గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్: రాజమౌళి, కీరవాణి, ఆర్ఆర్ఆర్ నామినేట్ అయిన ఈ అవార్డులు ఏంటి

Rajamouli

ఫొటో సోర్స్, facebook/RRRMovie

    • రచయిత, వరికూటి రామకృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘కొడితే ఏకంగా ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలి...’

ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు(రామ్‌ చరణ్) చెప్పే డైలాగ్ ఇది. ఇప్పుడు ఆ సినిమాకు హాలీవుడ్‌లో వస్తున్న అవార్డులు, నామినేషన్లు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. 

ఇప్పటికే ఈ సినిమా, ఇరవైకి పైగా సంస్థలకు సంబంధించిన ఫిలిం అవార్డులకు నామినేట్ అయింది. కొన్ని అవార్డులను గెలుచుకుంది కూడా. వాటిలో ఒకటైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా బాగా పేరుంది.

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కు రెండు విభాగాల్లో నామినేట్ అయింది రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా. ఒక తెలుగు సినిమాగా చూస్తే ఇదొక చరిత్ర. భారతీయ సినిమాగా చూస్తే ఒక రికార్డ్. ఈ అవార్డ్‌ను గెలుచుకుంటే అది మరొక చరిత్ర అవుతుంది. 

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

చరిత్ర సృష్టిస్తుందా?

భారతీయ సినిమాకు 1959లో తొలిసారి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చింది. వి.శాంతారామ్ డైరెక్ట్ చేసిన ‘దో ఆంఖే బారా హాథ్(1957)’ సినిమా, విదేశీ భాషా విభాగంలో ఉత్తమచిత్రంగా నిలిచింది. 

ఆ తరువాత మహాత్మా గాంధీ జీవితం మీద తీసిన గాంధీ(1982) సినిమాకు ఆరు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు వచ్చాయి. ఈ సినిమాను నిర్మించిన సంస్థల్లో నేషనల్ ఫిలిం డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒకటి. 

మీరా నాయర్ తీసిన సలాం బాంబే(1988), మన్సూన్ వెడ్డింగ్(2001) సినిమాలు విదేశీ భాషా విభాగంలో నామినేట్ అయ్యాయి.

ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న తొలి భారతీయునిగా 2009లో సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ నిలిచారు. స్లమ్‌డాగ్ మిలియనీర్(2009) సినిమాకు ‘బెస్ట్ స్కోర్’ విభాగంలో ఆయనకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. 

గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు సంబంధించి ‘బెస్ట్ పిక్చర్: నాన్- ఇంగ్లిష్ లాంగ్వేజ్’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా నామినేట్ అయింది. ఒకవేళ ‘బెస్ట్ పిక్చర్’గా నిలిస్తే ఆ అవార్డును సొంతం చేసుకున్న మరొక భారతీయ సినిమాగా రికార్డును సృష్టిస్తుంది ఆర్ఆర్ఆర్. అలాగే తొలి తెలుగు సినిమాగా చరిత్రను లిఖిస్తుంది. 

ఒకవేళ ‘బెస్ట్ స్కోర్’ విభాగంలో ఆర్ఆర్ఆర్ విజేతగా నిలిస్తే గోల్డెన్ గ్లోబ్‌ను ముద్దాడిన రెండో భారతీయునిగా ఎం.ఎం.కీరవాణి నిలుస్తారు. 

‘నక్కినక్కి కాదే తొక్కుకుంటూ పోవాలే...’ అని కొమురం భీం(జూనియర్ ఎన్టీఆర్) అన్నట్లుగా మిగతా సినిమాలను వెనక్కి నెడుతూ ‘ఆర్ఆర్ఆర్’ ముందుకు పోతుందా? 

‘...హీ స్కేర్స్ మీ మోర్’ అని హాలీవుడ్ సినిమా చేత అనిపించుకుంటుందా? 

తెలియాలంటే వేచి చూడాల్సిందే. 

లియోనార్డో డికాప్రియో నటించిన ది రెవనెంట్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు వచ్చాయి.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, లియోనార్డో డికాప్రియో వంటి ప్రముఖ హాలీవుడ్ నటులు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు స్వీకరించిన వారి జాబితాలో ఉన్నారు.

