నిర్భయ కేసు: నలుగురు దోషులను వేర్వేరుగా ఉరి తీయడం కుదరదు - దిల్లీ హైకోర్టు

ఫొటో సోర్స్, DELHI POLICE
నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు విధించిన ఉరిశిక్షను నిలిపివేస్తూ ట్రయిల్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను దిల్లీ హైకోర్టు సమర్థించింది. ట్రయిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కేంద్రం వేసిన పిటిషన్‌ను కోర్టు బుధవారం కొట్టేసింది.
ఆ కేసులో నలుగురు దోషులుకు వేర్వేరుగా ఉరి శిక్షను అమలు చేయడం సాధ్యం కాదని పేర్కొంది.
ఇటీవల ఈ కేసులో నలుగురు దోషులకు విధించిన ఉరి శిక్షపై దిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు స్టే విధించింది. ఈ నిలుపుదలను కేంద్ర ప్రభుత్వంతో పాటు, తిహార్ జైలు అధికారులు కూడా కోర్టులో సవాలు చేశారు. కానీ, దాన్ని కొట్టేస్తూ జస్టిస్ సురేష్ కైత్ ఉత్వర్వులు జారీ చేశారు.
నిర్భయ కేసులో నలుగురు దోషులూ ఒక ‘‘కామన్ ఆర్డర్’’కు లోబడి ఉన్నారని, వారిని వేర్వేరుగా ఉరితీయడం కుదరదని కోర్టు పేర్కొంది.
నలుగురు నిందితులకు మిగిలి ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలను వారం రోజుల్లోగా ఉపయోగించుకోవాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది.
నిందితుల్లో ఒకరైన పవన్ కుమార్ గుప్తా క్యురేటివ్ పిటిషన్, అలాగే అక్షయ్ కుమార్, పవన్ గుప్తాలు తమ మెర్సీ(క్షమాభిక్ష) పిటిషన్‌లను ఇంకా ఉపయోగించుకోవాల్సి ఉంది. వారు ఆ పిటిషన్లను దాఖలు చేసి, వాటిపై తుది నిర్ణయం వెలువడిన తరువాతే నలుగురికీ ఉరి శిక్ష అమలు చేసే అవకాశం ఉంటుందని కోర్టు తెలిపింది.

ఇంతకుముందు ఈ కేసులో ఏం జరిగింది?
నిర్భయ హంతకులకు శిక్ష అమలులో జాప్యంపై తీహార్ జైలు అధికారులు వేసిన పిటిషన్‌పై ఫిబ్రవరి 2, ఆదివారం నాడు దిల్లీ హైకోర్టులో ప్రత్యేక విచారణ జరిగింది. సెలవు రోజు అయినప్పటికీ కేసు తీవ్రత దృష్ట్యా విచారణకు కోర్టు అంగీకరించింది.
నిర్భయ హంతకులకు మరణశిక్ష విధించేందుకు అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తీహార్ జైలు అధికారులు దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఉద్దేశపూర్వకంగానే దోషులు శిక్షా ప్రక్రియను ఆలస్యం చేసేలా చేస్తున్నారని, వ్యవస్థ వైపు నుంచి కూడా ఇది జరుగుతోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు.
"ఒక్కసారి సుప్రీంకోర్టు దోషులందరి శిక్షను ఖరారు చేసిన తర్వాత, వారికి విడివిడిగా శిక్షను విధించడానికి సైతం ఎలాంటి అడ్డంకులూ లేవు. ఉరి శిక్షను వాయిదా వేయగలిగే ఏకైక అవకాశం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడమే" అని మెహతా అన్నారు.
న్యాయ ప్రక్రియపై నమ్మకం నిలిచేందుకు ఇక ఈ కేసులో ఎలాంటి ఆలస్యం ఉండకూడదు. మరణశిక్ష ఆలస్యం కాకూడదు. నేరస్థుల దృష్టి నుంచి చూస్తే, శిక్ష అమలులో ఆలస్యం వారిపై అమానవీయ ప్రభావం చూపిస్తుంది.
ఇకపై ఈ కేసులో దోషులకు శిక్షను అమలు చేయడంలో ఎలాంటి జాప్యానికి తావుండకూడదు" అని మెహతా కోర్టును కోరారు.
క్షమాభిక్ష తిరస్కరణకు గురైన తర్వాత మరేదైనా అపీల్ లేదా దరఖాస్తు పెండింగులో ఉన్నప్పటికీ దోషులను, సహదోషులను ఉరితీయవచ్చని జైలు నిబంధనలు చెబుతున్నాయని మెహతా స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
న్యాయవ్యవస్థను అపహాస్యం చేసేలా ఉద్దేశపూర్వక జాప్యానికి వారు కారణం అవుతున్నారని ఆయన అన్నారు. శిక్ష అమలును ఆలస్యం చేయడానికి వారు అన్ని రకాల మార్గాలను ఎంచుకుంటున్నారని మెహతా అన్నారు. వారు చేసిన దారుణ, అమానవీయ నేరం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు.
అనంతరం దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్ తన వాదనలు వినిపించారు. దోషులు అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ కుమార్ శర్మల తరపున ఆయన వాదించారు.
"సుప్రీంకోర్టు గానీ, రాజ్యాంగం గానీ ఉరి తీయడానికి ఎంత వ్యవధి ఉండాలనే దానిపై ఏమీ స్పష్టం చేయలేదు. ఒకవేళ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు గురైతే అప్పుడు మరణ శిక్ష అమలుకు 14 రోజుల సమయం ఉండాలని శత్రుఘన్ సింగ్ చౌహాన్ కేసు తీర్పు సమయంలో వెల్లడించారు.
నా క్లైంట్లకు విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలని కోరుతున్నాను. మరణ శిక్ష వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు" అని సింగ్ అన్నారు.


