ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని మాత్రమే కాదు, అవతరణ దినోత్సవమూ ఒక గందరగోళమేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జింకా నాగరాజు
- హోదా, బీబీసీ కోసం
దాదాపు ఆరు దశాబ్దాలపాటు నవంబర్ 1న తెలుగు వాళ్లు ఆంధ్రప్రదేశ్ అవతోరణోత్సవాలు జరుపుకుంటూ వచ్చారు.
2014లో ఈ రాష్ట్రం రెండుగా విడిపోయి తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో ఉన్నట్లుండి ఈ తేదీ ప్రాముఖ్యం కోల్పోయింది. ఈ తేదీ చుట్టూ ఉన్న భావోద్వేగం ఒక్కసారిగా చల్లబడి పోయింది. ఎన్ని పాటలు, ఎంత సాహిత్యం, ఎన్ని గాథలు, ఎంత చరిత్ర... అంతా చరిత్ర పాఠ్యపుస్తకంలో ఒక ప్రాముఖ్యంలేని అధ్యాయంగా మిగిలిపోయింది.
దాదాపు ఆరేడేళ్లుగా ఈ తేదీని ఏం చేసుకోవాలో తెలియని గందరగోళంలో ఆంధ్రప్రదేశ్ ఉండింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబర్ ఒకటిని మర్చిపోయి, నవ్యాంధ్రప్రదేశ్ అవతరణ జూన్ 2న కాబట్టి ఆరోజును నవనిర్మాణ దినంగా జరుపుకోవాలన్నారు.
2019లో ముఖ్యమంత్రి అయిన వైసీపీ జగన్మోహన్ రెడ్డి....కాదు, నవంబర్ 1నే రాష్ట్ర అవతరణ అన్నారు. నవంబర్ 1, 1956లో ఏర్పడిన విశాల ఆంధ్రప్రదేశ్ ఇపుడు ఉనికిలో లేదు. నిజానికి 1953 నాటి ఆంధ్ర స్థాయికీ కుంచించుకు పోయింది. కాబట్టి నవంబర్ 1న అవతరణోత్సం జరుపుకోవడం సరికాదు అని కొందరు అంటున్నారు.
ఇపుడు మిగిలింది ఆంధ్ర రాష్ట్రమే కాబట్టి 1953, అక్టోబర్ 1 ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినాన్నే రాష్ట్రావతరణ దినంగా పాటించాలని కొందరు సూచిస్తున్నారు. మొత్తానికి ఇపుడున్న ఆంధ్రప్రదేశ్ అవరణ దినోత్సవ తేదీ ఒక గందరగోళమే.
అసలే రాజధాని తేల్చుకోలేక గందరగోళంలో ఉన్న రాష్ట్రానికి మరో గందరగోళం తోడయ్యిందన్నమాట. ఈ తేదీలు ఇలా తారుమారు కావడం వల్ల ప్రజల మనోభావాలు ఏమంత దెబ్బతిన్నట్లు అనిపించదు. ఎలాంటి అలజడి లేదు.
పవిత్రమైనదని భావిస్తూ వచ్చిన ఒక తేదీ మీద ప్రజల్లో ఉన్నట్లుండి ఇంత నిర్లిప్తత ఎందుకొచ్చింది? కారణం ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్ అవతరణ ఎవరికి అవసరమైంది?
దీనికి కారణాలను ఆంధ్రప్రదేశ్ అవతరణకు దారితీసిన పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. ఆంధ్ర రాష్ట్రం లాగానో, తెలంగాణ లాగానో పోరాడి తెచ్చుకున్నది కాదు ఆంధ్రప్రదేశ్. కేవలం వాదోపవాదాల ద్వారా సాధించుకున్నదే. ఇంకా స్పష్టంగా చెబితే ఆంధ్రప్రదేశ్ ఏర్పడటంలో ప్రజాఉద్యమం కనిపించదు.
