ఇక్కడ పూలతో శాకాహార చెప్పులు, బ్యాగులు తయారు చేస్తారు, ఏమిటివి, ఎలా తయారవుతాయి?

ఫొటో సోర్స్, Sushmita Pathak
- రచయిత, సుశ్మితా పాఠక్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
కాన్పూర్‌లోని ఓ మురికివాడలో ఓ స్టెరిలైజ్డ్ ల్యాబ్ ఉంది. దీని లోపల ఫ్లాస్కులతో కూడిన ఇంక్యుబేటర్‌లు ఉన్నాయి.
ఈ ఫ్లాస్కులలో పులియబెట్టిన పదార్థంలా కనిపించే చిన్న కుప్పలు ఉంటాయి.
పక్క గదిలో బయోరియాక్టర్ (మెరుస్తున్న ఓ లోహపు స్థూపాకార పాత్ర) కనిపిస్తుంది. ఇది యాంటీబయాటిక్‌లను తయారు చేసే ప్రయోగశాలలా కనిపిస్తుంటుంది.
అయితే ఇది ఏ ఫార్మాస్యూటికల్ కాదు. పైప్-లాడెన్ బయోరియాక్టర్‌లో తయారు చేసి, ఇన్ఫెక్షన్ నుంచి మిమ్మల్ని రక్షించేవి కావు.
భారతదేశంలోని నదులను శుభ్రంగా మార్చడంలో సహాయపడేదే ఇది.
దీనిని ఫ్లెదర్ (తోలులా ఉండే పదార్థం) అని పిలుస్తారు. ఇది జంతువుల తోలుకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేస్తున్న కొత్త పదార్థం.
ఇది మెత్తటి గొర్రె తోలులా సున్నితంగా, మృదువుగా ఉంటుంది. పూల నుంచి దీనిని తయారు చేస్తారు.
ఈ ఫ్లెదర్‌ను కాన్పూర్‌కు చెందిన ఫూల్ అనే స్టార్టప్ కంపెనీ తయారు చేస్తోంది.
మొక్కలు, శిలీంధ్రాల ఆధారిత తోలు ప్రత్యామ్నాయాలను ఉత్పత్తి చేసే కంపెనీలలో ఇది ఒకటి.
సంప్రదాయ తోలు పరిశ్రమకు చరమగీతం పాడుతూ వేగన్ (శాకాహారి ఆధారిత) ఫ్యాషన్‌పై పెరుగుతున్న ఆసక్తిని ఉపయోగించుకుంటోంది.

ఫొటో సోర్స్, Sushmita Pathak
పరిశ్రమ ఆలోచన ఎలా మొదలైంది?
జంతువుల నుంచి తోలును ఉత్పత్తి చేయడం పర్యావరణ ముప్పులకు కారణం అవుతుంది. దీని తయారీలో నీరు, శక్తి ఖర్చు ఎక్కువే.
తోలును తయారు చేయడానికి రసాయనాలతో జంతువుల చర్మాన్ని శుద్ధి చేస్తారు.
ఈ ప్రక్రియలో భారీగా విషపూరిత రసాయనాలు విడుదల అవుతాయి. ఇవి నీటి వనరులను విషపూరితం చేస్తాయి.
జంతు చర్మం కోసం పశువుల పెంపకం చేపట్టాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ ప్రక్రియ గ్రీన్ హౌస్ వాయువులను ఉత్పత్తి చేస్తుంది. ఇది అటవీ నిర్మూలనకు కారణం అవుతోంది.
అంతేకాకుండా తోలు కోసం పశు వధశాలలో చోటుచేసుకునే అమాననీయ పరిస్థితులపై జంతు హక్కుల కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
భారతదేశంలోని దేవాలయాల దగ్గర భారీగా పేరుకుపోయిన పూల వ్యర్థాలతో తయారు చేసేదే ఈ ఫ్లెదర్.
ఈ స్టార్టప్ ప్రయాణం 2015వ సంవత్సరం చలికాలపు ఉదయం వేళ మొదలైంది.
అంకిత్ అగర్వాల్ స్వస్థలం కాన్పూర్. అంకిత్, అతని స్నేహితుడు అక్కడి గంగానది ఒడ్డు వద్దకు వెళ్లారు.
దేశంలోని అన్ని నదులకంటే గంగానది అత్యంత పవిత్రమైనదిగా హిందువులు విశ్వసిస్తారు.కానీ, అక్కడ కనిపించిన దృశ్యం వారిని షాక్‌కు గురిచేసింది.
