హాయిగా నిద్ర పట్టాలంటే ఇంట్లో ఎలాంటి మార్పులు చేయాలి?

ఇంటీరియర్ డిజైన్

ఫొటో సోర్స్, Charlie Schuck/ Clarkson Potter

    • రచయిత, డెయిసీ వుడ్‌వర్డ్
    • హోదా, బీబీసీ కల్చర్

హాయిగా నిద్ర పట్టేలా చూడటంతోపాటు మూడ్‌ను మెరుగు పరిచేందుకు ఇంటీరియర్ డిజైన్‌లో చాలా కొత్త విధానాలు కనిపిస్తున్నాయి. ట్రెండ్, లుక్స్‌లకు తక్కువ ప్రాధాన్యమిస్తూ సంతృప్తికి వీనిలో పెద్దపీట వేస్తున్నారు. ఈ ఫీల్ గుడ్ హోమ్స్ ఎలా ఉంటాయో డెయిసీ వుడ్‌వర్డ్ అందిస్తున్న కథనమిదీ.

మనం నివసించే ప్రాంతాలు మన మూడ్‌లను ప్రభావితం చేస్తుంటాయనేది అందరికీ తెలిసిందే. చైనా పద్ధతి ఫెంగ్ సుయీతో మొదలుపెట్టి స్కాండినేవియా విధానం హిగ్గే లాంటివి మన పరిసరాల లుక్స్, లేఅవుట్‌లతో మన ఆరోగ్యాన్ని మరింతగా ఎలా మెరుగుపరచాలో దృష్టిసారిస్తుంటాయి.

అయితే, 1960ల వరకు మన చుట్టుపక్కల పరిసరాలతో మన సంబంధాలను అధ్యయనం చేసే ఎన్విరాన్‌మెంటల్ సైకాలజీని అధ్యయనం చేయాల్సిన విభాగంగానే గుర్తించలేదు. అయితే ఆ తర్వాత వేగం పుంజుకొంది. నేడు ఇంటీరియర్ డిజైన్‌ల కొత్తకొత్త అధ్యయనాలు మొదలవుతున్నాయి.

ఇంటీరియర్ డిజైన్

ఫొటో సోర్స్, Charlie Schuck/ Clarkson Potter

‘‘నేడు మన ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ఇంట్లోని పరిసరాల పాత్రపై దృష్టి సారించడం ఎక్కువైంది’’అని ఫాల్‌మౌత్ యూనివర్సిటీలో ఇంటీరియర్ డిజైన్ ప్రొఫెసర్, ‘‘క్రియేటింగ్ ఇంటీరియర్ అట్మాస్ఫియర్: మైస్-ఎన్-సీన్ అండ్ ఇంటీరియర్ డిజైన్’’ పుస్తక రచయిత జీన్ వైట్‌హెడ్ బీబీసీ కల్చర్‌తో చెప్పారు.

‘‘ఇప్పటికే ఆరోగ్య సదుపాయాల ఇంటీరియర్ డిజైన్స్ ఇలాంటి విధానాలను అనుసరిస్తున్నాయి. అయితే, నేడు ఇవి అతిథ్య రంగాలు, పర్యటక ప్రాంతాలు, ఇళ్లలో కూడా కనిపిస్తున్నాయి’’అని ఆమె అన్నారు.

ఇక్కడ మన అంతిమ లక్ష్యం ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడమే అంటారు వైట్‌హెడ్. ఈ విధానాలు కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి మొదలైన తర్వాత మరింత ఎక్కువయ్యాయని వివరించారు.

లాక్‌డౌన్‌ల సమయంలో కొంతమంది దాదాపు 90 శాతం సమయాన్ని ఇళ్లలోనే గడిపారు. ‘‘ఈ సమయంలోనే అసలు మన ఇళ్లు ఎలా కనిపిస్తున్నాయి? అనే ఆలోచించే విధానం నుంచి అసలు ఇవి మన మూడ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? అనే విధానానికి చాలా మంది వచ్చారు. దీంతో ఇంటీరియర్ డిజైన్‌లో ఇండివిడ్యువాలిటీ, మైండ్‌ఫుల్‌నెస్, సెల్ఫ్‌కేర్ లాంటి అంశాల ప్రాధాన్యం పెరిగింది’’అని వైట్‌హెడ్ వివరించారు.

ఇంటీరియర్ డిజైన్

ఫొటో సోర్స్, Charlie Schuck/ Clarkson Potter

ఎలాంటి ప్రభావం?