అవకాశవాదం, పదవీ కాంక్ష, కుల రాజకీయాలు, కమ్యూనిష్టులను ఓడించడం ప్రముఖంగా కనిపిస్తాయని పలువురు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. తెలుగు వారంతా ఒక రాష్ట్రంగా ఉంటే బాగుండునన్న ఆకాంక్ష అప్పటికి కొందరికి ఉంటే ఉండవచ్చు గాక, కానీ సామూహిక వ్యక్తీకరణ రూపంగా భావించే సామాజిక చలనం ఉద్యమం లాగా అయితే కనిపించలేదు. రాజకీయ వ్యూహాల్లో భాగంగా అయితే స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రముఖ పరిశోధకుడు గౌతం పింగ్లే దీనిని మూడు ముక్కల్లో చక్కగా చెప్పారు. ఒక సెంటిమెంటు లేదు... ఒక లాజిక్ లేదు... ఎస్‌ఆర్‌సీ రికమండేషన్ లేదు... దానికి తోడు ప్రధాని నెహ్రూ వ్యతిరేకి... అయినా ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం వింత. ఈ వింత వెనక ఉన్న కారణాలను ఆయన ఇలా చెప్పారు.
1. తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్‌లో పారిశ్రామికీకరణ వల్ల ఆర్థికాభివృద్ధి జరిగి అదనపు నిధులున్నాయి. వెనకబడిన ఆంధ్రాకు నిధుల కొరత ఉంది.
2. ఆంధ్రలో రాజధాని కర్నూలా, విజయవాడయా, మరొకటా తేల్చుకోలేక పోతున్నారు. నిర్మాణానికి నిధుల్లేవు. హైదరాబాదు రాజధాని అయితే, రాజధాని సమస్య పరిష్కారం అవుతుంది.
3. రెండు రాష్ట్రాలలో కమ్యూనిస్టులు బలపడుతున్నారు. తొందర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారేమో అన్నంత పరిస్థితి వుంది.
కమ్యూనిస్టులు బలపడేందుకు కారణం భూమి, భుక్తి, విముక్తి అంటూ వారు చేసిన సామాజిక, సాంస్కృతిక పోరాటాలు. అందువల్లే వారు విశాలాంధ్రకు నిస్సంకోచంగా మద్దతు ప్రకటించారు అని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన మాజీ ఆచార్యుడు ప్రొ.కర్లి శ్రీనివాసులు చెప్పారు.
ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలు విలీనమైతే కాంగ్రెస్ కూడా విలీనమై బలపడుతుంది. ఆంధ్ర రాష్ట్ర ఆలోచనలాగానే ఆంధ్రప్రదేశ్ ఆలోచన కూడా కోస్తాలోనే పుట్టిందని 'ఎమర్జెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్'లో కేవీ నారాయణ రావు రాశారు.
విశాలాంధ్ర ఏర్పాటులో ఉన్న ప్రయోజనాలు గ్రహించాక తెలంగాణ నేతలు కూడా ఆ నినాదం అందుకున్నారు. కమ్యూనిస్టులు తమ భవిష్యత్తుపై అంచనాలేక ఆ నినాదం అప్పటికే అందుకుని ఉన్నారు.

ఫొటో సోర్స్, Tulika books
ఆంధ్రప్రదేశ్ (విశాలాంధ్ర) ఆలోచన నేపథ్యం
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తర్వాత భాష చుట్టూ మారిన సెంటిమెంట్ల నుంచి చూస్తే గతం అర్థం కాకపోవచ్చు. తెలంగాణలో కూడా తెలుగు, తెలంగాణ అనే మాటకంటే ఆంధ్ర అనే మాటకే ప్రాముఖ్యం ఇచ్చారు.
బ్రిటిష్ ఇండియాలో ఉన్న తెలుగు ప్రాంతాలతో పాటు, నైజాంలో ఉన్న తెలుగు ప్రాంతాలు కూడా కలసి ఒక ఒక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలనే భావన రెండు ప్రాంతాల్లో ఉండింది. ఆ భావన దాదాపు ఒకే సారి మొదలయిందనవచ్చు. తెలంగాణ అనే కంటే ఆంధ్ర అనే మాటే తెలంగాణ రాజకీయాల్లోకి బాగా వాడుకలో ఉండేది.
