ఆంధ్రప్రదేశ్: మొబైల్ ఫోన్లు చోరీ అయితే పోలీసులు ఎలా వెతికి పట్టుకుంటారో తెలుసా?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
విజయనగరం జిల్లాకు చెందిన స్వామి సెల్ ఫోన్‌ను ఆయన ఇంటర్నెట్ సెంటర్‌కు వచ్చిన వ్యక్తి ఒకరు దొంగిలించారు. దీనిని తర్వాత ఆయన సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించారు.
కానీ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇస్తే, ఫోన్ వస్తుందో రాదో తెలియదుగానీ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుందేమోనని అనుకొని అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయలేదు. కొత్త ఫోన్ కొనుక్కున్నారు.
కానీ చోరీ అయిన ఫోన్ రెండు మూడు వారాల్లోనే తిరిగి ఆయన వద్దకు చేరింది. ఆయన పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయకపోయినా, ఆయన ఫోన్ ఆయనకు తిరిగి దక్కింది.
విజయనగరం పోలీసులు ఆగస్టులో తీసుకొచ్చిన వెబ్ పోర్టల్ ద్వారా ఇది సాధ్యమైంది. ఇలాంటి పోర్టల్‌నే కర్నూలు పోలీసులు కూడా అదే నెల్లో తీసుకొచ్చారు. కర్నూలు జిల్లాలోనూ చోరీ అయిన ఫోన్లను పోలీసులు ఇలా వెతికి పెడుతున్నారు.
“ఫోన్ కూడా మన శరీరంలో భాగంగా మారిపోయింది. ఎందుకంటే మన విలువైన డాక్యుమెంట్లు, ఫోటోలు.. ఇలా అన్నీ సెల్‌ఫోన్‌లోనే ఉంటాయి, అది పోతే చాలా కష్టంగా ఉంటుంది” అని అంటారు విజయగనం జిల్లా ఎస్పీ దీపిక పాటిల్.
సెల్ ఫోన్ పోయిందనే ఫిర్యాదులు స్పందన కార్యక్రమంలో కూడా వస్తుంటాయని, వాటిని పరిష్కరించేందుకే vzmmobiletracker.in అనే పోర్టల్‌ను ప్రారంభించామని ఆమె బీబీసీతో చెప్పారు.
“జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మొబైల్స్ పోగొట్టుకున్న బాధితుల నుండి vzmmobiletracker.inలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ట్రేస్ చేస్తాం. ఆగష్టు, సెప్టెంబర్‌లలో రూ. 28 లక్షల విలువైన 175 ఫోన్లు రికవరీ చేసి, బాధితులకు అప్పగించాం. ఫోన్ పొగొట్టుకున్నవారు స్టేషనుకు రావాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచే ఫిర్యాదు చేయండి. ఇలాంటి ఫిర్యాదుల దాఖలును సులభతరం చేయడానికే ఈ పోర్టల్. ఫోన్ మోడల్, ఐఎంఈఐ నంబరు, ఫోన్ నంబర్ ఉంటే చాలు. పోయిన ఫోన్‌ను కనిపెట్టే విధంగా ఒక సిస్టమ్‌ను అభివృద్ధి చేశాం. ఈ పోర్టల్‌ను విజయనగరం సైబర్ సెల్ విభాగం నిర్వహిస్తుంది”అని ఎస్పీ వివరించారు.

‘‘చార్జింగ్ పెడితే ఫోన్ కొట్టేశారు, కొత్త ఫోన్ కొనుకున్నా’’
విజయనగరంలో ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తున్న స్వామి సెల్ ఫోన్ పోయింది. పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేద్దామని తొలుత అనుకున్నా, తర్వాత అలా చేయలేదు.
సెల్ ఫోన్ పోవడంపై స్టేషన్‌కు వెళ్లకుండానే పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని ఆ తర్వాత స్వామికి తెలిసింది.
“నా షాపులో ఫోన్ చార్జింగ్ పెట్టాను. కాసేపటి తర్వాత చూస్తే కనపడలేదు. సీసీ కెమెరాల్లో చూస్తే ఒకబ్బాయి దొంగతనం చేస్తున్నట్లు కనపడింది. ఫిర్యాదు ఇవ్వడం, ఫాలోఅప్ చేయడం కష్టమని...కొత్త ఫోన్ కొనుక్కున్నా. కానీ తర్వాత సెల్ ఫోన్ రికవరీ పోర్టల్ కోసం తెలిసింది. కొత్త ఫోన్ నుంచి అన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాను. మూడు నెలల్లో నా ఫోన్ రికవరీ చేశారు”అని స్వామి అన్నారు.
ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కాలేజ్ డాక్యుమెంట్స్, ఫ్యామిలీ ఫోటోస్ ఉన్న చరిష్మా సెల్ ఫోన్ జారిపోయింది. స్వామిలాగే పోలీసు స్టేషన్‌కు వెళ్లడం ఇష్టం లేక ఆమె ఫిర్యాదు చేయలేదు. ఆ తర్వాత పోర్టల్ ద్వారా కంప్లైట్ చేసి, తాను పొగొట్టుకున్న ఫోన్ నెలన్నరలో పొందారు.
కర్నూలు జిల్లాలో ఫోన్లు పోగొట్టుకున్న 564 మందికి సెప్టెంబరు 18న వాటిని పోలీసులు అందచేశారు.
కర్నూలు పోలీసులు kurnoolpolice.in/mobiletheft పోర్టల్‌ను సెల్‌ఫోన్ ఫిర్యాదులు కోసం ఏర్పాటు చేశారు.

ఎలా ఫిర్యాదు చేయాలి?
సెల్‌ఫోన్ పోతే అందరికి ముందుగా ఫోన్ గురించి కాకుండా అందులో ఉన్న సమాచారం కోసమే ఆందోళన ఉంటుందని విజయనగరం సైబర్ క్రైం సెల్ ఎస్ఐ ప్రశాంత్ కుమార్ అన్నారు. డేటా మరొకరి చేతికి వెళ్లకుండా ఉండాలంటే ఫోన్ పోయిన విషయాన్ని గుర్తించిన వెంటనే కేంద్ర టెలికాం శాఖ నిర్వహించే CEIR (Central Equipment Identity Register) అనే వెబ్ సైట్ కు సమాచారం ఇవ్వాలి.
“సీఈఐఆర్ వాళ్లు మన ఫోన్ బ్లాక్ చేస్తారు. దాని వలన ఫోన్ దొంగిలించిన/దొరికినవాళ్లు మన ఫోన్‌ను ఉపయోగించకుండా ఆపవచ్చు. అలాగే గూగుల్ అకౌంట్ల నుంచి సైన్ అవుట్ అవ్వాలి. అప్పుడు మొబైల్‌లో ఎలాంటి సమాచారం బయటకు పోదు. జీమెయిల్, ఐఏంఈఐ, ఫోన్ నంబర్లు ... ఒక వేళ ఐఫోన్ అయితే దాని ఐడీ పోర్టర్‌లో ఎంటర్ చేస్తే చాలు. మీరు ఇచ్చిన సమాచారంతో దానిని మా వద్ద ఉన్న టెక్నాలజీతో అది ఎక్కడుందో తెలుసుకుంటాం. ఒక వేళ వేరే ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో ఉంటే అక్కడ స్థానిక సోర్సెస్ ద్వారా సమాచారం తెలుసుకుంటాం. రోజుకు జిల్లాలో సెల్ ఫోన్ పోయిందని 50 ఫిర్యాదులు వస్తాయి” అని ప్రశాంత్ కుమార్ చెప్పారు.
ఆ టెక్నాలజీ ఏమిటో చెప్పేందుకు పోలీసులు నిరాకరించారు.

ఐఎంఈఐ నంబరు లేకపోతే...
ఐఎంఈఐ నంబర్ లేకపోయినా ఫిర్యాదు చేయవచ్చు. ఫోన్ పోయే సమయానికి అందులో ఉన్న నంబర్ చెప్పగలిగినా చాలు అని ప్రశాంత్ కుమార్ చెప్పారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయని ఆయన వివరించారు.
“మన ఫోన్లు దొంగతనం చేసి, దానిని నేరాలు చేసేందుకు వాడే అవకాశం ఉంది. అందుకే ఫోన్ పోయిన వెంటనే ఫిర్యాదు చేయాలి. ఎందుకంటే లోన్ యాప్స్, వేధింపులు, బ్యాంక్ మోసాలు, ఉద్యోగాల పేరుతో మోసాలు, మ్యాట్రిమోనీ మోసాలు, ఫేక్ యాడ్స్ లాంటి సైబర్ నేరాలకు ఫోనే కీలకం” అని ఆయన చెప్పారు.
“సెల్ ఫోన్ పోయిందనే ఫిర్యాదులు విజయనగరం జిల్లాలో సెప్టెంబరులో 500 వరకు వచ్చాయి. సెల్‌ఫోన్ విషయంలో ఎక్కువ దొంగతనాలే జరుగుతాయి. దొంగతనం చేస్తే సైబర్ చట్టాల ప్రకారం శిక్షలుంటాయి. దొంగిలించిన సెల్‌ఫోన్ ఎవరైనా కొంటే అన్నీ పరిశీలించి, ఫోన్ తీసుకుని హెచ్చరించి పంపించేస్తాం’’అని ప్రశాంత్ కుమార్ తెలిపారు.

ఫిర్యాదు చేసిన తర్వాత?
సెల్‌ఫోన్ పోయిందనే విషయాన్ని పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసిన తర్వాత అది తమ సర్వర్‌కు చేరుతుందని ప్రశాంత్ కుమార్ చెప్పారు.
“అక్కడ నుంచి సైబర్ సెల్ టీం ఆఫీసులోని అన్నీ సిస్టమ్‌కు ఆ కంప్ల్టైట్ వెళ్తుంది. దానిలో ఫోన్ నెంబర్ నుంచి ఆ ఫోన్ మోడల్ వరకు అన్నీ వివరాలు ఉంటాయి. ఫోన్ దొంగలించిన/దొరికినా ఆ వ్యక్తులు వెంటనే ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసి, సిమ్ తీసేస్తారు. అందుకే ఈఎంఈఐ నంబర్ అవసరం. అది లేకపోయినా ఆ ఫోన్‌లో వాడిన నంబరు ఆధారంగానైనా ఫోన్ ట్రేస్ చేస్తాం. మేం ఆ ఫోన్‌ను రికవరీ చేసే లోపు దానిలోని డేటాను తస్కరించే అవకాశం ఉంది. అందుకే ఫోన్ పోయిన వెంటనే సిమ్ బ్లాక్ చేయించడమంతో పాటు CEIR ఫిర్యాదు చేస్తే ఫోన్ వాడకుండా బ్లాక్ చేస్తారు. అప్పుడు ఆ ఫోన్ వాడేందుకు పనికిరాదు” అని సైబర్ క్రైమ్ సెల్ ఎస్ఐ ప్రశాంత్ కుమార్ చెప్పారు.

నెల రోజుల్లో వెతికి పట్టుకుంటాం: సిద్ధార్థ్ కౌశల్
పోయిన, దొంగలించిన మొబైల్ ఫోన్ల కోసం బాధితులు ఫిర్యాదు చేసేందుకు కర్నాలు పోలీసులు కూడా kurnoolpolice.in/mobiletheft అనే పోర్టల్‌ను నిర్వహిస్తున్నారు.
“ఎవరైనా పొరపాటున మొబైల్ పొగొట్టుకుంటే ఈ పోర్టల్ లో ఫిర్యాదు చేస్తే... సులభంగా ఆ ఫోన్‌ని రికవరీ చేయవచ్చు. లాస్ట్ మొబైల్ ట్రాకింగ్ సర్వీస్ పేరుతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఫిర్యాదు అందిన నెల రోజుల్లోగా ఫోన్ వెతికి పట్టుకుని బాధితులకు అప్పగిస్తాం. ఎలాంటి ఫీజు వసూలు చేయకుండానే ఫోన్ రికవరీ చేసి బాధితులకు అప్పగిస్తాం. లాస్ట్ మొబైల్ ట్రాకింగ్ సర్వీస్ పోస్టర్‌ను ప్రతి గ్రామ సచివాలయంలో అందుబాటులో ఉంచుతాం”అని కర్నూలు జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అన్నారు.
15 నుంచి 30 రోజుల్లో రికవరీ: దీపిక పాటిల్
“సెల్ ఫోన్ పోతే చాలా మంది ఫిర్యాదు చేయకుండా కొత్తది కొనుక్కోవాలని చూస్తున్నారు, కానీ అది అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. డబ్బులు కోసం సెల్ దొంగతనం చేసి, ఎక్కడో అమ్మేస్తారు. కానీ ఆ ఫోన్ ఎక్కడెక్కడికో వెళ్లి, చివరకి నేరగాళ్లు దానిని సైబర్ నేరాలకు వాడతారు. అందుకే ఫోన్ పోగానే ముందు ఆ విషయాన్ని నెట్ వర్క్ సంస్థలకు తెలిపి సేవలు నిలుపు చేయించుకోవాలి” అని విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక పాటిల్ చెప్పారు.
“సెల్ ఫోన్ ను మేం డెవలప్ చేసిన అన్‌లైన్ పోర్టల్స్ ద్వారా సగటున 15 నుంచి 30 రోజుల వ్యవధిలో రికవరీ చేస్తున్నాం. స్టేషన్‌కు రాకుండా ఇంటి వద్ద నుంచే ఫిర్యాదు చేసినా చాలు, ఫోన్ దొరికిందని మేమే మీకు సమాచారం ఇచ్చి, ఫోన్ అందచేస్తాం. సెల్ ఫోన్ మేళాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఫోన్ పోతే దొరుకుతుందనే విషయాన్ని వారికి తెలియ చేస్తున్నాం” అని ఎస్పీ దీపిక పాటిల్ చెప్పారు.
“ఒకే వ్యక్తి మూడు ఫోన్లు పొగొట్టుకున్నారు. ఆ మూడు ఫోన్లు మూడు సార్లు రికవరీ చేశాం. సెల్ ఫోన్ రికవరీ అంతా కూడా ఉచితమే” అని ఆమె వివరించారు.
ఇవి కూడా చదవండి:
- చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది.. ఈ ‘విధ్వంసానికి’ 5 కారణాలు..
- తెలంగాణ: ‘చూపు పోయింది.. వరంగల్‌లో అడుక్కుని బతకమన్నారు.. 50 ఏళ్లుగా నేను ఏం చేస్తున్నానంటే..’
- జనాభా నియంత్రణ గురించి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు.. టార్గెట్ ముస్లింలు, క్రైస్తవులేనా?
- శ్రీకాకుళం జిల్లా: బట్టలు ఉతకం అన్న రజకులు.. ఇతర కులాల సహాయ నిరాకరణ.. ఏం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మెక్సికోలో అగంతకుల కాల్పులు, మేయర్ సహా 18మంది మృతి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













