ఇరాన్ నిరసనలు: మహిళల ఆందోళనలతో ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉందా?

- రచయిత, బెహ్రాంగ్ తాజ్‌దిన్, లైజ్ డూసే
- హోదా, బీబీసీ పర్షియన్
మహసా అమీనీ మరణం తర్వాత పెల్లుబికిన నిరసనలతో ఇరాన్ అట్టుడికిపోయింది. ఈ నాలుగు వారాల్లో అక్కడ పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరిగాయి.
ఈ నిరసనలు ప్రభుత్వానికి ముప్పుగా మారాయి. దీంతో ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది.
ఇరాన్ నిరసనలపై ప్రత్యేక కవరేజీ అందిస్తోన్న బీబీసీ పర్షియన్ రిపోర్టర్ బెహ్రాంగ్ తాజ్‌దిన్, చీఫ్ ఇంటర్నేషనల్ కరెస్పాండెంట్ లైజ్ డూసే అక్కడి ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ నిరసనల పరిణామాల గురించి విశ్లేషించారు.

ఫొటో సోర్స్, EPA
1. ఇరాన్‌లో నిరసనలకు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు?
బెహ్రాంగ్ తాజ్‌దిన్: ఏదో ఒక రాజకీయ సమూహమో లేక ఒక వ్యక్తి ఈ నిరసనలకు సారథ్యం వహించడం లేదు. తమ జీవితాలపై నియంత్రణ సాధిస్తున్న ప్రభుత్వ విధానాలతో విసుగు చెందిన ఇరాన్ మహిళలే ఈ నిరసనలను నడుపుతున్నారు.
ఈ నిరసనల్లో ఎక్కువగా 'మహిళలు, జీవితం, స్వేచ్ఛ', ''నియంత మరణించాలి'' అనే నినాదాలే వినిపించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీని ఉద్దేశిస్తూ మహిళలు ఈ నినాదాలు చేశారు.
ఇరాన్‌లో విధానపరమైన మార్పులు, అప్రజాస్వామిక స్వభావం, ఇస్లామిక్ రిపబ్లిక్ భావజాలంతో నడిచే విధానాల్లో మార్పు తీసుకురావాలనే కోరికే ఈ మహిళలందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చింది.

ఫొటో సోర్స్, AFP
2. ఇరాన్ జనాభాలో ఎంతమంది ఈ నిరసనలకు మద్దతు ఇస్తున్నారు?
బెహ్రాంగ్ తాజ్‌దిన్: నిజానికి ఈ నిరసనలు విద్యార్థి సమాజంలో లేదా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో మొదలు కాలేదు. కుర్దిస్తాన్ ప్రావిన్సులోని సాకేజ్ ప్రాంతంలో మొదలై దేశమంతటా దావానలంలా విస్తరించాయి.
ఈ నిరసనల్లో విద్యార్థులు, పెద్ద నగరాల ప్రజలు, చిన్న నగరాల్లోని మహిళలు, సంప్రదాయ పట్టణ ప్రజలతోపాటు పేద, ధనిక వర్గాలు కూడా పాల్గొనడం మేం చూశాం.
ఈ నిరసనలకు ఎంత శాతం మంది ప్రజలు మద్దతు ఇస్తున్నారో, ఎంతమంది సానుభూతి చూపిస్తున్నారో కచ్చితంగా చెప్పడం కష్టం. అయితే, వీటికి పలు దేశాల నుంచి పలు సమాజాల నుంచి విస్తృత స్థాయిలో మద్దతు లభిస్తున్నట్లు ఆధారాలు సూచిస్తున్నాయి.

