సుష్మితా సేన్-LGBT: ట్రాన్స్ జెండర్ పాత్రలను కూడా మామూలు నటులతోనే చేయించాలా ? ఈ అభ్యంతరాలు ఎందుకు వినిపిస్తున్నాయి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మేఘ మోహన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్‌పై తీస్తున్న ఒక బాలీవుడ్ చిత్రంలో ప్రధాన పాత్రను ట్రాన్స్‌జెండర్ కాని నటి, మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ చేస్తున్నారు. దీనిపై ట్రాన్స్ కమ్యూనిటీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ పాత్ర ఒక ట్రాన్స్‌జెండర్‌కే ఇస్తే బాగుండేదని, సినిమాల్లో బ్రేక్ కోసం చాలామంది ట్రాన్స్ నటులు వెయిట్ చేస్తున్నారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఒక సినిమా ఆడిషన్ జరుగుతోంది. ప్రధాన పాత్రకు బెస్ట్ ఫ్రెండ్ పాత్ర కోసం నవ్య సింగ్ వచ్చారు. ఆడిషన్‌లో ఆమెలో ఆత్మవిశ్వాసం కనిపించింది. ఆమెలో కొంచం సెక్సీనెస్ ఉంది. కానీ, మొత్తం దృష్టిని ఆకర్షించేంత కాదు. ప్రధానంగా, ఆమె తనకు ఇచ్చిన డైలాగులను మరచిపోకుండా చెప్పారు.
ఆమె ఆడిషన్ పూర్తయ్యాక, ఆ గదిలో చాలాసేపటికి వరకు నిశ్శబ్దం ఆవరించింది. చివరికి, క్యాస్టింగ్ డైరెక్టర్లలో ఒకరు నోరు తెరిచారు. "ఇంతకీ, మీరెవరు?, ఆడా? మగా?" అని ఆయన నవ్యను అడిగారు.
"నా మనసు విరిగిపోయింది. ఇలాంటి కటువైన మాటలు నాకు కొత్త కాదు. బాలీవుడ్‌కి వచ్చినప్పటి నుంచి వీటికి నేను అలవాటుపడిపోయాను. కానీ, దీన్ని తట్టుకోవడం ఎప్పటికీ సులువు కాదు" అని నవ్య చెప్పారు.
బిహార్‌లో గ్రామీణ ప్రాంతానికి చెందిన నవ్య 18 ఏళ్ల వయసులో ముంబై వచ్చారు.
నవ్య తన తల్లితో జరిపిన చివరి సంభాషణలో, తనకు పుట్టుకతో వచ్చిన జెండర్‌ను తన మనసు అంగీకరించట్లేదని చెప్పారు.
ఓరోజు సాయంత్రం నవ్య, ఆమె తల్లి ఇంటి వసారాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడే నవ్య తన మనసులో మాటను వాళ్లమ్మకు చెప్పారు.
"నేను అబ్బాయిని కాను. అమ్మాయినని నా మనసు చెబుతోంది" అన్నారు. నవ్య తల్లికి ఆశ్చర్యం కలిగినా, అది బయటపెట్టలేదు. ఆకాశంలో చంద్రుడిని చూస్తూ తల విదిలించారు.
"నేల మీదకు తిరిగిరా.. నువ్వు అబ్బాయివి" అన్నారామె.

ఫొటో సోర్స్, Navya Singh
నవ్య, తన గురించి బయటకు చెప్పుకున్నాక, ఇక ఆ గ్రామంలో ఉండలేకపోయారు. నవ్య తాత ఆ గ్రామ సర్పంచ్. వాళ్లది సంప్రదాయ పంజాబీ కుటుంబం. ఆడ, మగ తప్ప మరో జెండర్‌కు తావు లేదని నమ్మే సంప్రదాయవాదులు.
నవ్య, మహి అనే మరొక ట్రాన్స్‌జెండర్ అమ్మాయిని ఆన్‌లైన్‌లో కలిశారు. మహి కూడా కొన్నేళ్ల క్రితం బిహార్ నుంచి ముంబై తరలివెళ్లిన వ్యక్తే. తన పరిస్థితి గురించి మహికి చెప్పారు. ముంబై వచ్చేయమని సలహా ఇచ్చారు మహి.
నవ్యకు ఉత్సాహం కలిగింది. దూరదర్శన్‌లో సినిమాలు, సీరియల్స్ చూస్తూ పెరిగారు. 'మై బనూంగీ మిస్ ఇండియా' సీరియల్ అంటే ఆమెకు చాలా ఇష్టం. అందులో ఒక డాన్స్ ప్రోగ్రాంలో వచ్చే అందమైన అమ్మాయిలలో తాను ఒకరైతే, లేదా లీడింగ్ రోలే తనకి వస్తే ఎలా ఉంటుందని ఊహించుకునేవారు.
