హిమాలయాల్లోని 'రహస్య స్వర్గపు లోయల' మర్మమేంటి? ఈ ‘బీయూల్’ల గురించి ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టారా?

ఫొటో సోర్స్, Stuart Butler
- రచయిత, స్టువర్ట్ బట్లర్
- హోదా, .
ఆశ్రమంలోని ఒక తలుపు నుంచి 7,000 మీటర్ల ఎత్తులో ఉన్న మంచు శిఖరాలను చూస్తూ ఒక బౌద్ధ సన్యాసి నవ్వుతూ ఇలా అన్నారు: ''నేను నా ఇంట్లో ఉన్నాను. స్వర్గంలో ఉన్నాను''.
ఆ తర్వాత ఆయన తరగతి గదిపై తన దృష్టిని సారించారు. ఆ తరగతిలో బాల సన్యాసులకు ఆయన చదువు చెబుతున్నారు.
నేను ఆయనకు కృతజ్ఞతలు చెప్పి, నా వెనుక ఉన్న తలుపును మూసివేసి ఆశ్రమం నుంచి బయటకు నడిచాను. అంటే 'బీయూల్' నుంచి దూరంగా నడిచాను.
ఇంగ్మా స్కూల్ ఆఫ్ టిబెటన్ బుద్ధిజం 8వ శతాబ్ధంలో స్థాపించిన అత్యంత పురాతన నాలుగు పాఠశాలల్లో ఒకటి. ఈ స్కూలు చెప్తున్నదాని ప్రకారం, బీయూల్ అనేది భౌతిక, ఆధ్యాత్మిక ప్రపంచాలు కలిసిపోయే ఒక ప్రదేశం.
ప్రత్యేకంగా చెప్పాలంటే అవి 'రహస్య స్వర్గపు లోయలు'. ప్రపంచం అత్యంత ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా యుద్ధం, కరవు, మహమ్మారులతో వినాశనం చెందే ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ లోయల గురించి అందరికీ తెలుస్తుంది.
అలాంటి సమయాల్లో బీయూల్ ఒక శరణార్థి శిబిరంగా పనిచేస్తుందని నమ్ముతారు.
''బీయూల్ ఒక పవిత్ర స్థలం, ఆశ్రయం అందించే స్థానం. ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను లామాలు (టిబెట్ బౌద్ధ టీచర్లు) నడిపిస్తారు'' అని 'గెయటీ ఆఫ్ స్పిరిట్- ద షెర్పస్ ఆఫ్ ఎవరెస్ట్' అనే పుస్తక రచయిత ఫ్రాన్సిస్ క్లాజెల్ వివరించారు. హిమాలయాలు, బౌద్ధుల సంస్కృతి గురించి ఆమె అనేక పుస్తకాలు రాశారు.
కానీ, బీయుల్‌లోకి ఎవరు పడితే వారు ప్రవేశించలేరని ఆమె చెప్పారు. జీవితంలో అనేక పరీక్షలను, కష్టాలను ఎదుర్కొని స్వచ్ఛమైన హృదయం ఉన్న నిజమైన బౌద్ధుడు మాత్రమే బీయూల్‌కి ప్రవేశించగలరని పేర్కొన్నారు.
పై నిబంధనలకు లోబడని వ్యక్తులు బీయూల్‌లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే మరణించే అవకాశం ఉందని చెప్పారు.
ఈ రీజియన్‌కు ఎన్నో గైడ్ బుక్స్ రాసిన ఒక రచయితగా.. హిమాలయాలు, టిబెట్ ప్రాంతాలను తరచుగా పర్యటించే వ్యక్తిగా నాకు ఒక విషయం చాలా ఆసక్తికరంగా అనిపించింది.
అదేంటంటే, హిమాలయ పర్వత సానువుల్లోని ఈ రహస్య ప్రాంతాలు, విపత్తు సమయాల్లో ఎంత ఉపయోగపడ్డాయో తెలుసుకోవడం.
ఈ బీయూల్ చరిత్ర, పూర్వాపరాల గురించి చెప్పాలని నేను క్లాజెల్‌ను అడిగాను.

ఫొటో సోర్స్, Stuart Butler
బీయూల్‌లను తాంత్రిక బౌద్ధ వజ్ర గురువు 'పద్మసంభవ' సృష్టించారని ఆమె వివరించారు. 8, 9వ శతాబ్దాలలో హిమాలయాలు, టిబెట్ అంతటా బౌద్ధ మతం వ్యాపించడంలో పద్మసంభవ కీలక పాత్ర పోషించారని చెబుతుంటారు.
