'స్పామ్ కాల్స్ గోలేంట్రా బాబూ' అని మీకెప్పుడైనా అనిపించిందా... దీనికి విరుడుగు ఏంటి?

స్పామ్ కాల్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"హలో! మీకు 2 లక్షల లోన్ మంజూరు అయింది."

దరఖాస్తు చేయని లోన్ ఎలా మంజూరు అయిందో అర్ధం కాదు.

"కంగ్రాట్యులేషన్స్! మీరు లక్కీ డ్రా గెలుచుకున్నారు. విదేశాలకు వెళ్లేందుకు, విలాసవంతమైన రిసార్ట్ లో గడిపేందుకు అవకాశం. కాల్ పూర్తిగా వినండి."

లక్కీ డ్రా అనగానే తెలియకుండానే ఆ కాల్ వినేందుకు ఆసక్తి చూపిస్తారు.

"హలో! మీకు క్రెడిట్ కార్డు అప్రూవ్ అయింది. క్రెడిట్ లిమిట్ రూ.100,000."

దరఖాస్తు చేయకుండానే క్రెడిట్ కార్డు ఎలా వచ్చిందో అర్ధం కాక ఆలోచనలో పడతారు.

"హలో! మీ ఆర్‌ఓ ఫిల్టర్ సర్వీస్ టైం ముగిసింది. విజిట్‌కు ఎప్పుడు రమ్మంటారు?"

ఇంట్లో ఆర్‌ఓ లేనప్పుడు ఈ కాల్ ఎక్కడినుంచి వచ్చిందో అర్ధం కాక అయోమయానికి గురవుతాం.

రోజువారీ పనుల్లో తలమునకలై ఉన్నప్పుడు, ఆఫీసుల్లో ముఖ్యమైన మీటింగుల్లో ఉన్నప్పుడు, ట్రావెల్ చేస్తున్నప్పుడు, లేదా ఇంటి పనుల్లో నిమగ్నమైనప్పుడు అకస్మాత్తుగా వచ్చే కాల్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఆత్రుతతో పిక్ చేసే కాల్ మీ సహనాన్ని పరీక్షిస్తుంది.

స్నేహితులతో లేదా సహచరులతో ఏకాంతంగా గడుపుతున్నప్పుడు మీ మధ్య సరదాగా సాగే సంభాషణను కట్ చేస్తూ ఇలాంటి కాల్స్ రావడం చాలా మందికి ఎదురయ్యే అనుభవమే.

64 శాతం మంది భారతీయులకు ప్రతీ రోజు సగటున మూడు లేదా అంతకు పైగా స్పాం కాల్స్ వస్తాయని మే2022లోవిడుదల చేసిన లోకల్ సర్కిల్స్ సర్వే అంచనా తెలిపింది.

ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు అందరికీ ముందుగా ఎదురయ్యే ప్రశ్న: మన టెలిఫోన్ నంబర్ ఈ అపరిచిత సంస్థలు లేదా వ్యక్తుల దగ్గరకు ఎలా వెళ్ళింది?

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

మన టెలిఫోన్ నంబర్ ఎంత మంది అపరిచితుల దగ్గరకు చేరిందో ఊహిస్తే ఆందోళన కలుగక మానదు.

కొన్ని వందల, వేల మంది చేతుల్లోకి మన టెలిఫోన్ నంబర్ చేరిపోయి ఉండవచ్చు. ఈ నంబర్ తో పాటు మన వ్యక్తిగత వివరాలు, వయసు, ప్రాంతం, ఉద్యోగం, ఆదాయం, షాపింగ్ అలవాట్లు కూడా డేటా కూడా చాలా మంది చేతుల్లోకి చేరి ఉంటుంది.

మన సమాచారం సురక్షితంగా ఉందో లేదో తెలియదు. ఒక వేళ మన సమాచారం దుర్వినియోగం అయితే, ఏమి చేయాలో కూడా తెలియదు. ఇదొక పెద్ద వలయం.

