కేరళలో నరబలి: నిందితుడి ఇంటి వెనుక 61 శరీర భాగాలు- బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

ఫొటో సోర్స్, PTI
- రచయిత, బి.సుధాకర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కేరళలో నరబలికి సంబంధించి విస్మయానికి గురిచేసే మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక తమిళ మహిళ సహా ఇద్దరు మహిళలను కొందరు నిందితులు అపహరించి నరబలి ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ ఘటన కేరళలోని ఎళంథూర్‌లో చోటుచేసుకుంది. అయితే, నిందితుల్లో ఒకరైన షఫీ ఇలాంటి హత్యలు చాలా చేసి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు.
అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేందుకు బీబీసీ ఘటన స్థలానికి వెళ్లింది.
హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని వివరాలు మిమ్మల్ని కలిచివేయొచ్చు.
నిందితుల్లో ఒకరైన భగావల్ సింగ్ ఇంటికి సమీపంలో నివసించే ఓ మహిళ బీబీసీతో మాట్లాడారు. ఆమె తమిళనాడులోని దిండిగల్‌కు చెందినవారు. మంత్రగాడిగా చెప్పుకునే షఫీ వలలో తను కూడా పడబోయానని, కానీ, తృటిలో తప్పించుకున్నానని ఆమె తెలిపారు. ఆమె తన పేరును వెల్లడించడానికి ఇష్టపడలేదు.
‘‘అసలు నేనే షఫీతో వెళ్లుండాలి. నాకు లక్ష రూపాయలు ఇస్తానని అతడు చెప్పాడు. కానీ, చివరి నిమిషంలో నేను మనసు మార్చుకున్నాను. అప్పుడే అతడు రోసలిన్(49)ను తీసుకెళ్లాడు’’అని ఆమె వివరించారు.
అయితే, తన భర్త ఇంత దారుణమైన నేరానికి ఒడిగట్టాడని చెబుతుంటే నమ్మలేకపోతున్నానని షఫీ భార్య అంటున్నారు.

56 శరీర భాగాలు, 5 ఎముకల ముక్కలు..
భగావల్ సింగ్ ఇంటి వెనుక తోటలో పోలీసులు తవ్వకాలు చేపట్టారు. దీంతో వారికి 61 శరీర భాగాల శిథిలాలు కనిపించాయి.
పదునైన ఆయుధాలతో ఈ శరీర భాగాలను ముక్కలు చేసి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. ఈ శిథిలాల్లోని 56 శరీర భాగాలు పద్మకు చెందినవని, ఐదు ఎముకలు రోసలిన్‌కు చెందినవని వారు వెల్లడించారు.
వీటిలో 35 శరీర భాగాలను శవపరీక్షలు, రసాయన విశ్లేషణల కోసం బుధవారం పంపించారు. మరో 26 శరీర భాగాలను గురువారం పరీక్షల కోసం పంపించారు.
ఇక్కడ, రోసలిన్, పద్మ శరీర భాగాలు కలిసిపోయి ఉన్నాయి. వీటిలో ఎవరి భాగాలు ఏవో గుర్తించేందుకు వీరి బంధువుల నుంచి రక్త నమూనాలను సేకరించారు. అనంతరం వాటిని డీఎన్ఏ పరీక్షల కోసం పంపించారు.

