చంద్రుడు ఆడా, మగా?

చంద్రుడు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జన్హవీ మూలే,
    • హోదా, బీబీసీ మరాఠీ

చందమామ - ఈ ఒక్క పదం మనలో అనేక భావోద్వేగాలను, జ్ఞాపకాలను రేకెత్తిస్తుంది. కాదంటారా?

చందమామను చూసి కొందరు తమ ప్రేమికుల ముఖారవిందాన్ని గుర్తు తెచ్చుకుంటారు. కొంత మంది చంద్రుని పైకి మనిషి చేసిన ప్రయాణాన్ని విస్తృతమైన అంతరిక్ష ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు తొలి మెట్టులా భావిస్తారు.

చంద్రుని గమనం సముద్ర కెరటాల పై కూడా ప్రభావం చూపిస్తుంది. కొన్ని శతాబ్దాలుగా ప్రపంచంలో కొన్ని తరాలకు చెందిన కవులను కూడా ప్రభావితం చేసింది.

ఇండియా, చైనా, దక్షిణ ఆసియా, ఇజ్రాయెల్, ఇతర ఇస్లామిక్ దేశాల్లో చంద్రుని గమనం ఆధారంగా క్యాలండర్లు ఉంటాయి.

కొన్ని దేశాల్లో చంద్ర గమనం ఆధారంగా క్యాలెండర్లు ఉంటే కొన్ని చోట్ల సూర్య, చంద్ర గమనం రెండూ కలిపి క్యాలెండర్లను రూపొందిస్తారు.

వాస్తవానికి చాలా మతాలు, సంస్కృతులు, నాగరికతల్లో చంద్రునికి సంబంధించిన కథలు, కల్పనలు ఉన్నాయి.

హిందువులు చంద్రుడిని "సోమ" అనే దేవతగా కొలిచి పూజిస్తారు. చంద్రున్ని నవగ్రహాల్లో ఒకటిగా పూజిస్తారు.

ఇస్లాం నెలవంకను మతానికి సంకేతంగా చూస్తుంది.

బుద్ధుని జీవితంలో అనేక ముఖ్యమైన ఘట్టాలతో చంద్రునికి సంబంధం ఉంది.

యూరోపియన్ దేశాల్లో చంద్రుడిని చీకటికి, దుష్టశక్తులతో సంబంధం ఉన్నట్లుగా చూస్తారు. పౌరాణిక పాత్రలైన డ్రాకులా, వాంపైర్, వేర్‌వోల్వ్స్ చంద్రునితో సంబంధం ఉన్న పాత్రలే.

కొన్ని సంస్కృతుల్లో చంద్రుని పురుషునిగా భావిస్తే, కొందరు చంద్రుడిని స్త్రీగా పరిగణిస్తారు.

వీడియో క్యాప్షన్, విశ్వ రహస్యాలు శోధించే ప్రయోగశాలలో పరిశోధనలు ఏం చెబుతున్నాయి

బుద్ధుని ప్రయాణం

బుద్ధుని జీవితంలో చాలా ఘట్టాలు పౌర్ణమి నాడు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి వైశాఖ పౌర్ణమి నాడు ఆయన జీవితంలో మూడు సంఘటనలు చోటు చేసుకున్నాయి.

ఆయన లుంబినిలో వైశాఖ పూర్ణిమ నాడు జన్మించారు. 35 సంవత్సరాల తర్వాత వైశాఖ పూర్ణిమ నాడు ఆయనకు జ్ఞానోదయం అయింది.

ఆయన 80వ సంవత్సరంలో వైశాఖ పూర్ణిమ నాడు మరణించారు.

ఆషాఢ మాసంలో వచ్చే బుద్ధ పూర్ణిమను బౌద్ధ మతస్థులు ధమ్మ దివస్, లేదా ధమ్మ చక్ర దినంగా జరుపుకుంటారు.

బుద్ధునికి జ్ఞానోదయం అయిన తర్వాత బుద్ధుడు ఆ రోజున తన తొలి ఆధ్యాత్మిక ప్రసంగాన్ని చేశారు.

ఆశ్వయుజ పూర్ణిమ నాటికి బౌద్ధ సన్యాసులు తమ ధర్మ ప్రచారానికి విరామం ఇస్తారు.

హిందూ పురాణాలు ఆకాశం 27 భాగాలుగా విభజితమై ఉంటుందని భావిస్తాయి

ఫొటో సోర్స్, Getty Images

నక్షత్రాలకు అధిపతి

హిందూ పురాణాలు ఆకాశం 27 భాగాలుగా విభజితమై ఉంటుందని భావిస్తాయి. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క నక్షత్రం ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ నక్షత్రాలకు చంద్రుడు అధిపతిగా ఉంటాడని చెబుతారు.

పౌరాణిక గాథల ప్రకారం ఈ 27 నక్షత్రాలు దక్ష ప్రజాపతికి కూతుర్లని చెబుతారు. వీటిని చంద్రునికిచ్చి పెళ్లి చేశారని చెబుతారు.

కానీ, చంద్రునికి మాత్రం అందరి కంటే ఎక్కువగా రోహిణి పై ఎక్కువ ప్రేమ ఉండేది. దీంతో, మిగిలిన 26 నక్షత్రాలు తండ్రి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాయి.