క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోవడానికి అభ్యంతరం ఏమిటి అని జస్టిస్ సురేశ్ కైత్.. ఏపీ సింగ్‌ను ప్రశ్నించారు.
అలానే చేయాలని రాజ్యాంగంలో ఎక్కడా స్పష్టం చేయలేదని, దీనిపై గతంలో ఎలాంటి తీర్పూ లేదని, ఇది తమ తప్పు కాదని సింగ్ తెలిపారు.
"వారంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన దళితులు. వారిని దిల్లీకి తీసుకొచ్చి తప్పుడు కేసులో ఇరికించారు. ముకేశ్ సింగ్, రామ్ సింగ్ ఇద్దరూ దళితులు. వారిద్దరూ రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. దరఖాస్తు పెట్టకపోవడం వారి తప్పు కాదు" అని సింగ్ చెప్పారు.మరో దోషి ముకేశ్ సింగ్ తరపున వాదించిన లాయర్ రెబెకా జాన్... మరణ శిక్ష పడినవారికి కూడా కొన్ని హక్కులుంటాయని అన్నారు. రాజ్యాంగపరంగా ఉన్న అన్ని అవకాశాలను వారి తుదిశ్వాస విడిచే వరకూ ఉపయోగించుకోవచ్చని రెబకా వాదించారు.
డెత్ వారెంట్ ఇవ్వడం అనేది ట్రయల్ కోర్టు ప్రత్యేక పరిథిలో ఉందని రెబకా తెలిపారు.
"వీళ్లందరికీ హైకోర్టు ఒకేసారి శిక్ష విధించింది. దాన్ని సుప్రీంకోర్టు కూడా ఒకే తీర్పుతో సమర్థించింది. అందువల్ల వీరి శిక్ష అమలు కూడా ఒకేసారి జరగాలి" అని రెబెకా అన్నారు.
దిల్లీ ప్రిజన్ రూల్ 858, శత్రుఘన్ సింగ్ చౌహాన్ తీర్పుల ప్రకారం క్షమాభిక్ష దరఖాస్తు తిరస్కరణకు గురైన తర్వాత శిక్ష అమలుకు 14 రోజుల సమయం ఇవ్వాలని రెబెకా ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ కేసులో ఎప్పుడు, ఏం జరిగింది?
2012 డిసెంబర్ 16: 23 ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థినిపై నడుస్తున్న బస్సులో ఆరుగురు సామూహిక అత్యాచారం చేశారు. విద్యార్థిని, ఆమె పురుష స్నేహితుడిని తీవ్రంగా కొట్టారు. ఇద్దరినీ రోడ్డు పక్కన విసిరేశారు.
2012 డిసెంబర్ 17: ప్రధాన నిందితుడు, బస్ డ్రైవర్ రామ్ సింగ్‌ను అరెస్టు చేశారు. తర్వాత కొన్ని రోజులకే అతడి తమ్ముడు ముకేశ్ సింగ్, జిమ్ ఇన్‌స్ట్రక్టర్ వినయ్ శర్మ, పండ్లు అమ్మే పవన్ గుప్తా, బస్ హెల్పర్ అక్షయ్ ఠాకూర్, 17 ఏళ్ల బాలుడిని అరెస్టు చేశారు.
2012 డిసెంబర్ 29: సింగపూర్‌లోని ఒక ఆస్పత్రిలో బాధితురాలి మృతి. శవాన్ని తిరిగి దిల్లీకి తీసుకొచ్చారు.
2013 మార్చి 11: నిందితుడు రామ్ సింగ్ తీహార్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు అతడు అత్మహత్య చేసుకున్నాడని చెబితే, అతడి తరఫు వకీలు, కుటుంబ సభ్యులు మాత్రం అది హత్య అని ఆరోపించారు.
2013 ఆగస్టు 31: జువైనల్ జస్టిస్ బోర్డ్ మైనర్ నిందితుడిని దోషిగా తేల్చింది. మూడేళ్లపాటు జువైనల్ హోంకు పంపింది.
2013 సెప్టెంబర్ 13: ట్రయల్ కోర్టు నలుగురు నిందితులను దోషిగా ఖరారు చేస్తూ, ఉరిశిక్ష విధించింది.
2014 మార్చి 13: దిల్లీ హైకోర్టు ఉరిశిక్షను సమర్థించింది.
2014 మార్చి-జూన్: నిందితులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకూ ఉరిశిక్షపై స్టే విధించింది.

