ఇండియా టూరిజం: 'రివెంజ్ ట్రావెల్' అంటే ఏంటి, ఇది భారత పర్యాటక రంగాన్ని రక్షిస్తుందా?

తాజ్ మహల్

ఫొటో సోర్స్, Getty Images

కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా రెండు సంవత్సరాల పాటు ప్రయాణాలు నిలిచిపోయాయి. మళ్లీ ఇప్పుడిప్పుడే భారత పర్యాటక రంగం కోలుకుంటోంది. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రుబీనా ఎ.ఖాన్ ఈ ఆశావహ పరిస్థితులకు కారణాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాను.

భారతదేశ జీడీపీలో పర్యాటక రంగం వాటా దాదాపు 3 శాతం. 2019లో దాదాపు 10 కోట్లమందికి ఈ రంగం ఉపాధి కల్పించింది.

కానీ, మిగతా ప్రపంచం మాదిరిగానే, కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ రంగం తీవ్రంగా దెబ్బతింది. కోవిడ్ రాకకు ముందు ఏడాది అంటే 2019లో సుమారు కోటి మంది పర్యాటకులు భారతదేశాన్ని సందర్శించగా, 2020లో ఆ సంఖ్య 27 లక్షలమందికి పడిపోయింది. ఇవి అధికారికంగా కనిపిస్తున్న గణాంకాలు.

విదేశీ సందర్శకుల సంఖ్య నేటికి కూడా కరోనా ముందునాటి సంఖ్యకు చేరుకోలేదు. అయితే, దేశీయ పర్యాటకులు పెరగడం ఈ రంగంలో ఉత్సాహాన్ని పెంచుతోందని ట్రావెల్ కంపెనీ ఆపరేటర్లు, హోటల్ పరిశ్రమకు చెందిన వారు అంటున్నారు.

రెండు సంవత్సరాల పాటు ఎటూ కదలలేని పరిస్థితిలో గడిపిన భారతీయ పర్యాటక ప్రియులు, ఇప్పుడు విపరీతంగా ప్రయాణాలు చేస్తున్నారు. ఈ పరిణామాన్ని 'రివేంజ్ ట్రావెల్'గా ఈ రంగానికి చెందిన నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఖరీదైన విదేశీ ప్రయాణాల కన్నా, దేశంలోనే పర్యటించడానికి చాలామంది మొగ్గు చూపుతున్నారని వారు చెబుతున్నారు.

పర్యాటక రంగం

ఫొటో సోర్స్, Getty Images

కొత్త ట్రెండ్స్

మహమ్మారి తర్వాత కొత్తగా పుట్టుకొచ్చిన మైక్రో హాలిడేస్ (micro-holidays) వర్క్‌కేషన్‌(workcations) వంటి ట్రెండ్స్ వల్ల పరిశ్రమ ప్రయోజనం పొందుతోంది.

ట్రావెల్ వెబ్‌సైట్ మేక్‌మైట్రిప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ దీప్ కల్రా దీని గురించి మాట్లాడుతూ, 2020 చివరి త్రైమాసికంలో ఈ రంగం మళ్లీ అభివృద్ధిని చూడటం మొదలుపెట్టిందని, స్థిరంగా కోలుకుంటోందని చెప్పారు. ''గత మూడు ఆర్ధిక త్రైమాసికాలు మా కంపెనీకి లాభదాయకంగా కనిపించాయి'' అని ఆయన అన్నారు.

భారతదేశం మొదటి నుంచి పర్యాటక రంగానికి స్వర్గధామంగానే ఉంది. చారిత్రక కోటలు, అద్భుతమైన ప్యాలెస్‌ల నుండి దట్టమైన అరణ్యాల వరకు, సందర్శకులకు అనేక ఆప్షన్లు ఉన్నాయి.

