ఇరాన్: ఇక్కడ మహిళలకు ఎక్కువగా ఉరి శిక్షలు విధిస్తున్నారు ఎందుకు

ఫొటో సోర్స్, Abdorrahman Boroumand Center
ఇరాన్‌లో జూలై చివరి వారంలో 32 మందిని ఉరి తీశారు. అందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. తమ భర్తలను హత్య చేసినందుకు ఆ మహిళలకు ఈ శిక్షను అమలు చేశారు. ఇరాన్‌ను ఉరిశిక్షల దేశంగా మానవ హక్కుల కార్యకర్తలు పిలుస్తున్నారు.
''ఇరాన్‌లో హత్య కేసులకు ఎలాంటి జైలు శిక్ష లేదు. అయితే క్షమించడం లేదంటే ఉరితీయడం అంతే'' అని అమెరికాలో ఉన్న ఇరానియన్ మానవ హక్కుల సంస్థ అబ్డోర్హన్ బోరోమండ్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రొయా బోరోమండ్ అన్నారు.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వార్షిక గణాంకాల ప్రకారం, ఇరాన్ కంటే ఇతర దేశాలే ఎక్కువ మందిని ఉరి తీస్తాయి. అయితే, మహిళలను ఉరి తీయడం మాత్రం ఇరాన్‌లోనే ఎక్కువ.
ఇరాన్ ఎందుకు మహిళలను ఉరి తీస్తుంది?

ఫొటో సోర్స్, Getty Images
మరణ శిక్ష
ఇరాన్‌లో గత వారం ముగ్గురు మహిళలను ఉరి తీయగా, ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో మరో ఆరుగురు మహిళలకు ఇదే శిక్షను అమలు చేశారని అబ్డోర్హన్ బోరోమండ్ సెంటర్ చెప్పింది.
''2000-2022 మధ్య కనీసం 233 మంది మహిళలను ఉరి తీసినట్లు మా రికార్డుల్లో ఉంది. హత్య నేరం కింద 106 మందికి, డ్రగ్స్ సంబంధిత నేరాలతో 96 మందికి ఉరిని విధించారు. పెళ్లికి ముందే ఇతర వ్యక్తులతో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు మరికొంత మందిని ఉరి తీశారు'' అని బీబీసీతో బోరోమండ్ చెప్పారు.
15 శాతం ఉరి కేసులను మాత్రమే అధికారికంగా ప్రకటించారని, అధికారులు సమాచారం ఇవ్వని ఇతర కేసుల గురించి ఖైదీలు, ఇతర అధికారిక వర్గాల ద్వారా తమకు తెలుసునని ఆమె తెలిపారు.
ఇరాన్ న్యాయ వ్యవస్థ ప్రకారం, హత్య కేసులకు మరణశిక్ష విధించలేరు. అయితే, నేరస్థుడిని క్షమించాలా వద్దా అనేది మాత్రం బాధిత కుటుంబం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
సహాయం అందకపోవడం
భర్తను చంపిన నేరం కింద గత వారం ఉరితీతకు గురైన ఒక మహిళను కాపాడేందుకు, చివరి నిమిషంలో క్షమాభిక్ష కోసం ఇరానియన్ కార్యకర్త అతెనా డయేమీ ప్రయత్నించారు. ఆ మహిళ పేరు సానుబర్ జలాలీ, ఆమె వయస్సు 40 ఏళ్లు. ఆమె అఫ్గానిస్తాన్‌కు చెందినవారు.
క్షమాభిక్ష కోసం జలాలీ భర్త కుటుంబ సభ్యులతో చర్చించాలని డయేమీ అనుకున్నారు.
''బాధిత కుటుంబ సభ్యుల్ని కలిసి, వారిని క్షమించమని అడిగేందుకు మేం ప్రయత్నించాం. కానీ, జైలు అధికారులు సహాయం చేయలేదు. వారు కేవలం ఆమె తరఫున వాదించే ఒక న్యాయవాది ఫోన్ నంబర్‌ను ఆమెకు ఇచ్చారు. కానీ, ఆయన మా విజ్ఞప్తిని పట్టించుకోలేదు. బాధిత కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు కొన్నిసార్లు మాత్రమే జైలు అధికారులు సహకరిస్తారు'' అని బీబీసీతో డయేమీ చెప్పారు.
