ఆవు తేన్పుల మీద పన్ను... ఎక్కడ, ఎందుకు?

ఆవులు

ఫొటో సోర్స్, Thinkstock

    • రచయిత, వరికూటి రామకృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మీ దగ్గర ఒక ఆవు ఉంది అనుకోండి. అది తేన్చినప్పుడు పన్ను కట్టాల్సిందే అంటూ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తే ఎలా ఉంటుంది? వినడానికే కొంచెం వింతగా... మరి కొంచెం కొత్తగా అనిపిస్తోంది కదా!

ఈ కొత్తరకం ట్యాక్స్‌ను రైతుల మీద వేసేందుకు సిద్ధమవుతోంది న్యూజీలాండ్. పర్యావరణాన్ని రక్షించాలంటే తప్పదు అని చెబుతోంది.

పర్యావరణ మార్పులకు ఆవుకు సంబంధం ఏంటి? ఆవు తేన్పుల మీద పన్ను వేయడం ద్వారా పర్యావరణ మార్పులను ఎలా రక్షిస్తారు? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పటికే మీ బుర్రలో మెదులుతూ ఉండొచ్చు.

ఆ సందేహాలకు సమాధానాలను కాస్త వివరంగా చూద్దాం.

ఆవు

ఫొటో సోర్స్, Thinkstock

ఆవుకు పర్యావరణానికి సంబంధం ఏంటి?

ఆవులు తేన్చినప్పుడు, మూత్రవిసర్జన చేసినప్పుడు మీథెన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయువులు విడుదల అవుతాయి. పర్యావరణ మార్పులకు కారణమవుతున్న వాటిలో గ్రీన్ హౌస్ వాయువులు కూడా ఉన్నాయి.

తేన్పులపై పన్ను

ఆవు తేన్చినప్పుడు మీథెన్ వాయువు విడుదల అవుతోంది కాబట్టి దాని మీద పన్ను వేస్తామని న్యూజీలాండ్ చెబుతోంది. దీంతో పాటు ఇతర పశువులు, గొర్రెల మీద కూడా పన్ను వేయనున్నారు.

ఆవులు, గొర్రెలు, మేకల ద్వారా సుమారు 14శాతం గ్రీన్ హౌస్ వాయువులు విడుదల అవుతున్నాయి.

పర్యావరణ మార్పులు

మీథెన్ ఎలా నష్టం చేస్తుంది?

సూర్యుడి నుంచి విడుదలయ్యే వేడిని 20 రెట్లు ఎక్కువగా మీథెన్ పట్టి ఉంచుతుంది. సీఓ2 కంటే కూడ ఇది చూపే ప్రభావం ఎక్కువ. వేడి వాతావరణంలోనే ఉండి పోవడం వల్ల భూమి వేడి ఎక్కుతుంది. అది చివరకు గ్లోబల్ వార్మింగ్‌కు దారి తీస్తుంది. భూమి మీద మీథెన్ విడుదలకు పశువులు కూడా ప్రధాన కారణం అవుతున్నాయి.

ఆవు జీర్ణవ్యవస్థ

మీథెన్ ఎలా విడుదల అవుతుంది?

ఆవు జీర్ణాశయంలో నాలుగు అరలు ఉంటాయి. తొలి అరను రూమెన్ అంటారు. ఇందులో గడ్డి వంటి ఆహారం పాక్షికంగా జీర్ణం అవుతుంది. ఇక్కడే అసలు సమస్య ఉంది. రూమెన్‌లో ఉండే బ్యాక్టీరియా ఫెర్మెంటేషన్ ప్రక్రియ ద్వారా ఆహారాన్ని జీర్ణం చేసే క్రమంలో మీథెన్ వాయువు విడుదల అవుతుంది.

ఆవులు తేన్చినప్పుడు లేదా అపాన వాయువును విడుదల చేసినప్పుడు మీథెన్ బయటకు విడుదల అవుతుంది.

ఒక పెద్ద ఆవు రోజుకు 500 లీటర్ల వరకు మీథెన్‌ను విడుదల చేస్తుంది.

భూమి మీద సుమారు 140 కోట్ల ఆవులు ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన చూస్తే గ్రీన్ హౌస్ వాయువుల విడుదలలో ఆవుల వాటా సుమారు 3.7శాతం అని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.

మీథెన్ అనేది వాతావరణంలో ఉంటుంది. కానీ మానవుని చర్యల వలన అది మరింత ఎక్కువగా విడుదల అయ్యి పరిమితికి మించి పోతోంది.