నీటిపై బూడిదరంగులో చెత్త తేలుతోంది. అక్కడి బురదలో భక్తులు వదిలేసిన టన్నుల కొద్ది బంతి, గులాబీ, చేమంతి పూలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Sushmita Pathak
ఈ పూలను హిందూ ఆచారాలలో దైవారాధనకు వాడుతారు. వీటిని పవిత్రమైనవిగా భావిస్తారు. అంటే ఇతర వ్యర్థాలతో వాటిని పడేయకూడదని అర్థం.
అయితే వాటిని నదిలో వేయడం ఆచారంలో ఓ భాగం. దీంతో పూలు అక్కడి నీటిలో ఎక్కువగా కనిపిస్తాయి.
కాగా, అవి అక్కడి నదిలోని హానికరమైన రసాయనాలు బయటికి వచ్చేలా చేస్తాయి. అంతేకాకుండా పూలన్నీ కుళ్లిపోయి నీటిపై పొరలా ఏర్పడి కాలుష్యానికి దారి తీస్తున్నాయి.
సాధారణంగా భక్తులు గంగానదిలో స్నానాలు ఆచరిస్తారు. ఆ నదిలోని నీటిని పవిత్ర తీర్థంగా తాగుతారు. ఈ దృశ్యాలు అగర్వాల్‌ను కలవరపరిచాయి.
దేవాలయాల వద్ద పేరుకుపోతున్న పూల వ్యర్థాలకు పరిష్కారం కనుగొనే అన్వేషణలో పడ్డారు. దీనిని ఆయన ''లోయెస్ట్ హ్యాంగింగ్ ఫ్రూట్'' గా అభివర్ణించారు.
పూలను అగరబత్తులుగా మార్చే ఆలోచనతో 2017లో అగర్వాల్ ఫూల్ (హిందీలో పూలు) కంపెనీ ప్రారంభించారు.
కాన్పుర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కంపెనీ అగర్వాల్‌కు మద్దతు అందించింది. అంతేకాకుండా ఫూల్ స్టార్టప్ పెట్టుబడిదారులలో బాలీవుడ్ నటి ఆలియా భట్ కూడా ఒకరు.
ప్రతిరోజూ ఉదయం ఫూల్ కంపెనీ ట్రక్కులు కాన్పుర్‌లోని దేవాలయాల చుట్టూ తిరిగేవి. పూల వ్యర్థాలను నదిలో వేయడానికి ముందే వాటిని సేకరించేవి.
పూల్ ఫ్యాక్టరీలో కార్మికులు పూల రేకులను తీసి వాటిని ఎండబెడతారు. ఎండబెట్టిన రేకులను పొడి చేసి, కొన్ని నూనెలతో పిండిని తయారు చేస్తారు.
తరువాత మహిళా కార్మికులు ధూపం కర్రలు తయారు చేసేవారు.
అయితే ఈ పూలతో చాలా ప్రభావవంతమైన, ఆశ్చర్యకరమైన ఉపయోగం ఉందని తర్వాత కంపెనీకి తెలిసింది.

ఫొటో సోర్స్, Phool
ఫ్లెదర్ ఎలా పుట్టింది?
2018లో తేమ అధికంగా ఉన్న రోజున ఫూల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ హెడ్ నచికేత్ కుంట్ల, కంపెనీలోని ఇతర శాస్త్రవేత్తలు ఫ్యాక్టరీ ఫ్లోర్‌లోని వ్యర్థ పూల కుప్పపై తెల్లటి పొరను గమనించారు.
కొంచెం తీక్షణంగా పరిశీలించగా వారికి సన్నని పీచు నెట్‌వర్క్ కనిపించింది. సెల్యూలోజ్ నుంచి న్యూట్రిషన్ సాయంతో పువ్వులపై ఒక రకమైన ఫంగల్ సూక్ష్మజీవులు పెరగడానికి ప్రయత్నిస్తున్నట్లు కుంట్ల గుర్తించారు.
అనంతరం ఫూల్ పరిశోధకులు ప్రయోగాలు చేశారు. ఐఐటీ కాన్పుర్ సమీపంలోని అడవి నుంచి సూక్ష్మజీవులను సేకరించారు.