దక్షునికి కోపం వచ్చి చంద్రుని శపించారు. దీంతో చంద్రుడు తరిగిపోవడం మొదలయింది. ఆయన తప్పును గ్రహించి క్షమాపణ కోరారు. దీంతో, దక్షుడు చంద్రుడు ప్రతీ రోజు ఒక భార్య దగ్గరకు వెళ్లాలనే నిబంధన విధించి శాప విముక్తున్ని చేశారు.

దీంతో, ఆయన రోహిణిని కలిసే సమయం వచ్చేసరికి నిండు చంద్రునిగా మారి, ఆమెను విడిచి పెట్టే సమయానికి తరిగిపోతూ ఉంటారనే కథ ప్రాచుర్యంలోకి వచ్చింది.

అయితే, ఇదంతా కేవలం కల్పన మాత్రమే. చంద్రుడు పై కనీసం కాంతి కూడా ఉండదు. సూర్యకాంతి చంద్రుని పై పాడినప్పుడు ఆ కాంతి పరావర్తనం చెందుతుంది.

హిందువులు చంద్రుని మానవ జీవితం పై ప్రభావం చూపించే అంతరిక్ష గ్రహాల్లో ఒకటిగా భావిస్తారు. ఆయన దేవతల పానీయం సోమరసాన్ని కనిపెట్టారని అంటారు.

చంద్రునికి సంబంధించిన మరొక కథ సోమ, తారలకు సంబంధించింది. తార బృహస్పతి భార్య. సోమ బృహస్పతి శిష్యుడు.

తార సోమునితో ప్రేమలో పడి ఆయనతో పారిపోయింది. వారిద్దరికీ ఒక కుమారుడు పుట్టాడు. ఆ కొడుకే బుధుడు అని అంటారు.

బుధునికి కూడా తండ్రి మాదిరిగా స్త్రీ లక్షణాలు ఉంటాయని చెబుతారు.

చందమామ

ఫొటో సోర్స్, Getty Images

స్త్రీ తత్వంలో చంద్రుడు

భారతీయ సంస్కృతిలో చంద్రుడిని స్త్రీతత్వంతో చూస్తారు. మహిళను చంద్రునితో పోలుస్తూ చాలా పాటలు రాశారు. జాబిలిని స్త్రీ తత్వమైన ప్రేమకు, భావోద్వేగాలకు, సున్నితత్వానికి సంకేతంగా చూస్తారు.

కొన్ని ప్రాంతాల్లో చంద్రుడు మహిళల్లో రుతుస్రావం పై ప్రభావం చూపిస్తుందని నమ్ముతారు. చైనాలో టావోఇజంలో యిన్ యాంగ్‌ను సూర్య చంద్రులతో పోలుస్తారు.

చంద్రుని స్త్రీ తత్వంగా, సూర్యుని పురుష తత్వంగా భావిస్తారు. ఇద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటారని చెబుతారు.

చైనా పౌరాణిక గాథల్లో స్వర్గలోక సుందరి చాంగ్ హో అనే పాత్రకు సంబంధించిన కథలుంటాయి. ప్రస్తుతం ఆమె చంద్రుని బందీగా ఉందని ఆ కథల్లో చెబుతారు.

చాంగ్ హో

ఫొటో సోర్స్, Getty Images

కానీ, ఆమె అక్కడి వరకు ఎలా వెళ్లారు? చాంగ్ ఆమె భర్త కోసం ఉద్దేశించిన పానీయాన్ని తాగగా, ఆమె నేరుగా చంద్రుని దగ్గరకు చేరుకున్నారని కథలు ప్రచారంలో ఉన్నాయి.

గ్రీకు పౌరాణిక గాథల్లో చంద్రుడు ఆర్టెమిస్ అనే స్త్రీ దేవత. ఆమె కవల సోదరుడు అపోలో. ఆర్టెమిస్‌ను వేట, ప్రకృతి, అడవికి దేవతగా భావిస్తారు.

గ్రీకులకు సూర్య చంద్రులకు ప్రాతినిధ్యం వహించే హీలియోస్, సెలెన్ అనే మరో ఇద్దరు దేవతలున్నారు.

రోమన్లు చందమామను లూనా దేవతగా భావిస్తారు. లూనాను చంచల స్వభావం ఉన్న దేవతగా చూస్తారు.

దీని నుంచే లునాటిక్స్ (పిచ్చివాళ్ళు) అనే పదం పుట్టిందని చెబుతారు. చంద్రునితో సంబంధం ఉన్న మరో రోమన్ దేవత డయానా. మెక్సికోలో ఆజ్‌టెక్‌లు చంద్రున్నీ కోయోల్‌షాకి దేవతకు అధిపతిగా భావిస్తారు.

వీళ్ళు చంద్రున్ని స్త్రీ తత్వంతో చూస్తారు.

సుకియోమి

ఫొటో సోర్స్, Getty Images

కానీ, జపాన్, ఈజిప్టులో చంద్రున్ని పురుష దేవతగా భావిస్తారు. జపాన్‌లో సుకియోమి అనుచరులు చంద్రునికి పూజలు నిర్వహిస్తారు.

ఆయనకు అమాతెరాసు అనే సోదరి ఉందని అంటారు. మరో సోదరుడు సుజానో సముద్రానికి, ఉప్పెనలకు అధిపతి అని చెబుతారు.

సుకియోమి పై ఆగ్రహించిన అమాతెరాసు తిరిగి తన ముఖాన్ని చూడనని నిర్ణయించుకున్నారు. అందుకే ఒకరు పగలు, మరొకరు రాత్రి పూట ఉదయిస్తారని చెబుతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)