ఫొటో సోర్స్, WANA NEWS AGENCY
3. నిరసనలకు మీడియా కవరేజీ ఎక్కువగా ఎందుకు దక్కట్లేదు?
లైజ్ డూసే: నిరసనలపై ఇరాన్ అణచివేతలను ఖండిస్తూ అనేక పాశ్చాత్య ప్రభుత్వాలు ప్రకటనలు విడుదల చేశాయి.
వారు కొత్తగా ఆంక్షల్ని కూడా విధించారు. ఉదాహరణకు బ్రిటన్, ఇరాన్ మొరాలిటీ పోలీస్‌పై అయిదుగురు రాజకీయ, భద్రతా అధికారులపై ఆంక్షలు విధించింది.
ఇక మీడియా విషయానికొస్తే, కొన్ని విదేశీ మీడియా ప్రతినిధులు ఇరాన్‌లోనే ఉన్నారు. వారితో పాటు ఇరాన్ జర్నలిస్టులు కూడా ఆంక్షల కిందే పనిచేస్తున్నారు. అయినప్పటికీ, వారు వార్తలను అందిస్తున్నారు.
బీబీసీతో సహా చాలా మీడియా సంస్థలు అక్కడికి జర్నలిస్టులను పంపాలని అనుకుంటున్నాయి. కానీ, వీసాలు అందట్లేదు. అందుకే ఇరాన్ ప్రజలు పంపుతున్న వీడియోలు, వారి సోషల్ మీడియా ఖాతాలపై ఆధారపడుతున్నాం.
అక్కడి ప్రత్యక్ష్య సాక్షుల వివరణలతో పాటు, వీడియోలను బీబీసీ పొందగలుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
4. మతం నుంచి దూరంగా జరిగేందుకే నిరసనలా?
బెహ్రాంగ్ తాజ్‌దిన్: గత రెండు దశాబ్దాల్లో ఇరాన్ తక్కువ మతపరమైన సమాజంగా మారిందనే సంకేతాలు ఉన్నాయి.
ఇస్లామిక్ విలువలను పాటించడంలో పెరుగుతున్న తిరస్కరణే, ఇరాన్ మొరాలిటీ పోలీసుల ఆవిర్భావానికి కారణం.
ప్రజలపై ఇస్లామిక్ విలువలను రుద్దడానికి, ప్రజల డబ్బును మతపరమైన సంస్థల్లో పెట్టడానికి ఇరాన్ ఎంతగా ప్రయత్నించిందో ప్రజలు అంతగా మతం నుంచి దూరంగా వెళ్లారు.
ఇస్లాం నుంచి నాస్తికత్వం వైపు లేదా ఇతర మతాల వైపు వెళ్లడం అక్కడ చట్టప్రకారం నిషేధించారు. ఈ నేరానికి మరణశిక్ష కూడా పడవచ్చు. కాబట్టి ప్రజలు ఇలాంటి అభిప్రాయాలను అక్కడ బహిరంగంగా వ్యక్తం చేయడం కనిపించదు.

ఫొటో సోర్స్, Twitter
5. ఆమ్నెస్టీ వంటి మానవహక్కుల గ్రూపులు ఇరాన్‌లో ఉన్నాయా?
బెహ్రాంగ్ తాజ్‌దిన్: లేదు. ఇతర మానవ హక్కుల సంఘాల తరహాలోనే వారు కూడా విదేశాల నుంచే ఇరాన్ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
ప్రభుత్వేతర సంస్థల (ఎన్జీవో)ను ఇరాన్ అనుమానిస్తుంది. తమ దేశంలోని ఎన్జీవోలపై కూడా ఇరాన్‌కు నమ్మకం ఉండదు. ఎన్జీవోలపై గూఢచర్యం, జాతీయ భద్రతకు ముప్పు కలిగించడం, ప్రభుత్వాన్ని కూలగొట్టే సంస్థలు అంటూ ఆరోపణలు చేస్తుంది.
దేశీయంగా, అంతర్జాతీయంగా ఎన్జీవోల తరఫున పనిచేసే కార్యకర్తలు అరెస్ట్ అవ్వడం మేం చూశాం. ఎలాంటి సాక్ష్యాలు లేకుండానే వారిని ఇలాంటి ఆరోపణలతో అరెస్ట్ చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో మానవ హక్కుల సంఘాలు స్వతంత్రంగా, సురక్షితంగా ఇరాన్‌లో పనిచేయడం దాదాపు అసాధ్యమే.