నిజాం ఆంధ్ర మహాసభ అంటే ఏమిటి? నిజాం ఆంధ్ర మహాసభ కార్యకలపాలు చూసి ఒక దశలో నిజాం ప్రభుత్వానికి కూడా అనుమానం వచ్చింది.
నవాబ్ అలీ యార్ జంగ్ బహదూర్ మాడపాటి హనుమంతరావుతో వాకబు చేస్తూ ‘‘ఇక్కడ ఉన్న తెలంగాణ తెలుగు జిల్లాలను మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న తెలుగు జిల్లాలతో కలిపేందుకు మీరు నైజాం ఆంధ్ర మహాసభ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది’’ అని అన్నారు.
అలాంటి పనులు తాము చేయమని హనుమంతరావు భరోసా ఇవ్వాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, PhuleEducationalCircle
హైదరాబాద్ సంస్థానంలో ఉన్న తెలుగు వాళ్లు కూడా తమను ఆంధ్రులమనే చెప్పుకునే వాళ్లు. నైజాం ఆంధ్రమహాసభ ఆరో సభ(1937)లో ఒక చర్చ జరిగింది. మద్రాసు ప్రెసిడెన్సీలో ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ ఉన్న రోజులవి. అయితే, ఇక్కడి తెలుగు వాళ్లు హైదరాబాద్ సంస్థానం నుంచి విడిపోయి, మద్రాసు తెలుగువాళ్లతో కలవాలన్న భయాలొద్దు, స్విట్జర్లాండ్ లాగా మూడు భాషల సంయుక్త రాష్ట్రంగా ఉంటే బాగుంటుందని సభ అధ్యక్షుడు ఎం.నరసింగరావు అభిప్రాయపడ్డారు.
అంటే అర్థం ఏమిటి, తెలుగు వాళ్లంతా కలసి ఒక రాష్ట్రంగా ఉండాలన్న ఆలోచనకు బీజాలుపడ్డాయనేగా. అయితే, హైదరాబాద్‌లో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఇలాంటి చర్చ చేయడం మానుకున్నట్లు కనిపిస్తుంది. అక్కడ రాజకీయ సభల మీద నిషేధం ఉంది. అందుకే హైదరాబాద్ రాజకీయ సభలు బయటి రాష్ట్రాలలో జరుగుతూ వచ్చాయి.
ఇక మద్రాసు ప్రాంతంలోని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాత్రం తెలంగాణ జిల్లాలను కూడా కలుపుకోవాలనే కలలుకంటూ వచ్చింది. తెలుగు వాళ్లంతా ఉండే ఒక తెలుగు రాష్ట్రం ఉంటే బాగుంటుందని 1937 ప్రాంతంలో ప్రొఫెసర్ మామిడిపూడి వెంకటరంగయ్య సూచించారు. ఆయన కేరళ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు ఏర్పడితే తప్పేంటని ప్రశ్నించారు.
ఇలా తెలుగు వాళ్లకి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉంటే బాగుంటుందనే చర్చల మధ్య, 1942 అక్టోబర్ నెలలో గుంటూరులో జరిగిన ఆంధ్ర మహాసభ 'విశాలాంధ్ర' రాష్ట్రం ఏర్పాటుకోసం కృషిచేయాలని తీర్మానం ఆమోదించింది. తర్వాత 1943(బళ్లారి), 1946 (గుంటూరు) ఆంధ్ర మహాసభ సమావేశాలలో విశాలాంధ్ర భావం బలపడింది.
ఇదే సమయంలో కమ్యూనిస్టులు కూడా విశాలాంధ్ర కు డిమాండ్ చేశారు. 1937లో వాళ్లు తొలిసారి విశాలాంధ్రకు మద్దతు పలికారు. జాతులకు స్వయం నిర్ణయాధికారం ఉండాలనే సూత్రం ప్రకారం వాళ్లు తెలుగు, కన్నడ, తమిళ తదితరు భాషల వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలన్నారు. ఆంధ్రా కమ్యూనిస్టుల రంగ ప్రవేశంతో విశాలాంధ్రభావనకు రెక్కలొచ్చాయి.