ఏళ్లపాటు సేకరించిన కొన్ని వస్తువులు కోవిడ్-19 సమయంలో తమపై ప్రభావం చూపడాన్ని తాము గుర్తించామని ఆన్‌లైన్ డిజైన్ మ్యాగజైన్ ‘‘సైట్ అన్‌సీన్’’ వ్యవస్థాపకులు మోనికా ఖేమ్సురోవ్, జిల్ సింగర్ వివరించారు.

‘‘మేం మా ఇళ్లలోనే చాలాసేపు ఉండేవాళ్లం. మా ఇంట్లో వస్తువులను చూస్తుంటే మాకు చాలా ప్రశాంతంగా అనిపించేవి. వీటి వల్ల మేం ఒంటరులం అనే భావన మాలో కలగడం తగ్గింది’’అని మోనికా చెప్పారు. వీరు ‘‘హౌ టు లివ్ విత్ ఆబ్జెక్ట్స్: ద గైడ్ టు మోర్ మీనింగ్‌ఫుల్ ఇంటీరియర్స్’’ పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. చుట్టుపక్కల ప్రాంతాలతో భావోద్వేగాలు, మూడ్‌లను ఎలా మెరుగుపరచుకోవాలో దీనిలో వివరించారు.

కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయడం, వాటితో భావోద్వేగాలను ఏర్పరచుకోవడం లాంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని మోనికా చెప్పారు. ‘‘కొన్ని వస్తువులతో మనం కొన్ని జ్ఞాపకాలు, బంధాలను ఏర్పరచుకోవచ్చు’’అనే విధానం ఆధారంగా ఇది పనిచేస్తుందని వివరించారు.

ఇంటీరియర్ డిజైన్

ఫొటో సోర్స్, Charlie Schuk/ Clarkson Potter

‘‘మీరంటే ఇష్టమని, మీ శ్రేయస్సు తమకు ముఖ్యమని చెబుతూ స్నేహితులు ఇచ్చే వస్తువే కావొచ్చు, లేదా ఏదైనా విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు మీరు కొన్న వస్తువే కావొచ్చు.. కొన్ని వస్తువులతో కొన్ని జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి. ఒక్కసారి వాటిని చూసిన వెంటనే, ఆప్తులను అవి దగ్గర చేస్తున్నట్లు అనిపిస్తాయి. అయితే, కొన్నిసార్లు అవి చూడటానికి అందంగా కనిపించకపోవచ్చు. కానీ, వాటి వల్ల మీ మూడ్ మెరుగు అవుతుంది’’అని సింగర్ చెప్పారు.

అలా భద్రంగా దాచుకున్న లేదా సేకరించిన వస్తువులను చుట్టూ ఉంచుకున్నప్పుడు మీ మూడ్ కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. మన చుట్టూ ఉండే పరిసరాలు మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే అంశంపై నిపుణులు, సోషల్ సైకాలజిస్టు లిండ్సే టీ గ్రాహం ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘‘మనం ఆ పరిసరాల్లోకి అడుగుపెట్టిన వెంటనే ఎలా ఫీల్ అవుతున్నామో గుర్తించండి. దాని గురించి మరీ ఎక్కువ ఆలోచించొద్దు..’’అని చెప్పారు.

‘‘మొదట ఇప్పుడు నేను ఏమైనా ఒత్తిడికి గురవుతున్నానా?, నేను సంతోషంగా ఉన్నానా’’అని మమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని లిండ్సే సూచించారు. ‘‘ఆ తర్వాత వెంటనే అసలు ఎలాంటి ఫీలింగ్ కోరుకుంటున్నారో గుర్తించండి. అప్పుడు మీకు ఏం కావాలో మీకే తెలుస్తుంది’’అని ఆమె వివరించారు.

ఇంటీరియర్ డిజైన్

ఫొటో సోర్స్, Ana María López

‘‘స్వీట్ హోమ్’’

ఇక్కడ అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మన మూడ్‌ను మెరుపరిచే వస్తువులను గుర్తించడం ఎలా? ఇలా ప్రభావితం చేసే అంశాల్లో కాంతి (లైటింగ్) కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు.

