అవతార్ 2: ‘కథలో పస లేదు, కథనంలో వేగం లేదు, పాత్రల్లో దమ్ము లేదు.. టెర్మినేటర్ బెటర్’ - బీబీసీ రివ్యూ

ఫొటో సోర్స్, 20TH CENTURY STUDIOS
- రచయిత, నికోలస్ బార్బర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
జేమ్స్ కామెరూన్ రూపొందించిన అవతార్ సినిమా విడుదలై 13 ఏళ్లు అయ్యింది. వసూళ్లలో అంతకు ముందు ఆయనే తీసిన టైటానిక్ సినిమా పేరిట ఉన్న రికార్డులను ఆ అవతార్ బద్దలు కొట్టింది.
ఒక దశాబ్దం పైగా నిరీక్షణ తర్వాత కామెరూన్ అవతార్2తో పండోర గ్రహానికి తిరిగి వచ్చారు. ద వే ఆఫ్ వాటర్ అని సినిమాకు పేరు పెట్టారు.
ఈ సినిమాలో నావి జాతికి నాయకుడైన జేక్ సల్లీ (సామ్ వర్తింగ్‌టన్) తన భార్య నాతిరి (జో సాల్దానా), నలుగురు పిల్లలతో ప్రశాంతమైన జీవితం సాగిస్తుంటాడు.
చిట్టిపొట్టి డ్రెస్సుల్లో కనిపించే ఈ నావి జాతి ప్రజలు తాము ఈ గ్రహం మీద ఎంతో సంతోషంగా ఉన్నామని భావిస్తూ కాలక్షేపం చేస్తుంటారు.
భూమి మీద నుంచి వచ్చిన అంతరిక్ష నౌకలు ఆకాశంలో గర్జించడం మొదలు పెట్టినప్పుడు వారి ప్రశాంతత చెడిపోతుంది.
అలా వచ్చిన ఆక్రమణదారులు, ‘టెర్మినేటర్ 2’ ప్రారంభంలో కనిపించే మంటల తరహాలో మైళ్ల పొడవున అడవిని కాల్చివేస్తారు.
‘ఏలియన్స్’ సినిమాలోలాగా.. ఎక్సోస్కెలెటిన్ రోబోటిక్ యంత్రాలతో వారు చాలామంది అక్కడ దిగిపోతారు. వారిపై గెరిల్లా యుద్ధం చేస్తాడు జేక్. రైల్వే ట్రాక్‌లను పేల్చివేసి ఆయుధాలను దొంగిలిస్తాడు.

ఫొటో సోర్స్, 20th Century Studios
అవతార్ సినిమాలో విలన్ కల్నల్ మైల్స్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్) చివరిలో చనిపోతాడు. కానీ, అవతార్ 2లో అతని మెమరీ పండోరా నివాసి అయిన ఒక నావి శరీరంలోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అతను కూడా సల్లీ మాదిరిగానే చాలా బలంగా, పొడవుగా ఉంటాడు. అతను తన చావును ఏమాత్రం లెక్క చేయడు. జేక్ మీద పగ తీర్చుకోవటానికి బయలుదేరుతాడు.
దీంతో.. ఒక అద్భుత సాహసయాత్రకు ఓ సుదీర్ఘ అంతరిక్ష కావ్యం రచించటానికి వేదిక సిద్ధమైంది. మధ్యలో దురాక్రమణ వలసవాదం గురించి, స్థానికుల్లో కలిసిపోవటం గురించి నైతిక చర్చలకూ వెసులుబాటు ఉంటుంది.
కానీ, కామెరూన్ ఇక్కడ సినిమాను మరో దారిలోకి తీసుకెళ్లాడు. దీంతో ‘ది వే ఆఫ్ వాటర్’ చప్పగా మారింది.
బతికివచ్చిన క్వారిట్జ్ తన మీద పగ పట్టాడని తెలుసుకున్న జేక్, తన కుటుంబంతో కలిసి పారిపోతాడు. తమ పెంపుడు డ్రాగన్ల మీద ఎక్కి దూరంగా ఉన్న దీవులకు వెళ్లి అక్కడ వేరొక తెగ జనం దగ్గర దాక్కుంటాడు. జేక్, కామెరాన్ ఇద్దరూ ఇక్కడ గందరగోళానికి గురైనట్లు కనిపిస్తుంది.
అవతార్ తొలి సినిమా జేక్ గురించి మనకు పెద్దగా చెప్పదు. కానీ, అతను అరివీర పోరాటయోధుడని ఆ సినిమా చూపిస్తుంది. అలాంటి వీర సైనికుడు అవతార్ 2లో క్వారిచ్‌తో నేరుగా పోరాడకుండా, చాటుగా పారిపోవడం పిరికితనం లాగా కనిపిస్తుంది. అది ఆ పాత్ర లక్షణం లాగా అనిపించదు.
జేక్ తన సైన్యానికి సారథ్యం వహిస్తూ, దుష్ట శక్తుల మీద పోరాడుతున్న సమయంలో.. త్యాగాలకు సిద్ధమవ్వాల్సిన అసాధారణ పరిస్థితుల్లో.. ఇలా పారిపోవటం కథాగమనాన్ని దెబ్బతీసింది. సీరియస్‌నెస్ లేకుండా చేసింది.
దండెత్తి వచ్చిన వారు ఒకవైపు పండోరా గ్రహాన్ని తగలబెడుతూ, ఊచకోతకు పాల్పడుతోంటే, వారి గురించి మర్చిపొమ్మని.. సల్లీ కుటుంబం బీచ్‌లో సేదదీరుతున్న తీరును చూసి ఆనందించండని ప్రేక్షకులకు చెప్తాడు కామెరూన్.