తెలుగుజాతి వైభవాన్ని కీర్తిస్తూ పాటలు పద్యాలు వచ్చాయి. మూడు కోట్ల తెలుగువాళ్లు ఒక్కటవ్వాలని నినాదం పుట్టింది. పుచ్చలపల్లి సుందరయ్య 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం' అనే పుస్తకం కూడా రాశారు. అయితే, కొందరు తెలంగాణ కమ్యూనిస్టులు మాత్రం స్వతంత్ర హైదరాబాద్ అంటూ ఒక దశలో భిన్న స్వరం వినిపించారు.
1948 సెప్టెంబర్ పోలీస్ యాక్షన్ తర్వాత హైదరాబాద్ భారత్‌లో విలీనం అయ్యాక చాలా మంది ఆంధ్ర, తెలంగాణ ప్రముఖలు ఇక విశాలాంధ్ర, సంయుక్త కర్నాటక, సంయుక్త మహారాష్ట్రల కోసం కృషి మొదలుపెట్టాలని నిర్ణయించారు.
హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ పోలీస్ యాక్షన్ తర్వాత విశాలాంధ్ర ను సమర్థిస్తూ తీర్మానం చేసింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్‌ను పరిశీలించేందుకు వేసిన కమిటీ మద్రాసు సందర్శించినపుడు తెలుగువాళ్లు అందించిన వినతి పత్రాల్లో మద్రాసు, హైదరాబాద్ తెలుగు ప్రాంతాలను కలుపుతూ విశాలాంధ్ర ఏర్పాటుచేయాలని కూడా కొందరు కోరారు.
అపుడు విశాలాంధ్ర క్యాంపెయిన్ బలంగా చేస్తున్నవారిలో అయ్యదేవర కాళేశ్వరరావు ఒకరు. ఆయన ఒక దశలో హైదరాబాద్ సందర్శించినపుడు భవిష్యత్తులో ఆంధ్రుల రాజధాని హైదరాబాద్ అవుతుందని కొందరు మరాఠా నేతలు కూడా అన్నారట. ఇలాంటి ఆలోచనలు చేసేందుకు ఇది అనువైన సమయం కాదని కాళేశ్వరరావును సర్దార్ పటేల్ వారించినట్లు చెబుతారు.
ఆంధ్ర రాష్ట్రం కంటే విశాలాంధ్ర సాధించేందుకు ఉద్యమించడం మంచిదని ఆయన ఆలోచన. 1949లో ఆంధ్ర రాష్రం ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మొగ్గు చూపాక కూడా అయ్యదేవర తన ప్రయత్నాలు ఆపలేదు. 1949 నవంబర్ 26న ఆయన విజయవాడ కేంద్రంగా విశాలాంధ్ర మహాసభను ఏర్పాటు చేశారు.
మద్రాసు, ఒరిస్సా, మధ్య ప్రదేశ్, హైదరాబాద్, మైసూర్ స్టేట్స్‌లో ఉన్న మూడున్నర కోట్ల తెలుగు వారి సమైక్యత సాధ్యమయినంత తొందరగా సాధించేందుకు వీఎంఎస్ కృషి చేస్తుందని ఆయన ప్రకటించారు.

ఫొటో సోర్స్, Rajyasabha
గవర్నర్ జనరల్ రాజగోపాలాచారికి మాత్రం విశాలంధ్రయోచన నచ్చ లేదు. 1949 డిసెంబర్‌లో హైదరాబాద్ సందర్శించినపుడు ఆయన చాలా స్పష్టంగా హైదరాబాద్‌ను భాషను బట్టి ముక్కలు చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వాయిదా పడుతూ వస్తున్న కొద్ది విశాలాంధ్ర డిమాండ్ బలపడుతూ వచ్చింది. 1950 జనవరిలో వీఎంఎస్ స్టాండింగ్ కమిటీ వరంగల్‌లో సమావేశమై ఒక ఆసక్తికరమయిన తీర్మానం చేసింది.