అయితే, తాను ఇప్పటివరకు ఇద్దరిని ఉరిశిక్ష నుంచి, మరో ఎనిమిది మందిని ఇతర శిక్షల నుంచి కాపాడినట్లు డయేమీ తెలిపారు.
జలాలీతో పాటు అదే రోజు ఉరితీతకు గురైన మరో ఇద్దరు మహిళల్లో ఒకరికి 15 ఏళ్ల వయస్సులోనే పెళ్లి జరిగింది. మరో మహిళ, భర్తను చంపారనే నేరంతో అయిదేళ్లకు పైగా జైలులో ఉన్నారు.

ఫొటో సోర్స్, Atena Daemi
బలహీనమైన డిఫెన్స్
మానవ హక్కుల కోసం పోరాడే డయేమీ కూడా ఏడేళ్లు జైలు జీవితం గడిపారు. జైళ్లలో మహిళా ఖైదీలకు కనీస వసతులు ఉండవని చెప్పారు.
జడ్జిలుగా పురుషులే ఉండటం, ఎక్కువ మంది లాయర్లు కూడా పురుషులే కావడంతో కోర్టు వ్యవహారాలు కూడా ఎక్కువగా మహిళలకు వ్యతిరేకంగానే ఉంటాయన్నారు.
''ఇరాన్ కోర్టులు తప్పనిసరిగా ఒక డిఫెన్స్ లాయర్‌ను ఏర్పాటు చేయాలి. అయితే, ఆ లాయర్ నుంచి ఎక్కువగా న్యాయ సహాయం అందదు. మాజీ జడ్జిలు లేదా ప్రాసిక్యూటర్లను ఇలా డిఫెన్స్ లాయర్లుగా ఏర్పాటు చేస్తారు. హత్య కేసుల్లో నిర్దోషిగా నిరూపించుకోవడం అంత సులభం కాదు. ఇలాంటి కేసుల్లో నిందితుల కంటే బాధిత కుటుంబీకుల మాటలకే ఎక్కువ విలువ ఇస్తారు'' అని డయేమీ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
వ్యవస్థలో వివక్ష
ఇరాన్ జర్నలిస్ట్ అసీహ్ అమిని, నార్వేలో ఉంటారు. ఆమె మహిళలకు మరణశిక్ష విధించిన కేసులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సమస్యకు మూల కారణం న్యాయ వ్యవస్థ అని ఆమె చెప్పారు.
''చట్టాల ప్రకారం తండ్రిని లేదా తాతను కుటుంబపెద్దగా పరిగణిస్తారు. తమ కూతుళ్ల భవిష్యత్‌ను పెళ్లిలను వీరే నిర్ణయిస్తారు. బలవంతంగా పెళ్లి చేసుకున్న మహిళలు గృహ హింసతో సహా తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవచ్చు. ఇరాన్ కోర్టుల్లో విడాకులు దొరకడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో కొందరూ ప్రతీరోజు హింసను అనుభవిస్తుంటారు. మరికొంతమంది భర్తలను చంపాలని భావిస్తారు. మరణ శిక్ష పడిన మహిళలకు సొంత తల్లిదండ్రుల నుంచి కూడా మద్దతు దొరకదు. కొంతమంది మహిళలు, తామే తమ భర్తను చంపినట్లు ఒప్పుకున్నారు కూడా. అయితే, ఎంతోకాలంగా అనుభవిస్తోన్న హింస నుంచి తమను బయట పడేసే వ్యవస్థ లేదా మద్దతు దొరికి ఉంటే... తాము నేరం చేసే వాళ్లం కాదని ఆ మహిళలు నొక్కి చెప్పారు'' అని బీబీసీతో అమిని అన్నారు.

ఫొటో సోర్స్, Javad Montazeri
జువైనల్ ఉరిశిక్షలు
ఇరాన్‌లో 16 ఏళ్ల బాలిక అతీఫా సహలేహ్‌ని చాలామంది పురుషులు లైంగికంగా వేధించారు. మహిళల పట్ల ఇరాన్ కోర్టులు ఎలా వ్యవహరిస్తాయో చెప్పడానికి అమిని, అతీఫాను ఉదాహరణగా చూపారు.
