులు దులుపుకోవడం కాకుండా పరిమితికి మించి ప్రజలు వస్తున్నప్పుడు నియంత్రించి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు.