‘‘లైటింగ్ వల్ల మీ చుట్టుపక్కల పరిసరాలు వెంటనే మారిపోతాయి’’అని గ్రాహం అన్నారు. మరోవైపు మన జీవ గడియారంపై కూడా ఇది ప్రభావం చూపిస్తుందని, ఫలితంగా మన శారీరక, మానసిక ఆరోగ్య ప్రభావితం అవుతుందని ఆమె అన్నారు.

‘‘భిన్న రకాల లైట్‌లతో భిన్నరకాల మూడ్‌లను ఎలా ఉత్తేజితం చేయొచ్చనే అంశం చుట్టూ ప్రస్తుతం పరిశోధనలు ఎక్కువగా జరుగుతున్నాయి. మీకు కావాల్సినట్లుగా వార్మ్ లేదా కూల్ బల్బులను ఎంచుకోవచ్చు’’అని ఎన్విరాన్‌మెంట్ సైకాలజిస్టు సల్లీ అగస్టిన్ చెప్పారు.

‘‘మీరు మనసును ప్రశాతంగా ఉంచే పర్యావరణం కోసం చూస్తుంటే సాఫ్ట్ లేదా వార్మ్ లైట్‌లను ఎంచుకోవాలి. అలా కాకుండా ఏకాగ్రతను పెంచుకోవాలి అనుకుంటే కూల్ లేదా వెలుగు కాస్త ఎక్కువగా ఉండే లైట్‌లను ఎంచుకోవాలి’’అని ఆమె చెప్పారు.

‘‘టేబుల్ టాప్ లేదా ఫ్లోర్ ల్యాంప్స్ నుంచి తక్కువ తీవ్రతతో వచ్చే వార్మ్ లైట్ మనపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అదే కూల్ లైట్స్ అయితే, సీలింగ్ లేదా లైటింగ్ సాకెట్స్‌లో ఏర్పాటుచేసుకోవాలి’’అని అగస్టిన్ సూచించారు.

వీడియో క్యాప్షన్, నిద్ర సరిగా పోని వాళ్ళకు సాయం చేసే గుణం తగ్గిపోతుందా?

డిజైన్‌లు కూడా..

కొన్నిసార్లు మన చుట్టుపక్కల పరిసరాల డిజైన్‌లు, టెక్స్చర్‌లు కూడా మనపై ప్రభావం చూపిస్తాయి.

‘‘ఉదాహరణకు మనకు బాగా తెలిసిన లేదా పరిచయమున్న డిజైన్‌లు మనలో ప్రశాంతతను పెంచుతాయి. హాయిగా విశ్రాంతి తీసుకునేందుకు తోడ్పడతాయి. ఒకవేళ మీరు భిన్న రకాల డిజైన్‌లను వాడితే, వాటి మధ్య కాస్త ఖాళీ స్థలం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి’’అని అగస్టిన్ సూచించారు.

‘‘మృదువుగా కనిపించే శిశువుల బట్టలను పోలిన సాఫ్ట్ మెటీరియల్స్‌తో మన మూడ్ చాలా ప్రశాంతంగా మారుతుంది. ఇవి శబ్దాలను కూడా మెరుగ్గా అదుపుచేయగలవు. ఫలితంగా ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటుచేస్తాయి’’అని ఆమె అన్నారు.

ఇంకో విధంగా ప్రశాంతతను ఇంట్లోకి ఆహ్వానించొచ్చు కూడా. అదే సహజసిద్ధమైన ప్రకృతికి ప్రతిబింబాలను మన ఇంట్లో పెట్టుకోవడం. ఇక్కడ మొక్కల గురించి మన ప్రధానంగా చెప్పుకోవాలని అగస్టిన్ అన్నారు.

నేచురలిస్ట్ లేదా బయోఫీలిక్ డిజైన్‌లలో భాగంగా మొక్కలతోపాటు మరిన్ని ప్రకృతికి అద్దంపట్టే వస్తువులను ఇంటీరియర్ డిజైన్‌లలో ఉపయోగిస్తున్నారు. ‘‘వీటిలో ఇంట్లో భిన్నరకాల ఆకృతులను పెట్టుకోవడం ఒకటి. దీనిలో భాగంగా వంపులు తిరిగిన, 3డీ రూపాలను ఇళ్లలో పెడుతున్నారు. ప్రకృతిలో సహజసిద్ధంగా కనిపించే కొన్ని ఆకృతులకు అద్దం పట్టేలా ఇవి ఉంటాయి. వీటితోపాటు ఎలాంటి పెయింట్లూ వేయని చెక్కతో చేసిన ఆకృతులను కూడా ఇంట్లో పెడుతున్నారు. ఇవి మనలో ఒత్తిడి స్థాయిలను తగ్గించగలవు’’అని ఆమె వివరించారు.

