హైదరాబాద్ స్కూళ్లలో పిల్లలపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయా?

లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, iStock

    • రచయిత, సురేఖ అబ్బూరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘12 ఏళ్ల అమ్మాయి ఎదుర్కొన్న సమస్య గురించి ఓ వ్యక్తి చైల్డ్‌లైన్‌కు ఫోన్ చేశారు. ఆ అమ్మాయి ఇంటికి మేం వెళ్లాం. ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న ఆ అమ్మాయిని.. అసలు ఏం జరిగింది? అని అడిగాను. విషయం తెలుసుకున్నాక నాకు ఏడుపు ఆగలేదు’’అని చైల్డ్‌లైన్‌ కోసం పనిచేస్తున్న ఓ మహిళ బీబీసీతో చెప్పారు.

‘‘మొదట్లో చెప్పడానికి భయపడిన ఆ అమ్మాయి.. స్కూల్ హెడ్‌మాస్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని చెప్పడం మొదలు పెట్టింది. దానిని రేప్ అంటారని కూడా తనకు తెలియదు. ఏదో చాలా చెడు జరిగింది అన్నది మాత్రమే తనకు తెలుసు’’అని ఆమె వివరించారు.

‘‘అన్నింటినీ తాను ఒక్కొక్కటిగా వివరించింది. అది విని నేను దాదాపు 20 నిమిషాలు ఆ అమ్మాయిని చూస్తూ ఏడ్చేశాను. ఆ పాపకు ఇంకా రుతుస్రావం అంటే ఏంటో కూడా తెలియదు’’అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

అసలు ఏం జరుగుతోంది?

‘‘హెడ్ మాస్టర్ రూమ్‌కు పిలిచి నువ్వు బాగా చదువుతావు. ఇంకా బాగా ఎలా చదువుకోవాలో నేను చెబుతాను అని చెప్పేవాడు. ఆ తరువాత కొన్ని వీడియోలు చూపించడం మొదలు పెట్టాడు. ఇవన్నీ ఏమి బాగోలేదు.. నాకు ఎందుకు చూపిస్తున్నారు అని అడిగితే, ఎదగాలి అంటే ఇవి కూడా నేర్చుకోవాలి, నేను నేర్పుతా అని అనేవాడు’’ అని చైల్డ్ లైన్ కు చెందిన మహిళ వెల్లడించారు. ఆమె తన పేరు చెప్పడానికి ఇష్టపడ లేదు.

‘‘ఒక రోజు కార్ ఎక్కు.. అందరికీ చాక్లెట్లు కొనడానికి షాప్‌కు వెళదాం రా అని చెప్పడంతో కార్ ఎక్కాను. కార్‌లో నాపై బలవతం చేశాడు. మళ్లీ నన్ను బడిలో దింపేశాడు. నేను ఇంటికి వచ్చి ఆ విషయాన్ని చెప్పాను. కానీ, అందరూ నన్నే తప్పుపట్టాడు. అంత మంది పిల్లలు ఉండగా నిన్నే ఎందుకు పిలిచారు? ఆయన ఆరేడేళ్లుగా ఇక్కడ ఉన్నారు.. తను అలాంటి వాడు కాదు అని చెప్పారు’’అని ఆ పాప చెబుతుంటే తన మనసు చలించిపోయిందని ఆమె వివరించారు.

“బడిలోనే రక్షణ ఉంటుందని.. మేం కూలి పని చేసుకుంటూ మా అమ్మాయిని స్కూల్‌కు పంపాము. ఇప్పుడు చదువు లేకపోయినా ఫర్వాలేదు, మా పిల్ల ఇంట్లోనే ఉంటే ఇలా జరిగేది కాదు అని కొందరు చెబుతుంటే నా మనసు చలించిపోతోంది’’అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

సుమారు 16 ఏళ్లుగా ఒక స్వచ్ఛంద సంస్థకు చెందిన చైల్డ్‌లైన్‌లో ఆమె పనిచేశారు. మూడో తరగతి చిన్నారి, ఎనిమిదో తరగతి బాలిక, ఇంటర్ చదువుతున్న అమ్మాయి.. ఇలా చాలామంది అమ్మాయిలు తమపై జరిగిన అఘాయిత్యాల గురించి తమతో చెబుతుంటారని ఆమె అన్నారు.

‘‘వారికి అండగా ఉన్నాం అని తృప్తి ఉంటుంది. కానీ, ఈ ఘటనలకు అంతు లేదా? అని ఒక్కోసారి బాధేస్తుంది’’అని ఆమె వివరించారు.

లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/GETTYIMAGES

చాలా జరుగుతున్నాయి...

‘‘ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. వీటిలో కొన్నింటిలోనే కేసులు నమోదు అవుతున్నాయి’’అని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి .

తాజాగా ‘‘దివ్య దిశ’’ అనే స్వచ్ఛంద సంస్థ.. హైదరాబాద్‌లో ఇలా నమోదు అయిన కేసుల వివరాలను విడుదల చేసింది.

ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2022 వరకు మొత్తంగా 86 కేసులు రిపోర్ట్ కాగా.. ఏప్రిల్ 2022 నుండి సెప్టెంబర్ 2022 వరుకు 43 కేసులు నమోదు అయినట్లు సంస్థ పేర్కొంది. ఇలాంటి కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతోంది ప్రభుత్వ పాఠశాలలోనే అని సంస్థ వివరించింది.

అయితే, ఈ గణాంకాలు కేవలం హైదరాబాద్‌లోని 16 మండలాల లోనివి మాత్రమే అని ఆ సంస్థ డైరెక్టర్ ఇసిడోరె ఫిలిప్స్ తెలిపారు. చుట్టుపక్కన కలిసి ఉన్న వేరే జిల్లాల సమాచారం వీటిలో కలపలేదని వివరించారు.

మరోవైపు దక్షిణ భారత్ దేశంలోని చెన్నైలో 2021 మే నెలలో సుమారు 200 లైంగిక దాడుల కేసులు విద్యార్థులు నమోదు చేశారని అవుట్‌లాడ్ ఇనిషియేటివ్ అనే సంస్థ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా చైల్డ్‌లైన్‌లలో వచ్చిన డేటాను పరిశీలిస్తే, రిపోర్ట్ అవుతున్న కేసుల సంఖ్య ఇటీవల పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరోనావైరస్ వ్యాప్తి తర్వాత స్కూళ్లు తెరచుకోవడంతో ఈ సంఖ్య పెరిగినట్టు తెలుస్తోంది .

అయితే మొత్తంగా ఇలాంటి కేసులు ఎన్ని వస్తున్నాయి? వీటిలో స్కూళ్లల్లో జరుగుతున్న లైంగిక దాడులు ఎన్ని? అనే ప్రశ్నల విషయంలో సమగ్ర డేటా అందుబాటులో లేదు.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన వివరాల ఆధారంగా చూస్తే.. 2020లో మొత్తంగా పిల్లలపై వేధింపుల కేసులు 47,221 నమోదయ్యాయి. 2021లో ఈ సంఖ్య 53,874కు పెరిగింది.

లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

హైదరాబాద్‌లో ఎందుకు ఎక్కువ కేసులు ?

తెలంగాణలో మిగతా జిల్లాల కంటే హైదరాబాద్‌లో ఎక్కువగా ఈ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.

నగరంలోని పెద్ద స్కూళ్లతో పాటు మధ్య తరహా స్కూళ్ల గదులలో అసలు ఏం జరుగుతోంది? అనేది బాహ్య ప్రపంచానికి తెలియడంలేదని దివ్య దిశ డైరెక్టర్ ఇసిడోరె ఫిలిప్స్ వివరించారు.

‘‘ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది అనేది నాణెంలో ఒకవైపు మాత్రమే. అయితే, అసలు ఇలాంటి కేసులు ఎందుకు ఎక్కువుగా నమోదు అవుతున్నాయి? అనేది తెలియాలి’’అని ఆయన అంటున్నారు.

‘‘గతంలో ఇలాంటి సంఘటనల గురించి చెప్పడానికి కూడా భయపడేవారు. ఆ భయం ఇప్పటికి ఎక్కువగానే ఉంది. కానీ, పరిస్థితుల్లో నెమ్మదిగా మార్పు వస్తోంది. అందుకే కేసుల సంఖ్య కూడా నెమ్మదిగా పెరుగుతోంది’’అని ఆయన చెప్పారు.

ఈ సమస్య కేవలం ఒక్క హైదరాబాద్‌ లేదా తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు. చెన్నైలోనూ 2021 మే నెలలో ఇలాంటి కేసులు 200 కు పైగా వచ్చినట్లు 'అవుట్‌లాడ్' అనే సంస్థ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

ఇలాంటి ఘటనలు పెరగడానికి కారణాలు ఏమిటి?