నీలి రంగులో దట్టంగా ఉన్న ప్రాంతాల్లో మీథెన్ ఎక్కువగా విడుదల అవుతోంది

ఫొటో సోర్స్, GHGSAT

ఫొటో క్యాప్షన్, ఉపగ్రహాల చిత్రాల ప్రకారం నీలి రంగులో దట్టంగా ఉన్న ప్రాంతాల్లో మీథెన్ ఎక్కువగా విడుదల అవుతోంది

15వేల ఇళ్లకు విద్యుత్

ఈ ఏడాది తొలిసారి అంతరిక్షం నుంచి ఆవుల ద్వారా విడుదలయ్యే మీథెన్ వాయువుల స్థాయిని పరిశోధకులు గమనించారు.

అమెరికాలోని పర్యావరణ పరిశోధన కంపెనీ జీహెచ్‌జీ శాట్, ఉపగ్రహాల ద్వారా మీథెన్‌ స్థాయిలను కొలిచింది.

అమెరికాలోని జొక్విన్ వ్యాలీ అనే ప్రాంతంలో వారు పరిశోధనలు జరిపారు. అక్కడ ఆవుల వల్ల గంటకు 361 నుంచి 668 కిలోల మీథెన్ విడుదల అవుతున్నట్లు వారు గుర్తించారు.

ఇది ఇలాగే కొనసాగితే ఏడాది మొత్తం మీద విడుదల అయ్యే మీథెన్‌తో 15వేలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆవు

ఫొటో సోర్స్, Getty Images

న్యూజీలాండ్‌లో ఎందుకు?

ప్రస్తుతం న్యూజీలాండ్ జనాభా సుమారు 50 లక్షలు. కానీ అక్కడ ఉన్న పశువులు కోట్లలో ఉన్నాయి. ఆవుల వంటి పశువులు ఒక కోటి ఉండగా గొర్రెలు సుమారు 2.6 కోట్లు ఉన్నాయి.

న్యూజీలాండ్‌లో సగానికిపైగా గ్రీన్ హౌస్ వాయువులు వ్యవసాయ రంగం నుంచి వస్తున్నాయి. అందులో పాడి కోసం, మాంసం కోసం పెంచే పశువుల వలన విడుదలయ్యే వాయువులు చాలా ఎక్కువ.

పశువుల తేన్పుల నుంచి మీథెన్ అధిక స్థాయిల్లో విడుదలవుతోందని న్యూజీలాండ్ చెబుతోంది.

2030 నాటికి 10శాతం

2050 నాటికి న్యూజీలాండ్‌లో గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను తగ్గించి కర్బన తటస్థంగా మార్చాలని ఆ దేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 2030 నాటికి మీథెన్ విడుదలను 10శాతం తగ్గించాలని, 2050 నాటికి 47శాతం వరకు తగ్గించాలని న్యూజీలాండ్ భావిస్తోంది.

ఆవులకు ఆహారంతో కలిపి ఇచ్చే పింక్ సీవిడ్

ఫొటో సోర్స్, University of Sunshine Coast

ఫొటో క్యాప్షన్, ఆవులకు ఆహారంతో కలిపి ఇచ్చే పింక్ సీవిడ్

ప్రత్యామ్నాయం ఏంటి?

ఆవులు విడుదల చేసే మీథెన్ వాయువుల స్థాయి తగ్గాలంటే అవి తీసుకునే ఆహారంలో చేయాల్సిన మార్పులపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 2014లో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు 'పింక్ సీవిడ్'ను గుర్తించారు. ఆహారంలో పింక్ సీవిడ్‌ను కలిసి ఇచ్చినప్పుడు ఆవుల్లో మీథెన్ వాయువు విడుదల 99శాతం తగ్గినట్లు ఆస్ట్రేలియా నేషనల్ సైన్స్ ఏజెన్సీ తెలిపింది.

ఆవులను పర్యావరణ అనుకూలంగా మార్చేందుకు ఇలాంటి పరిశోధనలు అనేకం కొనసాగుతున్నాయి.

గొర్రెలు

ఫొటో సోర్స్, Getty Images

రైతుల వ్యతిరేకత

అయితే న్యూజీలాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి రైతులు కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇలా తేన్పులపై పన్ను వేయడం వల్ల రైతులు పశువులను, భూములను అమ్మేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

అయితే పన్నుల రూపంలో రైతుల నుంచి వసూలు చేసే డబ్బును తిరిగి వారి కోసమే ఖర్చు పెడతామని ప్రభుత్వం చెబుతోంది. వ్యవసాయ టెక్నాలజీలను మరింత అభివృద్ధి చేసేందుకు, పరిశోధనకు, రైతుల ప్రోత్సహకాలకు పన్నులను వినియోగిస్తామని అంటోంది.

వీడియో క్యాప్షన్, ఆవు పేడతో మురుగునీరు ఇలా శుద్ధి చేయొచ్చు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)