కోవిడ్‌‌కు ముందటి స్థాయికి మించి దూసుకెళ్తున్న భారత పర్యటక రంగంలో ఎదురవుతున్న సవాళ్లేంటి?

వీడియో క్యాప్షన్, కోవిడ్‌‌కు ముందటి స్థాయికి మించి దూసుకెళ్తున్న భారత పర్యటక రంగంలో ఎదురవుతున్న సవాళ్లేంటి?

భారత్‌లో దేశీయ పర్యటకరంగం మళ్లీ ఊపందుకుంది. మహమ్మారికి ముందటి స్థాయిని కూడా దాటి ముందుకు వెళ్తోంది. దీని వల్ల దేశ ఆర్థికవ్యవస్థకు ఎంతో మేలు జరుగుతున్నప్పటికీ... సెలవుల్లో వెల్లువెత్తే పర్యటకుల తాకిడితో పర్యావరణపరంగా సున్నితమైన పర్వత ప్రాంతాలపైన తీవ్రమైన దుష్ప్రభావం పడుతోంది. బీబీసీ ప్రతినిధి నిఖిల్ ఇనామ్‌దార్ అందిస్తోన్న రిపోర్ట్.

మహాబలేశ్వర్‌ను పశ్చిమ కనుమల రారాణిగా పిలుస్తారు.

ఈ పర్వతాల్లో స్వచ్ఛమైన గాలి కోసం, ప్రకృతి అందాలను వీక్షించడం కోసం ఏళ్ల తరబడి పర్యటకులు ఇక్కడికి వస్తున్నారు.

కానీ ఇప్పుడు... ఇక్కడ కనిపిస్తున్నట్టుగా... కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్‌లు సాధారణమైపోయాయి.

చెత్త మేటలుగా పేరుకుపోతోంది.

ఎంతో అందమైన ఈ ప్రాంతమంతా ఇప్పుడు బిల్ బోర్డులు, నిర్మాణ పనులు ఎక్కువైపోయాయి.

మహమ్మారి కాలమంతా ఇళ్లకే పరిమితమైపోయిన పర్యటకులు ఇప్పుడు విజృంభించారు.

ఈ వేసవిలో వచ్చినంత మంది పర్యటకులను గతంలో ఎన్నడూ చూడలేదని హోటల్ యజమానులు చెబుతున్నారు.

ఇక స్థానిక బజార్లలో వ్యాపారం కూడా అదే స్తాయిలో పుంజుకుంది. కోవిడ్‌తో రెండేళ్లపాటు నష్టాల్లో కూరుకున్న వ్యాపారాలు పర్యటకుల తాకిడితో మెల్లిగా కోలుకుంటున్నాయి.

అయితే, దీనికి మరో పార్శ్వం కూడా ఉంది.

అధిక సంఖ్యలో పర్యటకుల తాకిడి కారణంగా ఈ కొండ ప్రాంతం ఒత్తిడికి లోనవుతోంది. ఈ పరిస్థితి ఒక్క మహాబలేశ్వర్‌లోనే కాదు... దేశవ్యాప్తంగా కొండ ప్రాంతాలన్నింటికీ వాటి సామర్థ్యాన్ని మించి పర్యటకులు వస్తున్నారు. దాంతో వాటి సున్నిత జీవావరణం ప్రమాదంలో పడుతోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా... పర్యటకులు వాడి పడేయడంతో కుప్పలుగా పేరుకుపోతున్న చెత్తను మనం చూడొచ్చు.

ఈ కొండల్లోనే పుట్టి పెరిగిన హోటల్ నిర్వాహకురాలు ప్రి శేవక్రమణి.. కొన్నేళ్ల కింద ఓ స్వచ్ఛతా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.

కానీ కొన్నేళ్లుగా ఈ సమస్య పెరుగుతూనే పోతోందని ఆమె అంటున్నారు.

మహాబలేశ్వర్‌లో ఎక్కువ మంది పర్యటకులకు సరిపడే స్థాయిలో మౌలికసదుపాయాల కల్పన జరగలేదు. దాంతో హోటల్స్ నుంచి చెత్త భారీగానే బయటకు వస్తుంది. కాబట్టి, పర్యటకులపై జరిమానా విధించడమే దీనికి అంతిమ పరిష్కారం. అలానే చెత్తను గ్రామాల స్థాయిలో వేరు చేయాలి. స్పష్టమైన చెత్త నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

అంటే పర్యటకుల సంఖ్యను నియంత్రించాల్సిన సమయం వచ్చిందంటారా?

మిగులు ఆదాయాలు పెరుగుతోన్న ప్రస్తుత తరుణంలో - భారత్‌లో దేశీయ పర్యటకరంగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. కానీ ఇది రెండంచుల కత్తిలాంటిది. పర్యటకులకు ఆకర్షణగా ఉన్న ఈ అందమైన ప్రాచీన పర్వత ప్రాంతాలు పర్యటకుల తాకిడి కారణంగానే కళతప్పి పోయే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)