స్థానికుల ఆందోళన
ఎళంథూర్‌కు చెందిన షాజీ బీబీసీతో మాట్లాడుతూ, ఈ ఘటన పట్ల ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ఇంత దారుణమైన వార్త విని మేం షాక్‌కు గురయ్యాం. నేడు విద్య, నాగరికతలలో ఎంతో పురోగతి కనిపిస్తోంది. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళనను కలిగిస్తోంది. ముఖ్యంగా డబ్బు కోసం ఇలాంటి నరబలులు ఇస్తున్నారు. కూడథారి ఘటన కంటే ఇది ఎక్కువ ఆందోళనను కలిగిస్తోంది. కూడథారి ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురుపై విషప్రయోగం జరిగింది’’అని ఆయన అన్నారు.
కూడథారిలో ఒక మహిళ తమ కుటుంబ సభ్యులకు ఆహారంలో సైనేడ్ కలిపి హత్యచేసిన ఘటన గురించి ఆయన గుర్తు చేశారు.
స్థానికంగా కూరగాయలు అమ్మే జోస్.. భగావల్ ఇంటికి సమీపంలోనే రెండేళ్లుగా జీవిస్తున్నారు. తను భగావల్ సింగ్ కుటుంబ సభ్యులు కనిపిస్తే నవ్వుతోనే పలకరించేవాడినని, ఎప్పుడూ పెద్దగా మాట్లాడేవాడిని కాదని వివరించారు.
‘‘అతడిని ఆయుర్వేద నిపుణుడిగా అందరూ చెబుతుంటారు. చికిత్స కోసం చాలా మంది ఆయన దగ్గరకు వస్తుంటారు. ఆయన, ఆయన భార్య లైలా.. ఇరుగుపొరుగువారితో బాగానే కలిసిపోయేవారు. వారు అరెస్టైనప్పుడు, అమాయకులను అరెస్టు చేస్తున్నారని మేం అనుకున్నాం. అసలు విషయం తెలిసిన తర్వాత, షాక్‌కు గురయ్యాం’’అని జోస్ చెప్పారు.
ఈ విషయంలో పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన అన్నారు. మరోవైపు ఇలాంటి హత్యలు చాలా చోటుచేసుకుని ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.

పోలీసుల విచారణ
ఈ కేసులో భగావల్ సింగ్ ఇంటికి ఇరుగుపొరుగున ఉండే వారినీ పోలీసులు విచారిస్తున్నారు. ఈ హత్యల గురించి ఏమైనా తెలుసా? అని ప్రశ్నిస్తున్నారు.
భగావల్ సింగ్ గురించి ఏం తెలుసని పోలీసులు తమను ప్రశ్నించారని స్థానికులు బీబీసీతో చెప్పారు.

‘‘శరీర భాగాలను ముక్కలుగా కోశారు’’
భగావల్ ఇంటి వెనుక తవ్వకాలు జరిపినప్పుడు పంచాయతీ సర్పంచ్ షాలీ లాలు అక్కడే ఉన్నారు. ఆమె బీబీసీతో మాట్లాడారు.
‘‘నిందితులు తమ ఇంటివెనుక కొన్ని ప్రాంతాలను పోలీసులకు చూపించారు. దీంతో అక్కడ పోలీసు సిబ్బంది తవ్వకాలు చేపట్టారు. నేను వాటిని దగ్గరుండి చూశాను. మాకు శరీర భాగాలు చాలా స్పష్టంగా కనిపించాయి. వర్షం బాగా కురవడంతో శరీర భాగాలపై మట్టి పేరుకుంది. అవి బయటకు తీసినప్పుడు విపరీతమైన దుర్వాసన వచ్చింది’’అని ఆమె చెప్పారు.
‘‘అసలు ఆ శరీర భాగాలు ఎలా ఉన్నాయో నేను చెప్పలేను. చాలా దారుణంగా ముక్కలు కోసేశారు’’అని ఆమె వివరించారు.
ఈ తవ్వకాలు మధ్యాహ్నం మొదలై రాత్రి పది గంటల వరకు కొనసాగాయి. లిప్‌స్టిక్, కళ్లజోడు, పర్సు లాంటి బాధిత మహిళలు ఉపయోగించిన వస్తువులు కూడా అక్కడ లభించాయి.
‘‘మొదట మాకు తలలు కనిపించాయి. ఆ తర్వాత చేతులు కనిపించాయి. మిగతా భాగాలు ఎక్కడ ఉన్నాయని అడిగినప్పుడు, నిందితులు వేరే ప్రాంతాలను చూపించారు. మేం అక్కడ కూడా తవ్వకాలు చేపట్టాం. అక్కడ కూడా కొన్ని శరీర భాగాలు కనిపించాయి. ఇలాంటి నరబలులు మరిన్ని జరిగాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టాలి’’అని షాలి చెప్పారు.
హత్యకు గురైన రోసలిన్ కుమార్తె మంజు వర్గీస్ కూడా ఘటన స్థలానికి వచ్చారు. ఆమె బీబీసీతో మాట్లాడారు. 2015 నుంచి జనవరి 2022 వరకు ఆమె ఉత్తర్ ప్రదేశ్‌లో టీచర్‌గా పనిచేశారు.
జనవరిలోనే ఆమె కలాడికి వచ్చారు. ఫిబ్రవరి వరకు ఆమె తల్లి రోసలీన్‌తోనే కలిసి ఉన్నారు. ఆ తర్వాత వడక్కంజేరి ఒట్టుప్పారాలో ఒక ట్రస్టు కోసం పని చేసేందుకు వెళ్లారు.

