సౌదీ అరేబియా: కూతురిని ఇవ్వరు, ఇచ్చినా దేశం దాటనివ్వరు...మూడేళ్లుగా హోటల్ గదిలోనే బందీ అయిన అమెరికన్ మహిళ

కార్లీ మోరిస్

ఫొటో సోర్స్, CARLY MORRIS

ఫొటో క్యాప్షన్, తన కూతుర్ని అమెరికాకు తీసుకెళ్లడం కోసం కార్లీ మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నారు
    • రచయిత, మైక్ థామ్సన్
    • హోదా, బీబీసీ న్యూస్

సౌదీ అరేబియా జాతీయులను వివాహం చేసుకొని విడాకులు తీసుకున్న అమెరికా, కెనడా, బ్రిటన్‌తో పాటు ఇతర పశ్చిమ దేశాలకు చెందిన మహిళలు తమ పిల్లల కోసం పోరాటం చేస్తున్నారు.

సౌదీ జాతీయునితో వివాహ బంధం నుంచి తప్పుకున్న తర్వాత అక్కడ నుంచి తమ పిల్లలను బయటకు తీసుకురావడానికి ఈ తల్లులు పోరాడుతున్నారు.

ఈ విషయంలో చాలా మంది మహిళలకు తమ సొంత ప్రభుత్వాల నుంచి కూడా అవసరమైన సహాయం అందడం లేదని ఒక కార్యకర్త చెప్పారు.

అయిదేళ్ల కూతురు తాలాతో కలిసి సౌదీ అరేబియాకు చేరుకున్న అమెరికన్ మహిళ కార్లీ మోరిస్‌కు తొలుత అంతా సవ్యంగానే ఉన్నట్లు అనిపించింది.

అమెరికాలో చదువుకుంటున్న సౌదీకి చెందిన వ్యక్తిని కార్లీ మోరిస్ వివాహం చేసుకున్నారు. వారికి పాప పుట్టింది. తర్వాత వారు విడాకులు తీసుకున్నారు.

కార్లీ భర్త ఏడేళ్ల పాటు అమెరికాలో ఉన్నారు. సౌదీలో కొన్ని రోజులు ఉండేందుకు రావాలంటూ అతను కార్లీని ఒప్పించారు. తన తల్లిదండ్రులకు పాపను చూపించడం కోసం కార్లీతో పాటు పాపకు కూడా 30 రోజుల వీసాను ఏర్పాటు చేశారు.

అయితే, తమ కోసం తన మాజీ భర్త బుక్ చేసిన హోటల్‌లోకి వెళ్లగానే కార్లీ ఆందోళన చెందారు. వారి కోసం కేటాయించిన గదిలో కిటికీలు లేవు. ఇంటర్నెట్ సదుపాయం లేదు. ఆ గదిలో కార్లీ ఫోన్‌కు సిగ్నల్స్ కూడా అందలేదు. రోజుల గడుస్తున్న కొద్దీ ఆమెకు మరింత ఎక్కువ ఆందోళన కలిగింది.

''మేం సౌదీకి చేరుకున్న వారం రోజుల తర్వాత నా పాస్‌పోర్ట్, జనన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని ఆయన నన్ను అడిగారు. తాలాకు ఎగ్జిట్ పర్మిట్ అనుమతి పొందడం కోసం ఈ పత్రాలు కావాలని నన్ను అడిగారు. కానీ, ఆయన తాలా పౌరసత్వాన్ని సౌదీకి బదలాయించినట్లు తర్వాత నాకు తెలిసింది'' అని కార్లీ చెప్పారు.

కార్లీ లాగే డజన్ల సంఖ్యలో మహిళలు ఇదే సమస్యతో పోరాడుతున్నారని హ్యుమన్ రైట్స్ ఫౌండేషన్‌కు చెందిన బెథాని అన్నారు

ఫొటో సోర్స్, BETHANY ALHAIDARI

ఫొటో క్యాప్షన్, కార్లీ లాగే డజన్ల సంఖ్యలో మహిళలు ఇదే సమస్యతో పోరాడుతున్నారని హ్యుమన్ రైట్స్ ఫౌండేషన్‌కు చెందిన బెథాని అన్నారు

సౌదీ అరేబియాలో ద్వంద్వ పౌరసత్వానికి గుర్తింపు ఉండదు. కాబట్టి అమెరికాలో పుట్టి పెరిగిన తాలాను ఇక అప్పటినుంచి సౌదీ అరేబియా పౌరురాలిగా మాత్రమే పరిగణించారు.