"ఈ నంబర్ ను ఒక్కొక్కసారి మనమే స్వయంగా షాపులో ఏదైనా కొనుగోలు చేసినప్పుడు, బ్యాంకులో ఫార్మ్స్ నింపుతున్నప్పుడు, లేదా క్రెడిట్/డెబిట్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నప్పుడు, ఏదైనా వ్యాపార సంస్థలకు సమాచారం కోసం కాల్ చేసినప్పుడు ఇచ్చి ఉంటాం" అని మాజీ సైబర్ క్రైమ్ పోలీస్ సూపరింటెండెంట్ రామ్మోహన్ బీబీసీకి చెప్పారు.

"ఆన్‌లైన్‌లో ఏవో పోర్టల్స్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు మనమే ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తాం. మన డేటాను ఆన్ లైన్ ముఠాలు ట్రాక్ చేస్తూ ఉండవచ్చు".

"కొన్ని యాప్స్ లాగిన్ అవుతున్నప్పుడు మీ కాంటాక్ట్స్ యాక్సెస్ కావాలని అడుగుతాయి. అగ్రీ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే మీ కాంటాక్ట్స్ అన్నీ సదరు యాప్ సంస్థల దగ్గరకు వెళ్లిపోతాయి. మీరు ఆ యాప్ ను డిలీట్ చేసేటప్పటికే మీ కాంటాక్ట్స్ బయటకు వెళ్ళిపోయి ఉంటాయి" అని వివరించారు.

కొన్ని సోషల్ మీడియా ఇంటర్‌మీడియరీలు కూడా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తాయి. వారి ప్రైవసీ విధానాలు సామాన్యులు అర్ధం చేసుకునే విధంగా ఉండవు. దీంతో, యూజర్లు అగ్రీ అనే ఆప్షన్ ఎంపిక చేసుకుని యాప్ వాడకాన్ని మొదలుపెడతారని, దీని ద్వారా కూడా సమాచారం బదిలీ అయిపోతుందని రామ్మోహన్ వివరించారు.

"మోసాలను సాధారణంగా వ్యవస్థీకృతమైన సిండికేట్ ముఠాలు చేస్తూ ఉంటాయి". వాళ్ళు వివిధ సంస్థల నుంచి డబ్బులు చెల్లించి కూడా డేటా సేకరిస్తారని చెప్పారు.

ఇలా మన చేతుల నుంచి బయటపడిన సమాచార ఫలితమే ప్రతి రోజు మనం ఎదుర్కొనే అన్ వాంటెడ్ కాల్స్.

ఈ డేటా టెలీ మార్కెటింగ్ సంస్థలకు చేరవచ్చు లేదా ఎవరైనా సైబర్ క్రైం ముఠాల చేతుల్లోకి కూడా చేరవచ్చు. ఈ డేటాను సదరు సంస్థలు ఇతరులతో పంచేందుకు అనుమతి అవసరం లేదు.

వీడియో క్యాప్షన్, ఈ యాప్స్ ఉంటే మీ ఫోన్ హ్యాక్ అయినట్లే...

ఒక కాల్ తో అకౌంట్ ఖాళీ

కొన్ని సార్లు అపరిచిత నంబర్ల నుంచి వచ్చే కాల్స్ వల్ల మన బ్యాంకు అకౌంట్లలో డబ్బు కూడా ఖాళీ అయిపోయే అవకాశం ఉంటుంది. సైబర్ మోసగాళ్లు మన వివరాలు సేకరించి అకౌంట్ లో డబ్బులు తీస్తారు, లేదా ఏదైనా లింక్ పంపించి దాని పై క్లిక్ చేయమంటారు. అకౌంట్ లో డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి.

ఇటీవల భారతదేశంలో కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయమంటూ 8000 మందికి లింకులు పంపిన మోసం చోటు చేసుకున్నట్లు ప్రింట్ వెబ్ పత్రికలో ప్రచురితమయింది. ఈ కేసులో దిల్లీ పోలీసులు దేశ వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 23 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ భారీ కుంభకోణంలో బాధితులు సుమారు రూ.20 కోట్లు పోగొట్టుకున్నట్లు అంచనా.