కానీ, నెలల తరబడి అంతర్జాతీయ ప్రయాణాలకు అంతరాయం ఏర్పడడంతో, ఎక్కువ మంది భారతీయులు దేశంలోనే విహార యాత్రలు చేయాలనే ఆలోచనకు తెరతీశారని ట్రావెల్ కంపెనీ ఎస్‌ఓటీసీ(SOTC) మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ సూరి అన్నారు.

"ఈ మహమ్మారి భారతీయులకు కొత్త పర్యాటక ప్రపంచాన్ని చూపించింది "అని సూరి చెప్పారు.

అనేక చారిత్రక, సాంస్కృతిక కట్టడాలతో భారతదేశం పర్యాటకులను ఆకర్షిస్తోంది
ఫొటో క్యాప్షన్, అనేక చారిత్రక, సాంస్కృతిక కట్టడాలతో భారతదేశం పర్యాటకులను ఆకర్షిస్తోంది

ఇంత వరకు పెద్దగా ఎవరూ వెళ్లని ప్రాంతాలకు డిమాండ్ పెరిగిందని సూరి వివరించారు. తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు, లోకల్ ఫుడ్, కల్చరల్ ఈవెంట్స్, అడ్వెంచర్స్ కోసం ప్రజలు వెతుకుతున్నారని ఆయన వెల్లడించారు.

"ప్రయాణికులు ఇప్పుడు స్పెషల్‌గా, ప్రైవసీగా ఉండే హోమ్‌స్టే లను సౌకర్యవంతంగా ఫీలవుతున్నారు" అని ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (FHRAI) సీనియర్ అధికారి ప్రదీప్ శెట్టి చెప్పారు.

మేక్ మై ట్రిప్ చైర్మన్ కల్రా కూడా దీన్ని అంగీకరిస్తున్నారు. వీలైనప్పుడల్లా భారతదేశంలో ప్రయాణాలు చేసేందుకు ప్రజల్లో ఆసక్తి పెరిగిందని ఆయన అన్నారు.

"ప్రయాణాల ఫ్రీక్వెన్సీ కూడా మారిపోయింది. తరచూ ప్రయాణాలు చేస్తున్నారు. ఏడాదికోసారి వచ్చే సెలవుల స్థానంలో మైక్రో-హాలీడేస్ వచ్చాయి. వీక్లీఆఫ్‌లు, ఇతర సెలవుల రూపంలో విరామాలు కోరుకుంటున్నారు’’ అని ఆయన అన్నారు.

పర్యాటక రంగం

ఫొటో సోర్స్, Getty Images

ఆతిథ్య రంగంపై ప్రభావం

ఈ మార్పు భారతదేశంలోని హోటళ్లకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే యంత్రంగా మారింది. ప్రజలు అంతర్జాతీయ సెలవులకు రిజర్వ్ చేసుకున్న డబ్బును దేశీయంగా మెరుగైన సౌకర్యాల కోసం ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.

మహమ్మారి కారణంగా కొన్ని లగ్జరీ హోటళ్లు వాటి ధరలను తగ్గించాయి. ఇది బుకింగ్‌లు, స్వల్పకాలిక ఆదాయాల పెరుగుదలకు దారితీసింది.

''కోవిడ్ మహమ్మారి తర్వాత హోటల్ రంగం బలంగా, వేగంగా కోలుకుంది'' అని 'ది ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (IHCL) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పునీత్ ఛత్వాల్ అన్నారు.

ఐసీహెచ్‌ఎల్ సంస్థ దేశంలోనే అతి పెద్ద హాస్పిటాలిటీ కంపెనీ తాజ్ లగ్జరీ హోటళ్ల వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.

వీడియో క్యాప్షన్, ఈ డైమండ్ బ్రిడ్జ్ మీద నడిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుంది

"ఈ రోజు ఐసీహెచ్‌ఎల్ ఆక్యుపెన్సీ గణాంకాలు మహమ్మారికి ముందు స్థాయిలను మించిపోయాయి. ఇది ప్రధానంగా దేశీయ పర్యాటకం నుంచి లభిస్తున్న ఆదరణ" అని ఆయన చెప్పారు.