సౌదీలోని పురుష సంరక్షణ వ్యవస్థ (మేల్ గార్డియన్‌షిప్ సిస్టమ్) నిబంధనల ప్రకారం తండ్రి అనుమతి లేకుండా కూతురు దేశాన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు.

తన మాజీ భర్త ప్రతీరోజూ ఉదయం తాలాను తీసుకెళ్లి, పొద్దుపోయాక మళ్లీ తన వద్దకు తీసుకొచ్చేవాడని కార్లీ చెప్పారు.

ఒంటరిగా హోటల్ గదిలోనే ఉండేదాన్నని, డబ్బు లేకపోవడంతో అతను తీసుకువచ్చే ఆహారంపైనే ఆధారపడేదాన్నని ఆమె వెల్లడించారు.

తనను, తన కూతుర్ని తిరిగి ఇంటికి పంపాలని రెండేళ్ల పాటు కార్లీ అతనిని బతిమాలారు. ఆ తర్వాత తన పరిస్థితిని వివరిస్తూ సహాయం చేయాల్సిందిగా కోరుతూ అమెరికా కాంగ్రెస్‌తో పాటు ఇతరులను ఆమె ఉత్తరాల ద్వారా సంప్రదించారు.

ఈ చర్య తన మాజీ భర్తకు కోపం తెప్పించిందని ఆమె చెప్పారు.

''సహాయం కోరుతూ సౌదీ వెలుపల ఉన్న వ్యక్తులను నేను సంప్రదిస్తున్నట్లు ఆయనకు తెలిసింది. వెంటనే నా కూతురిని తీసుకెళ్లిపోయాడు. రెండు నెలల పాటు తనను అపహరించాడు. అతనితో పాటు అతని కుటుంబం కూడా ఇళ్లు వదిలి పారిపోయింది. అదే సమయంలో పాపను తనకే అప్పగించాలంటూ పిటిషన్ కూడా వేశాడు'' అని కార్లీ వివరించారు.

తన కూతుర్ని తిరిగి పొందడం కోసం రెండేళ్లు పట్టిందని బెథానీ చెప్పారు

ఫొటో సోర్స్, BETHANY ALHAIDARI

ఫొటో క్యాప్షన్, తన కూతుర్ని తిరిగి పొందడానికి రెండేళ్లు పట్టిందని బెథానీ చెప్పారు

కస్టడీ విచారణలో భాగంగా దాఖలు చేసిన పేపర్లలో తాను తలాను అపహరించలేదని ఆయన పేర్కొన్నారు.

అమెరికా రాజకీయ నాయకుల నుంచి ఎటువంటి ప్రత్యుత్తరాలు, సమాధానాలు రాకపోవడంతో కార్లీ సహాయం కోరుతూ వైట్ హౌస్‌ను ఆశ్రయించారు. అక్కడి నుంచి కూడా ఆమెకు బదులు రాలేదు.

కానీ జూలై నెలలో అమెరికా అధ్యక్షుడ జో బైడెన్ రియాద్‌ను పర్యటించినప్పుడు ఆమెలో ఆశలు కలిగాయి. రియాద్‌లోని అమెరికా దౌత్యకార్యాలయ సిబ్బందికి కూడా ఆమె విజ్ఞప్తులు పంపించారు. ఆ ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి.

మరోవైపు అమెరికాలో ఉన్న కార్లీ తల్లి డెనిస్ వైట్ కూడా ఆందోళనలో ఉన్నారు. అమెరికాకు సౌదీతో ఉన్న రాజకీయ, ఆర్థిక సంబంధాల ప్రాముఖ్యత నేపథ్యంలో అమెరికా దౌత్యవేత్తలు చర్య తీసుకోవడానికి ఇష్టపడరు అని డెనిస్ నమ్ముతున్నారు.

ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో సౌదీ అరేబియా ఒకటి. ప్రస్తుతం నెలకొన్న ఇంధన సంక్షోభ సమయంలో చమురు ఉత్పత్తి అనేది సౌదీకి శక్తిమంతమైన రాజకీయ బలాన్ని అందిస్తుంది.

కాలిఫోర్నియాలోని తమ ఇంట్లో నుంచి మాట్లాడిన డెనిస్ వైట్ తన మనవరాలి చదువు గురించి ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడేళ్లలో తాలా ఒక్కసారి కూడా పాఠశాలకు వెళ్లలేదని తనకు తెలిసినట్లు ఆమె చెప్పారు.