ముంబై వెళ్లాక ఆమె టీవీ/సినిమా ప్రపంచానికి దగ్గరయ్యారు. చేతిలో ఎక్కువ డబ్బులు ఉండేవి కావు. ఒక్కోసారి ఒక్క వడాపావ్ తిని కడుపు నింపుకునేవారు.
మహి మోడల్‌గా పనిచేస్తూ, సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఉండేవారు. నవ్యకు ముంబైలోని ఎల్జీబీటీ కమ్యూనిటీని పరిచయం చేశారు. మహి ద్వారా ఎందరో ఎల్జీబీటీ డాన్సర్లు, మోడల్స్, డిజైనర్లు, నటులను కలిశారు నవ్య.
వారిలో కొంతమంది పేర్లు సుపరిచితమే. మిగతా వారు పరిశ్రమలో బ్రేక్ కోసం ఎదురుచూస్తూ కష్టాలు పడుతున్నవారు, ముఖ్యంగా ట్రాన్స్ కమ్యూనిటీకి చెందినవారు. వారిలో చాలామంది పొట్టకూటి కోసం సెక్స్ వర్కర్లలుగా మారడం చూశారు నవ్య.
"బాలీవుడ్‌లో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు పని దొరకడం కష్టమే. ఫ్యాషన్ షోలు, సినిమాల ఆడిషన్స్‌కు వెళతాం. కానీ, తరువాత మాకు పిలుపు రాదు. గే ఫ్యాషన్ డిజైనర్లు, ప్రొడ్యూసర్లు కూడా మాకోసం తలుపులు తెరవరు. ఒక్కోసారి ఎల్జీబీటీ సంఘం కూడా ట్రాన్స్ వ్యక్తుల పట్ల చిన్నచూపు చూస్తుంది" అన్నారు నవ్య.
అయితే, నవ్యకు కొన్ని అవకాశాలు వచ్చాయి. ఫ్యాషన్ షోలలో పాల్గొన్నారు. గ్రాజియా మ్యాగజైన్‌కు మోడల్‌గా చేసే అవకాశం వచ్చింది.
మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా పోటీ ఫైనల్స్‌కు కూడా వెళ్లారు. ఆ ప్రోగ్రాంకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. భారతదేశంలో ట్రాన్స్‌జెండర్ల కోసం నిర్వహించే అతిపెద్ద అందాల పోటీ అది.

ఫొటో సోర్స్, Navya Singh
ముంబై వెళ్లిన ఏడేళ్ల తరువాత నవ్యకు చెప్పుకోదగ్గ పాత్ర ఒకటి దొరికింది. ‘సావధాన్ ఇండియా’ అనే క్రైమ్ సిరీస్‌లో నవ్యకు ట్రాన్స్ వుమన్ పాత్ర దక్కింది. అందులో చేశాక, ఇన్‌స్టాగ్రాంలో ఆమెకు ఫాలోయింగ్ పెరిగింది. లక్షకంటే ఎక్కువమంది ఫాలోయర్లు వచ్చారు.
ఆ సిరీస్ మొదటి ఎపిసోడ్ ప్రసారమయ్యాక, ఆమెకు తన తల్లిదండ్రుల నుంచి ఫోన్ వచ్చింది. నవ్య బిహార్ వదిలివెళ్లినప్పటి నుంచి వాళ్లు ఆమెతో మాట్లాడలేదు.
"వాళ్లు సారీ చెప్పారు. 'ట్రాన్స్‌జెండర్‌గా ఉండటం అంటే ఏమిటో మాకు అర్థం కాలేదు, నిన్ను టీవీలో చూశాక అర్థమైంది. నువ్వు మా బిడ్డవి' అన్నారు."
నవ్య సంతోషంగా వాళ్లను దగ్గరకు తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2022 ప్రారంభంలో, రాబోయే ఒక వెబ్ సిరీస్ గురించి ముంబై ఎల్జీబీటీ కమ్యూనిటీలో ఒక వార్త హల్‌చల్ చేసింది.
ముంబైకి చెందిన గౌరీ సావంత్ అనే ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ కథ ఆధారంగా 'తాలీ' (చప్పట్లు) అనే సినిమా తీస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఎయిడ్స్‌తో చనిపోయిన ఒక సెక్స్ వర్కర్ కూతురిని గౌరీ సావంత్ దత్తతకు తీసుకున్నారు.
2014లో గౌరి తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు కూడా బిడ్డను దత్తత తీసుకునే హక్కు ఉంటుందంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఆమె వేసిన ఈ ముందడుగుకు విశేషంగా ప్రశంసలు లభించాయి.
