Sudan: వ్యభిచారం చేస్తోందని మాజీ భర్త ఆరోపణ, రాళ్లతో కొట్టి చంపమని కోర్టు తీర్పు, ఆమెను రక్షించేవారే లేరా

సూడాన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మేఘ మోహన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సూడాన్‌లో వ్యభిచారం చేశారన్న అభియోగంపై ఒక మహిళను రాళ్లతో కోట్టి చంపాలని కోర్టు తీర్పు చెప్పింది. ఈ శిక్షను అడ్డుకోవడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదు. ప్రభుత్వ మంత్రులెవరూ జోక్యం చేసుకోలేదు.

ఏడాది క్రితం సూడాన్‌లో సైన్యం తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని చేజిక్కుంచుకుంది. 20 ఏళ్ల ఆ మహిళకు సరైన న్యాయం జరగలేదని, ఆమెను విడుదల చేయాలని హక్కుల ప్రచారకులు అంటున్నారు.

ఆమెపై జరిగిన విచారణ "ఒక జోక్" అని ఓ ప్రభుత్వ అధికారి కూడా అంగీకరించారు. "ఈ విషయంలో జోక్యం చేసుకుని ఆమెను విడిపించగలిగే మంత్రులెవరూ మాకు లేరు" అని ఆయన అన్నారు.

ఆ మహిళ 2020లో తన భర్త నుంచి విడిపోయి, తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నారు. ఒక ఏడాది తరువాత ఆమె వ్యభిచారం చేస్తోందంటూ ఆమె భర్త అభియోగం మోపారు.

2022 జూన్‌లో సూడాన్‌లోని వైట్ నైల్ రాష్ట్రంలోని కోస్తి నగరంలో ఒక కోర్టు ఆమెను దోషిగా నిర్ధరించింది.

కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆమె మళ్లీ పిటిషన్ పెట్టుకున్నారు. దీనిపై విచారణ జరిగింది. తుది తీర్పు రావాల్సి ఉంది.

సూడాన్ సాంఘిక అభివృద్ధి మంత్రిత్వ శాఖలో 'మహిళలపై హింస' విభాగానికి నేతృత్వం వహిస్తున్న సులైమా ఇషాక్ బీబీసీతో మాట్లాడుతూ, ఆ మహిళ కేసులో విచారణ లోపభూయిష్టంగా జరిగిందని అన్నారు.

ఇదే విషయాన్ని రాజధాని ఖార్టూమ్‌లోని అధికారులకు చెప్పానని, కానీ, ప్రభుత్వంలో మంత్రులు లేకపోవడంతో తన మాటను ఎవరూ వినిపించుకోలేదని అన్నారు.

ఆ మహిళ పేరును బయటపెట్టవద్దని ఆమె కుటుంబం బీబీసీని కోరింది.

కస్టడీలో ఉన్నప్పుడు ఆమెకు ఒక లాయరును కేటాయించలేదని, ఆమెపై వచ్చిన అభియోగాలేమిటో ఆమెకు తెలీదని మానవ హక్కుల సంఘాలు అంటున్నాయి.

"నేరం చేసినట్టు ఒప్పుకోమని ఆమెను పోలీసులు బలవంతపెట్టారనడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి" అని ఆఫ్రికన్ సెంటర్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ స్టడీస్ (ఏసీజేపీఎస్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మొసాద్ మొహమ్మద్ అలీ చెప్పారు.

ఆమె అప్పీల్‌ను అనుసరించి ఇప్పుడైనా కోర్టు "సరైన నిర్ణయం తీసుకుంటుందని" ఆశిస్తున్నట్లు ఆమె మహిళ తరఫు న్యాయవాది ఇంతిసార్ అబ్దాలా బీబీసీతో అన్నారు.

రాజధాని ఖార్టూమ్‌లో రాళ్లతో కొట్టి చంపే శిక్షను నిరసిస్తున్న ఆందోళనకారులు

ఫొటో సోర్స్, SIHA

ఫొటో క్యాప్షన్, రాజధాని ఖార్టూమ్‌లో రాళ్లతో కొట్టి చంపే శిక్షను నిరసిస్తున్న ఆందోళనకారులు

ఇప్పటికీ చట్టాల్లో అమానుష శిక్షలు..