అందులో మూడు అంశాలున్నాయి. ఒకటి ఆంధ్ర రాష్ట్రం తక్షణం ఏర్పడాలి. తర్వాత హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రదేశం ఏర్పడాలి. ఆపైన తెలంగాణ, ఉత్తర సర్కార్ ప్రాంతాలను కమ్యూనిస్టుల నుంచి విముక్తి చేయాలి. ఈ సమావేశానికి మద్రాసు ప్రాంతానికి చెందిన తెలుగు ప్రముఖులు టంగుటూరి ప్రకాశం, సాంబమూర్తి, కోటిరెడ్డి, పి.తిమ్మారెడ్డి హాజరయ్యారు.
ఆ తర్వాత నెల రోజులకే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఒక తీర్మానం చేసి, హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు విభాగాలు చేసి ఆయా భాషల రాష్ట్రాలకు ఈ ముక్కలను బదలాయించాలని కోరింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ వ్యవహారం నెహ్రూకు నచ్చలేదు
అయితే, హైదరాబాద్‌ను తెలుగు, కన్నడ, మరాఠా ప్రాంతాలుగా విడగొట్టాలన్న ఆలోచన ప్రధాని నెహ్రూకు నచ్చలేదు. ఆయనకు ఈ చిన్న రాష్ట్రాల గొడవే బాగా లేదు. విశాలాంధ్ర ప్రస్తావన తెచ్చినందుకు ఆయన కాళేశ్వరరావును మందలించారు కూడా.
తర్వాత మనసు విరిగిన కాళేశ్వరరావు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనే కోరి మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. 1952లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

ఫొటో సోర్స్, POTTISRIRAMULUMEMORIAL/AMARAJEEVISAMARAGAATHA
నాటి తెలంగాణ ప్రాంత నేతల్లో ఊగిసలాట
హైదరాబాద్ విభజన, విశాలాంధ్ర ఏర్పాటు పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియక, చాలామంది తొలుత విశాలాంధ్ర, ఆంధ్రదేశం అని ఉబలాట పడ్డారు. చర్చల్లో ఉన్నంత వరకు ఈ సమస్య బాగానే ఉండింది.
1953 అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్టం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ భవిష్యత్తు సమస్య కళ్లెదుట ప్రత్యక్షమయింది. విశాలాంధ్రను నెహ్రూ విస్తరణ కాంక్ష అంటూ వ్యతిరేకిస్తున్నారు. ఇదే అదనుగా తీసుకుని ప్రజా సోషలిస్టు పార్టీకి చెందిన రామ్మూర్తి నాయుడు అనే వ్యక్తి స్వతంత్ర తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదన చేశారు.
నిజానికి ఒక పెద్ద రాష్ట్రంగా ఉండటంకంటే తెలుగు వాళ్లు రెండు చిన్న రాష్ట్రాలుగా ఉంటే బాగుంటుందన్న ఆలోచన కూడా మొదలయింది. ఈ చర్చ మొదలు కావడంతో గతంలో విశాలాంధ్రకు మద్దతు పలికిన అనేక మంది రెండు తెలుగు రాష్ట్రాలు అనే వాదన వైపు మొగ్గుచూపారు. ఉదాహరణకు కేవీ రంగారెడ్డిని తీసుకుంటే, ఆయన ఒక దశలో విశాలాంధ్ర అన్నారు. ఆ మరుసటి సంవత్సరం హైదరాబాద్ పీసీసీ అధ్యక్షుడు కాగానే విశాలాంధ్ర మీద తన నిర్ణయం మార్చుకున్నారు.
ఇలాగే ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు కూడా నిర్ణయం మార్చుకున్నారు. 1953 జూన్ 3న, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ జనరల్ బాడీ సమావేశంలో హైదరాబాద్ విభజనను, విశాలాంధ్ర, సంయుక్త మహారాష్ట్ర, సంయుక్త కర్నాటక ప్రతిపాదనను సమర్థించారు.