పూల వ్యర్థాలను వివిధ సూక్ష్మజీవుల జాతులకు తినిపించారు. ప్రయోగశాలలోని నియంత్రిత పరిస్థితులలో అది ఎలా పెరుగుతుందో చూడటానికి అక్కడ ఉష్ణోగ్రత, తేమను సర్దుబాటు చేశారు.

ఫొటో సోర్స్, Sushmita Pathak
ఈ ప్రయోగ ఫలితంగా ప్యాకేజింగ్‌లో ఉపయోగించే మందపాటి స్టైరోఫోమ్ రకం పదార్థం తయారైంది.
కానీ, సూక్ష్మజీవుల ఆకృతి విచిత్రంగా ఉన్నట్లు పరిశోధకులు గ్రహించారు. ''దీన్ని తాకితే తోలులా ఉందని టీంలో ఒకరు అన్నారు'' అని కుంట్ల చెప్పారు.
"అయితే మనం ఒక ఫాబ్రిక్ లాంటి పదార్థాన్ని సృష్టించగలమా? అది ఓ ఆలోచన " అని వారితో అన్నారు కుంట్ల.
పరిశోధకులు ప్రయోగాలు కొనసాగించి, రెండు జాతులను కలిపారని ఆయన చెప్పారు.
సూక్ష్మజీవులు పోషకాలను మరింత సమర్ధవంతంగా ఆకర్షించడానికి, మెరుగ్గా పెరగడంలో సాయపడటానికి పూలను ద్రవ రూపంలో తినిపించడం ప్రారంభించారు.
దీనికోసం పూల రేకులను నీటిలో ఉడకబెట్టి సెల్యులోజ్ తీశారు. లిగ్నిన్‌లను తీయడానికి కొన్ని అదనపు కార్బోహైడ్రేట్‌లను కలిపారు.
"సూక్ష్మజీవి దాన్ని తింటుంది. అది పెరుగుతుంది" అని ఫూల్ అసోసియేట్ రీసెర్చ్ సైంటిస్ట్ అమెన్ తాలుక్దార్ పేర్కొన్నారు.
"ఇది తోలులో మాదిరిగానే అణువులను ఉత్పత్తి చేస్తుంది"అని ఆయన చెప్పారు.
2021లో పూల్ ఉత్పత్తి చేయడం ప్రారంభించిన ఫ్లెదర్‌కు ఇది నాందిగా మారింది.

ఫొటో సోర్స్, Sushmita Pathak
ఫ్లెదర్ ఎలా తయారు చేస్తారు?
ఇంక్యుబేటర్‌లోని ఫ్లాస్క్‌లలో చిన్న సూక్ష్మజీవులు వేయడం ద్వారా ఇది మొదలవుతుంది. పోషకాలు అధికంగా ఉండే పూల ద్రవాన్ని తాగించడం ద్వారా అవి క్రమంగా పెద్దవిగా పెరుగుతాయి.
స్వేచ్ఛగా ప్రవహించే ద్రవం మందపాటి స్లర్రీగా మారినపుడు సూక్ష్మజీవి పరిపక్వతను పొందిందని తెలుస్తుంది. ఈ మిశ్రమాన్ని ట్రేలలో పోస్తారు.
తర్వాత ట్రేను కొన్ని రోజులు అలాగే ఉంచుతారు. దీంతో అది బ్రీ చీజ్ (పాలతో చేసిన ఒక పదార్థం)పై ఉన్న పొర ఆకారంలోకి మారుతుంది.
దీన్ని చెట్టు-బెరడు పొడి ద్రావణంతో శుద్ధి చేస్తారు. ఎండబెట్టి, రంగు వేస్తారు. ఆ తర్వాత అది పాము, మొసలి చర్మం పొలుసుల మాదిరి మారుతుంది.
చివరగా మృదువైన షీట్ వస్తుంది. ఇది జంతువులకు ఉండే తోలును పోలి ఉంటుంది.
అయితే పటిష్టమైన తోలు అవసరమయ్యే బెల్ట్‌ల వంటి వస్తువులకు ప్రస్తుతం పదార్థం అంతగా సరిపోదని కుంట్ల చెప్పారు.
లెదర్ బలం 8 నుంచి 25 మెగాపాస్కల్‌ల వరకు ఉంటుంది. అయితే ఫ్లెదర్ 6 నుంచి 10 మెగాపాస్కల్‌లు మాత్రమే.
