పాకిస్తాన్‌లో దైవదూషణ అభియోగాలపై లెక్చరర్‌కు మరణశిక్ష

ఫొటో సోర్స్, ASAD JAMAL
పాకిస్తాన్‌లో దైవదూషణ అభియోగాలపై జునైద్ హఫీజ్ అనే లెక్చరర్‌కు మరణశిక్ష పడింది.
మహమ్మద్ ప్రవక్తను కించపరిచేలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై 2013 మార్చిలో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.
పాకిస్తాన్‌లో దైవదూషణ తీవ్ర నేరం. ఇస్లాం మతాన్ని కించపరిచేవారికి మరణశిక్ష విధించేలా చాలా కఠినమైన చట్టాలను ఆ దేశం అమలు చేస్తోంది.
దైవదూషణ ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని మత ఛాందసవాదులు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడిన ఘటనలూ చాలా జరిగాయి.
2017లో కేవలం దైవదూషణ ఆరోపణలు వచ్చినందుకే మాషల్ ఖాన్ అనే విద్యార్థిని జనం ఒక యూనివర్సిటీలో కొట్టిచంపారు.
తాజాగా మరణశిక్ష పడ్డ జునైద్.. అమెరికాలో స్కాలర్‌షిప్‌పై మాస్టర్స్ డిగ్రీ చదువుకున్నారు. అమెరికన్ సాహిత్యం, ఫొటోగ్రఫీ, థియేటర్‌లో స్పెషలైజేషన్ చేశారు.
పాకిస్తాన్‌కు తిరిగివచ్చిన తర్వాత ముల్తాన్‌లోని బహావుద్దీన్ జకారియా యూనివర్సిటీలో లెక్చరర్‌గా చేరారు. ఆయన వయసు ఇప్పుడు 33 ఏళ్లు.

ఈ కేసులో జునైద్ తరఫున వాదించేందుకు తొలుత న్యాయవాదులు ఎవరూ ముందుకు రాలేదు.
ఏడాది తర్వాత ఆయన కోసం వాదించేందుకు రషీద్ రెహమాన్ అనే న్యాయవాది అంగీకరించారు. అయితే, ఆ న్యాయవాదిని కొందరు తుపాకులతో కాల్చిచంపారు.
2014లో జునైద్‌పై కోర్టు విచారణ ప్రారంభించింది. ఆయనకు వ్యతిరేకంగా 13 మంది సాక్ష్యం చెప్పారు. సాక్షుల్లో యూనివర్సిటీ లెక్చరర్లు, విద్యార్థులు, పోలీసులు కూడా ఉన్నారు.
జైలులో జునైద్‌పై మిగతా ఖైదీలు పదేపదే దాడులు చేస్తుండటంతో, కొన్నేళ్లుగా ఆయన్ను ఒంటరిగా ఒక సెల్‌లో పెట్టారు.
ముల్తాన్ సెంట్రల్ జైల్ కోర్టు శనివారం జునైద్‌కు మరణశిక్షను ఖరారు చేసింది. రూ.5 లక్షల జరిమానా కూడా విధించింది.
జునైద్‌కు మరణశిక్ష పడటం 'తీవ్ర దురదృష్టకరం' అని ఆయన ప్రస్తుత న్యాయవాది ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో అన్నారు. ఈ తీర్పుపై పైకోర్టులో సవాలు చేస్తామని చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
జునైద్‌కు మరణశిక్ష పడటంపై ప్రొసిక్యూషన్ తరఫు న్యాయవాదులు మిఠాయిలు పంచుకుని, సంబరాలు చేసుకున్నారు. 'అల్లాహో అక్బర్', 'దైవదూషకులకు మరణమే' అంటూ నినాదాలు చేశారు.
మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ తీర్పును 'పూర్తిస్థాయి న్యాయవైఫల్యం'గా వర్ణించింది. తీవ్ర విచారకరమని వ్యాఖ్యానించింది.
పాకిస్తాన్‌లో దైవదూషణ అభియోగాలపై ప్రస్తుతం 40 మంది మరణశిక్షను ఎదుర్కొంటున్నారు. అయితే, ఇంతవరకూ ఎవరికీ ఈ శిక్షలను అమలు చేయలేదు.

దైవదూషణ కేసులో ఆసియా బీబీ అనే క్రైస్తవ మహిళకు పాకిస్తాన్‌లో మరణశిక్ష పడిన కేసు గత ఏడాది అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది.
ఆసియా ఎనిమిదేళ్లు జైల్లో గడిపిన తర్వాత, ఆమెకు కింది కోర్టు విధించిన శిక్షను పాక్ సుప్రీం కోర్టు గత ఏడాది రద్దు చేసింది.
ఆమె జైలు నుంచి విడుదలవ్వడంతో పాకిస్తాన్‌లో అలర్లు చెలరేగాయి. ఆమెను శిక్షించాల్సిందేనంటూ కొందరు ఆందోళనలకు దిగారు.
దీంతో ఆసియా తన కుటుంబంతో సహా పాక్‌ను విడిచి, మరో దేశానికి వలస వెళ్లారు.
ఇవి కూడా చదవండి:
- ఆసియా బీబీ: దైవదూషణ కేసులో పాకిస్తాన్ జైలు నుంచి విడుదల
- ఇదోరకం మోసం.. కొన్ని సెకన్ల ముందు సమాచారం తెలుసుకుని కోట్లు కొల్లగొడుతున్నారు
- పౌరసత్వ సవరణ బిల్లు: ఇతర దేశాల్లో మైనారిటీల గురించి భారత్ వాదనలో నిజమెంత...
- ఈ 23 ఏళ్ల ఎంపీ సగం జీతం చాలంటున్నారెందుకు?
- పాకిస్తాన్ సోషల్ మీడియాలో మహిళల ఆందోళన... స్త్రీవాద సదస్సుపై ఆగ్రహం
- నుదిటిపై గాటు సీరియల్ కిల్లర్‌ను పట్టిచ్చింది
- పాకిస్తాన్ థార్ ఎడారి ప్రాంతంలో తోడికోడళ్ల ఆత్మహత్యలకు కారణాలేంటి?
- విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌కు కార్యనిర్వాహక రాజధానిగా మారేందుకు సన్నద్ధంగా ఉందా
- భూపత్ డాకూ: భారత్‌లో ఎనభై హత్యలు చేసి పాకిస్తాన్ పారిపోయిన దోపిడీ దొంగ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