ఫొటో సోర్స్, 20TH CENTURY STUDIOS
"అవతార్: ది వే ఆఫ్ వాటర్" టైటిల్‌లోని వాటర్ అనే పదం సూచిస్తున్నట్లు.. జేమ్స్ కామెరూన్ హిట్ సినిమాలైన ‘ది అబిస్’ నుంచి, ‘టైటానిక్’ నుంచి కొన్ని సీన్లు నేరుగా అవతార్ 2లోకి వచ్చాయని చాలా త్వరగానే తెలిసిపోతుంది.
సీన్ తర్వాత సీన్‌లో.. జేక్, నాతిరి, వారి పిల్లలు ఇసుక తిన్నెల మీద విహరిస్తూ, మెరుపులీనే సముద్రంలో ఈదుతూ ఉంటారు.
చిన్నవయసులో ఉన్న సల్లీ పిల్లలు మత్స్యకన్య పిల్లలతో సరసాలాడుతూ, గొడవ పడుతూ కనిపిస్తారు. మధ్య మధ్యలో వారి మాటల్లో బ్రో (బ్రదర్), కజ్ (కజిన్) అనే ఇంగ్లీషు మాటలు కూడా పలికిస్తాడు దర్శకుడు.
జేక్ కొడుకుల్లో ఒకరు ఒక ఒంటరి తిమింగలంతో స్నేహం చేస్తాడు. వారిద్దరూ కలిసి ఈత కొడుతున్న దృశ్యాలు కనిపిస్తాయి.
ప్రతి ఒక్కరూ కొత్త తరం హిప్పీ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. పండోర చరిత్ర, భౌగోళిక శాస్త్రంపై గంభీరమైన ఉపన్యాసాలు ఇస్తుంటారు.
ఇవి సోషల్ మీడియాలో మనకు తెలియని వారు ఇచ్చే విసుగుపుట్టే సందేశాల్లాగా కనిపిస్తాయి. లేదంటే ‘రిటర్న్ ఆఫ్ ది జెడి’ సినిమాలో లాగా ల్యూక్, హాన్, లియాలు ఇవోక్ గ్రామంలో గంటల తరబడి చెప్పుకునే అంతులేని ముచ్చట్ల లాగా అనిపిస్తాయి. కొన్నిసార్లు ఫిలిప్ కె. డిక్ సైన్స్ ఫిక్షన్ ‘వియత్నాం వార్’ సినిమాను గుర్తుకు తెస్తుంది.

ఫొటో సోర్స్, Reuters
అయితే ఈ సముద్రం దృశ్యాలు అందంగా, చూడచక్కగా ఉంటాయి. సాంకేతికతపై జేమ్స్ కామెరూన్‌కు ఉన్న పట్టు, ఆసక్తి, అనురక్తి ఈ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. అత్యాధునిక కంప్యూటర్ గ్రాఫిక్స్, డిజిటల్ 3D, హైపర్-రియల్ క్లారిటీ మొదలైన సాంకేతిక పరిజ్ఙానాలను ఈ సినిమాలో ఉపయోగించారు.
కానీ, ఈ గిమ్మికులన్నీ మనల్ని సినిమా లోపలికి కాకుండా బయటకు తీసుకెళతాయి. యాక్షన్ నుంచి పక్కకు మళ్లిస్తాయి. గ్రాఫిక్స్ విజువల్స్ ఎంత ఆకట్టుకునేలా ఉన్నా, యాక్షన్ మాత్రం వాస్తవంలాగా అనిపించదు.
2009లో నిజంగా ప్రేక్షకుల మతి పోగొట్టిన అవతార్ కంటే ‘ది వే ఆఫ్ వాటర్’ సినిమా ఏమంత మెరుగ్గా కూడా లేదు. గ్రాఫిక్స్ విషయానికి వస్తే, మనం మొదట అవతార్ 1లో పండోర గ్రహం మీద దిగినప్పటి దృశ్యాలంత అద్భుతంగానూ లేవు.
కథాస్థలం అడవుల నుంచి సముద్రానికి మారడం ఇక్కడ సమస్య అయింది. వాస్తవానికి భూమి మీద మహాసముద్రాల నిండా.. మనల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే రకరకాల జీవులు ఎన్నో ఉన్నాయి. కామెరూన్, అతని బృందం సృష్టించిన సముద్ర జీవులు వాటికన్నా ఎక్కువ భిన్నంగా, అబ్బురపరిచేలా లేవు.
ఒంటి మీద పచ్చబొట్లు ఉండే నాలుగు కళ్ల తిమింగలాల గుంపు.. ‘ది లిటిల్ మెర్మెయిడ్’ సినిమాలో మాదిరిగా నీటిలో నాట్యం చేయడం సరదాగా ఉంటుంది. కానీ, ఇది నిజమైన తిమింగలాల విన్యాసాలను చూసినంత అద్భుతంగా అయితే లేదు.
మధ్య మధ్యలో కళ్లకు కనువిందు చేసే ఇలాంటి దృశ్యాలు కూడా సినిమాలో వేగాన్ని తగ్గించాయి. నింపాదిగా సాగుతున్నట్లు అనిపించేలా చేస్తాయి. ఈ సినిమా దాదాపు 192 నిమిషాల నిడివి ఉంది. అవతార్ 1 కంటే అరగంట ఎక్కువ.
సినిమా ప్రారంభంలో మనుషులు పండోరా మీద దిగిన సన్నివేశాల తర్వాత కథ పెద్దగా ముందుకు సాగదు. సల్లీ కుటుంబం వెకేషన్‌కు వెళ్లడం, క్వారిచ్ వాళ్లను వెదికి పట్టుకోవటం, క్లైమాక్స్‌లో వారి మధ్య చిన్న సముద్ర యుద్ధం జరగటం.. ఇదే మూడు గంటల పాటు సాగే కథ.
అంతే. సంక్లిష్టమైన సైనిక వ్యూహాలు లేవు, బలమైన సంభాషణలు లేవు. అర్థవంతమైన పాత్రలు లేవు. ద వే ఆఫ్ వాటర్‌లో ఏ పాత్ర కన్నా కానీ ‘టెర్మినేటర్’కి మరింత వ్యక్తిత్వం ఉంటుంది.