ఫొటో సోర్స్, Twitter/Konda Vishweshwar Reddy
అయితే, 1954 జనవరిలో కేవీ రంగారెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యారు. అంతేకాదు, హైదరాబాద్ విభజనకు ఆమోదం తెలిపి, విశాలాంధ్ర ప్రతిపాదన పక్కన పెట్టేశారు. అంతేనా, విభజనానంతరం భవిష్యత్తు గురించి నిర్ణయించుకునే అధికారం ఆయన భాషల వారికే వదిలేయాలనే నిర్ణయానికి వచ్చారు.
దీనితో మరాఠా వాళ్లు మహారాష్ట్రలో, కన్నడ వాళ్లు కర్నాటకలో కలవాలని తీర్మానించినా తెలంగాణ నేతలు ఇలాంటి తీర్మానం చేయలేక పోయారు. అంతేకాదు, 1954 జూన్ 7న జరిగిన ఒక సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడాలనే తీర్మానం చేశారు.
1954 జూన్, జూలై నెలలలో మొదటి ఎస్‌ఆర్‌సీ హైదరాబాద్‌కు వచ్చినపుడు రెండు రాష్ట్రాలుండాలని కొందరు, విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని మరికొందరు వినతి పత్రాలు సమర్పించారు. ఏ పిటిషన్ ఇవ్వనిది బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వమే.

ఫొటో సోర్స్, Getty Images
విశాలాంధ్ర వాదనకు బలం
హైదరాబాద్ రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా లేదు కాబట్టి, తెలంగాణ రాష్ట్రంగా కొనసాగితే, రాజకీయ అస్థిరత వస్తుందని దానికి విశాలాంధ్ర ఏర్పాటు మంచిందని కొందరు వాదించారు.
పెద్ద రాష్ట్రాలు, ఒక రాష్ట్రం, ఒక భాష వంటివి సంకుచిత వాదాలని...అవి జాతీయ సమగ్రతను దెబ్బతీస్తాయని మరికొందరు వాదించారు.
విశాలాంద్ర ఏర్పడితే, ఆంధ్రా వాళ్ల పెత్తనం మొదలవుతుందని... అన్నింటి మీద వాళ్ల అజమాయిషీ పెరిగి తెలంగాణ నేతల ప్రాముఖ్యం తగ్గుతుందనే భావం హైదరాబాద్ ప్రాంతంలో ప్రబలడం మొదలయింది. దీనికి ముల్కీ ఉద్యమం కూడా కారణమయింది.
ఇక అప్పట్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో ఉద్యోగావకాశాల సమస్య ఉండింది. ఇపుడు పక్క తెలుగు ప్రాంతాల నుంచి వచ్చే వారితో సమస్య అవుతుందనే భయం మొదలయింది. ఈ భయం హైకోర్టు నుంచి విశ్వవిద్యాలయం దాక పాకింది. దీనితో విశాలాంధ్రకు వ్యతిరేకత మొదలయింది.
హైదరాబాద్ విభజన జరిగితే, హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలని దీనికోసం ఉద్యమించాలనే వాదన ఉపందుకుంది. ఒక దశలో ఈ ప్రాంతంలోని కమ్యూనిస్టు నేతలు కూడ విశాలాంధ్రను వ్యతిరేకించినట్లు చెబుతారు. మరొక వైపు హైదరాబాద్‌లోని విశాలాంధ్ర వాదులకు, ఆంధ్ర విశాలాంధ్ర వాదులు మద్దతు ప్రకటించారు. విశాలాంధ్ర మహాసభ తమ శాఖలు రాష్ట్రంలో ఏర్పాటు చేసి కార్యక్రమాలు ఉధృతం చేసింది.
ఇలాంటపుడు 1955 సెప్టంబర్ 30న ఎస్‌ఆర్‌సీ నివేదికను సమర్పించింది. హైదరాబాద్ విభజనను, హైదరాబాద్ రాజధానిగా హైదరాబాద్ రాష్ట్రాన్ని ఎస్ఆర్‌సీ ప్రతిపాదించింది. రెండు రాష్ట్రాలు కలసిపోవాలన్న విషయాన్ని హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీకి వదిలేసింది.