ఒక్కొక్కసారి మీరు దరఖాస్తు చేయని ఉద్యోగానికి ఎంపికయ్యారు అంటూ సందేశాలు వస్తూ ఉంటాయి. అందులో ఒక లింక్ ఉంటుంది. అటువంటి లింకులను ఎప్పుడూ క్లిక్ చేయకూడదని సైబర్ నిపుణులు సూచిస్తారు.

ఫోన్ నంబర్ గుర్తు తెలియని విధంగా ఉన్నప్పుడు, స్పామ్ కాల్ అని చూపించినప్పుడు కాల్ లిఫ్ట్ చేయకుండా జాగ్రత్త వహించవచ్చు.

ఫొటో సోర్స్, iStock

ఈ నంబర్‌ను ఎలా గుర్తించాలి?

ఫోన్ నంబర్ గుర్తు తెలియని విధంగా ఉన్నప్పుడు, స్పామ్ కాల్ అని చూపించినప్పుడు కాల్ లిఫ్ట్ చేయకుండా జాగ్రత్త వహించవచ్చు.

కానీ, డిజిటల్ యుగంలో మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే వస్తువుల డెలివెరీ సమయంలో డెలివెరీ ఏజెంట్లు మన అడ్రెస్ కోసం లేదా మనం ఇంటి దగ్గర ఉన్నామో లేదో తెలుసుకోవడం కోసం కాల్ చేస్తూ ఉంటారు. ఆ కాల్స్ లిఫ్ట్ చేయకపోతే, ఆ వస్తువు వెనక్కి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం కాల్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటాం.

టెలీ మార్కెటర్ ఫోన్ నంబర్‌కు ముందు 140 తో మొదలయ్యే ఒక సిరీస్ నంబర్ ఇస్తారు. ఉదాహరణకు దిల్లీ నుంచి చేసే కాల్స్ కు 14011 తో మొదలవుతాయి. 140 తర్వాత ఆ ఏరియా కోడ్ ఉంటుంది. ఈ నంబర్ ద్వారా ఫోన్ చేస్తున్నదెవరో గుర్తించవచ్చు.

స్మార్ట్‌ఫోన్

ఫొటో సోర్స్, Getty Images

టెలీ మార్కెటర్లు చేసే కాల్స్‌, స్పామ్ కాల్స్‌కు తేడా ఉందా?

టెలీ మార్కెటర్లు తమ ఉత్పత్తులు, సేవల ప్రచారం కోసం కాల్స్ చేస్తే, స్పాం కాల్స్ మోసం చేసేందుకు చేస్తారు.

ఉద్యోగం ఇస్తున్నామని, బ్యాంకు వివరాలు ఇమ్మని, లక్కీ డ్రా లు గెలుచుకున్నారని, రుణాలు మంజూరు చేస్తామని వచ్చే కాల్స్ లేదా సందేశాల్లో మోసాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని రామ్మోహన్ వివరించారు.

నంబర్ ఎలా వచ్చిందో కాల్ చేస్తున్న టెలీకాల్ రిప్రజెంటేటివ్స్ కు కూడా తెలియదు. సదరు సంస్థల యాజమాన్యాలు వారికిచ్చిన నంబర్లకు కాల్ చేయడం మాత్రమే వారి విధి. ఉద్యోగులు ఒక సిరీస్ లో కాల్స్ చేస్తూ ఉంటారని చెప్పారు. ఇందులో ఉద్యోగుల ప్రమేయం చాలా తక్కువగా ఉంటుంది.

అందుకే ఒకే సంస్థ నుంచి ఒకే రోజు మూడు, నాలుగు కాల్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి.

కాల్స్ బారి నుంచి తప్పించుకోవడం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images

ఈ కాల్స్ బారి నుంచి తప్పించుకోవడం ఎలా?