"తాలీ సినిమా తీస్తున్నట్టు తెలియగానే మేం చాలా సంబరపడ్డాం. ఒక సినిమాలో ప్రధాన పాత్ర, హీరోయిక్ పాత్ర ట్రాన్స్‌జెండర్ కావడం సంతోషమే కదా. ఇది మా కమ్యూనిటీకి గొప్ప విజయం. ఇది మాకు బాగా తెలిసిన, అర్థమైన పాత్ర. మా కమ్యూనిటీలో వ్యక్తి గురించి సినిమా తీస్తున్నారు" అని చెప్పారు నవ్య.
అయితే, గౌరీ సావంత్ పాత్రలో సుష్మితా సేన్ నటిస్తున్నట్టు అక్టోబర్‌లో వెల్లడైంది.
"గౌరి పాత్రను ట్రాన్స్‌జెండర్ కాని వ్యక్తికి ఇచ్చారని తెలియగానే చాలా బాధ కలిగింది. నాకొక్కర్తికే కాదు, చాలామంది ఇదే విధంగా స్పందించారు" అన్నారు నవ్య.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
సోషల్ మీడియాలో చాలామంది ఇదే అంశాన్ని లేవనెత్తారు.
"ట్రాన్స్ కాని ఒక మహిళ ట్రాన్స్‌జెండర్ పాత్ర ఎందుకు పోషిస్తున్నారు? ఇదే సంవత్సరం? 1995 కాదుకదా ? ట్రాన్స్ పాత్రలకు ట్రాన్స్ నటులనే తీసుకోవచ్చు కదా" అంటూ ఒక యూజర్ ట్వీట్ చేశారు.
"ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో మంచి నటుల లిస్ట్ నేనివ్వగలను. సరే, బాలీవుడ్ నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలం?" అంటూ మరో యూజర్ ట్వీట్ చేశారు.
'సౌత్ ఇండియన్ సినిమాల్లో మార్పు వస్తోంది'
"ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు సరిపోయే విభిన్నమైన, సంక్లిష్టమైన పాత్రలు చాలా తక్కువ. సినిమాలలో వాళ్లకిచ్చే పాత్రలు.. సెక్స్ వర్కర్లు, పెళ్లి సీనులో కనిపించే వందమందిలో ఒకరు లేదా శాపాలు పెడుతూ గట్టి అరుస్తూ మాట్లాడే పాత్రలు. వాళ్లను మంచి పాత్రలు ఇవ్వడం అరుదు. దక్షిణ భారత సినిమాలలో కొంత మార్పు కనిపిస్తోంది. కానీ, బాలీవుడ్‌లో ఏ మార్పూ లేదు" అని ట్రాన్స్‌జెండర్ నటి కల్కి సుబ్రమణ్యం అన్నారు.
భారతదేశంలో ఫేమస్ అయిన ట్రాన్స్‌జెండర్ నటి అంజలి అమీర్. తమిళ సినిమా పేరన్బులో మమ్ముట్టి ప్రియురాలిగా నటించారు. అది ట్రాన్స్‌జెండర్ పాత్రే. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది.
భారతీయ సినిమాలో లీడింగ్ రోల్ వేసిన తొలి ట్రాన్స్ మహిళ అంజలి అమీర్.
వికలాంగురాలైన కూతురిని చూసుకుంటూ, ఒంటరితనం నిండిన పాత్రలో నటించారు ముమ్ముట్టి. ఆ తండ్రీకూతుళ్ల జీవితంలో ప్రవేశించి, సంతోషాలు నింపే ట్రాన్స్‌జెండర్ పాత్రలో అంజలి నటించారు.
అయితే, గౌరీ సావంత్ పాత్రలో సుష్మితా సేన్ నటించడాన్ని అంజలి సమర్థిస్తున్నారు.
"సుష్మితా సేన్ లాంటి ఫేమస్ నటి గౌరి పాత్రలో నటించడం ఎల్జీబీటీ కమ్యూనిటీకి మేలు చేస్తుంది" అన్నారామె.
"మా కథలు కూడా ప్రధాన స్రవంతిలోకి వస్తున్నాయని అర్థం. మా కథలు మరిన్ని ఇళ్లలోకి ప్రవేశించినప్పుడు, ప్రజలు మమ్మల్ని మనుషులుగా చూడగలిగినప్పుడు, మాకు మరిన్ని మంచి పాత్రలు వస్తాయి" అని బీబీసీతో అన్నారు అంజలి.

ఫొటో సోర్స్, Sreelesh Sreedhar
మమ్ముట్టి లాంటి స్టార్ హీరో, పేరన్బు డైరెక్టర్ రామ్ తనకు ఇచ్చిన సపోర్ట్ వలన తనకు సినిమాల్లో మరిన్ని పాత్రలు (ట్రాన్స్ కానివి) వస్తున్నాయని అంజలి చెప్పారు. అయితే, సౌత్ ఇండియన్ సినిమాలతో పోల్చుకుంటే బాలీవుడ్ వెనకబడి ఉందని అన్నారు.