ఫొటో సోర్స్, Reuters
6. అంతర్జాతీయ సమాజం, ఇరాన్ ప్రజలకు ఎలా సహాయపడగలదు?
లైజ్ డూసే: బీబీసీ జర్నలిస్టులుగా రాజకీయ ఉద్యమాల విషయంలో మేం ఎలాంటి సిఫార్సులు చేయం. కానీ, చాలా మానవ హక్కుల సంఘాలు, ఇతర పౌర సమాజాలు కొన్ని సూచనలు చేస్తున్నాయి. కొన్ని ప్రభుత్వాలు, కంపెనీలు ఇరాన్ ప్రజలకు మద్దతుగా చేపట్టిన చర్యల గురించి నేను చెప్పగలను.
ఇరాన్ ప్రజలు ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సేవలను వినియోగించడాన్ని సులభతరం చేసేందుకు అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు యూఎస్ ట్రెజరీ ఒక కొత్త జనరల్ లైసెన్స్ డీ-2ను జారీ చేసింది.
ఇరాన్ ప్రజలకు అంతరాయం లేకుండా ఇంటర్నెట్‌ను అందించేందుకు ఎలాన్ మస్క్ తన స్టార్ లింక్ నెట్‌వర్క్‌ను అందిస్తున్నారు.
గూగుల్, సిగ్నల్ వంటి ఇతర కంపెనీలు వీపీఎన్‌లను అందిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
7. నిరసనలు ప్రభుత్వ మార్పునకు దారి తీస్తాయా?
లైజ్ డూసే: కొంతమంది సీనియర్ అధికారులు, అణచివేత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, ఇస్లామిక్ రిపబ్లిక్ మనుగడే వారికి ముఖ్యం.
నీటి కొరత, ధరల పెరుగుదల, హిజాబ్ తప్పనిసరి అనే అంశాలపై చాలా ఏళ్లుగా ఇరాన్‌లో చాలా నిరసనలు జరుగుతున్నాయి. 2019లో ఆర్థిక స్థితి గురించి అక్కడ భారీగా నిరసనలు జరిగాయి.
అప్పటి నిరసనల్లాగే వీటిని కూడా ఎదుర్కోవచ్చని అధికారులు అనుకొని ఉండొచ్చు.
కానీ, నిరసనకారుల్లో చాలా మంది 25 ఏళ్ల లోపు వారే. ఇది ఇరాన్‌లో సంభవిస్తోన్న సామాజిక మార్పులను చూపుతుంది.
గతంలో ఇరాన్‌లో నిరసనలు భద్రతా బలగాల అణచివేత తర్వాత తగ్గిపోయేవి.
కానీ తాజా నిరసనలు ఎలాంటి దారి తీసుకుంటాయో అనేది ఇంకా అనిశ్చితిలోనే ఉంది.
ఇవి కూడా చదవండి:
- ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా: 'శారీరక శక్తి కన్నా మెదడు ప్రమాదకరం' అన్న సుప్రీం కోర్టు, బాంబే హైకోర్టు తీర్పు రద్దు
- కాంతార మూవీ రివ్వూ: సినిమా అంతా ఒక లెవెల్లో ఉంటే చివరి పది నిమిషాలది మరో లెవెల్
- ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించారు, స్థానికుల జీవితాలలో ఎలాంటి మార్పులు వచ్చాయి
- ఎలుకలు, ఎముకలు, బంకమట్టి, నాగజెముడు పండ్లు...ఆకలికి తట్టుకోలేక వీళ్లు ఇవే తింటున్నారు
- కేరళలో నరబలి: నిందితుడి ఇంటి వెనుక 61 శరీర భాగాలు- బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













