ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా: 'మెదడే ఎక్కువ ప్రమాదకరం, ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన అవసరం లేదు' అన్న సుప్రీం కోర్టు, బాంబే హైకోర్టు తీర్పు రద్దు

- రచయిత, సుచిత్ర కె.మొహంతి
- హోదా, బీబీసీ లీగల్ ప్రతినిధి
ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా జీవిత ఖైదును రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సస్పెండ్ చేసింది.
జీఎన్ సాయిబాబాతో సహా మరో అయిదుగురికి యుఏపీఏ (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం) కింద మహారాష్ట్రలోని గడ్చిరౌలి కోర్టు విధించిన జీవిత ఖైదును రద్దు చేస్తూ బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ శుక్రవారం తీర్పు చెప్పింది.
అయితే, ఈ తీర్పును సస్పెండ్ చేస్తున్నామని, వారి విడుదలపై స్టే విధిస్తున్నామని సుప్రీం కోర్టు శనివారం ఉదయం ప్రకటించింది. అంతేకాకుండా, తనను జైల్లో కాకుండా గృహ నిర్బంధంలో ఉంచాలని సాయిబాబా చేసిన అభ్యర్థనను కూడా సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
సాధారణంగా సుప్రీం కోర్టుకు శనివారం సెలవు ఉంటుంది. అయితే, జస్టిస్ ఎం.ఆర్ షా, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన సుప్రీం స్పెషల్ బెంచ్ ఈ కేసుకున్న ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకుని విచారణ చేపట్టింది.
మహారాష్ట్ర ప్రభుత్వం సొలిసిటర్ జనరల్ (ఎస్.జి) తుషార్ మెహతా, సాయిబాబా తరఫున వాదిస్తున్న న్యాయవాది ఆర్.బసంత్‌ల వాదనలను విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం బాంబే హైకోర్టు తీర్పును సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. సున్నితమైన అంశాలతో కూడిన ఈ కేసును మరింత లోతుగా విచారిస్తామని కూడా ధర్మాసనం ప్రకటించింది.

ఫొటో సోర్స్, AS Vasantha
55 ఏళ్ల వయసులో 90శాతం శారీరక వైకల్యంతో ఉన్న సాయిబాబా, మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా దేశానికి వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలు చేపట్టలేదని ఆయన న్యాయవాది బసంత్ కోర్టుకు విన్నవించారు.
సాయిబాబాకు ఆలోచించే మెదడు ఉందని సొలిసిటర్ జనరల్ చెబుతున్నారని, కానీ ఆయన నేరానికి పాల్పడినట్లు చూపే ఆధారాలు ఏమీ లేవని బసంత్ అన్నారు.
దీని మీద స్పందిస్తూ 'తీవ్రవాద, మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి మెదడే ఎక్కువ ప్రమాదకరమైనది. ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన పని లేదు.' అని జస్టిస్ షా అన్నారు. ఈ మాటను తాను ఈ నిర్దిష్టమైన కేసును దృష్టిలో పెట్టుకుని అనడం లేదని కూడా షా చెప్పారు.
గృహ నిర్బంధంలో ఉంచాలని సాయి బాబా న్యాయవాది చేసిన విన్నపాన్ని కూడా ఎస్.జి వ్యతిరేకించారు. ఇటీవల కాలంలో గృహ నిర్బంధం కావాలంటూ 'అర్బన్ నక్సల్స్' అడగడం పరిపాటి అవుతోంది అంటూ ఎస్.జి కోర్టుకు తెలిపారు.
'వాస్తవాలు చాలా ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. జమ్మూ కశ్మీర్‌లో ఆయుధాల కోసం పిలుపు ఇవ్వడం, పార్లమెంటును కూల్చడానికి మద్దతు తెలపడం, నక్సలైట్లతో సమావేశాలు ఏర్పాటు చేయడం, భద్రతా దళాల మీద దాడులు చేయడం వంటివి ఇందులో ఉన్నాయి' అని ఎస్.జి చెప్పారు.

ఫొటో సోర్స్, AS Vasantha
ప్రొఫెసర్ సాయిబాబా ఎవరు?
దిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల రామ్‌లాల్ ఆనంద్ కాలేజ్‌లో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జి.ఎన్.సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై 2014 మేలో మహారాష్ట్ర పోలీసులు అరెస్టుచేశారు. 2017 మార్చిలో యూఏపీఏ చట్టం కింద ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. ఆయనను మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో గల అండా సెల్‌లో నిర్బంధించారు.
వైద్య పరిభాషలో చెప్పాలంటే సాయిబాబాకు 90 శాతం వైకల్యముంది. ఐదేళ్ల వయసులోనే ఆయనకు పోలియో సోకింది. రెండు కాళ్లూ నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. చిన్ననాటి నుంచీ ఆయన వీల్‌చైర్‌కే పరిమితయ్యారు. 2014 నుంచి జైలులోనే ఉన్న ఆయన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. నరాలు దెబ్బతినడం, కాలేయ సమస్యలు, బీపీ తదితర సమస్యలున్నాయి. మరోవైపు ఆయనకు హృద్రోగ సమస్యలూ ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
కొంత కాలం కిందటి వరకు ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు విరసం నేత వరవరరావు ఆరోగ్య విషయంలో వారి బంధువులు, అభిమానుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ప్రభుత్వం వారికి జైలులో సరైన వైద్య సదుపాయాలు కల్పించడంలేదని, కరోనావైరస్ పేరుతో చంపేయడానికి కుట్ర చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
అయితే, వారి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది. కేస్లుల్లో తీవ్రత దృష్ట్యా వయసు, అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వకూడదని న్యాయస్థానాల్లో వాదిస్తూ వచ్చింది.
శుక్రవారం బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ ఆయన్ను విడుదల చేయాలని తీర్పు ఇచ్చింది. కానీ ఆ తీర్పును సుప్రీం కోర్టు శనివారం సస్పెండ్ చేసింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












