‘మహిళలు ప్రతిరోజూ గంట అదనంగా నిద్రపోతే 14 శాతం ఎక్కువగా సెక్స్‌లో పాల్గొంటారు’

నిద్రపోతున్న యువతి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బీబీసీ రీల్
    • హోదా, .

నిద్ర విషయంలో రాజీపడితే మంచి భాగస్వామిగా ఉండడంలో వెనుకబడిపోతారని, సెక్స్ జీవితం దెబ్బతింటుందని బిహేవియరల్ సైంటిస్ట్ డాక్టర్ వెండీ ట్రాక్సెల్ అంటున్నారు.

నిద్రకు జంటల లైంగిక జీవనానికి, ఆరోగ్యానికి సంబంధం ఉందని అధ్యయనాలూ సూచిస్తున్నాయని ఆమె చెబుతున్నారు.

వెండీ 15 ఏళ్లుగా నిద్రపై అధ్యయనం చేస్తూ జంటల నిద్రారీతులను, ప్రవర్తనలను నిశితంగా పరిశీలించారు.

నిద్ర అనేది వైయుక్తిక ప్రవర్తన కాదని, జంట ప్రవర్తన అని ఆమె చెబుతున్నారు.

మంచంపై భార్య, భర్తలు

ఫొటో సోర్స్, Getty Images

నిద్ర తగ్గితే నష్టాలివీ....

‘‘గత 15 ఏళ్లుగా నిద్రపై అధ్యయనం చేస్తున్నాను. నిద్ర అనేది ఆరోగ్యానికి సంబంధించిన ఒక ప్రవర్తన. అయితే, ఇది జంటల ప్రవర్తన. నిద్రపై అధ్యయనం చేసే చాలామంది దీన్ని వైయుక్తిక ప్రవర్తనగా భావిస్తారు.

మీరు నిద్ర విషయంలో రాజీ పడితే ఒక మంచి భాగస్వామిగా ఉండడంలో వెనుకబడిపోతారు. మూడీగా మారిపోతారు.. డిప్రెషన్‌లోకి వెళ్తారు. ఘర్షణపూరితవాతావరణంలోకి వెళ్తారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతింటాయి’’ అన్నారు డాక్టర్ వెండీ.

‘పార్టనర్ ఎమోషన్స్ అర్థం చేసుకోలేరు’

‘నిద్ర తగ్గితే సహానుభూతి చెందడం తగ్గిపోతుంది. పార్టనర్ ఎమోషన్స్ అర్థం చేసుకోవడంలో విఫలమవుతారు.

నిద్ర అనేది కేవలం మీ ఒక్కరి ఆరోగ్యం, మంచిచెడ్డలు,ఉత్పాదకతలకు మాత్రమే కీలకం కాదు.. మీ నిద్ర మీ భాగస్వామికీ కీలకమే. మీ ఇద్దరి మధ్య ఆరోగ్యకర అనుబంధానికి నిద్ర ఎంతో కీలకం’ అన్నారు డాక్టర్ వెండీ.

నిద్రపోతున్న, కలలు కంటున్న యువతి

ఫొటో సోర్స్, Getty Images

మంచి నిద్ర మంచి సెక్స్‌కు దారి అంటారెందుకు?

‘‘సుఖ నిద్రే సుఖ దాంపత్యం అంటాను నేను. దీనికి చాలా కారణాలున్నాయి.

ప్రస్తుత సమాజంలో సుఖ నిద్ర అనేది కరవవుతోంది. అందరూ సుఖ నిద్ర గురించే మాట్లాడుతున్నారు. నిద్రకు సమయం కావాలని కోరుకుంటున్నారు.

మంచిగా నిద్రపోయే అవకాశం ఉన్న స్నేహితులను బంధువులను చూసి అసూయ చెందుతున్నారు కూడా’ అని చెప్పారామె.

వీడియో క్యాప్షన్, నిద్ర సరిగా పోని వాళ్ళకు సాయం చేసే గుణం తగ్గిపోతుందా?

‘మగవాళ్లు తక్కువ నిద్రపోతే టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంది’

‘‘నిద్రకు, సెక్సువల్ యాక్టివిటీకి నేరుగా సంబంధం ఉంది. నిద్ర, సెక్సువల్ హార్మోన్ల మధ్యా సంబంధం ఉంది.

ఉదాహరణకు.. పురుషుల విషయంలో చూసుకుంటే వరుసగా కొన్ని రోజుల పాటు రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతే వారిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ 10 శాతం తగ్గిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆ టెస్టోస్టెరాన్ తగ్గుదల ప్రభావం పురుషుడి వయసుపైబడిన ఛాయలు పెరగడానికి కారణమవుతుంది’’

వీడియో క్యాప్షన్, ‘నిద్ర పట్టదు, చనిపోవాలని అనిపిస్తుంటుంది’

ఆడవాళ్లు రోజుకో గంట అదనంగా నిద్రపోతే 14 శాతం అధికంగా సెక్స్‌లో పాల్గొంటారు

‘మహిళల విషయానికొస్తే నిద్రకు, వారి పునరుత్పత్తి సామర్థ్యానికి మధ్య సంబంధం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

మహిళలు ప్రతి రోజు అదనంగా ఒక గంట నిద్రపోతే వారు సెక్స్‌లో పాల్గొనే ఫ్రీక్వెన్సీ 14 శాతం పెరుగుతుంది.

తగినంత నిద్రపోవడం, కొంత అదనంగా నిద్రపోవడమనేది జంటల సెక్స్ జీవితానికి ఉద్దీపన అని అధ్యయనాలు చెబుతున్నాయి’ అన్నారు వెండీ.

నిద్రపోతున్న యువతి

ఫొటో సోర్స్, Getty Images

నిద్రాభంగం..

ఒంటరిగా పడుకున్నప్పుడు కంటే కలిసి పడుకున్నప్పుడు చాలామంది నిద్ర అలవాట్లు సరిగా ఉండవని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇద్దరి నిద్రాకాలం, నిద్ర వ్యవధి సమానంగా ఉంటే మానసిక, శారీరక, లైంగిక ఆరోగ్యం బాగుంటుంది.

కానీ ఇద్దరి నిద్ర సింక్ కాకుంటే సమస్య ఏర్పడుతుంది.

జంటలో ఒకరి అలవాట్ల కారణంగా మరొకరికి నిద్రాభంగమయ్యే అవకాశాలుంటాయి.

పైన కాలు వేయడం, మంచమంతా తామే ఆక్రమించుకోవడం, గురకపెట్టడం వంటి కారణాల వల్ల జంటలో రెండోవారి నిద్రకు భంగం కలుగుతుంది.

అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, చంటిపిల్లలు ఉన్నప్పుడు కూడా జంటల నిద్రలో సమతూకం ఉండదు.

వయసు పైబడిన జంటలలో ఆరోగ్య సమస్యలు, నిద్రలేమి సమస్యలు, మెనోపాజ్ సమస్యలు వంటి కారణాల వల్ల నిద్రాకాలం ఒకటే అయినా నిద్ర వ్యవధి మారిపోతుంది.

గది ఉష్ణోగ్రతలు, పరుపులు వంటివన్న నాణ్యమైన నిద్రలో కీలకాంశాలే.

ఈ సమస్యలను అర్థం చేసుకుని సరి చేసుకోవడమో, పరిష్కారాలు వెతుక్కోవడమో చేస్తే నాణ్యమైన నిద్రకు అవకాశమేర్పడుతుంది.

ఫలితంగా శారీరక, మానసిక, లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్తున్నారు వెండీ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)