''హిమాలయాల్లో పర్యటిస్తున్నప్పుడు రాబోయే కాలాల్లో పోరాటాలు, ఘర్షణలు వస్తాయని పద్మసంభవ ముందే గ్రహించారు. కాబట్టి తన ఆధ్యాత్మిక శక్తులను ఉపయోగించి కొన్ని లోయలను రహస్యంగా దాచిపెట్టారు. దాచిపెట్టిన ఈ లోయలు ఎక్కడున్నాయో తెలుపుతూ కొన్ని గ్రంథాలు రాశారు. ఆ లోయల్లోకి ప్రవేశించడానికి నిబంధనలు కూడా ఆ గ్రంథాల్లో పొందుపరిచారు’’ అని ఆమె చెప్పారు.
‘‘ఈ గ్రంథాలను హిమాలయాల్లోని జలపాతాల వెనుక, మఠాల్లో, లోయల్లో భద్రంగా దాచిపెట్టారు. వీటిని లామాలు మాత్రమే కనుగొనగలరు. అది కూడా పద్మసంభవ ముందుగా నిర్ణయించి పెట్టిన సమయాల్లో మాత్రమే లామాలు ఈ గ్రంథాలను కనుగొంటారు'' అని క్లాజెల్ వివరించారు.
మొత్తంగా ఎన్ని బీయూళ్లు ఉన్నాయో ఎవరికీ కచ్చితంగా తెలియదు. కానీ, వాటి సంఖ్య 108గా ఉండొచ్చని చాలా మంది నమ్ముతుంటారు. వీటిలో చాలా వాటిని ఇంకా గుర్తించాల్సి ఉంది.
బీయూల్‌లు ఎక్కువగా హిమాలయాలకు దక్షిణం వైపు ఉన్నాయి. ఇక్కడి సారవంతమైన భూములు పచ్చదనంతో నిండి ఉండి స్వర్గలోకాలను తలపిస్తుంటాయి.
భారత్‌లోని సిక్కింలో, నేపాల్‌లోని హెలంబు, రోల్వాలింగ్, సుమ్ వ్యాలీల్లో కొన్ని బీయూల్‌లు ఉన్నాయి. శతాబ్ధాలుగా ఈ ప్రాంతాల్లో బౌద్ధాన్ని అనుసరించేవారు ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడ గ్రామాలు, పట్టణాలు ఏర్పడ్డాయి.
మరికొన్ని బీయూల్‌లు ఎక్కడ ఉన్నాయో వాటి స్థానాలు తెలిసినప్పటికీ, చాలామంది వాటి దగ్గరకు వెళ్లలేరు.

ఫొటో సోర్స్, Feng Wei Photography/Getty Images
బీయూల్‌లుగా పిలిచే ఈ రహస్య లోయలను కల్పిత కథలుగా పరిగణించడం చాలా సులభం. కానీ, ఈ రహస్య లోయలు నిజంగానే ఉనికిలో ఉన్నాయని నిరూపించే పురాతన పత్రాలు లభ్యమయ్యాయి.
ఉదాహరణకు 'పెమాకో బీయూల్' గురించి చూద్దాం. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతంలో ఉంది. దీని ప్రవేశ మార్గం 'యార్లంగ్ సాంగ్‌పో' (భూగ్రహంపై అత్యంత లోతైన లోయ) అనే లోతైన లోయలోని అత్యంత దుర్లభమైన భాగంలోని జలపాతం వెనుక కొండలపై దాగి ఉన్నట్లు గుర్తించారు.
ఈ ప్రాంతం మ్యాపుల్లో ఖాళీగా కనిపించేది. అక్కడొక జలపాతం ఉందనే సంగతి కూడా ఎవరికీ తెలియదు. కానీ, 1990లలో బౌద్ధ గురువు ఇయాన్ బేకర్ సారథ్యంలోని ఒక బౌద్ధ సన్యాసుల బృందం ఎవరికీ అంతుచిక్కని ఈ ప్రాంతంలోని వెళ్లింది. ఈ బృందం అక్కడ లోయ లోపల ఎత్తైన జలపాతాన్ని కనుగొంది.
ఆ తర్వాత 'ద హార్ట్ ఆఫ్ ద వరల్డ్' అనే పుస్తకంలో ఇయాన్ బేకర్ ఈ అనుభవం గురించి రాశారు.
బీయూల్‌లోకి అనువు కాని సమయాల్లో లేదా మీ మనస్సు స్వచ్ఛంగా లేనప్పుడు ప్రవేశించాలని ప్రయత్నిస్తే ఘోరమైన ముగింపును చూడాల్సి వస్తుందని అనేక కథలు తెలుపుతున్నాయి.