"ఫైబర్ సాంద్రతను ఎలా పెంచాలి, బలమైన పదార్థాన్ని ఎలా పొందవచ్చనే దానిపై ప్రస్తుతం ప్రయోగాలు సాగుతున్నాయి" అని కుంట్ల చెప్పారు.
ప్రయోగం చివరలో (దాదాపు 10 శాతం దూరంలో) ఉన్నామని భావిస్తున్నట్లు అగర్వాల్ చెప్పారు.
అయితే ఫ్లెదర్ ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తోంది. ఇటీవల 2022 ఎర్త్‌షాట్ ప్రైజ్‌లో ఫైనలిస్ట్‌గా ఉంది. ఇది పర్యావరణ సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలకు దారి చూపుతోంది.
ఫూల్ ఇప్పుడు కాల్విన్ క్లైన్, టామీ హిల్‌ఫిగర్‌ల మాతృసంస్థ అయిన పీవీహెచ్‌తో కలిసి ఫ్లెదర్ పైలట్ ప్రాజెక్టును చేపట్టింది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ మెటీరియల్ డెవలప్‌మెంట్, టెస్టింగ్ దశలో ఉందని పీవీహెచ్ తెలిపింది.
బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీదారు, మరొక అమెరికన్ ఫ్యాషన్ రిటైలర్ కూడా ఫ్లెదర్‌పై ఆసక్తి కనబరిచినట్లు అగర్వాల్ పేర్కొన్నారు.
ఇది కొన్నింటికి నష్టం కలిగించే ఆవిష్కరణేనని అగర్వాల్ ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే ఫ్లెదర్ జన్మస్థలం కాన్పుర్.. భారతీయ తోలు పరిశ్రమకు ప్రసిద్ధి కూడా.
ప్రపంచ మార్కెట్‌లో దీని స్థానం ఎలా ఉంది?
ఫాక్స్ తోలును చాలా వరకు శిలాజ ఇంధనాల ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు.
అయితే బయో-మెటీరియల్స్‌తో తయారు చేసే తోలు ప్రత్యామ్నాయాలు గత సంవత్సరం నుంచి అంతటా కనిపిస్తున్నాయి.
పైనాపిల్ ఆకు తోలుతో తయారు చేసిన స్నీకర్లను చేయడానికి నైక్ లండన్‌కు చెందిన అననాస్ అనమ్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
మెక్సికోలో ప్రిక్లీ పియర్ కాక్టస్ నుంచి డెసెర్టో మెటీరియల్‌ను తయారు చేస్తుంది. అయితే ఇటాలియన్ స్టార్టప్ కంపెనీ ఫ్రూమాట్.. ఆపిల్ స్కిన్ లెదర్‌తో ముందుకు వచ్చింది.
ఈ సంవత్సరం ప్రారంభంలో స్టెల్లా మెక్‌కార్ట్నీ కంపెనీ శిలీంధ్రాల హ్యాండ్‌బ్యాగ్‌లను విడుదల చేసింది.
"మనం దాన్ని సాధిస్తే, అది ప్రపంచానికి భారతదేశం అందించే పురోగతి" అని అగర్వాల్ చెప్పారు.
ఇప్పటివరకు ఫూల్ ఫ్లెదర్‌లతో వాలెట్లు, స్లింగ్ బ్యాగ్‌లు, చెప్పులు, షూలు తయారుచేశారు.
ఇవి కూడా చదవండి:
- మెస్సీ వరల్డ్ కప్ సాధిస్తే, భారత అభిమానులు సచిన్‌ను ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు
- ఫిఫా ప్రపంచ కప్ వేదికగా ఖతార్ మత ప్రచారం చేసిందా
- అవతార్ 2: ‘కథలో పస లేదు, కథనంలో వేగం లేదు, పాత్రల్లో దమ్ము లేదు.. టెర్మినేటర్ బెటర్’ - బీబీసీ రివ్యూ
- ఎలాన్ మస్క్: ట్విటర్ బాస్‌గా దిగిపోవాల్సిందేనంటూ యూజర్ల ఓటు - ఇప్పుడు పరిస్థితేంటో?
- ఖతార్: కనీసం ఒక్క నది, తాగడానికి నీటి చుక్కలేని ఈ దేశం.. ఫుట్‌బాల్ పిచ్‌ల కోసం నీటిని ఎలా సృష్టిస్తోంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















