రైలు ప్రయాణం: ప్రయాణికులకు తగినన్ని రైళ్లు నడపటం లేదా? రిజర్వేషన్ బోగీలలో తరచూ తగాదాలెందుకు?

రైలు
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఇటీవల శబరిమల యాత్ర కోసం ఎర్నాకులం వరకూ తిరునల్వేలి ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ క్లాస్‌లో బెర్త్ రిజర్వ్ చేయించుకుని గన్నవరం వాసి యార్లగడ్డ రమేష్ కుమార్ ప్రయాణానికి సిద్ధమయ్యారు. విజయవాడ రైల్వే స్టేషన్లో ఆ రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన తమకు బెర్తులన్నీ నిండిపోవడంతో పెద్ద సమస్య అయ్యిందని ఆయన బీబీసీతో చెప్పారు.

ఆ బెర్తుల్లో ఉన్న వారిని ఖాళీ చేయించి, మళ్లీ ఆ బెర్త్ తమకు దక్కేసరికి ట్రైన్ దాదాపు ఒంగోలు వరకూ వెళ్లిపోయిందని తెలిపారు. అంతసేపు వారితో వాగ్వాదం చేస్తే తప్ప తమ రిజర్వేషన్ బెర్త్ ఖాళీ చేయలేదని వాపోయారు.

ఈ సమస్య పెరుగుతోంది. రిజర్వేషన్ బోగీలలో కూడా జనరల్ టికెట్స్ తీసుకున్న వారితో బెర్తులన్నీ నిండిపోతున్నాయి. ముఖ్యంగా దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల నుంచి నుంచి వచ్చే రైళ్ళలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారితో అప్పటికే బోగీలు కిటకిటలాడిపోతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన తర్వాత ఆ రైలులో రిజర్వేషన్ ఉన్న వారికి కూడా లోపలికి వెళ్లేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది.

రైళ్లు నిలిపివేసి నిరసనలు

రైలు

డిసెంబర్ 8న ఎర్నాకుళం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఒకేసారి సుమారు 800 మంది వలస కూలీలు ఎక్కేశారు. జనరల్, రిజర్వుడు బోగీలు అనేదానితో సంబంధం లేకుండా వారితోనే రైలు నిండిపోయింది.

అప్పటికే కొన్ని గంటలుగా ఎర్నాకుళం వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తున్న వారంతా ఒకేసారి ఎక్కేయడంతో ఆ రైలు కిక్కిరిసిపోయింది.

దాంతో రిజర్వేషన్ చేయించుకున్న స్థానికులకు, రైలులో ఉన్న వారికి మధ్య వాగ్వాదాలు, వివాదాలు తలెత్తాయి. కొందరు ప్రయాణికులు తమ రిజర్వేషన్ బెర్తులు తమకే అప్పగించాలని రైల్వేఅధికారులకు ఫిర్యాదు చేశారు.

రైల్వే సిబ్బంది జోక్యం చేసుకుని రిజర్వుడు బోగీలలో ఎక్కిన వారందరినీ బలవంతంగా దించేశారు. దాంతో ఆగ్రహించిన బిహారీ కూలీలు ఆందోళనకు దిగారు. రైలుని ఆపేశారు.

రైలు

చివరకు మరో రైలులో వారిని పంపిస్తామని హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే రైలు కదిలింది.

డిసెంబర్ 11న విజయవాడలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది. బొకారో ఎక్స్‌ప్రెస్‌లో రిజర్వేషన్ చేయించుకున్న అయ్యప్ప భక్తులకు తమ బెర్తులు ఖాళీ లేకపోవడంతో సమస్య ఏర్పడింది. రైల్వేఅధికారులకు ఫిర్యాదుతో వారు రిజర్వేషన్ కన్ఫర్మ్ కాకుండా రిజర్వుడు బోగీలు ఎక్కిన బెంగాలీ ప్రయాణికులను దింపేశారు.

వారు కూడా నిరసనకు దిగారు. చాలా దూరం నుంచి ప్రయాణిస్తున్న తమను విజయవాడ వచ్చిన తర్వాత దించేశారంటూ వారు ఆందోళన చేపట్టారు. చివరకు వారికి నచ్చజెప్పి తర్వాత ట్రైన్‌కి పంపించే ఏర్పాట్లను అధికారులు చేయాల్సి వచ్చింది.

నవంబర్ చివరి వారంలో నర్సీపట్నం రోడ్డు సమీపంలో గుల్లిపాడు రైల్వేస్టేషన్‌లో కూడా ఇలాంటి సమస్య వల్లే రైలు 90 నిమిషాలు నిలిచిపోయింది.

రైలు

ఫొటో సోర్స్, Getty Images

వలస కూలీల ప్రయాణాలే...

గడిచిన కొన్ని దశాబ్దాలుగా వలసలు పెరుగుతున్నాయి. ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు సైతం కూలీలు తరలివెళుతున్నారు. అందులోనూ దక్షిణాదికి వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది.

