తీహార్‌ జైల్లో దిష్టిబొమ్మలకి ఉరి తీసి డమ్మీ ట్రయల్స్‌... బక్సర్‌ జైలు నుంచి ఉరితాళ్లు... ‘నిర్భయ దోషులకి ఉరి శిక్ష అమలు చేయడానికే’ - ప్రెస్ రివ్యూ

ఉరిశిక్ష

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీలో నిర్భయపై మూకుమ్మడి అత్యాచారం, హత్య కేసులో దోషులకి ఉరి శిక్ష అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ‘సాక్షి’ ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం... బిహార్‌ బక్సర్‌ జైలు నుంచి ఉరితాళ్లను తీసుకువస్తున్నారు. ఉరికంబంపై శిక్ష అమలు ఎలా జరపాలో నలుగురు దోషుల బరువు, ఎత్తున్న దిష్టిబొమ్మలకి ఉరి తీసి డమ్మీ ట్రయల్స్‌ వేసి చూశారని జైలు వర్గాలు తెలిపాయి.

దోషులందరినీ ప్రస్తుతం తీహార్‌ జైలు నంబర్‌ మూడులో వేర్వేరు గదుల్లో ఉంచి సీసీటీవీ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జైలు నంబర్‌ 3లోనే దోషులకి ఉరిశిక్ష అమలు చేయనున్నారు.

ఇటీవల మండోలి జైలులో ఉన్న పవన్‌ కుమార్‌ గుప్తాను తీహార్‌ జైలుకి తరలించినట్టు డైరెక్టర్‌ జనరల్‌ (జైళ్లు) సందీప్‌ గోయెల్‌ వెల్లడించారు. ముఖేష్‌ సింగ్, అక్షయ్‌ సింగ్, వినయ్‌ శర్మను ఉంచిన జైలు నెంబర్‌3లో పవన్‌ కుమార్‌ గుప్తాను ఉంచారు.

నిర్భయను 2012 డిసెంబర్‌ 16 అర్ధరాత్రి బస్సులో ఆరుగురు రాక్షసులు మూకుమ్మడిగా అత్యాచారం చేయడమే కాకుండా, దారుణంగా హింసించడంతో ఆమె కొన్నాళ్లు మృత్యువుతో పోరాడి సింగపూర్‌ ఆస్పత్రిలో కన్నుమూసింది.

ఆరుగురు దోషుల్లో ఒకరు జైల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మరొకరు మైనర్‌ కావడంతో మూడేళ్ల పాటు జువైనల్‌ హోంకి పంపారు. మిగిలిన నలుగురిని ఏ రోజైతే అత్యంత పాశవికంగా నిర్భయపై అత్యాచారానికి పాల్పడ్డారో అదే రోజు డిసెంబర్‌ 16న ఉరితీస్తారని వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు దోషులందరూ ఒకే జైలుకి చేరడంతో వారికి ఉరిశిక్ష అమలు జరపడం ఖాయమన్న వార్తలకు ఊతమిచ్చినట్టయింది.

హైదరాబాద్ పోలీస్

హైదరాబాద్ 'ఎన్‌కౌంటర్': మృతుల్లో ముగ్గురు మైనర్లు..? ఎముకల దృఢత్వ పరీక్ష చేస్తారా?

హైదరాబాద్‌ యువతి దిశ మీద అత్యాచారం, హత్య కేసులో.. పోలీసుల 'ఎన్‌కౌంటర్‌'లో చనిపోయిన నలుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారనే అనుమానాలు ఉన్నాయని 'ఈనాడు' ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. 'ఎన్‌కౌంటర్' మృతుల్లో ముగ్గురు నిందితుల వయసుకు సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధ్రువీకరణ పత్రాలు పరస్పర విరుద్ధంగా ఉండటం వంటి కారణాలతో.. వారి వయసు నిర్ధారణ ఎలా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

దిశ కేసులో నలుగురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినపుడు వీరి వయసు 20 సంవత్సరాలకంటే ఎక్కువ ఉన్నట్లు నమోదు చేశారు. నిందితులు చెప్పిన వివరాల ఆధారంగానే అలా చేశామనేది పోలీసుల వాదన.

దిశ మీద అత్యాచారం, హత్య కేసు విచారణలో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ క్రమంలో నిందితులు ఎదురుతిరగటంతో ఎదురు కాల్పులు జరిగి ఆ నలుగురు హతమైనట్లు పోలీసులు చెబుతున్నారు.

ఆధార్ వివరాల ప్రకారం.. (ఏ1 మినహా) ముగ్గురు నిందితులు పుట్టిన సంవత్సరం 2001గా ఉంది. అయితే వీరిలో ఇద్దరికి సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికెట్లలో ఉన్నవారి పుట్టిన తేదీలను బట్టి మైనర్లుగా భావించాల్సి వస్తోంది. ఒకరి పుట్టిన తేదీ 15-08-2002గా, మరొకరి పుట్టిన తేదీ 10-04-2004గా పత్రాల్లో నమోదై ఉంది.