"ట్రాన్స్ వ్యక్తులకు సినిమాల్లో పాత్రలు ఇస్తున్నారు. కానీ, అవి సెక్స్ వర్కర్ పాత్రలు లేదా బాధితులు. అలాంటి పాత్రల నుంచి నేను దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. మంచి పాత్రలు చేయాలనుకుంటున్నా. సుష్మితా సేన్ కూడా అలాగే అనుకుంటారు. నటులందరూ అలాగే అనుకుంటారు. గుర్తింపు (జెండర్) అందులోకి రాకూడదు" అన్నారు అంజలి.

ఫొటో సోర్స్, SushmitaSen/FB
'ఈ పాత్రకు నా ఫస్ట్ చాయిస్ సుష్మితా సేన్'.. గౌరీ సావంత్
గౌరీ సావంత్ కూడా ఇదే అభిప్రాయన్ని వ్యక్తం చేశారు. సుష్మితా సేన్‌ను ఉద్దేశిస్తూ ఆమె ఒక సందేశం పోస్ట్ చేశారు.
"ఈ పాత్రలో నటించడానికి సుష్మితా సేన్ ఒప్పుకోవడం మా కమ్యూనిటీకి గొప్ప గౌరవం" అన్నారామె.
అందుకు "మనం చేద్దాం" అంటూ సుష్మితా సేన్ జవాబిచ్చారు.
ఈ పాత్రకు తన ఫస్ట్ చాయిస్ సుష్మితా సేన్ అని గౌరి అన్నట్లు హిందుస్తాన్ టైమ్స్ పత్రిక ఒక కథనంలో పేర్కొంది.
తాలీలో ఒక చిన్న పాత్ర కోసం నవ్యను పిలిచారు. సెట్‌లో ఓ రోజంతా వెయిట్ చేసాక, ఆమెకు పాత్ర లేదని చెప్పి ఇంటికి పంపించేశారు. ఆ మాట తీవ్రంగా కలచివేసిందని నవ్య చెప్పారు.
"ఇది సెట్స్‌లో సాధారణంగా జరిగే విషయమే. కానీ, బాలీవుడ్‌లో ట్రాన్స్‌వుమెన్‌కు ఇది ఎక్కువ అనుభవం అవుతుంటుంది. మా సమయానికి విలువ లేదు.. మా ముఖం అవసరం లేదు. వెనకాల వచ్చే ఏదో ఒక పాత్ర మాది" అన్నారామె.
ఇంటి అద్దె చెల్లించడానికి డబ్బుల కోసం నవ్య నైట్ క్లబ్స్‌లో డాన్సర్‌గా పనిచేస్తున్నారు. మరోపక్క మోడల్‌గా ఫ్యాషన్ షోలకు, సినిమాల్లో పాత్రలకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
మంచి, బలమైన పాత్రల్లో నటించాలన్నది ఆమె కోరిక. కానీ, బాలెవుడ్‌లో ట్రాన్స్ వ్యక్తులకు అంత అవకాశం లేదని ఆమెకు తెలుసు.
అందుకే, తాలీ సినిమాపై, గౌరీ సావంత్ పాత్రపై ట్రాన్స్ వ్యక్తులు చాలా ఆశలు పెట్టుకున్నారు.
"గౌరి మాకు, మా కమ్యూనిటీకి సొంత మనిషి. ఆ పాత్రను ఒక ట్రాన్స్‌జెండర్ వ్యక్తి చేసుంటే ఎంత బలమైన సందేశం అందించి ఉండేవారో ఊహించండి. ఆ పాత్ర వేసిన ట్రాన్స్‌జెండర్ కెరీర్ మారిపోయి ఉండేది. ప్రధాని స్రవంతిలోకి వచ్చి ఉండేవారు" అన్నారు నవ్య.
ఇవి కూడా చదవండి:
- నెల జీతంలాగా స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే మార్గమిది, ఎవరు చేరొచ్చు, తెలుసుకోవాల్సిన విషయాలేంటి
- ‘ఫాంహౌస్‌లో ముందే సీసీ కెమెరాలు పెట్టాం...రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం’-హైకోర్టుకు చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
- వ్యభిచారం చేస్తోందని మాజీ భర్త ఆరోపణ, రాళ్లతో కొట్టి చంపమని కోర్టు తీర్పు, ఆమెను రక్షించేవారే లేరా
- పాకిస్తాన్, జింబాబ్వే మ్యాచ్ తర్వాత మిస్టర్ బీన్ పేరు ఎందుకు ట్రెండ్ అవుతోంది?
- రిషి సునక్‌కు నరేంద్రమోదీ కంగ్రాట్స్ చెప్పారు. కానీ, షీ జిన్‌పింగ్‌కు ఎందుకు చెప్పలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














