ఇరాన్‌లో మూడు వారాలుగా ఆగని నిరసనలు... ఈ మహిళల ఆగ్రహానికి కారణమేంటి?

హిజాబ్ నిరసనలు

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, ఇవానా స్కాటోలా
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

ఇరాన్‌లో దేశవ్యాప్తంగా నిరసనలు మొదలై మూడు వారాలకుపైనే గడుస్తోంది. మొరాలిటీ పోలీసుల నిర్బంధంలో 22ఏళ్ల యువతి మహస అమీనీ మృతి అనంతరం ఈ ఆందోళనలు రాజుకున్నాయి. అయితే, ఇప్పుడు నిరసనకారుల డిమాండ్లు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో చాలా మార్పులను వారు కోరుతున్నారు.

రాజధాని టెహ్రాన్‌లో పర్యటిస్తున్నప్పుడు ఇరానియన్-కుర్దు మహిళ అమీనీ హిజాబ్ సరిగా వేసుకోలేదని మొరాలిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారి నిర్బంధంలో ఉన్నప్పుడే ఆమె చనిపోయారు.

అయితే, అసలు ఆమె ఎలా చనిపోయారో చెప్పాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మృతికి బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కఠినమైన హిజాబ్ చట్టాలను రద్దు చేయాలని, మొరాలిటీ పోలీసు వ్యవస్థను పూర్తిగా తొలగించాలని కోరుతున్నారు. ఈ నిరసనలకు చాలా చోట్ల మహిళలే నేతృత్వం వహిస్తున్నారు.

హిజాబ్ నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

‘‘వుమన్, లైఫ్, ఫ్రీడమ్’’

నిరసనకారుల ప్రధాన నినాదం ‘‘వుమన్, లైఫ్, ఫ్రీడమ్’’. వీరు సమానత్వం కోసం పిలుపునిస్తున్నారు. మతపరమైన అతివాదాన్ని కట్టడి చేయాలని కోరుతున్నారు.

‘‘ఇదివరకటి నిరసనల్లో ఇలాంటి నినాదం ఎప్పుడూ వినిపించలేదు. ఇది చాలా కొత్తగా అనిపిస్తోంది’’అని బీబీసీ పర్షియన్ సర్వీస్ సీనియర్ రిపోర్టర్ బరన్ అబ్బాసీ చెప్పారు.

ఇదే నినాదం చేస్తూ మగవారు కూడా ఈ నిరసనల్లో పాలుపంచుకుంటున్నారు.

‘‘అమీనీ మృతి తర్వాత ఇక్కడ మహిళా హక్కుల ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఇరాన్ మహిళలకు హక్కులు, స్వేచ్ఛ కల్పించడమంటే అందరికీ హక్కులు, స్వేచ్ఛ కల్పించడమే’’అని బ్రిటన్‌లో మహిళా హక్కుల కోసం పోరాడే ఇరానియన్-బ్రిటిష్ కార్యకర్త నెగిన్ షిరాఘేయీ చెప్పారు.

అయితే, నేడు నిరసనలు దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. దీంతో డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి.

‘‘డెత్ టు ద డిక్టేటర్’’ అనే నినాదాలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇవి ఇస్లామిక్ రిపబ్లిక్ సుప్రీం లీడర్‌ను ఉద్దేశించి చేస్తున్న నినాదాలు.

హిజాబ్ నిరసనలు

ఫొటో సోర్స్, UGC

‘‘స్కూలు పిల్లలు కూడా ఈ నినాదాలు చేస్తున్నారు. వీరు వీధుల్లోకి వచ్చి.. అసలు ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలని అంటున్నారు’’అని నెగిన్ వ్యాఖ్యానించారు.

మరోవైపు ‘‘ఆజాదీ, ఆజాదీ, ఆజాదీ’’ అంటే ‘‘స్వేచ్ఛ, స్వేచ్ఛ, స్వేచ్ఛ’’అనే నినాదం కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా యూనివర్సిటీల దగ్గర ఈ నినాదాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు సోషల్ మీడియాలో తమకు నచ్చిన అంశాలను మాట్లాడేందుకు స్వేచ్ఛ కావాలని అంటున్నారు. తమకు నచ్చిన సంగీతాన్ని ఎలాంటి అరెస్టుల భయమూ లేకుండా వినేలా స్వేచ్ఛ ఉండాలని వారు చెబుతున్నారు.

మొత్తంగా డిమాండ్లన్నీ మానవ హక్కుల కోసమేనని నెగిన్ వివరించారు. ‘‘వీధుల్లో స్వేచ్ఛ, మహిళల హక్కులు, ప్రభుత్వాన్ని కూలదోయడం గురించి మాట్లాడుకుంటున్నారు’’అని నెగిన్ చెప్పారు.

హిజాబ్ నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

వైరల్ అవుతున్న పాట

నిరసనలకు ఎందుకుమద్దతు తెలుపుతున్నామో ఇరానియన్లు చెబుతున్న ఓ ట్విటర్ థ్రెడ్ వైరల్ అవుతోంది. ‘‘ఫర్.. ఫర్ మై డ్రీమ్స్.. ఫర్ మై క్వాలిటీ.. ఫర్ ఎ నార్మల్ లైఫ్’’ ఇలా ఆ థ్రెడ్ సాగుతోంది.