ఆమెకు న్యాయం చేయడానికి బదులుగా న్యాయమూర్తులు, పెళ్లికి ముందే ఆమె లైంగిక సంబంధాలను కలిగి ఉన్నారని 2004లో తీర్పునిచ్చారు.
''రేప్ కేసు విచారణ సమయంలో తనకు ఇతరులతో లైంగిక సంబంధాలు ఉన్నాయని ఒప్పుకోవడంతో ఆమెకు ఉరిశిక్షను విధించారు'' అని అమిని తెలిపారు.
ఇరాన్‌లోని ఇస్లామిక్ పీనల్ కోడ్ ప్రకారం, పెళ్లికి ముందే లైంగిక సంబంధాలు ఉన్నట్లు తెలిస్తే వారికి 100 కొరడా దెబ్బల్ని శిక్షగా విధిస్తారు. ఈ చర్య మూడుసార్లు పునరావృతం అయితే, చివరగా నాలుగో సారి మరణశిక్షను విధిస్తారని ఆమె వివరించారు.
''కానీ, అతీఫా విషయంలో ఈ సూత్రం అమలు కాలేదు. ఎందుకంటే ఆమెకు మరణశిక్ష విధించే కంటే ముందు రెండుసార్లు మాత్రమే కొరడా దెబ్బల శిక్షను అమలు చేసినట్లు నేను తెలుసుకున్నా'' అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బెదిరింపు సాధనం
చట్టం, కోర్టులు, సంప్రదాయాలలో ఇమిడిపోయిన ఈ వివక్ష కారణంగానే మహిళలు బాధితులు లేదా నేరస్థులుగా మారుతున్నారని, చివరకు మరణ శిక్షను ఎదుర్కొంటున్నారని అమిని అసంతృప్తి వ్యక్తం చేశారు.
బోరోమండ్ దీనికి మరో కారణం చెప్పారు.
ఇరాన్ జైళ్లు ఇప్పుడు రాజకీయ ఖైదీలు, డ్రగ్స్ వినియోగదారులతో కిక్కిరిసిపోయాయి. జైళ్లపై ఉన్న ఒత్తిడి తొలిగించడం కోసం అధికారులు, బాధిత కుటుంబాలపై ఒత్తిడి తెచ్చినట్లు బోరోమండ్ భావించారు. క్షమిస్తారా లేదా ఉరి తీయడమా? ఏదో ఒక నిర్ణయాన్ని వేగంగా చెప్పాలంటూ బాధిత కుటుంబాలను అధికారులు తొందరపెట్టారని ఆమె అన్నారు.
అధికారుల ఈ చర్య, చాలా మందిని ఉరికంబం ఎక్కిస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఉరిశిక్షల గురించి స్పందించాల్సిందిగా ఇరాన్ ప్రభుత్వాన్ని బీబీసీ సంప్రదించింది. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే, ఇరాన్‌లో ఉరిశిక్షలు చట్టబద్ధం అని గతంలో ఇరాన్ న్యాయవ్యవస్థ చెప్పింది. బలవంతపు కన్ఫెషన్లు, జైళ్లలో హింసకు సంబంధించిన పలు నివేదికలను ఇరాన్ ప్రభుత్వం పదే పదే ఖండించింది.
ఇవి కూడా చదవండి:
- చీతా: ఇండియాలో 50 ఏళ్ల కిందట అంతరించిపోయిన మృగం మళ్లీ వస్తోంది
- అల్ జవహిరి మరణం తర్వాత అల్ ఖైదా పరిస్థితి ఏమిటి, కొత్త నాయకత్వం సిద్ధంగా ఉందా
- టార్గెట్‌కు తప్ప, చీమకు కూడా హాని చేయకుండా ఆ మిసైల్ ఎలా దాడి చేస్తుంది, ఆపరేట్ చేసేది ఎవరు?
- ఉబర్: 30 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.2,414...ఇది కొత్త తరహా మోసమా లేక సాంకేతిక సమస్యా
- ‘‘హిందూ దేశం’’: భారతీయ ముస్లింలలో ఎలా భయాన్ని పుట్టిస్తున్నారు, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, మారేందుకు ఏం చేయాలి










