బ్రెగ్జిట్: బ్రిటన్‌లో ఏమేం మారతాయంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, టామ్ ఎడ్గింగ్టన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సుదీర్ఘ ప్రక్రియ తర్వాత యురోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి 2020 జనవరి 31 నాడు బ్రిటన్ బయటకు వచ్చేసింది.
ఈయూ నుంచి వైదొలిగేందుకు బ్రిటన్‌లో రెఫరెండం నిర్వహించి మూడేళ్లకుపైనే అయ్యింది. ఈ మధ్య కాలంలో ఆ దేశానికి ముగ్గురు ప్రధానులు మారారు. రెండు సార్లు ఎన్నికలు జరిగాయి.


ఈయూ నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన తర్వాత 11 నెలల ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది. అది ఇప్పుడు మొదలైంది.
ఈ పీరియడ్‌లో బ్రిటన్ ఈయూ నిబంధనలను పాటిస్తుంది. ఈయూకు డబ్బులు కూడా చెల్లిస్తుంది.
బ్రిటన్‌లో ఇక మీద చాలా విషయాలు మారబోతున్నాయి.
వాటిలో ఆసక్తికరమైన ఏడు విషయాలు ఇవి..

ఫొటో సోర్స్, Getty Images
1. బ్రిటన్ ఈయూ ఎంపీలు సభ్యత్వం కోల్పోతారు
ఈయూలోని అన్ని రాజకీయ సంస్థల నుంచి బ్రిటన్ బయటకు వచ్చేస్తోంది.
యురోపియన్ పార్లమెంటులోని బ్రిటన్ ఎంపీలు తమ సభ్యత్వాలు కోల్పోతారు.
ట్రాన్సిషన్ పీరియడ్‌లో మాత్రం న్యాయవివాదాలేవైనా ఏర్పడితే అంతిమంగా పరిష్కరించే అధికారం యురోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌కు ఉంటుంది.
2. ఈయూ సదస్సులకు హాజరవ్వరు
సాధారణంగా జరిగే ఈయూ సమావేశాలకు బ్రిటన్ మంత్రులు హాజరు కారు.
ఒక వేళ ప్రత్యేకంగా ఆహ్వానిస్తే తప్ప బ్రిటన్ ప్రధాని ఈయూ కౌన్సిల్ సదస్సులకు వెళ్లరు.
3. కొత్త వాణిజ్య విధానం
వస్తు సేవల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి వివిధ దేశాలతో ఇక బ్రిటన్ సంప్రదింపులు చేసుకోవచ్చు. కొత్త నిబంధనలను రూపొందించుకోవచ్చు.
ఈయూలో సభ్యత్వం ఉన్న సమయంలో బ్రిటన్‌కు.. ఇతర దేశాలతో వాణిజ్యం విషయంలో సంప్రదింపులు జరిపే వీలుండేది కాదు.
ఇప్పుడు సొంతంగా వాణిజ్య విధానం రూపొందించుకునే స్వేచ్ఛ రావడం వల్ల బ్రిటన్ ఆర్థికవ్యవస్థ వృద్ధికి ఊతం వస్తుందని బ్రెగ్జిట్ సమర్థకులు అంటున్నారు.
అయితే, ఇతర దేశాలతో బ్రిటన్ చేసుకునే వాణిజ్య ఒప్పందాలు, ట్రాన్సిషన్ పీరియడ్ ముగిశాకే అమల్లోకి వస్తాయి.

4. పాస్‌పోర్టుల రంగు మారుతుంది.
బ్రిటన్‌లో ప్రస్తుతం ఉన్న మెరూన్ రంగు పాస్‌పోర్టులు పోయి, నీలి రంగు పాస్‌పోర్టులు వస్తాయి.
30 ఏళ్ల క్రితం వరకూ దేశంలో ఈ నీలి రంగు పాస్‌పోర్టులే ఉండేవి. 1921లో వాటిని ముద్రించడం ప్రారంభించారు.
దాదాపు వచ్చే ఆరు నెలల్లో ఇలా మొత్తం పాస్‌పోర్టులను దశలవారీగా మార్చేస్తారు.

ఫొటో సోర్స్, PA Media
5. బ్రెగ్జిట్ నాణేలు
బ్రెగ్జిట్ స్మారకంగా 50 పెన్స్‌ల నాణేలు రాబోతున్నాయి. శుక్రవారం ఇవి చలామణీలోకి వస్తాయి.
మొత్తం 30 లక్షల నాణేలపై ఓ ఐకమత్య సందేశాన్ని, బ్రెగ్జిట్ తేదీని (జనవరి 31, 2020) ముద్రించారు.
ఈ నాణేల ముద్రణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఎవరైనా తమకు ఈ నాణేలు ఇస్తే తీసుకోమని బ్రెగ్జిట్‌ను వ్యతిరేకిస్తున్న కొందరు అంటున్నారు.
6. బ్రిటన్ బ్రెగ్జిట్ విభాగానికి మూత
బ్రిటన్-ఈయూ మధ్య సంప్రదింపుల వ్యవహారాలను పర్యవేక్షించిన బ్రిటన్ బ్రెగ్జిట్ విభాగం శుక్రవారంతో మూతపడింది.
మాజీ ప్రధాని థెరిసా మే 2016లో దీన్ని ఏర్పాటు చేశారు.
ఇకపై ప్రధాని కార్యాలయంలోని కొత్త విభాగం సంప్రదింపుల వ్యవహారాలను పరిశీలిస్తుంది.
7. నేరస్థులను జర్మనీ అప్పగించదు
జర్మనీ పౌరులు ఎవరైనా బ్రిటన్‌లో నేరం చేసి, సొంత దేశానికి పారిపోతే.. వారిని వెనక్క రప్పించడం కుదరదు.
ఇది వరకు జర్మనీ అలాంటి అనుమానిత నేరస్థులను బ్రిటన్‌కు అప్పగించేది.
ఈయూయేతర దేశాలకు నేరస్థులను అప్పగించకూడదని జర్మనీ రాజ్యాంగంలో ఉంది.
కాబట్టి, నేరస్థుల అప్పగింత సాధ్యం కాదు.

ఇవి కూడా చదవండి.
- బ్రెగ్జిట్: యురోపియన్ యూనియన్‌కు ‘విడాకులిస్తున్న’ బ్రిటన్... ఎందుకు? ఏమిటి? ఎలా?
- ఉందో లేదో తెలియని యతి... నేపాల్ సర్కారును ఎలా చిక్కుల్లోకి నెట్టింది?
- బోరిస్ జాన్సన్: ఒక జర్నలిస్టు.. బ్రిటన్ ప్రధాని ఎలా అయ్యారు?
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
- నాటో అంటే ఏమిటి.. దానికి ఇంకా ప్రాధాన్యం ఉందా
- ఎన్నడూ కనిపించనంత స్పష్టంగా సూర్యుడు... ఇక్కడ చూడండి
- ఆల్కహాల్‌తో చేతులు కడుక్కునే నిరంకుశ నియంత.. నికొలస్ చాచెస్కూ
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
- విక్టోరియా మహారాణి, ఆమె భారత గుమస్తా అబ్దుల్ కరీమ్ మధ్య అంతుపట్టని ఆ బంధాన్ని ఏమనాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