అవసరం లేని మార్కెటింగ్ సందేశాలను వినియోగదారులు బ్లాక్ చేయవచ్చు.

వినియోగదారులు తమ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు 1909 ద్వారా వాయిస్ కాల్ లేదా ఎస్ఎంఎస్ చేసి కాల్స్ బ్లాక్ చేసుకోవచ్చు.

ట్రాయ్ డిఎన్‌డి 2.0 యాప్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు.

టెలీ మార్కెటింగ్ ను రాత్రి 9 నుంచి ఉదయం 9 మధ్యలో చేయడాన్ని టెలికాం విధానం నిషేధిస్తోంది.

బ్యాంకింగ్, ఇన్సూరెన్సు సేవలు, ఆర్ధిక సేవలు, క్రెడిట్ కార్డులు, రియల్ ఎస్టేట్, విద్య, ఆరోగ్యం, ఇతర వినియోగదారుల సేవలు, ఆటో మొబైల్ సేవలు, కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్, వినోదం, ఐటీ, పర్యటకం, వినోదానికి సంబంధించిన కాల్స్ బ్లాక్ చేయవచ్చు.

నేషనల్ కన్స్యూమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్‌లో నంబర్ నమోదు చేసుకోవచ్చు.

నమోదు చేసిన ఏడు రోజుల తర్వాత కూడా కాల్స్ వస్తే, సదరు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ కు ఫిర్యాదు చేయవచ్చు. ఏ నంబర్ నుంచి కాల్ వస్తోందో, తేదీ, సమయం కూడా ఫిర్యాదులో తెలపాలి.

నంబర్‌ను పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేసే అవకాశాన్ని కూడా ట్రాయ్ నిబంధనలు కల్పిస్తున్నాయి. మూడు నెలల తర్వాత ఈ రిజిస్ట్రేషన్‌ క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు.

ట్రాయ్ డీఎన్‌డి లో నమోదు చేసుకున్న 95 శాతం మంది కాలర్లకు కూడా స్పామ్ కాల్స్ వస్తున్నట్లు లోకల్ సర్కిల్స్ సర్వే తెలిపింది.

కానీ, నమోదు చేసుకున్న తర్వాత కాల్స్ రావని రామ్మోహన్ అంటారు. మన మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసిన బ్యాంకులు, ఇన్సూరెన్సు తదితర సంస్థల నుంచి మాత్రమే కాల్స్ వస్తాయని అన్నారు.

రిజిస్టర్ లో నమోదు చేసిన తర్వాత కూడా కాల్స్ వస్తే, రూ.2.5 లక్షల వరకు జరీమానా విధించవచ్చు. ఇది మరింత కొనసాగితే, టెలికాం అధికారులు టెలీ మార్కెటర్‌ను పూర్తిగా నిషేధించే అధికారం కూడా ఉంటుంది.

వీడియో క్యాప్షన్, మీ ఖాతాలో డబ్బులు పోతే బ్యాంకులు ఇస్తాయా

డేటా లీక్ అయితే బాధ్యులెవరు?

"భారతదేశంలో ఒక ప్రత్యేకమైన డేటా సురక్షిత చట్టం లేదు. దీంతో, డేటా సేకరణ, అమ్మకం, షేర్ చేయడం విషయంలో ఎవరినీ బాధ్యులం చేయలేం" అని రామ్మోహన్ అన్నారు.

పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ పార్లమెంట్‌లో ఆమోదం పొందలేదు.

"ఈ డేటాను ఎలా ఉపయోగించుకుంటారో చెప్పాల్సిన అవసరం చట్టబద్ధంగా సంస్థలకు లేదు. ప్రజల అనుమతి లేకుండానే వారి డేటా షేర్ చేయవచ్చు".

స్పామ్ కాల్స్ వల్ల ప్రభావితమవుతున్న దేశాల్లో భారత్ నాల్గవ స్థానంలో ఉందని ట్రూ కాలర్ తమ గ్లోబల్ స్పామ్ రిపోర్ట్ 2021లో తెలిపింది. డేటా ఎలా లీక్ అయిందో కూడా తెలుసుకోవడం కష్టం.