సూడాన్‌లో ఇప్పటికీ కొన్ని హుదూద్ నేరాలకు మరణశిక్షలు విధిస్తారు. హుదూద్ అంటే ఖురాన్‌లో అల్లా నేరాలుగా పేర్కొన్నవి. దొంగతనం, వ్యభిచారం కూడా హుదూద్ కిందకు వస్తాయి.

సూడానీస్ చట్టంలో ఇప్పటికీ కొరడా దెబ్బలు, చేతులు, కాళ్లు నరికివేయడం, ఉరితీయడం, రాళ్లతో కొట్టి చంపడం వంటి శిక్షలు ఉన్నాయి.

2015లో ప్రభుత్వం రాళ్లతో కొట్టి చంపే శిక్షను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది కానీ, అలాంటిదేమీ జరగలేదని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి.

"చాలా సంప్రదాయబద్ధమైన రాజకీయ నేతలు కూడా రాళ్లతో కొట్టి చంపే శిక్షను వ్యతిరేకిస్తున్నారు. కానీ, ఇక్కడ మార్పు రావాలంటే చాలా కాలం పడుతుంది. ఆ మార్పు కోర్టు వరకు వెళ్లాలి. ఈలోగా బలయ్యేది మహిళలే" అని సులైమా ఇషాక్ బీబీసీతో అన్నారు.

సూడాన్‌లో వ్యభిచార నేరాల విషయంలో చాలా పక్షపాతం ఉంటుందని, మహిళలకే ఎక్కువగా శిక్షలు పడతాయని హార్న్ ఆఫ్ ఆఫ్రికా (సిహా)లో స్ట్రాటజిక్ ఇనీషియేటివ్ ఫర్ వుమెన్ ప్రాంతీయ డైరెక్టర్ హాలా అల్-కరీబ్ అన్నారు.

సూడాన్‌లో చివరిసారిగా ఇంతిసార్ ఎల్.షరీఫ్ అబ్దల్లా అనే యువతికి వ్యభిచారం నేరం కింద రాళ్లతో కొట్టి చంపే శిక్ష విధించారని హక్కుల ప్రచారకులు చెప్పారు.

కాగా, సిహా, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ జోక్యం చేసుకుని, ఆమెను విడుదల చేయాలని కోరుతూ ప్రచారాలు నిర్వహించాయి. దాంతో, 2012లో ఎల్ షరీఫ్ అబ్దల్లా, ఆమె నాలుగు నెలల బిడ్డ విడుదల అయ్యారు. అయితే, వెలుగు చూడని ఇలాంటి కేసులు ఇంకా ఎన్నో ఉంటాయని అల్-కరీబ్ అన్నారు.

"దేశంలోని హక్కుల ప్రచారకర్తలు, స్రీవాదుల వద్ద పరిమితమైన వనరులు ఉంటాయి. మాకు తెలియని, మా దృష్టిలోకి రాని ఎన్నో వందల కేసులు ఉండిఉండవచ్చు" అని అన్నారామె.

వీడియో క్యాప్షన్, నైలు నది రిజర్వాయర్‌ నిర్మాణంపై ఇథియోపియా, ఈజిప్టు దేశాల మధ్య వివాదం

'క్రూరమైన, అమానుషమైన, అవమానకరమైన శిక్ష'

2019లో సూడాన్ అధ్యక్షుడు ఒమర్ అల్-బషీర్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు అనంతరం, అధికారంలోకి వచ్చిన మధ్యంతర ప్రభుత్వం మహిళల దుస్తులు, ప్రవర్తనపై పరిమితులు విధించే ఒక చట్టాన్ని రద్దుచేసింది.

అయితే, గత ఏడాది సైన్యం ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కుంచుకున్న తరువాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందని, మొరాలిటీ పోలీసులు వీధుల్లో గస్తీ తిరుగుతూ మహిళల వస్త్రధారణపై చట్టం అమలు అయేలా చూస్తున్నారని సూడానీస్ జర్నలిస్ట్ జైనబ్ మొహమ్మద్ సాలీ చెప్పారు.

మాజీ అధ్యక్షుడు బషీర్ విధేయులను ప్రస్తుత పాలక వర్గం మళ్లీ నియమించుకుందనే వార్తలు వచ్చాయి.