ఫొటో సోర్స్, ARUN CHANDRA BOSE
‘‘మా అమ్మ లాటరీ టికెట్లు అమ్మలేదు’’
జూన్ ఆరు నుంచి తన తల్లి రోసలిన్ కనిపించడంలేదని మంజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగస్టు 15న ఆమె లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు రాసిచ్చారు.
‘‘ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసినట్లు నేను వార్తల్లో చూశాను’’అని మంజు చెప్పారు.
తన తల్లి రోసలిన్ కలాడిలో, తన సోదరుడు ఇడుక్కిలో ఉండేవారని, తను మాత్రం వడక్కన్‌చేరిలో ఉంటున్నానని ఆమె వివరించారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో ఉండేప్పుడు తల్లిని కూడా తనతోపాటు ఉండేందుకు రావాలని కోరానని, కానీ, ఆమె రాలేదని మంజు అన్నారు. మీడియాలో చెబుతున్నట్లు తన తల్లి లాటరీ టికెట్లు అమ్మేవారుకాదని ఆమె తెలిపారు.
‘‘ఆమె ఆయుర్వేద ఉత్పత్తులు విక్రయించేవారు. ఆమె ఉపయోగించిన కొన్ని వస్తువులు, గొడుగును పోలీసులు నాకు చూపించారు. ఆవి తనవేనని నేను ధ్రువీకరించాను’’అని ఆమె చెప్పారు.
డీఎన్ఏ విశ్లేషణ
ఆ శరీర భాగాలు రోసలిన్‌వేనని ధ్రువీకరిచేందుకు మంజు డీఎన్‌ఏ నమూనాలను త్రివేండ్రం మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు పోలీసులు పంపించారు.
షఫీ గురించి తనకు ఎలాంటి సమాచారమూ తెలియదని మంజు చెప్పారు.
షఫీ, భగావల్ సింగ్, లైలాలను 12 రోజులపాటు విచారించేందుకు ఎర్నాకుళం కోర్టు పోలీసులకు అనుమతులు ఇచ్చింది.
మరోవైపు హత్యకు గురైన వారిలో ఒకరైన పద్మ కుమారుడు ఆర్. సెత్తు తమిళనాడులోని ధర్మపురిలో జీవిస్తారు. తన తల్లి శరీర భాగాలు ధర్మపురికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సాయం చేయాలని ఆయన కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- కర్ణాటకలో హిజాబ్ వివాదం ఎంతో మంది విద్యార్థుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపించిందంటే...
- Income Tax: ఆదాయ పన్నును మ్యాగ్జిమం తగ్గించుకోవడం ఎలా?
- 'స్పామ్ కాల్స్ గోలేంట్రా బాబూ' అని మీకెప్పుడైనా అనిపించిందా... దీనికి విరుగుడు ఏంటి?
- ప్రశ్న పత్రంలో ఇస్లాంను దూషించారంటూ టీజే జోసెఫ్ చేయి నరికారు, ఇప్పుడు ఆ ప్రొఫెసర్ ఎలా ఉన్నారు?
- PMBJP-జనరిక్ మందులు: కీళ్ల నొప్పుల నుంచి క్యాన్సర్ చికిత్స దాకా ఏ మందులైనా 50 నుంచి 90 శాతం తక్కువ ధరకే.. అయినా వీటిని ఎందుకు కొనట్లేదు?‘హిందీని రుద్దుతున్నారు’ అంటూ ఎందుకు విమర్శలు పెరుగుతున్నాయి,అమిత్ షా కమిటీ సిఫారసుల్లో ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