ఏంటి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్?

అంతర్జాతీయంగా పేరున్న ఫిలిం అవార్డుల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ ఒకటి. 

హాలీవుడ్‌లో పని చేసే కొందరు జర్నలిస్టులు 1943లో హాలీవుడ్ ఫారిన్ కరస్పాండెంట్స్ అసోసియేషన్(హెచ్‌ఎఫ్‌సీఏ)‌ను స్థాపించారు. 

గొప్ప సినిమాలు, టీవీ షోలు, నటులను గౌరవించేందుకు 1944లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ను హెచ్‌ఎఫ్‌సీఏ స్థాపించింది. ఆ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారి అవార్డులు ఇచ్చారు. నాటి నుంచి ప్రతి ఏడాది గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ను ఇస్తూ వస్తున్నారు. 

హెచ్‌ఎఫ్‌సీఏ ఆ తరువాత హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్(హెచ్‌ఎఫ్‌పీఏ)గా మారింది. ప్రస్తుతం ఈ సంస్థ ఆధ్వర్యంలోనే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్సులు ఇస్తున్నారు. లాస్‌ఏంజలీస్‌లో పని చేసే ఎంటర్‌టైన్మెంట్ జర్నలిస్టులు హెచ్‌ఎఫ్‌‌పీఏలో సభ్యులుగా ఉంటారు. అయితే వీరు వివిధ దేశాల్లోని పత్రికలకు పని చేస్తుంటారు. 

ఆస్కార్ అవార్డ్స్(సినిమా), ఎమ్సీ అవార్డ్స్(టీవీ) తరువాత బాగా పేరున్న అవార్డుల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెబుతోంది. ఉత్తమ నటి, నటుడు, సినిమా, దర్శకత్వం, స్ర్కీన్‌రైటింగ్ వంటి విభాగాల్లో అవార్డులు ఇస్తుంటారు. ఉత్తమ విదేశీ భాషా చిత్రాలు, యానిమేషన్ సినిమాల కేటగిరీలు కూడా ఉంటాయి. 

సంగీతదర్శకుడు ఏఆర్ రెహ్మాన్

ఫొటో సోర్స్, A.R. Rahman/Facebook

ఫొటో క్యాప్షన్, స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్నారు

సినిమాల ఎంపిక ఎలా?

హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్(హెచ్‌ఎఫ్‌పీఏ)లోని యాక్టివ్, ఎమిరేటస్ సభ్యులకు మాత్రమే అవార్డుల ఎంపికలో పాల్గొంటారు. 

ఓటింగ్ రెండు దశల్లో జరుగుతుంది. నామినేషన్ దశలో తొలి ఓటింగ్ జరగ్గా విజేతలను ఎంపిక చేసేందుకు తుది ఓటింగ్ నిర్వహిస్తారు. 

ప్రతి ఒక్క ఓటరు ప్రతి కేటగిరిలోనూ ఎంట్రీల నుంచి అయిదు వరకు నామినేట్ చేయాల్సి ఉంటుంది. వాటికి ప్రాధాన్యత ప్రకారం నెంబర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ప్రతి విభాగంలో ఓట్లు ఎక్కువగా వచ్చిన తొలి అయిదు ఎంట్రీలను ప్రకటిస్తారు. 

ఇలా ఎంపికైన నామినేషన్ల జాబితాను మళ్లీ ఓటర్లకు పంపిస్తారు. ఈసారి ప్రతి కేటగిరిలో ఒక్క నామినీకి మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. ఇలా అత్యధిక ఓట్లు వచ్చిన ఎంట్రీని విజేతగా ఎంపిక చేస్తారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక రోజు వరకు విజేతల జాబితాను రహస్యంగా ఉంచుతారు. 

సాధారణంగా ప్రతి ఏడాది డిసెంబరులో నామినేట్ అయిన చిత్రాలు, నటుల జాబితాను ప్రకటిస్తారు. ఆ మరుసటి సంవత్సరం జనవరిలో అవార్డుల కార్యక్రమం ఉంటుంది. ఈసారి 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక వచ్చే సంవత్సరం జనవరి 10న జరగనుంది. 

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)