1962లో టిబెట్‌కు చెందిన టుల్షుక్ లింగ్పా అనే లామా, తనకు 'డెమోషాంగ్ బీయూల్'కు దారిని చూపే మ్యాప్ దొరికిందని చెప్పారు. ఈ బీయూల్ ప్రవేశద్వారం కాంచనగంగా పర్వత వాలుల్లో ఒకచోట ఉంటుందనే వదంతులు కూడా వచ్చాయి.
దాదాపు 300 మంది అనుచరులతో టుల్షుక్ లింగ్పా ఆ పర్వతం దగ్గరికి వెళ్లారు. ఈ ఘటన గురించి థామస్ కె షోర్ అనే రచయిత 'ఎ స్టెఫ్ ఎవే ఫ్రమ్ ప్యారడైస్' నే పుస్తకంలో రాశారు.
ఈ ఘటనలో ప్రాణాలతో బయట పడినవారి అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. 'లింగ్పాతో పాటు కొంతమంది అనుచరులు పర్వతం దగ్గరికి వెళ్లారు. అక్కడ వారు ప్రకాశవంతమైన దీపాల వెలుగును చూశారు. ప్రవేశ మార్గం దగ్గరికి రావాల్సిందిగా ఆ వెలుగు వారిని పిలిచింది. అయితే, లింగ్పా ఆ బీయూల్‌లోకి వెళ్లకుండా మిగతా అనుచరులను పోగు చేయడానికి వెనక్కి వచ్చారు. దీంతో మహత్తుగల ప్రవేశ మార్గం ద్వారా స్వర్గపు లోయను చూడటానికి బదులుగా లామాతో సహా ఆ బృందంలోని చాలామంది హిమపాతం కారణంగా చనిపోయారు' అని ఈ ఘటనలో బయటపడినవారు చెప్పినట్లుగా పుస్తకంలో షోర్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Image Source/Getty Images)
బీయూల్‌లోకి ప్రవేశించడానికి ఇతరులు విజయవంతమైన ప్రయత్నాలు చేశారు. అందులో షెర్పా ప్రజలు ఒకరు. తూర్పు టిబెట్‌లోని ఖామ్ రీజియన్‌లో వీరు నివసించేవారు. కానీ, 15వ శతాబ్ధంలో టిబెట్‌లో తలెత్తిన పరిస్థితులు షెర్పా ప్రజల జీవితాలను తలకిందులు చేశాయి.
లామా సాంగ్యా డోర్జే, టిబెట్ బౌద్ధ గురువు. కుంబు బీయూల్‌లోకి ప్రవేశించడానికి సరైన సమయాన్ని నిర్ణయించారు. ఆయన ప్రమాదకరమైన నాంగ్పా లా కనుమ (5,716 మీటర్ల ఎత్తు) గుండా తన బృందాన్ని నడిపించారు. వారంతా కుంబు బీయూల్‌కు చేరుకున్నారు.
అక్కడ నీటి సదుపాయం కలిగిన, పంటలు పండించగల సారవంతమైన భూముల్ని వారు కనుగొన్నారు. వారికి ఇదొక స్వర్గంలా అనిపించింది.
ప్రస్తుతం కుంబు రీజియన్ ప్రతీ ఏడాది వేల సంఖ్యలో అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తోంది.
ఇప్పటికీ కుంబు రీజియన్‌లోని కొన్ని ప్రాంతాల్లో బీయూల్ స్ఫూర్తి కనిపిస్తుంది. నేపాల్‌లోని బోతే కోషి నడి వ్యాలీలో 'లవుడో గొంపా' ప్రాంతాన్ని అత్యంత పవిత్రమైన ప్రాంతాల్లో ఒకటిగా పరిగణిస్తారు.
''కుంబు రీజియన్‌లో కేవలం 4 లోయలు మాత్రమే ఉన్నాయని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు'' అని 82 ఏళ్ల దావా సాంగ్యే షెర్పా అన్నారు. ఆమె గత 50 ఏళ్లుగా గొంపాలో నివసిస్తున్నారు. ఆమె కుంబు బీయూల్‌తో లవుడో గొంపా ప్రాంతానికి ఉన్న అనుబంధం గురించి వివరించారు.

ఫొటో సోర్స్, Stuart Butler
''గొంపా వెనకాల 'డ్రాగ్‌కర్మ' అని పిలిచే ఎత్తైన కొండ ఉంటుంది. ఆ కొండ మీద అయిదో లోయకు దారి తీసే రహస్య ప్రవేశ మార్గం ఉంది. అదే బీయూల్‌కు కీలక స్థానం'' అని ఆమె చెప్పారు.