తాజాగా మరో నిందితుడి కుటుంబ సభ్యులు తమ కుమారుడికి సంబంధించి బోనఫైడ్ సర్టిఫికెట్‌ను మంగళవారం సేకరించారు. అందులో అతని పుట్టినతేదీ 04-04-2004గా నమోదైంది. అంటే ఇతని వయసు 15 సంవత్సరాల 8 నెలలు. 2004లో పుట్టిన వీరిద్దరి మధ్య వయసు తేడా కేవలం ఆరు రోజులు మాత్రమే.

దీన్నిబట్టి మొత్తం నలుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ధ్రువపత్రాలను నిందితుల కుటుంబ సభ్యులు జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆదివారం నిందితుల కుటుంబ సభ్యులను విచారించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం 'మీ కుమారులు మైనర్లయితే ధ్రువపత్రాలు ఇవ్వండి' అని సూచించింది. తాము సేకరించిన ధ్రువపత్రాలను ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఇచ్చిన వాట్సాప్ నంబరుకు నిందితుల కుటుంబ సభ్యులు పంపినట్లు సమాచారం.

వయసు నిర్ధారణ తెలిపే ధ్రువీకరణ పత్రాలేవీ అందుబాటులో లేనప్పుడు లేదా వైరుధ్యంగా ఉన్నప్పుడు అస్థీకరణ పరీక్ష విధానాన్ని అవలంబిస్తుంటారు. ఎముకల దృఢత్వాన్ని పరీక్షంచడం ద్వారా ఫోరెన్సిక్ వైద్య నిపుణులు వయసును అంచనా వేస్తారు.

సాధారణంగా 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులకు దిగువ అవయవాల ఎముక, తుంటి ఎముక దృఢంగా ఉంటుంది. దీన్ని పరీక్షించటం ద్వారా ఫోరెన్సిక్ నిపుణులు వయసు నిర్ధారణపై అంచనాకు వస్తారు. అయితే ఈ అంచనా తేదీతో సహా కచ్చితంగా ఉండదు. అసలు వయసుకు కొంచెం అటూఇటూగా ఉంటుంది. అయినా కేసుల విచారణ క్రమంలో ఈ నివేదికనే ప్రామాణికంగా తీసుకుంటారు.

మరోవైపు.. కేసుల దర్యాప్తు క్రమంలో ఎవరిదైనా వయసు నిర్ధారణ చేయాల్సి వచ్చినప్పుడు స్థానిక విచారణ పద్ధతుల్నీ అవలంబిస్తుంటారు. అవసరమైన వ్యక్తి వయసును గుర్తించేందుకు అతడి తల్లి ప్రసవించినప్పుడు గానీ, గర్భిణిగా ఉన్నప్పుడు గానీ అదే ఊరిలో ఇంకెవరైనా మహిళ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారా? అని విచారించి ఒక నిర్ధారణకు వస్తారు.

ప్రస్తుత ఉదంతంలో నిందితులు మృతిచెందారు కాబట్టి వయసును ఎలా నిర్ధారణ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

అత్యాచారం

ఫొటో సోర్స్, Getty Images

బాలికలకు లిఫ్ట్‌ ఇచ్చి.. అత్యాచార యత్నం

తెలంగాణలోని వనపర్తి జిల్లాలో మరో అత్యాచార యత్నం జరిగిందని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో చెప్పింది .

ఆ కథనం ప్రకారం.. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని, 9వ తరగతి విద్యార్థిని కలిసి సోమవారం పొరుగూరికి వెళ్లారు.

ఇంతలో ఓ యువకుడు వచ్చి 'మీ ఇంట్లోవాళ్లు నాకు తెలుసు. మీరు వెళ్లేచోటకే వెళ్తున్నా. నా బైక్‌పై రండి' అంటూ ఇద్దరు విద్యార్థినులను నమ్మించి తన బైక్ మీద ఎక్కించుకున్నాడు.

కొద్దిదూరం వెళ్లాక గుట్ట వద్ద ఆపి డిగ్రీ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించబోయాడు. అయితే, 9వ తరగతి విద్యార్థిని బండరాయితో దాడిచేయడంతో వారి మెడలోని బంగారం, రూ. 500 లాక్కుని పారిపోయాడు. విద్యార్థినులు దగ్గర్లోని పౌలీట్రీ ఫాం వద్దకెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

మరోవైపు.. వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలోని ఓ తండాకు చెందిన 8 ఏళ్ల బాలికపై స్థానిక పరిశ్రమలో డ్రైవర్‌గా పనిచేస్తున్న నిందితుడు అత్యాచారానికి యత్నించాడు. అతడిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)