మహారాష్ట్ర: ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందా?

ఫొటో సోర్స్, ANI
ముఖ్యమంత్రి పదవికి శివసేన అధినాయకుడు ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది.
అసెంబ్లీ వేదికగా జూన్ 30న ఉద్ధవ్ ఠాక్రే బలాన్ని నిరూపించుకోవాలని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి సూచించారు. దీనికి వ్యతిరేకంగా శివసేన నాయకులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే, దీనిపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ పరిణామాల నడుమ ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) మద్దతుతో శివసేన ఈ మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో ఇప్పుడు ఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందోనని ఆసక్తి నెలకొంది.
అయితే, శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ శిందే.. కాంగ్రెస్, ఎన్‌సీపీ కూటమి నుంచి శివసేన బయటకు వచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హిందూత్వ సిద్ధాంతాలతో కాంగ్రెస్, ఎన్‌సీపీ సిద్ధాంతాలు సరిపోవడంలేదని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
శివసేన ఏం అంటోంది?
16 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేసే ప్రక్రియలు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో బలపరీక్ష నిర్వహించడం సరికాదని సుప్రీం కోర్టులో శివసేన తరఫు న్యాయవాదులు చెప్పారు. వాదనలను విన్న అనంతరం బలపరీక్షపై నిలుపుదల ఆదేశాలు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
ప్రస్తుతం శిందే దగ్గర 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. శివసేన నుంచి అనర్హత వేటు పడకుండా ఎమ్మెల్యేలతో ఆయన బయటకు రావాలంటే మొత్తం పార్టీ ఎమ్మెల్యేలలో మూడింట రెండొంతుల మంది ఆయన దగ్గర ఉండాలి.
వారం రోజుల నుంచి ఎమ్మెల్యేలతో శిందే గువాహటిలో మకాం వేశారు. తన వెనుక మొత్తంగా 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని శిందే చెబుతున్నారు.
ప్రస్తుతం శివసేన ఎమ్మెల్యేలతోపాటు కొంతమంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా శిందే దగ్గర ఉన్నారు. వీరందరితో కలిసి కొత్త పార్టీ ఏర్పాటుచేయబోతున్నట్లు ఆయన చెప్పారు. అయితే, బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలకు తాము కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టంచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
బీజేపీ పాత్ర ఏమిటి?
రాజకీయ సంక్షోభం నడుమ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్.. రాష్ట్ర గవర్నర్‌ను మంగళవారం కలిశారు. వెంటనే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం బలాన్ని నిరూపించుకునేందుకు బలపరీక్ష నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే, పార్టీకి హాని చేసేలా ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఉద్ధవ్ ఠాక్రే కోరారు. ‘‘శివసేనలో మీకు దక్కే గౌరవం బయట ఎక్కడా దొరకదు. మీరు ఇక్కడికి వస్తే మనం మాట్లాడుకుందాం. సమస్యను పరిష్కరించుకుందాం. శివసేన అధినేతగా నేను మీ గురించి ఆందోళన చెందుతున్నాను. మీరు రండి.. కూర్చొని మాట్లాడుకుందాం’’అని ఉద్ధవ్ ఠాక్రే అభ్యర్థించారు. అయినప్పటికీ పరిస్థితులు అదుపులోకి రావకపోవడంతో ఆయన రాజీనామా చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలదా?
ఈ సంక్షోభంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇది పూర్తిగా శివసేన అంతర్గత వ్యవహారమని మొదట్నుంచీ బీజేపీ చెబుతూ వచ్చింది.
అయితే, శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల వెనుక ఉన్నది బీజేపీనేనని వార్తలు, విశ్లేషణలు వచ్చాయి. మరోవైపు ఇప్పుడు తిరుగుబాటు ఎమ్మెల్యేలతో ఏక్‌నాథ్ సిందే మకాం వేసినది కూడా బీజేపీ పాలిత రాష్ట్రం అస్సాంలోనే.
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తంగా 288 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్టె మరణించారు. దీంతో ఆ స్థానం ఖాళీగా ఉంది.
మొత్తంగా శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్‌సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా కలిసి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు.
ప్రస్తుతం ఇద్దరు ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు అనిల్ దేశ్‌ముఖ్, నవాబ్ మాలిక్ జైలులో ఉన్నారు. వీరిద్దరూ అక్రమ నగదు చెలామణీ కేసులో జైలు వెళ్లారు.
బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేల బలముంది. మరోవైపు బహుజన్ వికాస్ అఘాడీలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ, ఎంఐఎం, ప్రహర్ జనశక్తి పార్టీలకు ఇద్దరేసి ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఎంఎన్ఎస్, సీపీఎం, పీడబ్ల్యూపీ, స్వాభిమాని పార్టీ, రాష్ట్రీయ సమాజ్ పక్ష, జనసురాజ్య శక్తి పార్టీ, క్రాంతికారీ షేట్కారీ పార్టీలకు ఒక్కో ఎమ్మెల్యే ఉన్నారు. వీరితోపాటు మరో 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు.
ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి 144 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇప్పుడు శివసేనకు చెందిన శిందే కూటమి బీజేపీకి మద్దతు ఇస్తే, ఇక్కడ మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది.
శిందే ఇప్పటివరకు మాట్లాడిన అంశాలను పరిశీలిస్తే, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే సంకేతాలు వస్తున్నాయి.
మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేసిన వెంటనే ముంబయిలోని తాజ్ ప్రెసిడెంట్ హోటల్‌లో బీజేపీ అగ్రనాయకులు సమావేశమయ్యారు. దేవేంద్ర ఫడణవీస్‌కు అనుకూలంగా ఈ సమావేశంలో నినాదాలు చేసినట్లు ఏఎన్ఐ వెల్లడించింది.
ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోయేది దేవేంద్ర ఫడణవీసేనని స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణా చెప్పారు. తమ మద్దతు కూడా బీజేపీకి ఉంటుందని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- అబార్షన్లు చేయించుకోవద్దని నిజంగా బైబిల్లో ఉందా, సమర్ధించేవారు ఏమంటున్నారు
- ప్రేమలో పడిపోవడం సరే, మరి బయటపడడం ఎలా? 18వ శతాబ్దికి చెందిన ఓ సన్యాసి చెప్పిన రహస్యాలు
- జగనన్న కాలనీలు: నిర్మాణ సమస్యలపై లబ్ధిదారులు ఏమంటున్నారు, కొందరు పట్టాలు వెనక్కి ఇచ్చేస్తున్నారెందుకు?
- అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ ప్రభుత్వాన్ని కంగారు పెట్టించిన మన్యం వీరుడు, 27 ఏళ్లకే ఎలా కన్నుమూశారో తెలుసా?
- పీవీ నరసింహారావు.. ‘నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