నేను ఆ కొండను చూడగలనా? అని ఆమెను అడిగితే, నవ్వుతూ తల ఊపారు. నీకొకటి చూపిస్తా రా అంటూ నన్ను తీసుకెళ్లారు.
ప్రార్థనా మందిరం వెనుక నుంచి తీసుకెళ్లి ఒక తలుపును తెరిచి ఒక గదిని చూపించారు. ఆ గది ఒక రాయి కింద నిర్మించారు.
ఆ గది లోపలి రాతి పైకప్పుకు నీలం రంగు పేయింట్ వేశారు. అక్కడే పద్మసంభవ విగ్రహంతో ఒక చిన్న మందిరం ఉంది. ఆ విగ్రహం కాళ్ల దగ్గర పర్యాటకులు సమర్పించిన వస్తువులు ఉన్నాయి. అవేంటంటే రాయల్ బ్రిటానియా డైజెస్టివ్ బిస్కెట్స్, నూడుల్స్ ప్యాకెట్, కొన్ని ఎండిన పువ్వులు ఆ విగ్రహం కాళ్ల దగ్గర ఉన్నాయి.
''ఇక్కడే పద్మసంభవ ధ్యానం చేశారు. ఇక్కడ నుంచే 'కుంబు'ను ఒక బీయూల్‌గా మార్చారు'' అని ఆమె చెప్పారు.
ఆ తర్వాత వ్యాలీపై ఉన్న థేమ్ గ్రామానికి వెళ్లమని ఆమె నాకు చెప్పారు. కుంబులోని థేమ్ మఠాన్ని అత్యంత పురాతన మఠాల్లో ఒకటిగా పరిగణిస్తారని ఆమె తెలిపారు. ఆ ప్రాంతం ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యమైనదని అన్నారు.

ఫొటో సోర్స్, Stuart Butler
లవుడో నుంచి థేమ్‌కు వెళ్లే మార్గం అంతా కొండలు, లోయలు, పర్వత శిఖరాలు ఉన్నాయి. వాటి మధ్య థేమ్ గ్రామం ఉంది. థేమ్ మఠం ప్రధాన ప్రార్థన మందిరం తలుపులు తెరిచినప్పుడు అక్కడ నాకు ముగ్గురు వృద్ధ సన్యాసులు కనిపించారు. వారు జపం చేస్తున్నారు. అందులో ఒకరు నన్ను పక్కనే ఉన్న బెంచ్‌పై కూర్చోమని చెప్పారు.
''కొన్నిసార్లు ఇక్కడ మేం ప్రార్థనలు చేస్తున్నప్పుడు మా ఎదుట పద్మసంభవ సాక్షాత్కారం అవుతారు. మేం చేస్తోన్న ప్రార్థనలు, పనులు ప్రపంచానికి మంచిని చేకూర్చుతాయని ఆయన మాతో చెబుతారు'' అని ఒక సన్యాసి గుసగుసగా నాతో చెప్పారు.
కాసేపటి తర్వాత, నేను ఆ తరగతి నుంచి బయటకు వచ్చాను. ఆ తరగతిలో ఉన్నప్పుడు ఆ సన్యాసి, ''నేను నా ఇంట్లో ఉన్నా. స్వర్గంలో ఉన్నా'' అని చెప్పారు.
హిమాలయాల్లో రహస్య లోయలు ఉన్నాయో లేదో తెలియదు. కానీ ఈ బౌద్ధ సన్యాసులు మాత్రం వారికి ప్రశాంతతను చేకూర్చే ప్రదేశాల్లో ఉన్నారని అర్థం అయింది.
అక్కడి నుంచి బయలుదేరగానే క్లాజెల్ చెప్పిన మాట ఒకటి గుర్తొచ్చింది. ''బీయూల్ అనేది కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదు. అది ఒక మానసిక స్థితి'' అని క్లాజెల్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- 'మూత్రాన్ని నోటితో శుభ్రం చేయించేవారు' ... పనిమనిషిని వేధించిన బీజేపీ నేత సీమా పాత్రా ఉదంతం ఎలా వెలుగులోకి వచ్చింది?
- ప్రిజన్ క్యాంప్-120: ఈ జైలులో అసలేం జరిగింది... 50 మంది ఖైదీలు ఎలా కాలి బూడిదయ్యారు?
- కాంగ్రెస్, బీజేపీల్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఎలా జరుగుతుంది?
- మురుగా మఠం అధిపతి స్వామి శివమూర్తిపై లైంగిక వేధింపుల కేసు... అసలేం జరిగింది?
- విక్రాంత్: ఈ విమాన వాహక యుద్ధ నౌకను తయారు చేసేందుకు ఎంత ఖర్చయింది, దీని ప్రత్యేకతలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