ఇలాంటపుడు 1955 అక్టోబర్ 22న జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఆంధ్ర, హైదరాబాద్ ముఖ్యమంత్రులిద్దరు తెలుగు రాష్ట్రాల విలీనానికి అంగీకరించి సంచలనం సృష్టించారు. ఎస్ఆర్‌సీ చెప్పినట్లు 1961 ఎన్నికల దాకా ఆగాల్సిన పని లేదని, తక్షణం చేపట్టవచ్చని సూచించారు.
బూర్గుల మళ్లీ తన నిర్ణయం మార్చుకోవడం పట్ల అంతా అవాక్కయ్యారు. దీనితో హైదరాబాద్-ఆంధ్రాలు విలీనం, ప్రత్యేక రాష్ట్రం వాదులు కార్యక్రమాలు ముమ్మరం చేశారు. విలీనం వ్యతిరేకులు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామని బెదిరించారు. కమ్యూనిస్టులు తక్షణం విలీనం చేయాలన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇదే సమయంలో హైదరాబాద్ అసెంబ్లీ ఎస్‌ఆర్‌సీ నివేదిక మీద చర్చ మొదలుపెట్టింది. సభలో ఉన్న 174 మందిలో 147 మంది మాట్లాడారు. 103 మంది విశాలాంధ్రకు జై అన్నారు. 29 మంది తెలంగాణకు సై అన్నారు. 15 మంది తటస్థంగా ఉన్నారు. అటువైపు ఆంధ్ర అసెంబ్లీ ఒకే రాష్ట్రానికి అనుకూలంగా తీర్మానం ఆమోదించింది. ఈ దశలో తెలంగాణలో ఉన్న అభద్రత భయాన్ని పొగొట్టేందుకు ఇరుప్రాంతాలకు చెందిన పెద్ద మనుషులు సమావేశమయ్యారు.
హైదరాబాద్ నుంచి డాక్టర్ చెన్నారెడ్డి, కేవీ రంగారెడ్డి, జేవీ నర్సింగరావు... ఆంధ్రా నుంచి బెజవాడ గోపాలరెడ్డి, ఎ.సత్యనారాయణ రాజు, నీలం సంజీవరెడ్డి వచ్చారు. ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు అటు ఇటు 'పెద్ద మనుషులు' ఒక ఒప్పందం చేసుకున్నారు.
అయితే, కొత్త తెలుగు రాష్ట్రానికి విశాలాంధ్ర అని కాకుండా ఆంధ్ర్రప్రదేశ్ అని పేరు పెట్టాలని నిర్ణయించారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవంబర్ 1న అవతరించింది. ప్రధాని నెహ్రూ కొత్త రాష్ట్రాన్ని ఆవిష్కరించారు.
వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చినట్లే పోయింది. అపుడూ ఇప్పుడూ ఆంధ్ర ప్రజలు ప్రేక్షకుల్లాగే ఉన్నారు. కాకపోతే నాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తరువాత కమ్యూనిష్టులు పట్టుకోల్పోతూ వచ్చారు. ఇపుడు ఆంధ్రప్రదేశ్‌ను విభజించి కాంగ్రెస్ పతనమయింది. మాసిపోతున్న ఒక తేదీ చెప్పే చక్కటి రాజనీతి కథ ఇది.
(రచయిత అభిప్రాయాలు వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- ఇక్కడ 60 వేల మంది కోటీశ్వరులున్నారు
- కరెన్సీ నోట్ల మీద లక్ష్మీ దేవి, వినాయకుడి బొమ్మలు ముద్రించడం సాధ్యమేనా, కేజ్రీవాల్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఏమంటున్నారు
- మోదీ ప్రభుత్వం ముస్లిం, క్రైస్తవ దళితులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిజంగానే అనుకుంటోందా?
- మునుగోడు ఉపఎన్నిక : ‘ఇక్కడ ఓటుకు ఎంఆర్పీ రేటును ఎలా నిర్ణయిస్తున్నారంటే...’’
- వీర్యం శరీరంపై పడితే అలర్జీ వస్తుందా, ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