ఫొటో సోర్స్, 20TH CENTURY STUDIOS
సినిమాలో చాలా ఇతర అంశాలు అసంపూర్ణంగా కనిపిస్తాయి.
ఉదాహరణకు, జేక్ పిల్లలలో ఒకరు, అవతార్ సినిమాలో చనిపోయిన గ్రేస్ (సిగౌర్నీ వీవర్) బయలాజికల్ డాటర్. మరి ఆమె బయలాజికల్ ఫాదర్ ఎవరు? ఆమె పండోరలోని వన్యప్రాణులతో టెలిపతిలో ఎలా మాట్లాడగలుగుతుంది? ఇలాంటి ప్రశ్నలకు మనకు ఈ సినిమాలో సమాధానం కనిపించదు.
‘ది వే ఆఫ్ వాటర్’ ఇప్పుడు అధికారికంగా ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ మాదిరిగా సీరియల్ ఫ్రాంచైజీలో భాగం. కాబట్టి ఈ సినిమాను విడిగా చూసినా పూర్తిగా అర్థమయ్యేలా ఉండాలన్న నియమేమీ వర్తించదు.
అవతార్ సీక్వెల్ కోసం మనం 13 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. అయితే 2024, 2026, 2028లో మరో మూడు సీక్వెల్ సినిమాలు విడుదల అవుతాయని చెప్తున్నారు. ‘ది వే ఆఫ్ వాటర్’ సినిమాకు పట్టిన సమయాన్ని చూస్తే.. మిగతా సీక్వెల్స్ చెప్పిన సమయానికి విడుదలవుతాయా అన్నది అనుమానమే.
రోబోలు, క్లోన్లను వెంటబెట్టుకుని స్పేస్‌షిప్‌లలో ఆల్ఫా సెంటారై గ్రహానికి ప్రయాణించగలిగిన 22వ శతాబ్దపు మనుషులు.. పండోరా గ్రహం మీద ఒక చెక్క బాణాన్ని తట్టుకునేంత బలమైన గాజును ఎందుకు అభివృద్ధి చేయలేక పోయారు అనేది అర్థం కాదు.
ఈ సందేహాన్ని కామెరూన్ తన సీక్వెల్స్‌లో తీరుస్తారని ఆశిద్దాం.
ఇవి కూడా చదవండి:
- ఖతార్: కనీసం ఒక్క నది, తాగడానికి నీటి చుక్కలేని ఈ దేశం.. ఫుట్‌బాల్ పిచ్‌ల కోసం నీటిని ఎలా సృష్టిస్తోంది
- గుండెపోటు వచ్చే అరగంట ముందు శరీరంలో ఏం జరుగుతుంది, ఏ లక్షణాలు కనిపిస్తాయి?
- రైలు ప్రయాణం: ప్రయాణికులకు తగినన్ని రైళ్లు నడపటం లేదా? రిజర్వేషన్ బోగీలలో తరచూ తగాదాలెందుకు?
- గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్: రాజమౌళి ఆర్ఆర్ఆర్ నామినేట్ అయిన ఈ అవార్డులు ఏంటి
- హోప్ ఐలాండ్: ఏపీలోని ఏకైక సముద్ర దీవిని చూశారా? అక్కడ 118 కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి















