Cough-syrup scandal: ఆ దగ్గు మందు హరియాణా నుంచి గాంబియా వరకూ ఎలా వెళ్లింది?

ఫొటో సోర్స్, WHO
- రచయిత, శృతి మేనన్
- హోదా, బీబీసీ రియాలిటీ చెక్
గాంబియాలో దాదాపు 70 మంది పిల్లల మరణాలకు భారతదేశంలో తయారైన దగ్గు మందు (కాఫ్ సిరప్) కారణమనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. అదే సమయంలో మందుల తయారీ, వ్యాపారం మీద సమర్థవంతమైన నియంత్రణ లేదన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి.
గాంబియాలో ఏం జరిగింది?
ప్రపంచ ఆరోగ్య సంస్థ గత వారం నాలుగు బ్రాండ్ల కాఫ్ సిరప్ (దగ్గుమందు)ల గురించి అంతర్జాతీయ హెచ్చరిక జారీ చేసింది. గాంబియాలో చిన్నారులకు తీవ్ర కిడ్నీ సమస్యలు ఉన్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించటంతో....ఈ సమస్యకు ఆ దగ్గు మందులు కారణం కావచ్చునని చెప్పింది.
ఆ సిరప్‌లను లేబరేటరీలో విశ్లేషించినపుడు.. ''వాటిలో ఆమోదనీయం కాని మోతాదుల్లో డైథిలీన్ గ్లైకాల్, ఎథిలీన్ గ్లైకాల్‌లు కలుషితాలుగా ఉన్నట్లు నిర్ధారణ అయింది'' అని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
ఈ సిరప్‌లు కేవలం గాంబియాకు మాత్రమే ఎగుమతి అయ్యాయని భారత ప్రభుత్వ అధికారులు, సిరప్ తయారు చేసిన సంస్థ మేడెన్ ఫార్మాస్యూటికల్స్ చెప్పాయి.

ఫొటో సోర్స్, Getty Images
తయారీ సంస్థ వివరాలు ఏమిటి?
అంతర్జాతీయంగా గుర్తించిన నాణ్యతా నియంత్రణ ప్రమాణాలకు తాము కట్టుబడి ఉన్నామని మేడెన్ ఫార్మాస్యూటికల్స్ చెప్తోంది.
అయితే, ఆ సంస్థ ఉత్పత్తులు కొన్ని భారతదేశంలో జాతీయ లేదా రాష్ట్ర స్థాయి నాణ్యతా నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా లేవు.
- ఈ కంపెనీని స్థానిక ప్రమాణాలకు అనుగుణంగా లేని సిరప్‌లను విక్రయించినందుకు గాను 2011లో బిహార్ రాష్ట్రంలో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు భారతదేశంలో అధికారిక పత్రాలు చెప్తున్నాయి.
- అలాగే 2018లో నాణ్యతా నియంత్రణ ఉల్లంఘనలకు గాను ఈ కంపెనీ మీద చట్టపరమైన చర్యలు చేపట్టారు.
- 2020లో జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో నాణ్యతా నియంత్రణ పరీక్షలో ఈ సంస్థ విఫలమైంది.
- 2022లో కేరళ రాష్ట్రంలో నాలుగు సార్లు నాణ్యతా నియంత్రణ పరీక్షలో విఫలమైంది.
- నాసిరకం ఉత్పత్తులను ఎగుమతి చేసినందుకు గాను వియత్నాం దేశంలో బ్లాక్‌లిస్టులో పెట్టిన 40 భారత ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఈ కంపెనీ కూడా ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
హరియాణా రాష్ట్రం కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ.. గాంబియాలో మరణాల పట్ల 'దిగ్భ్రాంతి' చెందినట్లు చెప్పింది. అయితే, ''డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, హరియాణా రాష్ట్ర డ్రగ్స్ కంట్రోలర్ల ప్రొటోకాల్స్‌ను కచ్చితంగా పాటిస్తున్నాం'' అని పేర్కొంది.
ఔషధ నియంత్రణ సంస్థలు ఇంకా పరీక్షలు నిర్వహిస్తున్నందున ఈ అంశంపై మరింత వ్యాఖ్యానించబోనంది.
నమూనాలను పరీక్షల నిమిత్తం పంపించామని, ఏదైనా తప్పు జరిగినట్లు గుర్తిస్తే చర్యలు చేపడతామని హరియాణా రాష్ట్ర ఆరోగ్యమంత్రి అనిల్ విజ్ బీబీసీ న్యూస్‌తో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత నాణ్యతా నియంత్రణ ఎంత సమర్థంగా ఉంది?
ప్రపంచంలో మొత్తం ఔషధాలలో మూడో వంతు మందులను భారతదేశం ఉత్పత్తి చేస్తోంది. అందులో అత్యధిక భాగం జనరిక్ మందులే.
ఆఫ్రికా దేశాలు, లాటిన్ అమెరికా దేశాలతో పాటు ఆసియాలోని కొన్ని దేశాలకు ఔషధాలను సరఫరా చేసే ప్రధాన దేశం భారతదేశమే.
దేశంలోని ఔషధ తయారీ పరిశ్రమలు.. కఠినమైన నాణ్యతా నియంత్రణ ప్రమాణాలు, ఉత్పత్తి విధానాలకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది.
కానీ నాణ్యతా నియంత్రణ సమస్యల విషయంలో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) వంటి విదేశీ నియంత్రణ సంస్థల నుంచి కొన్ని భారత కంపెనీలు విమర్శలను, నిషేధాలను ఎదుర్కొన్నాయి.
నియంత్రణ, పర్యవేక్షణ విభాగాలకు నిధుల కొరత, నియంత్రణ నిబంధనల పట్ల నిర్లక్ష్యం, స్వచ్ఛతా ప్రమాణాలకు కట్టుబడేలా చూడటం పట్ల ఆసక్తి లేకపోవటం కీలక సమస్యలని భారత ఫార్మాస్యూటిక్ పరిశ్రమ మీద ఒక విశ్లేషణ ఒకటి ఎత్తిచూపింది.
దేశంలో నాణ్యతా నియంత్రణలను ఉల్లంఘించినందుకు విధించే శిక్షలు - 20,000 రూపాయల జరిమానా, రెండేళ్ల వరకూ జైలు శిక్ష- ఇలా శిక్షలు స్వల్పంగా ఉండటాన్ని కూడా ప్రజారోగ్య ఉద్యమకారుడు దినేశ్ ఠాకూర్ లేవనెత్తారు.
''ఒక వ్యక్తి మరణానికి ఒక నాసిరకం మందుకు నేరుగా సంబంధం ఉందని నిరూపిస్తే తప్ప..విధించే శిక్షలు ఇవి'' అని ఆయన పేర్కొన్నారు.
వ్యాక్సీన్ల విషయంలో డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలను భారత్ పాటిస్తున్నప్పటికీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఔషధాలను నియంత్రించే జాతీయ సంస్థల్లో భారతదేశం లేదు.
''దీనివల్ల ఫార్మాస్యూటికల్ తయారీ కార్యకలాపాల మీద నియమ నియంత్రణలు ఏకరీతిగా లేకపోవచ్చు'' అని మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ (ఎంఎస్ఎఫ్) లీనా మెంఘానీ పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
గాంబియా పరీక్షించి ఉండాల్సిందా?
భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. అయితే.. ''దిగుమతి చేసుకునే దేశాలు దిగుమతి చేసుకున్న ఉత్పత్తులను పరీక్షించటం.. నాణ్యత సంతృప్తికరంగా ఉందో లేదో తనిఖీ చేసుకోవటం మామూలుగా అనుసరించే విధానం'' అని వ్యాఖ్యానించింది.
కానీ.. దగ్గు మందుకన్నా యాంటీ-మలేరియల్ ఔషధాలు, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్‌ను పరీక్షించటానికి ప్రాధాన్యం ఇస్తామని గాంబియా మెడిసిన్ కంట్రోల్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మర్కియు జన్నే కాయిరా చెప్తున్నారు.
దీనిపై గాంబియా మెడికల్ కంట్రోల్ ఏజెన్సీని బీబీసీ న్యూస్ సంప్రదించింది. కానీ స్పందన రాలేదు.
ఈ విషాదం ''లోతులను వెలికితీస్తాం'' అని గాంబియా అధ్యక్షుడు అడామా బారో చెప్పారు. ఔషధాలు, ఆహార భద్రత కోసం ఒక క్వాలిటీ కంట్రోల్ నేషనల్ లేబరేటరీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
''నాసిరకం మందుల దిగుమతులను నిర్మూలించటానికి నిబంధనలను ఏర్పాటు చేస్తాం'' అని కూడా ఆయన చెప్పారు.
తగినన్ని పరీక్షా సామర్థ్యాలు ఉన్న దేశాలు.. గాంబియా వంటి అల్పాదాయ దేశాలకు సాయం చేయాలని ఎంఎస్ఎఫ్ కోరుతోంది.
''ఇది కేవలం దిగుమతి చేసుకునే దేశాల బాధ్యత మాత్రమే కాదు'' అని మెంఘానీ పేర్కొన్నారు.
భారతదేశం నుంచి తాము దిగుమతి చేసుకునే ఔషధాలన్నిటినీ.. భారత్ నుంచి బయలుదేరటానికి ముందుగా అధీకృత ఏజెంట్లు ఆమోదించేలా చూడాలని నైజీరియా నేషనల్ ఏజెన్సీ ఫర్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కౌన్సిల్ ఇప్పుడు అడుగుతోంది.

ఇవి కూడా చదవండి:
- మొబైల్ ఫోన్లు చోరీ అయితే పోలీసులు ఎలా వెతికి పట్టుకుంటారో తెలుసా?
- కొల్లాపూర్ మహాలక్ష్మి - అంబాబాయి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
- రాజరాజ చోళుడు హిందువు కాదా, అసలు హిందూ అనే మతమే లేదా, చరిత్ర ఏం చెబుతోంది?
- బల్లి పడితే ఆహారం విషపూరితం అవుతుందా, ఇంట్లో బల్లులు లేకపోతే మనుషులకు ఏం జరుగుతుంది?
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