ఈ ట్వీట్ల నుంచి స్ఫూర్తి పొందిన ఇరానియన్ గాయకుడు షెర్విన్ హజీపౌర్ ఓ పాట కూడా రాశారు.

కేవలం 48 గంటల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పాటకు నాలుగు కోట్ల వ్యూస్ వచ్చాయి. ‘‘పెద్దగా గుర్తింపు లేని గాయకుడి పాటకు ఇంత ఆదరణ దక్కడం చాలా అరుదు’’అని బీబీసీ పర్షియన్ సోషల్ మీడియా జర్నలిస్టు తరానే స్టోన్ చెప్పారు.

ఈ పాట వైరల్ అయిన తర్వాత షెర్విన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ప్రొఫైల్ నుంచి ఆ పాటను తొలగించారు. ప్రస్తుతం అతడిని పోలీసులు విడుదల చేశారు.

హిజాబ్ నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

విసుగెత్తిపోయిన యువత

వీధుల్లోకి వచ్చి నిసనలు చేపడుతున్న వారిలో ఎక్కువ మంది యువతీ యువకులే ఉన్నారు. కొన్నిచోట్ల హైస్కూల్ విద్యార్థులు కూడా కనిపిస్తున్నారు.

‘‘దేశ వ్యాప్తంగా యూనివర్సిటీలో విద్యా కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అరెస్టు చేసిన తోటి విద్యార్థులను వదిలిపెట్టే వరకు తాము తరగతులకు వెళ్లబోమని విద్యార్థులు చెబుతున్నారు’’అని నెగిన్ చెప్పారు.

ప్రభుత్వం విధానాలతో నేటి యువత పూర్తిగి విసుగెత్తిపోయినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో అవినీతి, ప్రజల్లో పేదరికం పెరగడం, ద్రవ్యోల్బణం కూడా 50 శాతానికిపైనే మించిపోవడం, సామాజిక, రాజకీయ స్వేచ్ఛ లేకపోవడంతో వారు నిరాశకు లోనవుతున్నారు.

1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత, తొలిసారిగా అన్ని వర్గాల నుంచీ ప్రజలు ఈ నిరసనల్లో పాలుపంచుకుంటున్నారు.

హిజాబ్ నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ముఖ్యంగా టెహ్రాన్‌లోని ధనికులు, మధ్య తరగతి ప్రజలు, కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ నిరసనలు కనిపిస్తున్నాయి. మరోవైపు టెహ్రాన్‌కు 1200 కి.మీ. దూరంలో పేదలు ఎక్కువగా జీవించే బలూచెస్థాన్‌లోనూ ఈ నిరసనలు కనిపిస్తున్నాయి.

భిన్న జాతులకు చెందిన ప్రజలు కూడా ఈ నిరసనల్లో పాలుపంచుకుంటున్నారు.

‘‘నాలుగు దశాబ్దాల నుంచి దేశాన్ని అస్తవ్యస్తంగా నడిపిస్తున్నారు. అంతర్జాతీయ ఆంక్షలు ఒకవైపు, రాజకీయ వర్గాల్లో అవినీతి మరోవైపు అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపిస్తున్నాయి’’అని నెగిన్ అన్నారు.

పెరుగుతున్న నిత్యావసర ధరలు, విపరీతంగా పెరిగిన నిరుద్యోగ రేటు, అవినీతి, రాజకీయ అణచివేత ఇలా అన్నింటిపైనా ఇప్పుడు నిరసనల్లో డిమాండ్లు వినిపిస్తున్నాయి.

వీడియో క్యాప్షన్, పరువు పేరుతో జరుగుతున్న హత్యల సంఖ్యలో పెరుగుదల ఆందోళనకరం అంటున్న హక్కుల సంఘాలు

ఇదివరకటి నిరసనలు

1979 విప్లవం తర్వాత సుదీర్ఘ కాలం దేశంలో కొనసాగుతున్న నిరసనలు ఇవే.

2009లో ఎన్నికల్లో అవకతవకలు, 2017లో ఆర్థిక విధానాల్లో లోపాలు, 2019లో చమురు ధరల పెరుగుదల ఇలా చాలా అంశాలపై నిరసనలు జరిగాయి. వీటిని భద్రతా సంస్థలు పూర్తిగా అణచివేశాయి.

వీడియో క్యాప్షన్, మోరల్ పోలీసింగ్ క్రూరత్వంపై మహిళల ఆగ్రహం

ఇప్పుడు కూడా భద్రతా బలగాలు అలానే నడుచుకుంటాయని అందరూ అంచనా వేశారు. ప్రస్తుతం డజన్ల మంది నిరసనల్లో మరణించారు. వందల మందిని అరెస్టు చేశారు. నిరసనలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయకుండా ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధిస్తున్నారు.

అయినప్పటికీ నిరసనలు కొనసాగుతున్నాయి. వీటి వల్ల ఏమైనా మార్పులు వస్తాయా? ‘‘కచ్చితంగా రావొచ్చు’’అని నెగిన్ అన్నారు. ‘‘తమ హక్కుల గురించి మహిళలు తెలుసుకున్నప్పుడు, తమ పిల్లలకు వాటి గురించి వారు వివరిస్తారు. అప్పుడు మార్పు తప్పకుండా వస్తుంది’’అని ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)