వీడియో క్యాప్షన్, 72 మంది సభ్యుల ఉమ్మడి కుటుంబం: ‘మా ఇంట్లో ఒకపూట కూరగాయల ఖర్చు రూ.1200, నాన్ వెజ్ ఖర్చు రూ.5 వేలు.. సిలిండర్ 4 రోజుల్లో అయిపోతుంది’

సౌదీ అరేబియా జాతీయులను వివాహం చేసుకున్న తర్వాత తమ పిల్లలను అక్కడి నుంచి బయటకు తీసుకురావడం కోసం పోరాడుతున్న 50 మంది అమెరికా తల్లులలో కార్లీ కూడా ఒకరు అని అమెరికాకు చెందిన మానవ హక్కుల స్వచ్ఛంద సంస్థ (హ్యుమన్ రైట్స్ ఫౌండేషన్) సేకరించిన గణాంకాలు చెబుతున్నాయి.

ఈ జాబితాలో కెనడా, బ్రిటన్, ఇతర పశ్చిమ దేశాలకు చెందిన తల్లులు కూడా ఉన్నారని ఈ గణాంకాల ద్వారా తెలుస్తుంది.

బెథానీ అల్‌హైదరీ కూడా ఈ ఫౌండేషన్ సభ్యురాలు. ఆమె కూడా తన కూతురికి సౌదీ ఎగ్జిట్ వీసా పొందేందుకు ప్రయత్నిస్తూ రెండేళ్లు గడిపారు.

గత ఏడాది కాలంగా ఎవరూ ఈ ప్రయత్నంలో విజయవంతం కాలేదని ఆమె చెప్పారు. ‘‘చాలామందికి తమ సొంత ప్రభుత్వాల నుంచి కూడా అవసరమైన సహాయం అందదు’’ అని ఆమె అన్నారు.

పౌరుల సంక్షేమమే తమకు తొలి ప్రాధాన్యత అంశమని రియాద్‌లోని అమెరికా ఎంబసీ, బీబీసీతో చెప్పింది. కార్లీతో పాటు సౌదీ ప్రభుత్వంతో తాము తరచుగా సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది.

సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఎట్టకేలకు తాలా కస్టడీని కార్లీకి అప్పగించారు. అయితే, ఆమె ఉంటున్న సౌదీ నగరం దాటి బయటకు వెళ్లొద్దని ఆమెకు చెప్పారు.

డబ్బులు కూడా లేకపోవడంతో నాలుగు గోడల మధ్య బందీగా మారానని కార్లీ అన్నారు.

వీడియో క్యాప్షన్, భారత్‌లో పోల్ డాన్స్‌ని ఒక కళగా గుర్తించే సమయం వచ్చిందన్న రష్మి జాఠన్

''బయటకు కూడా రాకుండా రెండేళ్లు గడిచిపోయాయి. హోటల్ గదిలోనే ఉండిపోయా. నా మొహం కూడా ఎవరూ చూడలేదు. ఏ ఒక్కరూ వచ్చి నా గది తలుపు తట్టలేదు'' అని కార్లీ చెప్పారు.

ఈ సమస్య గురించి బయటి వ్యక్తులతో కార్లీ మాట్లాడుతున్నప్పటి నుంచి కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని కార్లీపై సౌదీ అధికారులు ఆరోపణలు మోపుతున్నారు. దీనికి శిక్షగా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఇప్పుడు ఆమెకు మరో పెద్ద సమస్య ఎదురైంది. తన భర్తను కలవకముందే కార్లీ ఇస్లాం మతంలోకి మారిపోయారు. అప్పటి నుంచి ఇస్లాం విశ్వాసాల ప్రకారమే నడుచుకుంటున్నాని కార్లీ తెలిపారు.

అయితే, తాలా కస్టడీని కార్లీ తిరిగి పొందిన కొన్ని రోజుల తర్వాత నుంచి ఆమె మాజీ భర్త తండ్రి ఆమెపై ఆరోపణలు చేస్తున్నారు. సౌదీ అరేబియాతో పాటు ముస్లింలు అందరి విశ్వాసాలను కార్లీ అవమానించారంటూ ఆయన ఆరోపించారు.

''సౌదీకి వెళ్లొద్దని నన్ను చాలామంది హెచ్చరించారు. అక్కడికి వెళ్తే తిరిగి రాలేవు, నీ కూతుర్ని కూడా తిరిగి తీసుకురాలేవు అని చెప్పారు. కానీ, నేనే వినకుండా ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మూడేళ్ల తర్వాత నా పరిస్థితి ఇలా తయారైంది'' అని కార్లీ చెప్పారు.

దీని గురించి మాట్లాడాల్సిందిగా సౌదీ అరేబియా అధికారులను, కార్లీ మాజీ భర్తను సంప్రదించాం. కానీ, వారు స్పందించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)