2011 జనాభా లెక్కల ప్రకారం అప్పటికి 5.4 కోట్ల మంది ఉపాధి కోసం సొంత రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ప్రస్తుతం వారి సంఖ్య దాదాపు ఏడు కోట్లకు చేరి ఉంటుందని దేశవ్యాప్తంగా వలస కూలీల సమస్యలపై పనిచేసే ఒక ఎన్జీవో అంచనా వేసింది.

వారిలో బిహార్, పశ్చిమ బెంగాల్, అసోంకి చెందిన కూలీలు ఎక్కువగా కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు వలస వెళుతుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి కూడా జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఎక్కువగా వస్తుంటారు.

రైలు

ఉత్తర్ ప్రదేశ్, బిహార్ సహా ఆరు రాష్ట్రాల నుంచి దక్షిణ భారతానికి వలస వచ్చేవారి సంఖ్య 1.4 కోట్ల వరకూ ఉంటుంది ఎన్జీవో ప్రతినిధి దినేశ్ తెలిపారు

"కరోనావైరస్ మహమ్మారి తర్వాత వలసలు పెరిగాయి. అంతకుముందు మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్ వైపు వెళ్లిన కూలీలు కూడా ప్రస్తుతం కేరళ, కర్ణాటక వైపు వస్తున్నారు. వారి రాకపోకలతో రైళ్లు నిండిపోతున్నాయి. అంతదూరం రోడ్డు ప్రయాణం సాధ్యం కాదు. ట్రైన్లలో రిజర్వేషన్లు చేయించుకునే స్తోమత గానీ, అలాంటి అవగాహన గానీ ఎక్కువ మందికి ఉండడం లేదు. దాంతో జనరల్ టికెట్ తీసుకుని ఖాళీ ఉన్న చోట ఎక్కేయడానికి అలవాటు పడుతున్నారు. అందుకే ప్రస్తుతం దూర ప్రాంతాల నుంచి వస్తున్న రైళ్లలో 80 శాతం మంది వారే ఉంటున్నారు". అంటూ దినేష్ తెలిపారు.

సాధారణ ప్రయాణ టికెట్లతో రిజర్వేషన్ బోగీలలో ఎక్కుతున్నప్పుడు అడ్డు చెప్పకుండా మార్గం మధ్యలో వారిని అడ్డుకోవడమే సమస్య అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

తగినంత డబ్బులు చేతిలో లేకుండా ప్రయాణిస్తున్న వారిని హఠాత్తుగా ట్రైన్ దింపేస్తే వారేమి కావాలన్నది ఆలోచించాలని దినేశ్ కోరుతున్నారు.

రైలు

జనరల్ బోగీలు ఎక్కడ?

ఇండియన్ రైల్వేస్ తీసుకొచ్చిన పలు మార్పుల కారణంగా క్రమంగా జనరల్ బోగీలు తగ్గిపోయాయి. కొన్ని దూర ప్రాంత రైళ్లలో జనరల్ బోగీలే లేకుండా నడుపుతున్నారు.

అత్యధిక రైళ్లలో కేవలం రెండు జనరల్ బోగీలుంటాయి. అది కూడా ఒకటి ఇంజిన్ వైపు ఉంటుంది. మరోటి రైలుకి చివరిలో ఉంటుంది. జనరల్ టికెట్ తీసుకున్న ప్రయాణికులకు తగినన్ని సీట్లు దొరికే అవకాశం లేదు. కనీసంగా నిలబడేందుకు కూడా చోటు లేని సందర్భాలు పెరుగుతున్నాయి.

ఒక జనరల్ బోగీలో ఖాళీ లేకుంటే రెండో బోగీలో ప్రయత్నించాలనుకునే వారికి ఆ చివరిలో ఉన్న బోగీ వరకూ వెళ్లేసరికి రైలు కదిలిపోతుందనే ఆందోళన ఉంటుంది. అందుకే ఎక్కువ సందర్భాల్లో జనరల్ బోగీ ఖాళీ లేకపోయే సరికి రిజర్వుడు బోగీలను ఆశ్రయిస్తున్నారు.

"అస్సాం, బెంగాల్, బిహార్ వలస కూలీల కోసం ప్రత్యేకంగా రైళ్లు నడపాలి. నిత్యం లక్షల మంది ఎర్నాకుళం, చెన్నై, బెంగళూరు స్టేషన్ల నుంచి కోల్ కతా, పట్నా, గువాహటి వైపు ప్రయాణిస్తున్నారు. కానీ వాళ్లకు అందుబాటులో ఉన్న రైళ్లు వేళ్ల మీద లెక్కపెట్టే సంఖ్యలో ఉంటున్నాయి. అందులోనూ జనరల్ బోగీలు నామమాత్రం. ఇంకెలా ప్రయాణం చేయాలి. సొంత ఊళ్లలో ఉపాధి ఎలానూ కల్పించలేదు. కనీసం అవసరమైన సంఖ్యలో రైళ్లు, బోగీలు ఏర్పాటు చేయకపోతే ఎలా" అని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ సంఘ్ ప్రతినిధి ఎం వెంకట రామన్ అన్నారు.