“తమను తాము ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో పిల్లలకు మనం అవగాహన కల్పించడం లేదు. ఈ సమస్యే చిన్నారులపై వేధింపులు పెరగడానికి కారణం అవుతోంది’’అని దివ్య దిశ డైరెక్టర్ ఫిలిప్స్ బీబీసీతో అన్నారు.

‘‘ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే వారు ఇంటిలోనో, ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలనో ఎంచుకోరు. ఎందుకంటే తమ గుట్టు త్వరగా బయటపడుతుందని వారికి తెలుసు. అదే స్కూలు పిల్లలు అయితే, తేలిగ్గా భయపెట్టి వారి నోరు మూయించేయొచ్చు’’అని ఆయన వివరించారు.

‘‘మనం కూడా స్కూలులో టీచర్లు , ప్రిన్సిపల్ తదితరులు చెప్పేవి తూచా తప్పకుండా వినాలని పిల్లలకు సూచిస్తుంటాం. వారు ఎక్కడికి రమ్మని పిలిచినా వెళ్లాలని సూచిస్తాం. దీంతో పిల్లలు తమకు ఇష్టం లేకపోయినా మనం చెప్పిందే చేస్తుంటారు’’అని ఆయన వివరించారు.

లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

స్కూళ్లు వీటిపై ఎలా స్పందిస్తాయి?

ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తమకు చెడ్డ పేరు వస్తుందనే భయంతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కేసులను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తాయని ఎంవీ ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్.వెంకట్ రెడ్డి వివరించారు.

"చాలా పాఠశాలలు బాధితురాలినే నిందిస్తాయి. అలాంటి ఘటనలు జరిగాయని అంగీకరించడానికి నిరాకరిస్తాయి. నేరాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తాయి. కొన్ని పాఠశాలలు అయితే, అల్పాదాయ వర్గాలకు చెందిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తాయి’’అని ఆయన అన్నారు.

‘‘కొన్ని కేసుల్లో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడిని పాఠశాల యాజమాన్యం సస్పెండ్ చేస్తుంది. కొన్నిసార్లు మాత్రం కేవలం బదిలీ చేస్తారు. అంటే ఆరోపణలకు పాల్పడేవారు వేరే చోట ఉద్యోగం చేసుకునే వీలుంటుంది. అసలు ఇది న్యాయం ఎలా అవుతుంది?’’అని ఆయన ప్రశ్నించారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: ఈ బడికి కరెంటు బిల్లు రాదు, ప్రభుత్వమే డబ్బు చెల్లిస్తుంది

స్కూళ్లలో జరుగుతున్న ఇలాంటి ఘటనలను ఎలా అదుపు చేస్తారు?అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని బీబీసీ ప్రశ్నించింది.

‘‘అలాంటి కేసుల డేటా ప్రస్తుతానికి నా దగ్గర లేదు. మొదట ఆ డేటాను నేను పరిశీలించాల్సి ఉంది. అయినా మేం ఘటనలు జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటున్నాం కదా. జూనియర్ కాలేజీలలో ఇలాంటి కేసులు వస్తున్నాయని తెలిసిన వెంటనే.. అక్కడ కౌన్సెలర్లను అందుబాటులో ఉంచాం. అలానే స్కూల్స్‌లోనూ ఇలాంటి సదుపాయాలు ఏర్పాటుచేస్తాం’’అని ఆమె అన్నారు.

లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

పోక్సో చట్టం ఏం చెబుతుంది ?

లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించేందుకు పోక్సో చట్టాన్ని 2012లో కేంద్రం తీసుకొచ్చింది. 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు లైంగిక నేరాల నుండి రక్షించడానికి దీనిలో నిబంధనలు ఉన్నాయి.

ఈ చట్టం ప్రకారం 18ఏళ్ల కంటే తక్కువ వయస్సు అందరూ బాలలే. పిల్లలపై జరిగే లైంగిక నేరాలను దీనిలో ఐదు రకాలుగా దీనిలో వర్గీకరించారు.

  • పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ (Penetrative sexual assault )
  • అగ్రిగేటివ్ పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ (Aggregative penetrative sexual assault )
  • సెక్సువల్ అసాల్ట్ (Sexual assault)
  • అగ్రిగేటివ్ పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ (Aggregative sexual assault)
  • సెక్సువల్ హెరాస్‌మెంట్ (Sexual harassment)

చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడితే పోక్సో చట్టం ప్రకారం 10ఏళ్లకుపైనే జైలు శిక్ష పడుతుంది. రెండోసారి నేరం రుజువైతే ఈ శిక్ష 20 ఏళ్లకు పైనే ఉంటుంది.

లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

చట్టాలు సరే.. ఎలాంటి చర్యలు తీసుకోవాలి ?

ఇలాంటి ఘటనలు జరుగుతునప్పుడల్లా ఉలిక్కిపడి, చేసిన వారి పై చర్యలు తీసుకోడం మాత్రమే కాదు. అసలు ఇలాంటివి స్కూళ్లలో జరగకుండా ఏం చెయ్యాలి అన్నది పెద్ద ప్రశ్న.

ఆడ పిల్లలు చదువుకోవాలి, వారి చదువు సవ్యంగా కొనసాగాలి అంటే.. బడి వారికి రక్షణ కవచంగా మారాలి అంటున్నారు ఎంవీ ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ వెంకట్ రెడ్డి.

‘‘పిల్లల సంరక్షణకు సంబంధించిన ఎన్‌జీవోల విషయంలో జువైనెల్ జస్టిస్ యాక్ట్‌లోని పిల్లల సంరక్షణ పాలసీ అమలు అవుతోంది. దీనిలో భాగంగా పిల్లలను ఎలా చూసుకోవాలని అనే అంశంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఇదే పాలసీని విద్యా సంస్థల్లో వారికీ వర్తించేలా చేయాలి. అప్పుడే వారికి పిల్లలకు సంరక్షణపై పూర్తి అవగాహన వస్తుంది. మరోవైపు పిల్లలను కూడా మనం మానసికంగా సిద్ధం చేయాలి. వేధింపులను వెంటనే తల్లిదండ్రుల దృష్టికి తీసుకొచ్చేలా మనం వారికి అవగాహన కల్పించాలి’’అని ఆయన అన్నారు.

లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, NIKITA DESHPANDE

తల్లిదండ్రులు ఏం చేయాలి?

మొట్టమొదట పిల్లలను బయటకు పంపేటప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఒంటరిగా ఎవరితోనూ వెళ్లకూడదని సూచించాలి. ఇంటి బయట ఆడుకునే ప్రదేశం కావచ్చు లేదా స్నేహితులు, బంధువుల ఇల్లు కావచ్చు అన్ని విషయాల్లోనూ పిల్లలకు అవగాహన కల్పించాలి.

‘‘ఎవరైనా మిగతా పిల్లలకంటే, ఒకరిద్దరితోనే సాన్నిహిత్యంగా ఉన్నారంటే సందేహించండి. ఎందుకంటే ఒక్కోసారి ఇలాంటి సాన్నిహిత్యాల వెనకే వేధింపులు ఉంటాయి’’అని అంటారు సైకియాట్రిస్ట్ పూర్ణిమ నాగరాజ్.

‘‘అలాంటి వారు వెంటనే పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడరు. తాము ఎంచుకున్న పిల్లలను ముందుగా మంచి చేసుకుంటారు. కావాల్సిన బొమ్మలు లేదా చాక్లెట్లు కొనిపెట్టడం చేస్తారు. ఆ తరవాత వారిని ముట్టుకోవడం లాంటివాటితో మొదలుపెడతారు. ఇలాంటివి జరిగేటప్పుడు వెంటనే అరవడం, అందరికీ చెప్పడం చేయాలని పిల్లలకు చెప్పాలి’’అని ఆమె సూచించారు.

‘‘నేరస్థులు పిల్లలను లొంగదీసుకోవడానికి, ఈ నేరాలను బయటకు చెప్పకుండా ఉండేందుకు పిల్లలను భయపెడతారు. వారి సోదరులు, లేదా తల్లిదండ్రులకు హాని చేస్తామని అంటారు. అలాంటి భయాలకు లొంగకూడదని పిల్లలకు మనం చెప్పాలి. సురక్షితమైన స్పర్శ , అసురక్షితమైన స్పర్శ గురించి వారికి తెలియజేయాలి’’అని ఆమె చెబుతున్నారు.

‘‘స్కూళ్లల్లో కేవలం అమ్మాయిల పైనే కాదు. అబ్బాయిలపై కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి. అయితే, అబ్బాయిలపై లైంగిక దాడి జరిగిందని అంటే వారిని అవహేళన చేస్తారనే భయం ఉంటోంది. అలాంటి అపోహలను పిల్లల్లో మనం తొలగించాలి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, పిలల్లను మనం అసలు తప్పుపట్టకూడదు. వారికి తమ అండ ఉంటుంది అనే నమ్మకం కలిగించాలి’’అని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)