ఫొటో సోర్స్, Getty Images
2017 మే: హైకోర్టు, ట్రయల్ కోర్టు ఉరిశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది.
2018 జులై: సుప్రీంకోర్టు ముగ్గురు దోషుల రివ్యూ పిటిషన్ కొట్టివేసింది.
2019 డిసెంబర్ 6: కేంద్ర ప్రభుత్వం ఒక దోషి క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి దగ్గరకు పంపింది. మంజూరు చేయవద్దని సిఫారసు చేసింది.
2019 డిసెంబర్ 12: తలారిని పంపించాలని ఉత్తరప్రదేశ్ జైలు అధికారులను తీహార్ జైలు అధికారులు కోరారు.
2019 డిసెంబర్ 13: ఉరిశిక్ష తేదీని నిర్ణయించాలని నిర్భయ తల్లి తరఫున పటియాలా హౌస్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దాంతో, నలుగురు దోషులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పటియాలా కోర్టులో హాజరుపరిచారు.
2020 జనవరి 7: డెత్ వారెంట్ జారీ చేసిన పటియాలా కోర్టు, జనవరి 22 ఉదయం 7 గంటలకు మరణశిక్ష అమలుచేయాలని ఆదేశం.
2020 జనవరి 15: నలుగురిలో ఒక దోషి క్షమా భిక్ష కోసం చేసుకున్న అర్జీ ఇంకా రాష్ట్రపతి దగ్గరే ఉండటం వల్ల జనవరి 22న ఉరి శిక్షను అమలు చేయట్లేదని వెల్లడించిన దిల్లీ ప్రభుత్వం.
2020 జనవరి 17: ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు దోషులకు మరణశిక్ష అమలు చేయాలని కొత్త డెత్ వారెంట్ జారీ చేసిన దిల్లీలోని పటియాలా కోర్టు.
2020 జనవరి 31: నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ దిల్లీ కోర్టు ఉత్తర్వులు

ఇవి కూడా చదవండి.
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: చైనా బయట మొదటి మృతి ధ్రువీకరణ
- కరీమ్ లాలా: ఈ ముంబయి మాఫియా డాన్‌ను ఇందిరా గాంధీ ఎందుకు కలిశారు?
- బడ్జెట్ 2020 :ఆదాయ పన్ను కొత్త శ్లాబ్స్‌తో యువత భవిష్యత్తుతో ఎందుకీ చెలగాటం?
- బడ్జెట్ 2020: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఏమన్నాయి
- 2022లోగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న నిర్మల.. ఇది సాధ్యమేనా?
- గాలి నుంచి ఆహారం తయారు చేస్తున్న ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు.. ఇదెలా సాధ్యం?
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
- ఆసిఫాబాద్ అత్యాచారం, హత్య: ‘అది ఆడమనిషి శరీరంలానే లేదు... నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’
- 'ప్రపంచం మౌనంగా ఉంది... నిశ్శబ్దం భయంకరంగా ఉంది'
- ఈయూ నుంచి నిష్క్రమించిన బ్రిటన్... స్వతంత్ర దేశంగా ఈయూకు తిరిగి వస్తామన్న స్కాట్లాండ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