అవసరాలకు అనుగుణంగా కొత్త రైళ్లు ఏర్పాటు చేయాలి. ఉన్న రైళ్లలో అదనపు బోగీలు జనరల్ ప్రయాణాలకు అందుబాటులో ఉంచాలి అని ఆయన కోరారు.

తమ సంఘం తరపున అనేక మార్లు పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య గురించి ప్రస్తావిస్తున్నా, ప్రభుత్వం మాత్రం ఎంపిక చేసిన స్టేషన్లు, కొన్ని ట్రైన్లలో సదుపాయాలకే ప్రాధాన్యతనిస్తూ అత్యధికులను విస్మరించడమే సమస్యకు మూలం అంటూ వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, సెల్పీ స్టేషన్: ఈ రైల్వే స్టేషన్‌లో ఎవరైనా సరే ఓ సెల్ఫీ తీసుకుంటారు...

సమస్య పెరుగుతోంది...

ఉత్తరాది, తూర్పు ప్రాంతాల నుంచి నుంచి కేరళ వైపు వచ్చే రైలు ప్రయాణికుల సంఖ్య మరింత పెరగవచ్చని రిటైర్డ్ రైల్వే అధికారిణి పి వసంత అన్నారు.

గతంలో కేరళకి వెళ్లాలంటే సులువుగా రిజర్వేషన్ దొరికేదని, ఇప్పుడు పది రోజుల ముందు కూడా వెయిటింగ్ లిస్ట్ తప్పడం లేదని ఆమె తెలిపారు.

"చాలా ఏళ్లపాటు టీటీఈగా పనిచేశాను. రిజర్వుడు బోగీలలోకి జనరల్ పాసింజర్లు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వచ్చేవారు. కానీ ఇప్పుడు రోజూ బెర్తులు రిజర్వుడు పాసింజర్లకు అప్పగించడమే సమస్య అవుతోంది. ముఖ్యంగా దూర ప్రాంత రైళ్లలో. ఇది మరింత పెరిగేలా ఉంది. ఇటీవల వలస కూలీలు నిత్యం కనిపిస్తున్నారు. ఎక్కువగా ప్రయాణికుల్లో వారే ఉంటున్నారు. కాబట్టి ప్రత్యామ్నాయం ఆలోచించకపోతే సమస్య ముదురుతుంది" అంటూ ఆమె అభిప్రాయపడ్డారు.

గోరఖ్‌పూర్, పట్నా వంటి స్టేషన్ల నుంచి ఎర్నాకుళం వరకూ రైళ్లు నడుపుతున్నారని, వాటిని వీక్లీ , బై వీక్లీ కాకుండా డైలీ నడిపితే కొంత ఉపయోగం ఉంటుందని ఆమె అన్నారు. రైళ్ల సంఖ్య పెరగకుండా, పెరుగుతున్న ప్రయాణికుల అసవరాలు తీర్చలేమని అన్నారు.

ఇలాంటి పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే రైళ్లలో తగాదాలు కూడా వచ్చే ప్రమాదం ఉందన్నారు.

వీడియో క్యాప్షన్, చావు అంచుల్లోకి వెళ్లిన రిక్షా కార్మికుడు, ఎలా బతికి బయటపడ్డాడంటే...

“చర్యలు తీసుకుంటున్నాం”

విజయవాడ నుంచి చెన్నై వైపు 19 రైళ్లు నడుస్తున్నాయి. వాటిలో కేవలం 2 మాత్రమే రెగ్యులర్‌గా తిరుగుతాయి. బెంగళూరు వైపు 12 రైళ్లు నడుపుతున్నారు.

అయినా వీటిలో అత్యధికం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవే కావడంతో ఆయా ప్రాంత ప్రయాణికులకే సరిపోతున్నట్టుగా ఉంది.

వలస కూలీల కారణంగా రిజర్వుడు బోగీలలో సమస్యలు వస్తున్నాయని రైల్వే అధికారులు అంగీకరించారు.

వాటిని ఆర్పీఎఫ్, ఇతర సిబ్బంది సహాయంతో పరిష్కరిస్తున్నామని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం తెలిపింది.

"అయ్యప్ప భక్తులు కూడా ఎక్కువ మంది కేరళ రైళ్లలో వెళుతుంటారు. వారికోసం ప్రత్యేకంగా దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 16 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నాము. వివిధ ప్రాంతాల నుంచి అవి బయలుదేరుతున్నాయి. ఇంకా కొందరు రెగ్యులర్ రైళ్లలో రిజర్వేషన్ చేయించుకున్న సమస్యలో సమస్య వచ్చింది. వెంటనే అప్రమత్తమయ్యి, తగిన టికెట్ లేకుండా రిజర్వుడు బోగీ ఎక్కిన వారిని దింపేశాము. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్నప్పుడు తగిన చర్యలు అవసరం ఉంటుంది. మా పరిధిలోకి రాగానే ప్రత్యేకంగా ఆర్పీఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేసి రిజర్వుడు ప్రయాణికులకు సమస్య రాకుండా చూస్తున్నాం" అంటూ పీఆర్వో నుస్రత్ ఎం మండ్రూప్కర్ బీబీసీకి తెలిపారు.

రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా అదనపు సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)