"సూడాన్‌లో మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చట్టాల్లో మార్పు తీసుకువస్తుందని ఆశించాం. స్త్రీలపై వివక్ష, అసమానత్వం తగ్గుతుందని ఆశించాం. కానీ, అది మా అమాయకత్వమని తేలింది" అని అల్-కరీబ్ అన్నారు.

సూడాన్ 2021లో హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్‌లో భాగమైంది.

"ఈ కన్వెన్షన్ ప్రకారం, హింస అంటే ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా, తీవ్రంగా బాధ పెట్టడం. రాళ్లతో కొట్టి చంపడం అనేది అత్యంత క్రూరమైన హింస" అని ఏసీజేపీఎస్‌కు చెందిన మొసాద్ మొహమ్మద్ అలీ అన్నారు.

ప్రస్తుతం ఈ శిక్ష పడిన మహిళను విడుదల చేయాలని అంతర్జాతీయ, స్థానిక ఎన్జీవోలు పిలుపునిస్తున్నాయి. దాన్ని బట్టి ఇది ఎంత "క్రూరమైన, అమానుషమైన, అవమానకరమైన" శిక్షో అర్థం చేసుకోవచ్చని ఆయన ఆన్నారు.

ప్రస్తుతం జైలులో ఉన్న 20 ఏళ్ల ఆ మహిళను కలిసేందుకు లాయర్ ఇంతిసార్ అబ్దాలాకు మాత్రమే అనుమతి ఉంది. ఆ మహిళ కొన్ని నెలల తరబడి వైట్ నైల్ స్టేట్‌లోని జైలులో మగ్గుతున్నారు.

"ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. కానీ, చాలా విచారంగా ఉన్నారు" అని లాయరు ఇంతిసార్ అబ్దాలా తెలిపారు.

"ఆమె ఒక సాదాసీదా పల్లెటూరి అమ్మాయి. సంప్రదాయమైన, మత విశ్వాసాలు ఉన్న రైతు కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తల్లిదండ్రులు ఆమె పక్షాన ఉన్నారు. ఆమె పెట్టుకున్న పిటిషన్‌పై కోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్నాం. అయితే, అదెప్పుడొస్తుందో ఎవరికీ తెలీదు. వేచి చూడడం తప్ప మరో మార్గం లేదు" అని ఆమె చెప్పారు.

2021లో రోడ్లపైకొచ్చి నిరసనలు చేస్తున్న సూడాన్ ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2021లో రోడ్లపైకొచ్చి నిరసనలు చేస్తున్న సూడాన్ ప్రజలు

'అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలి'

అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తే ఆమె ఈ కేసులోంచి బయటపడే అవకాశాలు పెరుగుతాయని హక్కుల ప్రచారకర్తలు అంటున్నారు.

"అంతర్జాతీయ సమాజం ఈ శిక్ష పట్ల దిగ్భ్రాంతి చెందవచ్చు కానీ, మాకేం షాకింగ్ కాదు. అంతర్జాతీయ సమాజం కూడా గొంతెత్తితే సూడాన్ ప్రభుత్వంపై ఒత్తిడి వస్తుంది. ఇలాంటి మహిళలను కాపాడగలుగుతాం" అని అల్-కరీబ్ అన్నారు.

కోస్తి క్రిమినల్ కోర్టును సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, ఎటువంటి స్పందనా రాలేదు. న్యాయ శాఖ మంత్రిని సంప్రదిద్దామంటే కుదరదు. ఎందుకంటే ఆ పదవిలో ఎవరూ లేరు.

"ఈ కేసు వివరాలన్నీ మాకు తెలుసు. మాకు తెలిసినంత వరకు ఇది కోర్టు తుది తీర్పు కాదు. సూడాన్‌లో న్యాయ అధికారులతో మేం మాట్లాడాం. వాళ్ల స్పందన కోసం ఎదురుచూస్తున్నాం" అని లండన్‌లోని సూడాన్ రాయబార కార్యాలయ ప్రతినిధి ఒకరు తెలిపారు.

వీడియో క్యాప్షన్, ఇరాన్ మహిళలకు మద్దతుగా జుత్తు కత్తిరించుకుంటున్న మహిళలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)