వ్యాపార సంస్థలు, కంపెనీలు డేటా సేకరించినప్పుడు ఆ డేటాను ఎలా వినియోగిస్తారో ఎవరికీ వెల్లడి చేయరు. వినియోగదారులు కూడా తమ డేటాను ఏ విధంగా ఉపయోగించుకునేందుకు అనుమతిస్తున్నారానే విషయాల పై పెద్దగా దృష్టి పెట్టరు.

డేటా లీక్ అయినప్పుడు కోర్టులో కేసు వేయవచ్చా?

ఫొటో సోర్స్, Getty Images

డేటా లీక్ అయినప్పుడు కోర్టులో కేసు వేయవచ్చా?

ఇటువంటి కేసులు పరిష్కారమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని న్యాయ నిపుణులు అంటున్నారు.

గత ఏడాది డోమినో సంస్థ 18 కోట్ల ఆర్దర్లకు సంబంధించిన సమాచారం లీక్ అవ్వడంతో భారీ డేటా బ్రీచ్ జరిగినట్లు ది ప్రింట్ పత్రిక పేర్కొంది.

కొత్త డ్రాఫ్ట్ టెలికాం బిల్లు ఈ స్పామ్ కాల్స్‌కు పరిష్కారం చూపిస్తుందా?

కొత్త డ్రాఫ్ట్ టెలికాం బిల్లు కాల్ తీసుకునే వారికి కాల్ చేసే వారి వివరాలు కచ్చితంగా కనిపించాలనే నియమాన్ని పొందుపరిచింది. ఇది సాధారణ కాల్స్ కు మాత్రమే కాకుండా వాట్సాప్, జూమ్, ఫేస్ టైం కాల్స్‌కు కూడా వర్తిస్తుంది.

సైబర్ మోసాలను నియంత్రించేందుకు, యూజర్ల డేటా పరిరక్షణకు ఈ బిల్లులో అనేక చర్యలు తీసుకున్నట్లు టెలికాం మంత్రి అశ్విని వైష్ణ సెప్టెంబరు 22న నిర్వహించిన విలేఖరుల సమావేశంలో చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

కాల్స్ ఎవరు చేస్తున్నారో తెలుసుకునే హక్కు ప్రతీ యూజర్‌కు ఉందని చెప్పారు. ఈ డ్రాఫ్ట్ పై వచ్చిన సూచనలను స్వీకరించిన ఫైనల్ డ్రాఫ్ట్ తయారు చేస్తామని చెప్పారు.

ప్రభుత్వం సమగ్రమైన డిజిటల్ విధానాన్ని రూపొందించేందుకు ప్రయత్నిస్తోందని అశ్విని వైష్ణ చెప్పారు. వచ్చే 6-10 నెలల్లో ఈ బిల్లు చట్టంగా మారవచ్చని చెప్పారు.

"కానీ, ఇది సరైన విధానం కాదు" అని అంటున్నారు రామ్మోహన్.

"కొన్ని సంస్థలు సంస్థ పేరు పై 100 కనెక్షన్లు తీసుకుని సిబ్బందికి ఇస్తారు. ఇలాంటి సందర్భాల్లో సదరు మొబైల్ నంబర్లు వ్యక్తుల పేర్ల పై లేవని కేసు నమోదు చేస్తామా?" అని ప్రశ్నించారు.

"నియమాలు రాసినంత సులభంగా అమలు చేయలేం" అని అన్నారు.

ప్రస్తుతం దేశంలో టెలీ కమ్యూనికేషన్‌ను ఇండియన్ టెలీగ్రాఫ్ చట్టం 1885, ది వైర్‌లెస్ టెలీగ్రాఫ్ చట్టం 1933, టెలీగ్రాఫ్ వైర్స్ (అన్‌లాఫుల్ పొసెషన్) చట్టం 1950 నియంత్రిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)