వీడియో క్యాప్షన్, గురక: నిద్రలోనే మీ ప్రాణాలు తీస్తుందా

అసలు దేని కోసం ఈ పరిసరాలను ఉపయోగించాలని అనుకుంటున్నాం అనే దానికి అనుగుణంగా వాటిని సిద్ధం చేసుకోవాలి. ఇంట్లో ఎక్కువ మంది ఒకే సమయంలో ఉండేటప్పుడు.. మాట్లాడుకోవడానికి వీలుగా ఫర్నీచర్‌ను సిద్ధం చేసుకోవాలి.

‘‘ఇతరులతో మాట్లాడేందుకు వీలుగా, అందరూ సంభాషణలో పాలుపంచుకునేందుకు, వినేందుకు అనువుగా ఫర్నీచర్ ఉండాలి. ఇక్కడ ఎత్తు, ఆకారం దాదాపు అంతా ఒకేలా ఉండేలా చూసుకోవాలి’’అని గ్రాహం సూచించారు.

పరిసరాలను మన మూడ్‌ మెరుగు పరచుకునేలా చూసేందుకు ఇలాంటి మార్గాలు చాలా ఉన్నాయి. వీటిలో రంగు కూడా ఒకటని అగస్టిన్ చెప్పారు.

‘‘లేత రంగులు కూడా మనలో ప్రశాంతతను కలుగచేస్తాయి. లేత ఆకు పచ్చ, తెలుపు రంగులు దీనికి బాగా ఉపయోగపడతాయి. కాస్త ముదురు రంగులు ఇతరుల్లో స్నేహభావానికి సూచికలుగా ఉంటాయి’’అని గ్రాహం చెప్పారు.

‘‘ఫర్నీచర్ కావొచ్చు. కళాకృతులు కావొచ్చు. లేదా లైట్‌లు కావొచ్చు. అన్నీ మన మూడ్‌లపై ప్రభావం చూపుతాయి’’అని గ్రాహం వివరించారు.

వీడియో క్యాప్షన్, ‘నిద్ర పట్టదు, చనిపోవాలని అనిపిస్తుంటుంది’

నిద్రకు ఇలా..

మన పడక గదిలో మార్పులు చేసుకోవడం ద్వారా రాత్రిపూట హాయిగా నిద్రపట్టేలా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

‘‘ఇక్కడ మనం రాత్రిపూట చేసే పనులను ముందుగా దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా మనలో ఆందోళన, ఆలోచనలకు దారితేసే అంశాలను అక్కడకు తీసుకెళ్లకూడదు. వార్మ్ లైట్లు, మృదువైన డిజైన్లతో మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఫలితంగా హాయిగా నిద్రలోకి జారుకోవచ్చు’’అని అగస్టిన్ చెప్పారు.

‘‘నిద్రలోకి జారుకొనేందుకు ప్రయత్నించే క్రమంలో కొందరిలో ఆందోళన పెరుగుతుంది. అలాంటప్పుడు చుట్టుపక్కల పరిసరాలు మనలో ప్రశాంతతను పెంచేలా చూసుకోవాలి. ముఖ్యంగా డోర్ మనకు కనిపించేలా చూసుకోవాలి. ఇది పరిణామక్రమంలో భాగంగా మనలోకి వచ్చిన ఆలోచన. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే తలుపు గుర్తొస్తుంది. అదిమనకు కనిపించినప్పుడు కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది’’అని ఆమె వివరించారు.

అయితే, మన ఇళ్లతో మన అనుబంధం పెరిగేలా లోపలి పరిసరాలు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘మన ఇల్లు మ్యూజియంలా ఉండాలని అనుకోకూడదు. అక్కడ కొన్నింటిని కనీసం ముట్టుకోవడానికి కూడా వీలుండదు. ఇక్కడ మన ఇంట్లో వస్తువులను మనం ఎంత ముట్టుకుంటే వాటితో అంత అనుబంధం పెరుగుతుంది’’అని మోనికా అన్నారు.

మన ఇల్లు ఎంత పెద్దదైనా లేదా చిన్నదైనా మన భావోద్వేగాలు, ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా దాన్ని మార్చుకోవచ్చని గ్రాహం చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)