రాఫెల్స్ ఉదయపూర్- దీనిని అంతర్జాతీయ హోటల్ చైన్ రాఫెల్స్ నిర్వహిస్తుంది. ఇది ఒక ప్రైవేట్ ద్వీపంలో ఉంది. భారతదేశంలో కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ తర్వాత ఆగస్టు 2021 నుంచి ఇది తిరిగి ప్రారంభమైంది.

''ఇండియాలో కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి సంవత్సరంలో ప్రతి నెలా మెరుగైన ఆక్యుపెన్సీ రేటును చూపించగలిగాం'' అని ఈ హోటళ్ల ఇండియా, సౌత్ ఏషియా ఆపరేషన్ల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పునీత్ ధావన్ అన్నారు.

"పోల్చి చూడటానికి మా దగ్గర కోవిడ్‌కు ముందు గణాంకాలు లేవు. కానీ, మా ప్రాపర్టీలో స్థిరమైన పెరుగుదల ఉన్నట్లు మేం గమనించాం'' అని ఆయన చెప్పారు.

చలికాలం, వివాహాల సీజన్‌ కోసం తమ హోటల్ సిద్ధమవుతోందని ధావన్ చెప్పారు.

పర్యాటక రంగం

ఫొటో సోర్స్, Getty Images

ముందున్న సవాళ్లు

అయితే, ప్రస్తుత పరిస్థితులు ఆశావహంగా ఉన్నప్పటికీ, దేశీయ పర్యాటకులు మాత్రమే ఈ రంగాన్ని మహమ్మారి ముందు స్థాయికి తీసుకెళ్లే పరిస్థితి లేదని పరిశ్రమకు చెందిన వారు అంటున్నారు.

పర్యాటక రంగ సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని సెప్టెంబరులో భారతదేశ పర్యాటక మంత్రి కూడా అన్నారు. అయితే, విదేశీయుల రాకపోకలు ఇంకా మెరుగు పడలేదు.

అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 2021లో 44.5% విదేశీ ప్రయాణికులు తగ్గినట్లు డేటా చూపిస్తోంది.

"ప్రపంచాన్ని మనవైపుకు ఆహ్వానిస్తూ భారతదేశం ఒక్క ప్రచార క్యాంపెయిన్‌ను కూడా చేయలేదు. మనకు కావలసింది పర్యాటకులు మనల్ని ఎంచుకునే మార్కెటింగ్ వ్యూహం. ఇంతకు ముందు చైనాకు 6 కోట్ల మంది పర్యాటకులు వెళ్లేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు'' అని దీపక్ దేవా అన్నారు. ఆయన దేశంలోనే ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీలలో ఒకటైన ట్రావెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్.

ప్రస్తుత విధానం చాలా గజిబిజిగా ఉన్నందున ప్రభుత్వం కూడా ఈ-వీసా సదుపాయాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రత్యేకించి యూకే వంటి దేశాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటకులకు ఈ సౌకర్యం కల్పించాలన్నారు.

అయితే, దేశీయ, అంతర్జాతీయ పర్యాటక రంగం అనేది కలిసి ఎదగాల్సినవేనని, ఇవి పరస్పర వ్యతిరేకం కాదని కల్రా అభిప్రాయపడ్డారు.

"అంతర్జాతీయ ప్రయాణాలు ఇప్పుడు మెరుగు కావడంతో, ఈ విభాగం కూడా పూర్తిస్థాయిలో కోలుకోగలదని మేము విశ్వసిస్తున్నాం" అన్నారాయన.

వీడియో క్యాప్షన్, ఒకప్పుడు రైతు కూలీ, సెక్యూరిటీ గార్డ్... ఇప్పుడు ప్రపంచ దేశాలు చుట్టేస్తున్నాడు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)